"*పల్లవి*
నా తెలుగు పంచదార
నా తెలుగు పాలధార
ఇది చక్కెర పలుకుల తెలుగు
మది చక్కని జిలుగుల తెలుగు
పలుకు పలుకులో కమ్మదనం
పదము పదములో అమ్మదనం
కలగలిసిన కమ్మని భాష తెలుగు
సిరిగలిగిన చెమ్మని భాష తెలుగు//నా //
చరణం
నటరాజ ఘట ఘటనా కర కింకిని
డమరుక నాదాలు నా అక్షరాలు
సామవేద జనిత సరస సంగీత సాహిత్య
ఓంకార నాదాలు నా గుణింతాలు//నా//
చరణం.
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు ఆదిభట్ల
గాత్రాలనంతాల కళ్యాణి రాగాలు అచ్చులై
నన్నయ తిక్కన పెద్దన పోతన వేమన తెలగన్న తిమ్మన్న
రసరమ్య కావ్యాలలంకారాలు హల్లులై
మంది యాసల అమ్మ భాష తెలుగు
గుండె లోతుల ఆత్మఘోష తెలుగు//నా//
చరణం.
శ్రీశైల కాలేశ్వర దాక్షారామా త్రిలింగాల కొలువంగ మా జీవితాలు
గోదావరి కృష్ణమ్మ నాగావలీల గలగలల మునుగంగ మా పుష్కరాలు
పంచ చీర కట్టుబొట్టులు బతుకమ్మ సంక్రాంతి సంబరాల
పాడిపంటలతో పిండి వంటలతో ఆటపాటల సంస్కృతుల
దేశ దేశాల నినదించే నా జాతి తెలుగు
భోగభాగ్యాల వికసించే నా జాతి వెలుగు//నా//
*రచన*.
సహజ కవి
*రాఘవ మాస్టారు కేదారి*
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి అధ్యక్షులు
కర్నాటక తెలుగు రచయితల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ కళాభారతి అధ్యక్షులు
916362973252
తెలుగు సాహితీ అభిమానులకు వందనాలు