తోలుబొమ్మలాట (Tolubommalata, Leather puppet show) ఒక జానపద
కళారూపం.
తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఒక రాజాస్థానంలోని పండితులు తమ ప్రభువును సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని తోలుబొమ్మలను తయారుచేసి తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించారట. ఈ ఆట నిజంగా పండితుల చేతనే మెరుగులు దిద్దుకున్నదని చెప్పడానికి అమరకోశంలోని శ్లోకాలు నిదర్శనంగా పేర్కొనవచ్చు.
తోలుబొమ్మలు ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని అక్కడ జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి తెలుస్తున్నది. పర్షియా, టర్కీల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలుబొమ్మలాట, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడినుండి ఫ్రాన్స్ లోని, వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు.
బొమ్మలాటలు భారతదేశంలో, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి. ఉత్తరదేశంలో కట్‌పుతలీ అనే కొయ్యబొమ్మలాటలూ, దక్షిణదేశంలో కీలుగుఱ్ఱపు బొమ్మలాటలూ, బొమ్మలాట్టం అనబడే కొయ్యబొమ్మలాటలూ ప్రచారంలో ఉన్నాయి. ఆంధ్ర దేశంలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలావరకు మరాఠా ప్రాఁతంనుండి వలస వచ్చినవారు. వీరిని కన్నడదేశంలో కిషథషిక్యాత జాతివారనీ, తమిళదేశంలో కిల్లెక్యాత వారని, తెలుగు దేశంలో బొమ్మలాటవారని, తోలుబొమ్మలాటవారనీ వ్యవహరిస్తారు. ఆంధ్ర దేశంలో చాలా వందల సంవత్సరాలనుండే బొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయని నాచన సోమన తదితర కవుల రచనలనుండి గ్రహించవచ్చును.
తోలుబొమ్మలు తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక, లేడి లేదా దుప్పి, మేక మొదలైన మూడు రకాల జంతువుల తోళ్ళను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోను, గ్రీకుదేశంలో ఒంటె చర్మంతోను తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చితోళ్ళను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండమీద లేదా చదునైన చాపమీద పరచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పల్చటి చర్మపుపొరను పదునైన కత్తి సహయంతో తీసివేసి మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహయంతో చతురస్రాకారపు చెక్కకు బిగించి ఆరవేస్తారు. ఈవిధంగా చేయడం వల్ల మిగిలిన కోద్దిపాటి నలకలు ఉంటే అవిపోతాయి. ఇన్ని దశల్లో శుభ్రపరచిన తోలు పలచనిపొరగా, పారదర్శకంగా తయారై దీపపుకాంతి ప్రసరించే విధంగా అవుతుంది.
జింక చర్మాలను దేవతలు, పౌరాణిక కధానాయకులలాంటి ముఖ్యమయిన పాత్రల బొమ్మలని తయారు చెయ్యడంలో ఉపయోగిస్తారు. లేడి చర్మం బాగా మన్నిక గలది గనుక వీటిని భీముడు, రావణుడు లాంటి యోధుల బొమ్మలని తయరు చెయ్యడానికి ఉపయోగిస్తారు. హస్యపాత్రల వంటి మిగిలిన బొమ్మల కోసం సులభంగా దొరికే గొర్రె చర్మాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక్కొక్క బొమ్మ తయారు చెయ్యడానికి ఒక చర్మం సరిపొతుంది. కానీ రావణుడు వంటి కొన్ని బొమ్మల తయారు చెయ్యడానికి ఎక్కువ చర్మం అవసరమవుతుంది. రావణుడి బొమ్మని తయారు చెయ్యడానికి కనీసం నాలుగు చర్మాలు అవసరమౌతాయి. శరీరం కోసం ఒక చర్మం, కాళ్ళ కోసం ఒక చర్మం, రెండు జతల చేతుల (ఒక్కొక్కటి ఐదు చేతులు) కోసం రెండు చర్మాలు. ఎంపికచేసుకున్న బొమ్మలకు రేఖాచిత్రాల ఆధరంగా ప్రకృతిసిద్దమైన కరక్కాయ, చింతగింజలపొడి, అన్నభేది మొదలైన రంగులచే తోలుబొమ్మలకు ఇరువైపుల రంగులు వేస్తారు. ప్రస్తుతం ఆధునికులు పారదర్శకమైన రంగులను ఉపయోగిస్త్తున్నారు.
రంగులతో సిద్దమైన తోలుబొమ్మలు తల, మొండెము కలసి ఒక భాగంగాను, చేయిని మూడు భాగాలుగాను, కాలును రెండు భాగాలుగాను తీర్చిదిద్ది అన్నింటిని ఒక దగ్గరకు చేర్చి సూత్రం (దారం) ద్వారా కలుపుతారు. అదేవిధంగా ఈ బొమ్మలను ఆడించడానికి వీలుగా బొమ్మకు నిలువుగా ఒక ఈతబద్దను పైనుండి క్రింద వరకు అమర్చి రెండుకాళ్ళ మధ్యభాగంలో పిడికెడు బద్దను వదులుతారు. ఈవిధంగా వదిలిన బద్దను పట్టుకుని ఆడిస్తారు.
రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెర భూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకాళ్ళు అడ్డుతగలకుండా వుంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ది చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు.
ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. మైకులు వంటి సాధనాలు లేకుండా విశాలమైన మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వారి గొంతు స్థాయిని ఊహించుకొనవచ్చును.
వీరికి హార్మీనియం శృతిగా ఉంటుంది. తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతే కాదు. వాళ్ల కాళ్ళక్రింద బల్లచెక్కలుంటాయి. ఆయా ఘట్టాలననుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. ముఖ్యంగా రధాలు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాలలో ఈ చెక్కలు టకటకా త్రొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. నగారా మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. వురుములు వురిమినట్టూ, పిడుగులు పడ్డట్టూ డబ్బాలు మ్రోగిస్తారు.
ఏ వ్యక్తి బొమ్మలను ఆడిస్తాడో ఆ వ్యక్తి తానే పాడుతూ, అనుగుణంగా బొమ్మను ఆడిస్తాడు. రెండు బొమ్మలను ఆడించే సమయంలో బొమ్మలమధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మలను చేతితో కొట్టిస్తాడు. అదే సమయానికి క్రింది బల్లచెక్క టకామని నొక్కుతాడు. ఈ సమయంలో మిగిలిన వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళూ, డబ్బాలూ, ఈలలూ, కేకలతో భీభత్సం సృష్టిస్తారు.
తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్తు పోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపాయి. తోలుబొమ్మలాటలో ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యతవుండేదో, ఈ హస్యపాత్రలకు అంతే ప్రాధాన్యత ఉండేది. ఈ పాత్రలను సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి; పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగట్టేవారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపులు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిల్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతంలకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి. లంకా దహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు.
నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు. అతను చాలా విషయాలలో ప్రజ్ఞాశాలి కూడా అయిఉంటాడు. మిగిలినవారందరూ అతనిని అనుసరిస్తూ ఉంటారు. సూత్రధారుడు కధను చాలా వివరంగానూ, చాకచక్యంగానూ చెబుతుంటాడు. అవుసరమైనంతవరకు అర్ధాలను విడమరచి వివరిస్తాడు. పాత్రల ఔచిత్యానుసారం గొంతు మారుస్తుంటాడు. ప్రేక్షకుల ఆదరణను, విసుగును గమనిస్తూ సమయానుకూలంగా మార్పులు చేస్తాడు, ఇతర పాత్రలను ప్రవేశపెడతాడు.
ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి. మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు సరసమాడుతుంది.
పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కకు లైను వేస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు హఠాత్తుగా కేతిగాడు వూడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు. ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.
తోలుబొమ్మలాటలకు ఉథృతంగా ఆదరణ లభిస్తున్న రోజుల్లో ఈ ప్రదర్శన జరుగుతునందంటే ఆ గ్రామంలో పండిత పామరులు కులమత భేదభావాలు మరచి తిలకించేవారు. తమకిష్టమైన పురాణ పురుషుల కథలను తెలుసుకునేందుకు ఈ తోలుబొమ్మలు తప్ప, మరోసాధనం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంకా చరిత్రను పరిశీలించి చూస్తే నాగరికత వికసిస్తున్న తొలి రోజుల్లో మానవుడు తన మనుగడ కోసమే ఎక్కువ కాలాన్ని వెచ్చించిన తొలినాళ్ళలో ఈ జానపద కళారూపం అవిర్భవించడంతో అతనికి మనోరంజనం కలగడమేకాక, తాను విన్న పురాణ కథల్లోని పాత్రలు కళ్ళముందు సాక్షాత్కరించడంతో భక్తి పారవశ్యంతో ఆనందానుభూతులకు లోనయ్యేవాడు. అంతేకాక పాత్రల స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకుని, తన జీవన సరళిలో నీతినియమాల పాటింపుతో కొంత నాగరికతను పెంపొందించుకున్నడు. ఒకరకంగా తాము కొలిచే దేవుడికి ఒక సమగ్రమైన రూపాన్ని తోలుబొమ్మలాటతోనే గుర్తించగలిగి, ఆరాధించడం మొదలు పెట్టాడని చెప్పవచ్చు.
వార్తాపత్రికలు , రేడియో వంటి సమాచార వ్యవస్థలేని తొలిరోజుల్లో తోలుబొమ్మలాట సమాచార మాథ్యమంగా పనిచేసిందని చెప్పవచ్చు. గ్రామ చంచారంగా సాగే ఈప్రక్రియ ఒక గ్రామంలోని సమాచారాన్ని మరో గ్రామానికి చేరవేయడం, ఆరోగ్యవిషయాలు, నీతి నియమాలు రాజకీయ మార్పులు, దొంగవ్యాపారుల గుట్టు మొదలైన ఆనాటి స్థితిగతులను బొమ్మలతో గృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది ఈకళాప్రక్రియ. ఆంధ్రదేశంలోని హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరుకుపల్లి, మదిరి, బసవయ్యపాలెం, గుండాలమ్మ పల్లె, వాడపల్లి, నెల్లూరు, వంటి అతికొద్ది ప్రాంతాల్లో తోలుబొమ్మల బృందాలు చివరి దశలో జీవిస్తున్నాయి.
సమాచారాన్ని అందించడంలో తోలుబొమ్మలాటలు చలనచిత్రాలతో పోల్చబడతాయి. తోలుబొమ్మలాటలు చలనచిత్రాలకి శతాబ్దాల ముందు దేశీయ పరిజ్ఞానంతో తయారుచేయబడ్డాయి.నలుగురైదుగురు మనుషులు కలిసి పాటలు, శబ్దాలు, సంగీతం సహాయంతో కొన్ని వందల పౌరాణిక పాత్రలని సజీవులని చెయ్యగలిగిన ప్రక్రియ తోలుబొమ్మలాట. సినిమాలాగానే తోలుబొమ్మలాట కూడా వెలుగు నీడల ప్రదర్శన. పాత్రల దుస్తులు, ఆభరణాలు చేసే విధంలోని ప్రత్యేకత ఏమంటే వాటి రంధ్రాలలోంచి వెలుతురు బయటకు వచ్చి, తెరపైన వింత జిలుగులు, భ్రమలు సాధ్యమయ్యేవి.
సుసంపన్నమైన హిందూ ఇతిహాసాలని తెరమీదకి తెచ్చిన ఒక గొప్ప ప్రక్రియ తోలుబొమ్మలాట.తర్వాత కాలంలో కనిపెట్టబడిన చలనచిత్రాలు, దూరదర్శని ఆధునిక పరిజ్ఞానం సహాయంతో అవే ఇతిహాసాలని మరింత మెరుగైన రీతిలో ప్రదర్శిస్తున్నాయి. అయినప్పటికీ తోలుబొమ్మలాట అనే ఈ అద్భుతమైన ప్రదర్శన కళ దక్షిణ ఆసియా ప్రాంతపు ప్రదర్శన కళల చరిత్రని అర్ధం చేసుకోవడంలో కీలకమైన పాత్ర పొషిస్తోందని తోలుబొమ్మలపై పరిశోధన చేసిన ఆచార్యుడు బ్రూస్ టేపర్ తన పరిశోధనా వ్యాసంలో వ్యాఖ్యనించాడు.
ఇంతటి ఉన్నత ప్రమాణాలతో నిండిన తోలుబొమ్మలాట వంశపారం పర్యంగా వస్తున్న ఒక కళాసంస్కృతి. వేల సంవత్సరాలుగా మౌఖికంగా వస్తూ జానపదుల గుండెల్లో గూడుకట్టుకున్న ఉత్కృష్టమైన కళాప్రక్రియ. రామాయణ, మహాభారత, భాగవత కథను అలవోకగా చెప్పే తోలుబొమ్మల కళాకారుల మాతృభాష మరాఠీ అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కళారూపం ఆంధ్రదేశంలో ఒక ప్రముఖ కళా రూపంగా అభివృద్దిచెంది తెలుగు సంస్కృతిలో మిళితమై మన జాతీయ సంపదకే వన్నె తెచ్చింది. ఇంతటి ఉన్నతమైన ఈ కళాప్రక్రియ నేడు అతి కొద్ది బృందాలతో జీవిస్తోంది. తోలుబొమ్మల దీపపుకాంతులు చరమాంకంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ కళకు సంబందించిన రచనలు, చరిత్ర, తోలుబొమ్మల తయారీ, బొమ్మలనాడించే పద్ధతులు, ఇందులో ఇమిడివున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం 'లిపి ' ద్వారా లేకపోవడం దురదృష్టకరం. మిగతా రాష్ట్రాల్లో పాశ్చాత్య దేశాల్లో ఉన్న బొమ్మల్లాట ప్రక్రియకు సంబంధించిన విజ్ఞానం లభ్యమవడం కారణంగా ఔత్సాహికులు, బృందాలు బొమ్మలాటల మనుగడకు, వ్యాప్తికి విశేష కృషి చేస్తుండగా, తోలుబొమ్మల కృషికి మనం మార్గం వేయలేకపోతున్నాము.
తోలుబొమ్మల కళారూపం అంతరించిపోవడానికి గల కారణం పరిశీలిస్తే 19, 20వ శతాబ్దాలలో నాటకాల ప్రభావం ఉధృతంగా ఉండడం, పద్యనాటకాల ప్రధాన్యత పెరగడం, నాటకాల్లో , శాస్త్రీయతకు, సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్నతస్థానం లభించడం, అంతకంటే ముఖ్యంగా లూమియర్ బ్రదర్స్ సాంకేతిక సృష్టిలో ఆవిష్కరించిన సినిమాలు ప్రజలను సమ్మోహితులను చేయడం, తెరపై ప్రేక్షకులకు కావలసినవి అందించడం, అదేవిధంగా ఇంట్లోనే జనరంజకం అన్న నేపథ్యంలో విస్తృతంగా చానల్స్ వచ్చి ప్రపంచ తీరుతెన్నులను మార్చడం వంటి ఎన్నో కారణాలు తోలుబొమ్మలు లాంటి కళారూపాల మనుగడకు సవాలుగా నిలిచాయి. ఇలాంటి విషమపరిస్థితుల్లో, ఇవీ మన ఆనవాళ్ళు అని చెప్పడానికి మన కళారూపాలను బ్రతికించు కోవలసిన అవసరం ఏర్పడింది. తోలుబొమ్మలాట వంటి కళారూపానికి మరిన్ని మెళకువల్ని జోడీంచి, దీన్ని ఆధునిక మానవుడికి చేరువగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మప్రచారం రజకీయరంగం, పిల్లలవిద్య, మానసిక వికలాంగుల విద్య, వైద్య పరిజ్ఞాన ప్రచారం వంటి మొదలైన రంగాల్లో ఈ కళారూపాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ కళా రూపాల మనుగడకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కాకుండా విశ్వవిద్యాలయాలు, స్వచ్చంద సంస్థలు, పరిశోధకులు తమవంతు కృషిని అందజేస్తే మన భావితరాలవారికి ' ఇవీ మన ఆనవాళ్ళు ' అని సగర్వంగా అందించవచ్చు.
విరాట పర్వములో ధుర్యోధనుడు కురువృద్ధులతో విరాట రాజు గొవులను ఉత్తరం వైపు తరలించే ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని బహుధా ఒక నమ్మకం ఉంది. అనావృష్టి కాలంలో ఈ ఆటను ఆడించడం ఒక ఆనవాయితీగా ఉండేది.