*'అర్బన్ నక్సల్' గురించి నిజాలు - నిష్ఠూరాలు
దివి కుమార్ 2-2-2019
---------------------------
*'అర్బన్ నక్సల్' గురించి నిజాలు - నిష్ఠూరాలు!*
ఒక సాంఘిక ఆదర్శానికీ, సమ సమాజ తాత్విక భావజాలానికీ కట్టుబడిన కొందరు వ్యక్తులకు గౌరవనీయమైన విలువ ఏర్పడే పరిస్థితి ఉన్నప్పుడు, దాని వ్యతిరేకులు, అది భరించలేక ఆ విలువలు ప్రమాదకరమైనవనీ, వారు ప్రమాదకారులనీ ప్రచారం కావించి వారికి గౌరవహీనతను ఆపాదించడం చరిత్ర పొడవునా సాగుతూన్నట్టే ఉంది. కమ్యూనిస్టులు అంటే ప్రమాదకారులు అనే భావం పాలకవర్గాలు వ్యాప్తిచేస్తున్న కాలంలో, గురజాడ కందుకూరి పేర్ల ముందు 'కామ్రేడ్' అనే బిరుదు తగిలించి వారిపట్ల సానుకూలతను ప్రదర్శించే కమ్యూనిష్టులు కాని వారికి ప్రమాద హెచ్చరికలు చేసిన కాలం మనకు తెలుసు. కమ్యూనిస్టు ప్రణాళిక రచనా కాలం నాటికే కొన్ని ఐరోపా పాలక ముఠాలు, ఒకరినొకరు నువ్వు కమ్యూనిస్టు అంటే నువ్వేకమ్యూనిష్టువి అని తిట్టుకుంటూ కమ్యూనిజం పేరుని భ్రష్టు పట్టించే పనిలో వున్నట్టు మార్క్సు - ఎంగెల్సులు రాశారు. ఇప్పుడు కొత్తగా 'అర్బన్ నక్సల్' అనే పదాన్ని సంఘ్ పరివారీయులు దురుద్దేశ పూరితంగా వ్యాప్తి చేస్తున్నారు. వారికి ఆ పదం ఎవరు సృష్టించారో, ఎవరు వ్యాప్తి చేశారో దాని సారాంశం ఏమిటో కూడా అవసరం లేదు. నక్సల్ అనే పదమే సంఘవిద్రోహ, దేశవిద్రోహ పదంలాగా వ్యాప్తి చేసి దాని మౌలిక సామాజిక విప్లవ గుణాన్ని అపభ్రంశం గావించడమే వారి లక్ష్యం.
సంవత్సరం క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు ఆనాటి ప్రధాన న్యాయమూర్తి పని పద్దతులను విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం మనందరం ఎరిగినదే. అప్పుడు ఒక బిజేపి నాయకుడు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ని అర్బన్ నక్సల్ అని వ్యాఖ్యానించాడు. బహుశా ఆధిపత్యాన్ని ధిక్కరించే ప్రతీ తెలుగు వాడూ భాజపేయుల దృష్టిలో నక్సలైటు కావచ్చు.
అయితే ఈ నక్సలైట్ అన్న పదం నక్సల్బరీ పోరాటం తర్వాత పుట్టిందని ఎక్కువ మందికి తెలుసు కానీ, ఆ పదం సృష్టికర్తలు పాలక వర్గాలేనన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. 1967 మే నెలలో పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ ప్రాంతంలో జోతేదార్లకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం ఆదివాసీలు, రైతు - కూలీలు, తేయాకు కార్మికులు తిరుగుబాటు చేశారు. అది అణచివేతకు గురయినా భారత దేశవ్యాపితంగా తీవ్ర ప్రభావాన్ని కలిగించింది. ఆశ్చర్యకరమయిన వాస్తవం ఏమంటే నక్సల్బరీ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారూ, దాన్ని అణచివేసిన వారూ ఒకే పార్టీ (సి.పి.ఐ.యం.) కి చెందిన కార్యకర్తలూ, నాయకులూ అవటం! అప్పటికే దేశ రాజకీయాలలో ఏకపార్టీ పాలనకు తొలి గండి పడింది. 1967 లో జరిగిన 4వ సార్వత్రిక ఎన్నికలలో 8 రాష్ట్రాలలో కాంగ్రేసు పార్టీ ఓడిపోయి ఐక్యసంఘటన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పశ్చిమ బెంగాల్లో అజయ్ ముఖర్జీ (బెంగాల్ కాంగ్రెస్) నాయకత్వాన, సి.పి.యం కు చెందిన జ్యోతిబాస్, హరేక్రిష్ణ కోనార్ తదితరులు కేబినెట్ మంత్రులుగా వుండిన ఐక్యసంఘటన ప్రభుత్వం ఏర్పడి వుంది. సిలిగురి జిల్లా స్థాయి సి.పి.యం కార్యకర్తలైన కానూ సన్యాల్, జంగల్ సంథాల్ తదితరుల నాయకత్వాన నక్సల్బరీ
తిరుగుబాటు జరిగింది. నాటి ఐక్య సంఘటనాప్రభుత్వం ఆ తిరుగుబాటుని అణచివేసింది. అది సి.పి.ఐ.యం. పార్టీలో ఆంతరంగిక సంఘర్షణకు కారణమైంది. విప్లవవాదానికీ, పార్లమెంటరీవాదానికి నడుమ సిద్ధాంత, రాజకీయ సంఘర్షణగా అది పరిణమించింది. నక్సల్బరీ సమర్థకులు విప్లవ వాదులయినారు. పార్లమెంటరీ వాదులు -- చట్టబద్ద, వత్తిడి రాజకీయ ఉద్యమాలతో నిరంతర సంస్కరణలద్వారా వ్యవస్థీకృత మార్పులను సాధించగలమనుకునే వారయినారు. కమ్యూనిస్ట్ విప్లవకారులకు నక్సలైట్లని పాలకవర్గాలు పేరిడినాయి. వారి మీడియా దానిని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ప్రచారపు మోజుతో కొందరు తమను తామే నక్సలైట్లమని భావించ సాగారు. కాలక్రమంలో వ్యక్తిగత హింసావాదులయిన వారే నక్సలైట్లన్నట్లు ఆ పదం ప్రాచుర్యం పొందింది. అయితే ఇటీవల మావోయిష్టులను ఏకంగా మావోలని మీడియా ప్రచారం చేస్తోంది. అందులోని హాస్యాస్పదమయిన అసంబద్ధత వారికి తెలియక పోవటం విచారించదగ్గది.
ప్రజల తిరుగుబాట్లన్నవి ప్రతి కాలంలోనూ వున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరున సాగివుండవచ్చు. వాటి పర్వవసానాలు వేర్వేరుగా ఉండి వుండవచ్చు. బిర్సా ముండా నాయకత్వాన చోటా నాగపూర్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటూ, మలబార్ లో మోఫ్లా రైతాంగపు తిరుగుబాటూ, అల్లూరి శ్రీరామరాజు నాయకత్వాన రంప గిరిజనుల తిరుగుబాటూ, కొమురం భీం నాయకత్వాన ఆదిలాబాద్ గోండుల తిరుగుబాటూ మనకు నూట ఇరవై ఏళ్ళ ఇటీవలి ఉదాహరణలు. సమాజంలో దోపిడీ, పీడనా తీవ్రతరమయినప్పుడు తమకు తోచిన పద్దతులలో ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలు, రైతాంగమూ తిరుగుబాట్లు చేశారు. ప్రజలు తిరగబడినప్పుడు క్రూరంగా అణచివేద్దాములే అనుకునే పాలకవర్గాలు వున్నప్పుడు, ఆ తిరుగుబాటునే విప్లవకర పోరాటంగా, నిర్మాణయుతంగా నడిపి, దోపిడీ అసమానతలను తొలగిద్దామనే ఆలోచన చేసే వారు కూడా వుంటారుకదా! తెలంగాణాలో 1940-51 నడుమ జరిగిన మిలిటెంట్ సాయుధ రైతాంగ పోరాటం అలాంటిదే. గత పోరాటాలు ఓటమి చెందటానికి గల కారణాలను విశ్లేషించుకుని, ఈసారి మరింత మెలకువగా తక్కువ నష్టాలతో విజయం సాధించటం ఎలా అని పోరాట నాయకత్వపు 'మేధ' తలపోస్తే పోరాటాలు ముందుకు వెడతాయి. అతివాద, మితవాదాలకు గురికాని సరైన సిద్ధాంత, రాజకీయ నాయకత్వం ప్రజా పోరాటాలకు సకాలoలో లభించకుంటే అవి తాత్కాలిక ఉద్యమాలుగా, తిరుగుబాట్లుగా మిగిలి పోతాయి.
30-1-2019 నాటి ఆంధ్రజ్యోతిలొ డా!! మాసాడి బాపురావు అన్నట్లు పాలకవర్గాలకు కూడా మేధావులు తప్పక వుండి తీరుతారు. ప్రజలకు ఉద్యమాలు లేక తిరుగుబాట్లు చేయక తప్పని ఆర్థిక, రాజకీయ పరిస్థితులను వ్యతిరేకించకుండా, ప్రజల తిరుగుబాట్లను మాత్రం వ్యతిరేకించేవారు పాలకవర్గ మేధావులనీ, తిరుగుబాటు పరిస్థితులకుగల కారణాలను తొలగించాలనే వారూ, ప్రజలపై అణచివేతను ఖండించేవారు ప్రజా పక్ష మేధావులనీ స్థూలంగా చెప్పుకోవాల్సివుంటుంది.
1966 జూన్ లో ఒక డాలరుకున్న రూపాయి విలువలో 37 వంతులు (37%) దిగకోసిన ఇందిరాగాంధి ప్రభుత్వం, 1968లో విద్యార్థులు నక్సల్బరీ ఉద్యమ ప్రభావితులవుతున్నారని గుర్తించి, ఇంజనీరింగ్ (డిప్లొమా&గ్రాడ్యుయేట్) విద్యార్థులకు నెలకు రూ.150/, & రూ.250/ స్టెఫండును ఒక సంవత్సరం పాటు ఇచ్చి తాత్కాలికంగా వారిని ఉద్యమ ఆసక్తి నుండి పక్కకు మళ్ళించగలిగింది. తర్వాత కాలపు భూసంస్కరణల నినాదాలూ, 20 సూత్రాల పథకాలూ మొదలయిన నిర్ణయాలన్నీ ప్రజల తిరుగుబాటు ప్రమాదాన్ని ఒక వాస్తవంగా గుర్తించబట్టే చేశారని అర్థం చేసుకోవాలి. ఆ నాటితో పోలిస్తే గడిచిన 50 ఏళ్ళలో పరిస్థితులు మరింత దిగజారలేదా? నేడు ప్రజలను బులిపుచ్చటానికీ, వోట్లు గడించడానికీ పాలక ముఠాలు ఎన్నెన్ని వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారో, రకరకాల విన్యాసాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము కదా! ఆ (నక్సల్ బరీ కాలం) నాడు మొత్తం విదేశీ అప్పు 10 వేల కోట్ల రూపాయలు. ఇప్పుడో?
38 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. జనాభా 250% పెరిగుండవచ్చు. డాలరు - రూపాయి మారకం విలువ 7వ వంతుకు (700%) దిగజారి వుండవచ్చు. కానీ విదేశీ అప్పు 380 రెట్లు (శాతాలలో చెప్పితే 38,000%) పెరిగి పోవటమన్నది ఆరోగ్య చిహ్నమయితే కాదు కదా! పోనీ ఆర్థిక అసమానతలు నాటి కంటే తగ్గుముఖంలో వున్నాయా అంటే కేవలం 9మంది మహా కుబేరుల ఆస్తులు దేశంలో సగం మంది (65కోట్ల మంది) ఆస్తులకు నేడు సమానమయి పోయాయి. 1991 లో అంటే సామ్రాజ్య వాద ప్రపంచీకరణకు ముందు ఒక్క బిలియనీర్ అయినా మన దేశంలో లేడనీ, ఇప్పుడయితే 119 మంది వున్నారనీ గణాంకాలు చెపుతుంటే, బిలియనీర్ల లెక్క డాలర్లలో చెప్పకూడదు, భారతీయుల రూపాయి లెక్కలలో చెప్పాలని ఒక్క దేశభక్తుడూ, ఒక్క పాలకవర్గ మేధావీ గొంతు విప్పడేం? మనకు జిల్లాల వారీ బిలియనీర్ల లెక్కలుచెప్పాలని ఒక్కరయినా అసెంబ్లీలో కాని పార్లమెంటులో కాని ప్రశ్నిస్తే దాని జవాబు విని దేశం ఎంత అభివృద్ధి పథంలో దూసుకు వెడుతోoదో తెలుసుకునే వారలం కదా!
ఆనాడు, 50 ఏళ్ళక్రితం, విప్లవ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి "అసెంబ్లీలు పార్లమెంటులూ బాతాఖానీ షాపులన్నా"డు. ఇవ్వాళ వాటి సమావేశాలే జరగని పరిస్థితి. వాయిదాలపై వాయిదాలో, బహిష్కరణలో, బాయికాట్లో కాక మరేమున్నాయి? శిగపట్లూ, తిట్లూ, సవాళ్ళు, శాపనార్ధాలూ తప్ప! ప్రజల వాస్తవ జీవన సమస్యలపై ఏమాత్రమయినా చర్చలున్నాయా? నాగిరెడ్డిగారు చెప్పిన బాతాఖానీకి కూడా ఎవరూ సిద్ధపడటం లేదు.
(ముగింపు రెండవ భాగంలో)
'అర్బన్ నక్సల్' గురించి నిజాలు - నిష్ఠూరాలు!
(ముగింపు భాగం)
భారత రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మలుపుకో గలిగినవారు శత, సహస్ర కోటీశ్వరులవుతారు. కీలవెన్మణులూ, చుండూరు హత్యాకాండలూ, భోపాల్ మారణ హెూమాలు, గుజరాతు ఘోర హత్యాచారాలు సాగించిన వారంతా నిర్దోషులుగా మిగులుతారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించినా దేశ భక్తులవుతారు. ఉరిశిక్షలు రద్దు చేయాలని అభిప్రాయ పడితే చాలు దేశ ద్రోహులవుతారు. 90% అంగ వైకల్యంతో వీల్ చైర్లో తప్ప కదలలేని శాయిబాబాను మానవతా దృష్టితో అండా సెల్ నుండి విడుదల చేసి, హౌస్ అరెస్ట్ లో నన్నా
వుంచమని కోరితే " 'అర్బన్ నక్సల్' కు రాజ్యాంగ హక్కులు పొందే అర్హత లేదు " పొమ్మంటారు. రాజ్యాంగంలోని నిరంకుశ చట్టాలను అడ్డం పెట్టుకుని వరవరరావు
తదితరులపై ఎవరూ నమ్మలేని హత్యారోపణ కావించి బెయిల్ కూడా దొరకనివ్వకుండా చేస్తుంటే, దాన్ని ఖండించే వారంతా అర్బన్ నక్సల్సేననీ, దేశద్రోహ సమానులేననీ ఆరోపించటానికి జంకూగొంకూ లేకపోవటం ఆశ్చర్యం గొలుపుతోంది. 1947 వరకు బ్రిటీష్ సైనిక రక్షణలోనున్న సంస్థానాలను ఇక నుండి తాము రక్షిస్తామనే హామీ మీద నూతన కాంగ్రేస్ పాలకులు భారత దేశంలో విలీనం చేసుకున్నారు. అయితే ఎవరి నుండి 560 మంది సంస్థానాధీశులను రక్షించాలిట! ప్రజల తిరుగు బాట్లనుండి కాక? ఫ్యూడల్ వ్యవస్థను తమ కేంద్రీకృత సైనిక శక్తితో ప్రజల పోరాటాల నుండి కాపాడిన ప్రక్రియనే, బ్రిటీషు వారొదిలిన చెప్పులలో కాళ్ళు పెట్టి పాలించటాన్నే, దేశ సమగ్రతా సాధనగా ప్రచారం చేస్తున్నారు. వేల సంవత్సరాల ఉపఖండ చరిత్రలో విశాల, సమగ్ర భారత దేశాన్ని తొలిగా నిర్మించినది బ్రిటీషు వలసవాదులు కాదా? 1946లో రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నికలు లేకుండా ఫ్యూడల్ సంస్థానాల నుండి 93 మంది ప్రాతినిధ్యం వహించగా, జరిగిన ఎన్నకలలో అందరికీ వోటుకాక, పరిమిత వోటు ప్రాతిపదికన ఎన్నికయిన ప్రతినిధులతో రాజ్యాంగం రూపొందిందనే వాస్తవాన్నిచెప్పే వారే కరువయారు.
"దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా? లంచగొండులేలేటి పాలనొకపాలనా?"* అని శ్రీశ్రీ 40 ఏళ్లక్రితం అంటే, ఆ నాడే ఆమాటను ఎవరూ సవాల్ చేయలేదు. ఇవ్వాళ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరు ఏ పార్టీలో వుంటూ , మరో పార్టీ టిక్కెట్ తో గెలిచి, ఏ పార్టీ మంత్రి వర్గంలో తేలుతారో ఖాయంగా చెప్పగలిగిన పార్టీ ఆఖరుకి భాజపాతో సహా ఎవరూ లేరు. ఇవన్నీ 1967 - 68 నాటి దేశ పరిస్థితుల కంటె నేటి ఆర్థిక రాజకీయవ్యవస్థలు మరింత దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తున్నాయని చూపటం లేదా? ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండానే ప్రజలు ముఖ్యంగా రైతులూ, పట్టణాల్లో కార్మికులూ, విద్యార్థులూ తమవయిన పద్ధతులలో పోరాడుతున్నారు. విప్లవ పరిస్థితులు ఏబై ఏళ్ల నాటి కంటే నేడు ఎక్కువ వున్న మాటయితే నిజం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పేరుతో ప్రజలను మతాలుగా, కులాలూ, ప్రాంతాలుగా.. చీలికలు పీలికలు చేసి, వ్యూహాత్మక అనైక్యతను పెంచి పాలక వర్గాలు సురక్షితం గా వున్నామని సంతోష పడుతూండవచ్చు. యువతరంలో కుల, మత విద్వేష, అహంకారాలను పెంచి, మద్యానికి, మాదక ద్రవ్యాలకూ, చౌకబారు వినోదాలకూ బానిసలను కావించి, సాంస్క్రుతిక పతనాలకు బలిచేసి తమనూ, కుటుంబాన్నీ, సమాజాన్నీ పట్టించుకోని వారుగా మారిస్తే చాలు... ఇక నోరు విప్పి ప్రశ్నించే వారే లేకుండా పోతారని సంబర పడుతూండ వచ్చు. కానీ దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సాంఘిక అసమానతలు, తీవ్రతరమవుతున్న దోపిడీ పీడనల పరిస్థితులే కొత్త విప్లవ శక్తులను సృష్టించుకుంటాయి. పాత పొరపాట్లను దిద్దుకుని ప్రజలను సమీకరించుకుని మరో పోరాటానికి సిద్ధoచేస్తాయి. ప్రజా పోరాటాలకు సరయిన మార్గదర్శకత్వo అందకుండా చేయటం కూడా అణచవేత చర్యలలో, పాలక ఎత్తుగడలలో భాగమే. కార్పొరేట్ సంపన్నుల. వారి అగ్రకుల శక్తుల రాజకీయాధిపత్యాన్ని పెంచుతున్న ఎన్నికల వ్యవస్థతో సహా చట్టబద్ద వ్యవస్థలను అప్రజాస్వామికంగా రూపొందిస్తూ, ఒకటొకటిగా విధ్వంసం చేస్తూండటాన్ని ప్రజలుగ్రహిస్తున్నారు. తద్వారా ప్రజలకు పోరాటం తప్ప దిక్కు లేని పరిస్థితిని పాలకవర్గాలే త్వరితం చెస్తున్నాయని గ్రహించాలి. మూడున్నర లక్షల మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవటం; జీవన భద్రతలను కోల్పోతున్న శ్రామికజనాలు, ఆదివాసీ ప్రాంతాల ముడిఖనిజాలను కారు చౌకగా విదేశాలకు తరలించేందుకు చుట్టివేతా అణచివేతలు సాగించడాలు; పెరిగి పోతున్న నిరుద్యోగం; మహిళలూ-దళితులూ-మైనారిటీలపై భౌతిక దాడులూ, హత్యలూ; అమానుష మానవ సంబంధాల విషసంస్క్రుతీ... మొదలయినవన్నీ పెరిగిపోతున్న సామాజిక సంక్షోభపు వ్యక్తీకరణలే. జస్టిస్ మార్కండేయ కట్టు లాంటి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తే ఈ దేశంలో ఒక ఫ్రెంచ్ విప్లవం లాంటిదొకటి సంభవిస్తే తప్ప నేటి పతన సామాజిక రాజకీయ పరిస్థితులలో నిజమయిన మార్పు రాదని విస్పష్టంగా ప్రకటించారు కదా!
చట్టబద్ధ సంస్కరణలద్వారా విప్లవ పరిస్థితులనుండి విప్లవాన్ని అనవసరం చేస్తారో? లేక చట్టబద్ద, చట్ట వ్యతిరేక అణచివేత పద్దతుల ద్వారా విప్లవాన్ని వాయిదా వేయిస్తారో పాలకవర్గ మేధావులనుకున్న వారే చెప్పాలి. ఆర్థిక రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న కొలదీ మొదటిది (సంస్కరణలు) తగినంత చేయలేక పోవటం, రెండవదైన అణచివేతపై ఆధార పడక తప్పని స్థితి ఏర్పడటమూ అనివార్య మవుతుంది. కాంగ్రేస్ పాలకుల కంటె మిన్నగా అణచివేతల ద్వారా యథాతథ పరిస్థితులను కాపాడి చూపిస్తామనే హామీపయిన భాజ పాలకులు అధికారానికి వచ్చారు. ఎన్ని వింత పోకడలుపోయినా అణచివేతా, మతోన్మాద రాజకీయాలతో, ప్రచారపు ఆర్బాటాలతో చిరకాల రోగగ్రస్త వ్యవస్థను ఆరోగ్యవంతం చేయలేరు.
భాజపేయులు వాడుతున్న
"అర్బన్ నక్సల్' అన్న పద ప్రయోగం వెనుక నక్సలైట్లనే వారు ఉండవలసిన చోటు అడవులనీ, అలాంటి వారు పట్టణాలలో వుండటమేమిటనే ధ్వని వినిపిస్తోంది. అడవులకూ, మందు పాతరలకూ, కొన్ని హత్యలకూ, ఎన్కౌంటర్ త్యాగాలకూ పరిమితమై వుండటమే విప్లవంగా చెలామణి చేయటo, పాలక మేధావుల ఆలోచనగా బయట పెట్టుకుంటున్నారు. 'కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల ఐక్యత' అనే ఒకనాటి నినాదం వెనుక నున్న పట్టణాలనుండి పల్లెల దాకా అనే విప్లవ ప్రజల ఐక్యతా సూత్రం మరుగున పడిపోవటం విప్లవ శక్తుల అశక్తతనే సూచిస్తోంది.
చివరగా..."మార్క్సిజం రక్తాన్ని ఏరులై పారించింది తప్ప ఏ దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచటం కోసమయినా ఉపయోగ పడిందా?" అని బాపురావు వేసిన 'మేధో'' ప్రశ్నకు టూకీగానయినా జవాబు చెప్పటం అవసరం. మార్క్సిజం పుట్టక పూర్వం ప్రపంచంలో ఎక్కడా రక్తపాతమే లేదన్నట్లూ, గడిచిన 170 ఏళ్ళలో మాత్రమే రక్తపాతమనేది ప్రపంచం ఎరిగినట్లూ మాట్లాడటం ఎంత హాస్యాస్పదమో చెప్ప పనిలేదు. 19వ శతాబ్దం లో మొత్తం యుద్ధ మరణాలు 194 లక్షల మంది అయితే, అదే 20వ శతాబ్దంలో 10 కోట్ల 97 లక్షలు (1097 లక్షలు). రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు, సామ్రాజ్యవాద దేశాలనన్నది జగమెరిగిన సత్యం. రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యధికులు త్యాగం చేసినది కమ్యూనిస్టుల నాయకత్వాన రష్యా, చైనా దేశ ప్రజలు. వాటిపై సైనిక దాడి చేసినది దురాక్రమణపూరిత సామ్రాజ్యవాదులయిన జర్మనీ హిట్లరూ, జపాన్ టొజో ఫాసిస్టులు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సైనిక జోక్యం చేసుకున్న 37 దేశాలలో, అది సుమారు 2 కోట్ల మంది మరణాలకు కారణమయిందని గ్లోబల్ రీసెర్చ్ - 2017 లో జేమ్స్ ఎ. లూకాస్ రాశాడు. మారణ హెూమాలు చేయాలంటే ఆయుధాలు తప్పని సరి. కమ్యూనిస్టు ప్రభుత్వాలే కాదు, మార్క్సిజం కూడా కనుమరుగయిందని ప్రచారం జరుగుతున్న నేడు, అనగా 2017వ సంవత్సరంలో, ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆయుధోత్పత్తికి చేసిన ఖర్చు - 1 లక్షా, 73 వేల కోట్ల డాలర్లు (1కోటి, 21 లక్షల 10 వేల కోట్ల రూపాయలు). అందులో కేవలం అమెరికానే ఆయుధాలకై చేస్తున్న ఖర్చు 40%, అంటే 69 వేల 200 కోట్ల డాలర్లు (48 లక్షల 44 వేల కోట్లరూపాయలు). ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం భారత దేశమే. భారతదేశమూ, పాకిస్తానూ కమ్యూనిస్ట్ దేశాలు కావు కదా, మరి ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఎవరి ఆయుధ వ్యాపారానికి వినియోగదారులుగా పరాధీనంగా బతుకుతున్నాయి? ఫ్యూడల్ రాచరికాల కాలంలో సైనికులను మాత్రమే చంపేవారు. కానీ ఇప్పటి సామ్రాజ్యవాదయుగంలో నిరాయుధులయిన ప్రజలను హతమార్చడమన్నది ఒక విధానంగా పెరిగినందుననే మరణాల సంఖ్య బాగా పెరిగి పోయింది. హిరోషిమా, నాగసాకిలలోని అమాయక ప్రజలపైన అణు బాంబులు వేసి లక్షల ప్రాణాలను బలిగొన్నదెవరో తెలిసి కూడా మార్క్సిజం రక్తాన్ని ఏరులై పారించింది అనడం ఎవరికి ఊడిగం చేసే రాతలో వేరే
చెప్పాలా!!
దివికుమార్, 2-2-2019
(ఆంధ్రజ్యోతిలో ప్రచురణ)