మనం సాధారణంగా ప్రాథమిక పాఠశాలలో అక్షరాలు నేర్చుకున్న రోజుల్లో అవి నేర్పిన ఉపాధ్యాయులు/ ఉపాధ్యాయురాళ్ళు ఏ అక్షరాన్ని ఎలా పలకాలని నేర్పితే అలాగే పలకడానికి జీవితాంతమూ అలవాటుపడతాం. ఆ తరగతులు దాటినాక అలా పలకడమే తప్ప ఇహ అక్షరాల గుఱించి జన్మలో ఎప్పుడూ పునరాలోచన చెయ్యం. నిజానికి ఆ అక్షరాలకి ఆ ఉపాధ్యాయుల ఉచ్చారణ ప్రామాణికం కాదు. కానీ చిన్ననాటి అమాయకత్వం మనలో పెద్దతనంలో కూడా కొనసాగడం వల్ల అలా అనుకుంటాం. ఆ తరగతుల్లో పాఠాలు బోధించడానికి నిపుణులూ, పండితులు రారు. అఱకొఱ విద్యార్హతలు గలవారే వస్తారు. వారిని నియమించిన నిర్వాహక వర్గాలక్కూడా "చిన్నపిల్లలకి చదువు చెప్పడానికి ఆ మాత్రం చదువు సరిపోతుందిలే" అని భావన. ఆ రకంగా ఏ అక్షరాన్నీ సరిగా పలకలేనివాళ్ళంతా మన పాఠశాలల్లో గురువులై కూర్చున్నారు. అలాంటివాళ్ళలో ప్రతిభ ప్రాతిపదికన కాకుండా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలకి ఎంపికైన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది తెలుగు పంతుళ్ళకీ పంతులమ్మలకీ ’శ-స’ ల మధ్య తేడా తెలియదు. అలాగే శ-ష ల మధ్య తేడా కూడా తెలియదు. ’ల-ళ’కి మధ్య తేడా తెలియదు. ’న-ణ’ ల మధ్య తేడా తెలియదు. మహాప్రాణాలు వాళ్ళకిష్టముంటే పలుకుతారు. లేకపోతే లేదు. లేదా పలక్కూడనిచోట్ల మహాప్రాణాలు పలుకుతారు (ఘాందీ, భోదించడం, బేధం మొ||). వాళ్ళనే పరమప్రమాణంగా తీసుకుంటే ఆయా అక్షరాలన్నీ అంతరించినవనే భావించాల్సి ఉంటుంది.
కొందఱు చకారం ఉన్న ప్రతిచోటా సకారం పలుకుతారు. అలాంటివారు అసలు చకారాన్ని ఎత్తెయ్యండని కోరితే ఎత్తేద్దామా ? అలా కొందఱు పలకడాన్ని బట్టి, కొందఱు పలకకపోవడాన్ని బట్టి అక్షరాలు అంతరించినవని భావిద్దామా ? అలా అయితే అంతిమంగా తెలుగులో అన్నీ కలిపి ఇఱవై అక్షరాలైనా మిగుల్తాయో లేదో ! కాబట్టి కొందఱు కొన్ని అక్షరాలు పలక్కపోవడమనేది భాషకి ప్రమాణం కాదు. ఒక అక్షరాన్ని ఇంకో అక్షరంగా రాస్తే భాషలోని పదాల చరిత్ర అంతరిస్తుంది. తాను వ్యక్తిగతంగా పలికినా, పలక్కపోయినా దేన్ని ఎలా రాయాలో అలాగే రాయాలి. అంటే పూర్వీకులు ఏ వర్ణక్రమంలో రాశారో మనం కూడా అదే వర్ణక్రమంలో రాయాలి. దీన్ని standardization అంటారు. Standardization వల్ల గతానికీ, వర్తమానానికీ, అలాగే వర్తమానానికీ, భవిష్యత్తుకీ మధ్య వారధి ఏర్పడుతుంది. అంటే గతకాలపు వారి మాటలు, ఈ కాలపువారికీ, ఈ కాలపువారి మాటలు భావితరాలకీ అర్థమవుతాయన్నమాట. అలాగే పదాల standardization వల్ల ఆ భాష మాట్లాడే వివిధ ప్రాంతాల, జాతుల మధ్య కూడా వారధి ఏర్పడుతుంది. అలా వారధి నిర్మించడమే ఏ దేశంలో నైనా విద్యావ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశంగా ఉంటుంది. అందుకే ఉచ్చారణ ఎంత మారినప్పటికీ ఇంగ్లీషులో పదాల వర్ణక్రమాన్ని (spelling) అలాగే ఉంచేస్తారు. ఎన్ని లోపాలున్నా ఇంగ్లీషు పదాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా రాయబడతాయి.ఒకప్పుడు పలికి ఇప్పుడు మానేసిన అక్షరాల్ని కూడా silent letters పేరుతో రాతలో నిలబెడతారు. వారికంటే మన అభ్యుదయదృక్పథం గొప్పది కాదని ఎవరైనా అంగీకరించాల్సిందే. మనలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఒక్కొక్కపదానికీ ఒక్కొక్క గుణింతం రాస్తూ పోతే భాష ప్రయోజనమూ, standardization తద్ద్వారా విద్యావ్యవస్థ ప్రయోజనమూ కూడా దెబ్బదింటాయి. అలాంటి యథేచ్ఛావర్తన మన ఆత్మగౌరవాన్నో, నిరంకుశత్వాన్నో తప్ప మన దూరదృష్టిని ప్రతిఫలించదు. అదీగాక మన తెలుగులా ప్రమాదంలో పడ్డ భాషలు పూర్వవారసత్వంలో ఏ అంశాన్నీ పోగొట్టుకోవడం మంచిది కాదు. అన్నింటినీ ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాల్సిందే.
శకటరేఫ [ఱ] విషయానికొస్తే, తెలుగులో ఈరోజు మనం పలుకుతున్న ప్రతి రేఫసహిత శబ్దాన్నీ శకటరేఫగానే పలుకుతున్నాం. అంటే మనం సాధారణ రేఫ [ర] అంటున్నది నిజానికి తెలుగురేఫ కాదు. మనం దాన్ని పలకడం మానేసి శతాబ్దాలవుతోంది. ఈ సాధారణరేఫ అనేది సంస్కృతంలోను, దానికి సంబంధించిన ఇంగ్లీషు, జర్మన్ లాంటి భాషల్లో ఉంది. దీన్ని స్పష్టాస్పష్టంగా వినపడీ వినపడనట్లు తేల్చి పలుకుతారు. రేఫని తెలుగువాళ్ళు అలా ఎప్పటికీ పలకరు. కనుక మనం (తెలుగువాళ్ళం) వ్రాతలో వాడాల్సింది సర్వేసర్వత్రా శకటరేఫనే గానీ సాధారణరేఫని కాదు. కానీ మన ఉపాధ్యాయుల పుణ్యమా ! అని చిత్రంగా ఏం జఱిగిందంటే - తెలుక్కి స్వాభావికం కాని సాధారణరేఫ సహజరేఫగాను, శకటఱేఫ అనవసరపు అక్షరంగాను పరిగణనలోకి రావడం.
ఏ అక్షరాన్నైనా అనవసరపు అక్షరంగానో, లేదా తీసేసి వేఱే అక్షరాలతో ప్రతిక్షేపించదగ్గ అక్షరంగానో భావించడం దూరదృష్టి లేని ధోరణి అనిపించుకుంటుంది. కొన్ని అక్షరాలు తెలుగు పదాల్ని రాయడానికి తక్కువ ఉపయోగపడినప్పటికీ, లిప్యంతరణ (transliteration) చేయాల్సి వచ్చిన సందర్భాల్లో బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మహాప్రాణ పకారానికి [ఫ] అటు సంస్కృతంలో గానీ, ఇటు తెలుగులో గానీ ఉపయోగం తక్కువ. కానీ [f] ధ్వనితో కూడుకొన్న ఆంగ్ల, ఉర్దూ, అరబిక్ శబ్దాల్ని వ్రాయాల్సి వచ్చినప్పుడు అది ఈరోజు మనకి లెస్సగా ఉపయోగపడుతోంది. అలాగే ఇప్పుడు చాలా మంది దంత్యజకారపు గుర్తుతో తెలుగు జకారాల్ని రాయడం మానేశారు. కానీ ఇంగ్లీషులోని [z] అనే అక్షరపు ధ్వనికి తెలుగులో సక్రమంగా లిప్యంతరణ చేయాలంటే దంత్య జకారం తప్ప వేఱే దారి లేదు. అలా సక్రమంగా తెలుగులోకి లిప్యంతరణ జఱక్కపోతే మనం ఆ లిప్యంతరణని అవహేళన చేస్తున్నాం. ఉదాహరణకి - బ్యాంకు. అలా ఇఱవయ్యాఱక్షరాల ఇంగ్లీషుతో యాభయ్యాఱక్షరాల తెలుగుని పోల్చి కించపఱుస్తున్నాం. కానీ అదే సమయంలో సక్రమమైన లిప్యంతరణకి ఉపకరించే తెలుగక్షరాల అస్తిత్వాన్నే సవాలు చేస్తున్నాం, "మేము పలకలేము, మేము రాయలేము" అనే ఆత్మాశ్రయ (subjective) కారణాల్ని ఉటంకిస్తూ ! మన తెలుగువాళ్ళు ఏ భాషాపదాలనైనా సునాయాసంగా పలుకుతారనే ప్రతిష్ఠ మనకుంది. విదేశీభాషల్ని నేర్చుకోవడానికి ఇతరుల మీద మనకున్న edge మన తెలుగులిపి, అది తరతరాలుగా తీర్చిదిద్దిన మన నాలుకలు. అక్షరాల్ని అనవసరమని భావించడమంటే ఆ edge ని వదులుకోవడమే అవుతుంది.
మన అశక్తత, లేదా మన అక్షరాల గుఱించి మనకి మాత్రమే ఉన్న అపోహలూ, అ
జ్ఞానాలూ - ఇవే మనకి ప్రమాణమై కూర్చున్నాయి. భాష యొక్క గతమూ, భవిష్యత్తు మనకి పట్టడంలేదు. ఈ పరిస్థితి మారాలి. మన భాష తత్త్వాన్ని, చరిత్రనీ మనం సమీచీనంగా అవగాహన చేసుకోవాలి. ఇతరులకి బోధపఱచాలి కూడా. భాషకున్న assets ని liabilities గా భావిస్తూ వస్తున్న ఈ కుహనా అభ్యుదయవాదాన్ని మనం ప్రయత్నపూర్వకంగా దూరంగా పెట్టాలి. ఇది అభ్యుదయవాదం కాదు, ఒక సైతాన్ అని అందఱూ గుర్తించే శుభదినం రావాలి.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.comఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org