*ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవo!*
*మాతృభాషా మాధ్యమoలోనే చదువులుండాలి!*
మన లాంటి దేశoలో తప్ప మరే సర్వస్వతంత్ర ప్రజాస్వామిక దేశoలోనూ ఈ అంశాన్ని తలలు బద్దలు కొట్టుకునే సమస్యలాగా అనునిత్య చర్చనీయాంశం కావించుకోరేమో!
"పిల్లలు తమ మాతృభాషలోనే ఉత్తమంగా నేర్చుకుంటారు. ప్రారంభ విద్య మాతృభాషలో ఉండాలి." అని యునెస్కో 1953 నివేదికలో మాతృభాషా బోధనకు సంబంధించిన మొదటి పెద్ద అంతర్జాతీయ విధాన ప్రకటన చేసింది.
తెలిసిన ప్రాపంచిక పరిజ్ఞానం ద్వారా తెలియని విషయాలను తెలుసుకునే పద్ధతి, అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ అమలవుతూ వున్నదని అoదరికందరం ఎరిగిన సంగతే! అయినప్పటికీ ఈ అంశoపై ఇంకా చర్చించుకుంటూనే వున్నాము. మన దేశానికి పట్టిన అనేకానేక దురవస్థల్లో ఇదొకటి!
ఆంధ్రా విశ్వ విద్యాలయపు తొలి సంచాలకులు కట్టమంచి రామలింగారెడ్డిని (1880 – 1951) ఆ కాలoలో ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో చాలా దిట్టగా భావించేవారు. అలాంటి ఆయనే
"పరభాషా మూలకమయినది విద్యయా?" అని ఆయన ఒక వ్యాసం రాశారు.
*మాతృభాషయందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమయిన మార్గము. మన ప్రస్తుత విద్యా విధానమునందు అనేక లోపములు గలవు. అందులో మొదటిది , మన బాలురు విషయ పరిజ్ఞానము లేకయే తమ పాఠములను గుడ్డితనముగా వల్లించి మెదడులోనికి యెక్కించుకొనుట! ఈ పాఠములు పరభాషలో నుండుట వలన బాలురు వాటిని జ్ఞాపకముంచుకొనుటకే యత్నించుచున్నారు.
దీని వలన వారి గ్రహణ శక్తి నశించి పోవుచున్నది. జ్ఞానమును అభివృద్ధి చెందించని విద్య నిజమైన విద్య కానేరదు. అటువంటి విద్యా విధానము ఖండనార్హము. సుమారు 80 సంవత్సరముల నుండీ మనము ఆంగ్ల భాష నభ్యసించుచుంటిమి. దాని వలన మనకేమయిననూ ప్రయోజనము కలిగినదా? మనలో నెవరయిననూ పండితులనదగిన వారు గలరా?మనలో పెక్కుమంది మాటలను నేర్చుకొనుచున్నారు గానీ విషయ జ్ఞానమును సంపాదించుట లేదు. కాబట్టి మన ప్రస్తుత విద్యావిధానము మన పురోభివృద్ధికి భంగకరముగా నున్నది.” అంతటి విద్యావేత్త వందేళ్ల క్రితం అనుభవంతో చెప్పిన మాటను పట్టించుకోకపోవడం వల్ల, పరాయి భాషలో బోధన అందుకుంటున్న కారణంగా ఇప్పటికే మూడు నాలుగు తరాలు తగినంత రాణించలేకపోయాయి. దాని దుష్ఫలితాలు సాంస్కృతిక పతన విలువల రూపంలో నేడు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత కాలానికి వస్తే.. అమల్లో ఉన్న "జాతీయవిద్యా విధానం" పత్రాన్ని కేoద్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా (29-7-2020) దాన్ని విడుదలచేసిన (ఇస్రో మాజీ చైర్మన్) కస్తూరి రంగన్ కూడా ఇదే విషయాన్ని చెపుతూ "కనీసం ఎనిమిదవ తరగతి వరకయినా మాతృభాషా మాధ్యమoలోనే కొత్త తరాల చదువులు వుండాలి." అన్నారు. ప్రాధమిక విద్యలో బోధనా మాధ్యమం గురించి ఆయన అభిప్రాయం పూర్తిగా సరైనది ! జాతీయ విద్యా విధానoలో మాతృభాషా మాధ్యమ నిర్ణయం నూరు దోషాలలో ఒక సుగుణం లాంటిది.
గడిచిన 78 ఏళ్ళలో ఎన్నో విద్యా కమిషన్లు తమ నివేదికలను సమర్పించినా వాటిని సక్రమంగా అమలు జరపకుండానే, విద్యా వ్యవస్థ తన లోటు పాట్లను సరిదిద్దుకోకుండానే మరికొంత కాలానికి మరొక విద్యా కమిషన్ను నియమించటం, ఇక నుండి విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగనున్నదని వాగ్దానించటం మన కళ్ళ ముందే అనేక పర్యాయాలు జరుగుతూ వస్తో౦ది. అలా అమలుకు నోచుకోని వాటిలో 1966నాటి కొఠారి కమిషన్ నివేదిక ముఖ్యమయినది.
అది ముచ్చటగా మూడు అంశాలను ప్రతిపాదించింది.
1.అందరికీ ఒకే ఒకే తరహా విద్య . (కామన్ స్కూల్ సిస్టo)
*2.ప్రభుత్వ నిర్వహణలోనే విద్య.*
*3.ఉన్నత పాఠశాల వరకూ మాతృభాషా మాధ్యమంలోనే విద్య* .
ఈ సూచనలను నాటి నుండి అమలు పరిచి వుంటే ఈనాడు మనకి ఈ చర్చ కాక మరొకటి వుండేది.
భాషా సమస్యలో మనకు అత్యంత కీలకమయినవి రెండే అంశాలు.1.పరాయి భాషను నేర్పటం ఎలా? 2. ఉత్పత్తి, పరిశోధన రంగాలతో సహా సమస్త ఆధునిక జీవన కార్యకలాపాలను మాతృభాషలో నిర్వహించుకోవడం ఎలా?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి...
‘’మాతృభాషను కళ్ళతోనూ, పరాయి భాషను కళ్లద్దాలతోనూ పోల్చినట్లు చెప్పుకునేవారు. ఇది చాలా వరకు సరియైనదే, కానీ పూర్తిగా కాదు. మాతృభాషను రాగి బిందెతోనూ, పరాయి భాషను మట్టి కుండతోనూ పోల్చటం ఎక్కువ సరయినది.
విద్యుత్తు, ఉష్ణ ప్రసరణలకు రాగి ఎంత ఉత్తమమైనదో విద్యాబోధన మాతృభాషలో అందించడం జ్ఞాన సమపార్జనకు అంత మంచిది.
ఏ మనిషికయినా పుట్టుకతో భాష రాదు. తమ పుట్టుకకు ముందే సమాజంలో తరతరాల తమ పూర్వీకుల ద్వారా రూపొంది, తమ చుట్టూ ఆవరించుకుని వుండే భాషను, తల్లి దండ్రులూ – కుటుంబమూ - సమాజాల ద్వారా ఉగ్గుపాలు జీర్ణించుకున్నట్లు పిల్లలు నేర్చుకుoటారు. నిరక్షరాస్యులని మనం అనుకునే వారిని, అక్షరాలు రాయటం రానివారని అనాలే కానీ, వాటిని పలకటం రాని, మాటలాడటం రాని వారనుకోకూడదు.
బడికి వెళ్ళటానికి మునుపే, నాలుగయిదేళ్ళ వయసుకే, పిల్లలకు తమదయిన మాతృభాషలో అక్షరాలు, పదాలు, వాక్యాలు నోటికి వచ్చేసి వుంటాయి. అంతేకాక తమకు అవసరమైన తెలిసిన విషయాలను మాట్లాడటం కూడా వారికి పట్టుబడి ఉంటుంది. వాటిలోని ఉచ్చారణ లోపాలను , వ్యాకరణ దోషాలను సాటి సామాజికుల సహజ సహకారంతో సరిదిద్దుకుంటూ వుంటారు. కనుకనే ఎవరూ ‘’ *మా నాన్న రేపు వచ్చింది* అని అనరు. తెలియక పొరపాటుగా పలికే మాటలను , వాక్యాలను సరిదిద్దే వాతావరణo వుంటుంది. దాన్ని 'భాషావరణo' (Linguistic Flux) అనవచ్చు. అది అత్యంత సహజంగా మాతృభాషావరణం అయి వుంటుంది. ఒక భాషాజాతి జనులoదరి ఉమ్మడి భాషా సాంస్కృతిక సంపదకు ఆ సమూహoలోని సరికొత్త మానవులందరూ వారసులే!!దీనినే వారసత్వపు సహజసిద్ధ మాతృభాషా
జలరాశి అనుకోవచ్చు. అంటే ఊట బావి లాంటిది అన్నమాట!
దీనికి భిన్నమయినది పరాయి భాష. అది కూడా ఆకాశo నుoడి ఊడిపడినదికాదు. వేరొక జాతి జనులు వేరే ప్రాంతoలో సృజించుకున్న జలరాశే! కనుక దానిని ఎత్తి పోతల ద్వారా ఎత్తున వుండే నీళ్ళ తొట్టెలో నిల్వ చేసుకున్నట్లుగా ఏర్పాటు చేసుకోవలసి వుంటుంది. దానర్థ ఏమిటి? ఒక ఇంజను లేక మోటారు ద్వారా, ఒక అదనపు శక్తిని తప్పని సరిగా నిత్యం ఉపయోగిస్తూ, దాన్ని వాడుకోవలసి వస్తుంది. ఆ నీళ్ళు సర్వ సాధారణంగా బడిలో మాత్రమే లభిస్తాయి. ఇంటి వద్ద , వీధిలో, ఇతర సామాజిక కార్యకలాపాలలొ తన పరాయి భాషా దోషాలను సరిదిద్దే వారు , పరిజ్ఞానాన్ని మెరుగు పరిచే వారు వుండరు. అది దాహం తీరని, తెలియని దప్పికలాగా వుంటుంది. అందుకే అనునిత్యం ఆంగ్ల వ్యాకరణ సమస్య ప్రతి ఒక్కరినీ వెన్నాడుతూ వుంటుంది. పదాల కోసమే కాదు కర్త, కర్మ, క్రియ, కాలాల, క్రియా వాచకాల వాడకానికి కూడా నిత్యం తడుములాడుకోక తప్పని పరిస్థితి వల్ల భావ వ్యక్తీకరణకు పరిమితి వస్తుంది. అంతే కాక అతి ముఖ్యమైన జ్ఞాన సముపార్జనకు అది అవరోధoగా మారుతుంది. దాని ఫలితంగా భట్టీయo చదువుకు అలవాటు పడటంతో పిల్లల మనో వికాసం కుంటుపడుతుంది. 17-18 సంవత్సరాలు ఆంగ్ల మాధ్యమoలో చదువుకుని కూడా ఇంకా స్పోకెన్ ఇంగ్లీషు పాఠాలకు వెతుకులాడటానికిగల కారణం ఇదే! నూటికి నూరు మందికీ ఇలాగే వుంటుందని కాదు కానీ, కనీసం తొంభై మంది పరిస్థితి అలాగే వుంటుంది.
అదే పిల్లలకు సహజంగా వచ్చే మాతృభాష ద్వారా పరాయి భాషను నేర్పే ప్రక్రియ చేపడితే సులువుగా, హాయిగా రెoడో భాషను కూడా నేర్వ గలుగుతారు.
ఇంకొక ఉదాహరణ చూద్దాం!
మనం గ్యాస్ పొయ్య మీద నీళ్ళు కాచుకోవాలంటే పూర్వ కాలంలోవలె , కట్టెల పొయ్యెలపై కాచుకున్న మట్టి కుండలకు బదులు ఇపుడు స్టీలు పాత్రలనో రాగి బిందెలనో వాడుతున్నాము. ఎందువల్ల? మట్టి కుండతో అయితే గ్యాసు ఎక్కువ ఖర్చవుతుంది కనుక!
రాగి పాత్ర ద్వారా, వేగంగా సులువుగా ఖర్చు తక్కువతో ఉష్ణం ప్రసరించి నీటిని బాగా వేడి చేసినట్లే, మాతృభాష ద్వారా జ్ఞానాన్ని సులువుగా బాగా వేగంగా సముపార్జించుకో గలుగుతాము. మరొక విధంగా చెప్పాలంటే – మాతృభాష అనేది బ్యాంకులో మూలధనం (ఫిక్సెడ్ డిపాజిట్) లాంటిదయితే పరాయి భాష దానిపై లభించే వడ్డీ లాంటిది. ఈ వడ్డీ ఎలాంటిదoటే అది సేవింగ్స్ ఖాతాలో వుంటూ కూడా మూలధనంలోకి వచ్చి చేరే స్వభావం కలది. దానర్థమేమంటే పరాయి భాషద్వారా మనం ఎంత జ్ఞానం పొందినా అది మాతృభాషలోకి రూపుమార్చుకుని నిల్వవుంటుంది. చాలా సార్లు మనం పరాయి భాషలో వ్యక్తం చేసేదంతా మాతృభాషలో నిలువ ఉoచుకున్న భావజాలమే తర్జుమా అయి పరాయి భాష రూపంలో వెలుపలికొచ్చేది!
మన ఆలోచనలను , అభిప్రాయాలను పరాయి భాషలో బాగా వ్యక్తం చేయటానికి కావలసినది ఈ తర్జుమా ప్రక్రియలో నైపుణ్యం. కనుక మన మాతృభాషలో ఎంత ఎక్కువ జ్ఞాన సంపదను (మూల ధనాన్ని) నిలువ చేసుకోగలిగితే అంత బాగా పరాయి భాష మీద పట్టుని సాధిoచటం సులువవుతుంది. అది లేకనే ఇపుడు అటు తెలుగూ రాని ఇటు ఆంగ్లమూ రాని కొత్త తరాలను మనం చూస్తున్నాము.
మన భవిష్యత్తరాలకు ఆంగ్లం బాగా రావాలనే దానిలో ఎవరికీ భిన్నాభిప్రాయం వుండనవసరం లేదు. కానీ అది, అనగా పరాయి భాష , పరాయి భాష ద్వారా బాగా రాదు. మాతృభాష ద్వారానే సులువుగా బాగా వస్తుంది.
గడిచిన 40 ఏళ్ళుగా ఆంగ్ల మాధ్యమ౦లో చదువుకున్న మన తెలుగు పిల్లలే కోటిన్నర మంది దాకా వుంటే , వారికి నిజoగా ఎంత ఆంగ్లం వచ్చిందో ఇసుమంత పరిశోధన , అధ్యయనమూ లేకుండానే పసి వయసుల నుండీ ఆంగ్ల బోధనకు ఆలోచన చేయటమంటే భవిష్యత్తు తరాల జీవితాలతో జూద మాడటమేననవలసి వస్తుంది.
మాతృభాష ఒక్క దానిలో విని బాగా అర్థం చేసుకోవటo, భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించడం, తడుముకోకుండా చదవటo, తప్పులు లేకుండా రాయటoలో పట్టు సంపాదించుకుంటే ప్రపంచంలోని ఏ ఇతర భాషలో అయినా సమస్త వ్యవహారాలు నిర్వహించుకోగలిగిన
అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి చెందింది. దీనివల్ల ఏ మాధ్యమంలో చదువు అందించాలి అనే సమస్య వెనక్కి పోయి ఒక్క భాషలోనైనా పట్టు సాధించడం ఎలా అనే సమస్య ముందుకు వచ్చే రోజులు దగ్గరకు వచ్చాయి. సులువుగా వేగంగా వాక్య నిర్మాణ దోషాలు లేకుండా చక్కగా అర్థం చేసుకోగలిగే సౌలభ్యం మాతృభాషలకే ఎక్కువ ఉంటుంది కనుక ఆలస్యం చేయకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి భాషా బోధనా మాధ్యమం విషయంలో
గత విధానాలకు భిన్నంగా మాతృభాషలకు ప్రాధాన్యత ఇచ్చే విధాన నిర్ణయాలు తీసుకోవటానికి కేంద్ర రాష్ట్ర పాలకులు సంసిద్ధులు కావాలి.
విద్యారంగాన్ని మొత్తం ఈ దృష్టితో ప్రక్షాళన చేయాలి.
మన భావాన్ని ఏ భాషలోకైనా తక్షణమే అనువదించి అందించగలిగే సాంకేతిక పరిజ్ఞానమూ, తగు పరికరాలు అందుబాటులోకి వచ్చేలోగా కూడా మాతృభాష ద్వారా పరాయి భాషను వేగంగా సులువుగా నేర్పగలిగే శాస్త్రీయ బోధనా విధానాలను కొత్త తరాలకు అందించడం పట్ల శ్రద్ధ వహించాలి. మాతృభాషలో ప్రాధమిక విద్యను ప్రైవేటు బడులలో కూడా తప్పనిసరి చేయాలి. విద్యను ప్రభుత్వమే నిర్వహించాలనే కొఠారి నివేదికను ఇప్పటికయినా అమలు చేయాలనే వత్తిడి పెరగాలి. విద్యావ్యాపారాన్ని అరికట్టాలనే ఆలోచన చేయని పాలకులు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, సామాజిక అసమానతలు పెరిగే విధానాలను అనుసరిస్తున్నారనీ భావించక తప్పదు.
*---దివికుమార్*
అధ్యక్షుడు , జనసాహితి .
(21-2-2026న
విశాలాంధ్రలో సంక్షిప్త ప్రచురణ)