-------సుప్రభాతం--------------------
ఈ పద్యము పింగళి సూరన గారి కళాపూర్ణోదయము లోనిది. పద్యము,శ్లోకముల
అర్థములను అడిగిన వెంటనే వివరించి పంపిన గురువుగారు శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
తా వినువారికి సరవిగ/
భావనతో నానునతి విభా వసుతేజా/
దేవర గౌరవ మహిమన/
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా
ఈ పద్యమును తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది!
శాధీనకు మా గిరి మత/
వికనసి లవమాన మహిమ వర గౌరవ దే/
జాతే సువ భావి తినను/
నాతో నవభాగ విరస కిరివానువితా
(కళాపూర్ణోదయం ,పింగళి సూరన)
తెలుగు సాహిత్య మందలి చతుర్విధ కవితలలో చిత్ర కవిత్వమొకటి.ఈ రచన కవికి
భాషపై,శబ్దములపై గల అధికారమును,అందలి నిష్ణాతృత్వమును వ్యక్తపరుచును.
ఈ పద్ధతిలో కావ్యములు కూడా వచ్చినవి. ఇది ఒక రసానుభూతిని కల్గించు కవిత. మన
కవుల ప్రతిభకు ఈ పద్యము ఒక నిదర్శనమై నిలుస్తుంది.
తెలుగు : అతివిభావి సుతేజా!- మిక్కిలి ప్రకాశించు పరాక్రమముగల; అధీశా- రాజా!; దేవర గౌరవ మహిమన--ఏలినవారి మహిమాతి శయము చేతనే ; మావలసిన కవిత--మాప్రియమైన కవిత్వము ; తాన్-- అది : వినువారికి-- శ్రోతలకు ; సరవిగన్--తగురీతిని ; భావనతోన్--తలచినంతనే ; మాకున్ మరగిమాకు స్వాధీనమై ; ఆనున్--భాసిల్లును;
భావము: ఆశ్రయ దాతలైన వారు తమ మహిమాతిశయముచేతనే శ్రోతల కానందమును గూర్చు యీ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది;
సంస్కృతము:- పదవిభాగము;
శాధి , ఇనకుమ్ ,అగిరి ,మత ,వికనసి ,లవమాన ,మహిమ వరగౌరవదే ,జాతే , సువిభౌ ,
ఇతి , నను ,నా ,అతః , నవభాః , గవి , రస ,కిరి ,వా , అనువితా ,
అర్ధము: ఇన- రాజా! ; ఆగిరి- పర్వతము లున్నంతకాలము ; కుమ్-- భూమిని ; శాధి--పాలింపుము ; మత--సర్వమత సమ్మతుడా ;వికనసి--మిక్కిలి కీర్తిచే విరాజిల్లు చున్నవాడవు ; లవమాన--లవునివలె మానవంతుడవగు ;నను-- ఓరాజా! ; నహిమ వర గౌరవదే--గొప్పతనముచే మిక్కిలి గౌరవమునిచ్చు ; సువిభౌ-- నీవంటి ప్రభువు ; ఇతి-- ఈరీతి; జాతే --కలిగియుండగా ;నా--మనుజుడు (పండితుడు) అతః--ఇట్టిగౌరవము వలన ;నవభాః--క్రొత్త వికాసము గలవాడై ; రసకిరి--నవరసములను వెదజల్లు ; గవి- భాషయందు ; అను వితా వా-- నుతియింపకుందురా?
భావము: ఓరాజా! ధరలో గిరులున్నంతకాల మీ యిల(భూమి) నేలుము. శ్రీరామ కుమారుడగు లవుని వంటి యభిమాన ధనుడా! గౌరవాదరమును జూపు నీవంటి ప్రభువు రాజైయుండగా పండిత కవులు రస వంతములగు కవితలతో నిన్ను స్తుతింప కుందురా
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.