వ్యాకరణ పుస్తకములు వలన, కంటె, పట్టి అను ప్రత్యయములను
పంచమీ విభక్తి అని చెప్పును. వలన అను పదము వలను వలన
కలిగినది అని భావన. వలను అనగా దిక్కు, వైపు అని అర్థము.
వలపట అనగా కుడి దిక్కు. కంటె అనునది కు + అంటె. పట్టి
పట్టు అను పదమునకు అన్వయించును. ఇవి కాక చిన్నయ సూరి చెప్పని
మఱొక ప్రత్యయము ఉండి. ఈ ఉండి ద్రుతముతో చేరి నుండిగా మారినది.
వలనకు బదులు కతమున, కృతమున అని కూడ కవులు వాడిరి.
సమయమును సూచించుటకు కోలె ప్రత్యయమును కూడ ఉపయోగించెదరు.
వలనకు బదులు వల్ల, కంటెకు బదులు కన్న కూడ ఉపయోగింతురు.
క్రింద కొన్ని ప్రయోగములు-
విష జలంబువలన, విషధర దానవు
వలన, ఱాలవానవలన, వహ్ని
వలన, నున్న వానివలనను రక్షించి
కుసుమశరునిబారి గూల్ప దగునె
- భాగవతము - 10.1039 - పోతన
ఆ నృసింహప్రభుండు తిప్పాంబవలన
నాగమాంబికవలన నందనుల గాంచె
వీరనరసింహరాయ భూవిభుని నచ్యు-
తాయతాంశజు శ్రీకృష్ణరాయ నిన్ను
- ఆముక్తమాల్యద - 1.31 - శ్రీకృష్ణదేవరాయలు
ఇతర దైవములవల్ల నిలను సౌఖ్యమా, రామ
మతభేదము లేక సదా మదిని మరులు గొన్న తన
మనసు దెలిసి బ్రోచినను మఱచి నను నీవె రామ
తనవాడన దరుణమిదె త్యాగరాజ సన్నుత
- త్యాగరాజ కృతి
నుత జల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత-
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స-
త్క్రతు వది మేలు తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త-
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్
- భారతము - ఆదిపర్వము, 4.92 - నన్నయ భట్టు
శరభ మృగములకంటె గేసరులకంటె
బులులకంటెను బిసరులై పొగరు మిగిలి
జల్లుకొనివచ్చె బైపైని సారమేయ
యూధములు వేదమయమూర్తు లుద్ధతముగ
- హరవిలాసము - సప్తమాశ్వాసము - కిరాతార్జునీయము - శ్రీనాథుడు
ఇంతకన్న యానంద మేమి ఓ రామ రామ
సుంత జనుల కెల్ల సమ్మతియై యుండు గాని
ఆడుచు నాదమున పాడుచు యెదుట రా
వేడుచు మనసున గుడి యుండుట చాలు
శ్రీహరి కీర్తనచే దేహాది యింద్రియ స-
మూహములు మఱచి సోహ మైనదే చాలు
నీ జపముల వేళ నీ జగములు నీవై
రాజిల్లునయ త్యాగరాజనుతచరిత
- త్యాగరాజ కృతి
ఎన్నగాను రామభజనకన్న మిక్కి లున్నదా
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనసా
కన్న విన్నవారి వేడుకొన్న నేమి ఫలము మనసా
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణి యొకతె పల్కగా
ప్రేమ మీఱ భద్రాద్రి ధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలము లిచ్చి కైవల్య మొసగలేదా
శాప కారణము నహల్య చాపఱాతి చంద మాయె
పాప మెల్ల బాసె రామపదము సోకి నంతనె
రూపవతులలో నధిక రూపురేఖలను గలిగియు
తాప మెల్ల తీరి రామ తత్త్వ మెల్ల తెలుపలేదా
- రామదాస కృతి
ఆకాశంబునుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు-
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య-
స్తోకాంబోధి బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం-
గా కూలంకష పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్
- భర్తృహరి నీతి శతకము 9 - ఏనుగు లకష్మణ కవి
ఇందులో వలన మాత్రమే ఉదాహరణకావ్యములలో వాడబడినది.
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
Courtesy: http://www.kanneganti.com/