*🇧🇴ఇది నిజం కాదా !?*
*ఆలోచింతురు గాక*
??????????????????!🙏
భాష ఏర్పడడానికి లిపి ఏర్పడడానికి అనేక వందల సంవత్సరాలు పట్టి ఉంటుంది అటువంటి భాషను పట్టించుకోకుండా వదిలేసినట్లయితే భావితరాలకు ఆ భాష , ఆ భాష మనుగడ , భాషతో ముడిపడి ఉన్న ఆ జాతి కూడా మరుగున పడుతుంది. చరిత్రలో అలా జరిగిన సందర్భాలు ఎన్నో మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలనలో వారి సామ్రాజ్య అధిపత్యంలో పరిపాలించబడిన అనేక రాజ్యాలలో ఇంగ్లీషు భాష ప్రభావం వలన అక్కడ ఉన్న సంస్కృతి వారి సాంప్రదాయాలు చాలావరకు మరుగునపడి, ఇంగ్లీష్ వారి సంస్కృతి సాంప్రదాయాలు అలవడినాయి ఆడడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఏ దేశ సంస్కృతి అయినా, అది ఆ దేశపు మాతృభాషను ఆవరించు కొని ఉంటుంది. అందువల్ల ఆ దేశపు సంస్కృతిని దెబ్బ తీయాలంటే మొట్టమొదటి వేటు ఆ దేశపు "మాతృభాషల" మీద పడాలి. మాతృభాషల స్థానంలో ఇంగ్లీషును నింపాలి. తమ మాతృభాషను తమ ఆచార
వ్యవహారాలను, కట్టుబాట్లను, తిండి తీర్థాలను, ఆదేశ ప్రజలు తక్కువగా చూసేలా, వాళ్ల మనస్తత్వాన్ని మార్చాలి. ఇందుకు మార్కెట్ భాష అయిన ఇంగ్లీష్ ను మాతృభాషల స్థానంలో ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం ద్వారా ఈపని జరిపించాలి. విద్యారంగంలో మొట్టమొదట ఈపనిని ప్రారంభింపచేయాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ పని, దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాతనే మొదలుపెట్టారు అని మనకు అర్ధమవుతుంది. అంతవరకూ ఇంగ్లీషు మాధ్యమం స్థానంలో మాతృభాషా మాధ్యమాన్ని అమలు పరుస్తున్న ప్రభుత్వాలు అకస్మాత్తుగా మాతృభాషా మాధ్యమం స్థానంలో ఇంగ్లీషును బలవంతంగా రుద్దటానికి గల కారణం ఆర్థిక విధానాలలో చోటుచేసుకున్న మార్పులే, మాతృభాషా మాధ్యమాన్ని నీరసపరిచి, ఆంగ్లభాషా మాధ్యమాన్ని ప్రోత్సహించే కుట్రలో భాగంగానే, వేలాది ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు ప్రభుత్వం ఉదారంగా 'లైసెన్స్'లు ఇచ్చేసింది! ఇంగ్లీషు భాష ఒక్కటే గొప్పభాష అనీ, అది నేర్వని వాడు వెధవైపోతాడనీ, ఏ ఉద్యోగానికైనా, ఇంగ్లీషు తప్పక వచ్చి ఉండాలని, ఒక మిధ్యావాదనను, క్రమంగా ఈ పాతికేళ్లలో ప్రచారం చేసి ప్రజల మెదళ్ళలోకి బలవంతంగా చొప్పించింది. ఆ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే, తమ పిల్లలను, ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చదివిస్తున్నారంటే ఇక సాధారణ ప్రజలగురించి చెప్పాల్సిన పనిలేదు.
ఎప్పుడైతే మాతృభాషా మాధ్యమం నీరసించి, ఆంగ్లభాషా మాధ్యమం విద్యాబోధనలో చోటుచేసుకుందో, అప్పటినుండే దేశీయమైన సంస్కృతి క్రమంగా బీటలు వారటం మొదలైంది. దానిస్థానంలో మార్కెట్ సంస్కృతి కొత్తతరం మెదళ్ళలో భూతమై కూచుంది. LKG నుండి ఆంగ్లభాషా మాధ్యమంలో చదివే పిల్లల ఆలోచనా విధానమే మారిపోయింది. వాళ్లకు కుటుంబ సంబంధాలపట్ల ఆసక్తి ఉండదు. బూట్లతో, టైలతో, బండెడు పుస్తకాలతో ప్రారంభమయ్యే వాళ్ళ చదువు సహజంగానే వాళ్ళ ఆసక్తులను మార్చివేసింది. చదువంటే ఇంగ్లీషేననీ, చదువనేది సంపాదనకోసమేననీ, సంపాదన అనేది మార్కెట్‌ను ఇంట్లో నింపుకోవ టానికేననే భావజాలం చాలా చిన్నవయసులోనే వాళ్ల మనసుల్లో నాటుకుపోయింది. సహజంగానే మాతృభాషపట్ల చిన్నచూపు ఆ పిల్లలకు ఏర్పడుతుంది. ఆ చిన్నచూపే మాతృభాషల చుట్టూ ఆవరించుకొనివున్న సంస్కృతిపై కూడా పడుతుంది. వాస్తవం కాని ఆశలను, వాళ్లు చదివే ఇంగ్లీషు భాష, వాళ్లలో రేకెత్తిస్తుంది. పదేళ్లకే సెల్ఫోన్లూ, 15ఏళ్లకే ద్విచక్రవాహనాలు, బోలెడు డ్రస్సులూ, అలంకారసామగ్రి, మీడియా మోజూ, లగ్జరీగూడ్సూ, యివే ప్రపంచంగా ఒక నూతన యువతరం తయారుకావటం వెనుక దాగి ఉన్నది ప్రపంచీకరణ మార్కెట్ కుట్రే!
తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలు ఇంగ్లీషు పిల్లలు కావటమే ఇష్టంగా ఒక కుహనాభావజాలం, ఇదే సందర్భంలో రూపుదిద్దుకుం టుంది. చిన్నప్పట్నుంచే పిల్లల్ని మాతృభాషకు దూరంచేయటం వల్ల తమకు తెలియకుండానే ఒక సాంస్కృతిక ద్రోహానికి పాల్పడు తున్నారు. చిన్నప్పట్నించే తమ పిల్లల్ని మార్కెట్ దాసులుగా తయారు చేయటం ఇక్కడినుండే ప్రారంభమౌతుంది. పెద్దపెద్ద చదువులు, పెద్దపెద్ద ఉద్యో గాలు, పెద్దపెద్ద సంపాదనలు, పెద్దపెద్ద హోదాలు, పెద్దపెద్ద వస్తు వ్యామోహ సంస్కృతితో జీవించాలనుకోవడం ఇవన్నీ కార్పోరేట్ విద్యావిధానం నేర్పే కుహనావిలువలు. ఈ విలువలతో ప్రారంభమైన వీళ్ల భవిష్యత్తు అంతిమంగా, మానవ సంబంధాలన్నీ మార్కెట్ సంబంధాలు గా ఘనీభవింపజేస్తుంది.
మాతృభాషను హతమారిస్తే తప్ప దేశీయమైన సంస్కృతి నాశనం కాదు. దేశీయమైన సంస్కృతిని నాశనంచేస్తే తప్ప మార్కెట్ సంస్కృతి మెదళ్లలో చోటుచేసుకోదు. ప్రపంచీకరణ కుట్ర ఇది. కంటికి కనిపించని కుట్ర ఇది. చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అర్ధంగాని కుట్ర ఇది. ప్రభుత్వాలను లొంగదీసుకొని ప్రభుత్వాలతో చట్టాలు చేయించి, విద్యారంగాన్ని నాశనంచేస్తున్న కుట్ర ఇది. ఐచ్ఛికంగా ప్రజల మనసుల్ని లొంగదీసుకొనే కుట్ర ఇది. ఆ కుట్ర మొదట విద్యారంగంలో ప్రారంభమౌతుంది. మాతృభాషల నాశనంతో ప్రారంభమౌతుంది.
ఈ కుట్రను భగ్నంచేస్తే తప్ప విద్యారంగం బాగుపడదు. దీన్ని ఎదిరిస్తే తప్ప, మాతృభాషలు బతకవు. మాతృ భాషలు బ్రతికితేనే ఆ భాష జాతి సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయి అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు.
దీన్ని నిలువరిస్తే తప్ప దేశీయమైన సంస్కృతి బతకదు అన్ని ఉపాధ్యాయ సంఘాలూ, విద్యార్ధి సంఘాలూ, ప్రజా సంఘాలూ, ప్రజలమేలుకోరే రాజకీయపార్టీలూ, సంఘటితమై ఒక త్రాటి మీద కొచ్చి పోరాటం చేసినప్పుడే, మాతృభాషా మాధ్యమాన్ని బతికించుకో గలుగుతాము. ప్రపంచీకరణ కుట్రను భగ్నం చేయగలుగుతాము. అయితే అందుకు సంసిద్ధoకాకుండా మనకెందుకులే అని, మాతృభాషపై అంతగా అభిమానం లేని మన తెలుగుప్రజలు మొద్దు నిద్రపోతున్నారు.
ఆ మొద్దు నిద్ర వదిలేది ఎప్పుడు, మన తెలుగు ముద్దు అని తెలిసేది ఎప్పుడు.
*రాఘవ మాస్టారు కేదారి*
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి అధ్యక్షులు