వృత్తము - సుగంధి - శ్యేని

72 views
Skip to first unread message

J. K. Mohana Rao

unread,
Mar 29, 2002, 7:50:55 AM3/29/02
to chan...@yahoogroups.com, racch...@yahoogroups.com

గర్భకవిత్వము - 106

సభకు నమస్సులు! /\

ఈ రోజు మీకు వృత్తము, సుగంధి, శ్యేనిలను గుఱించి
చెప్పబోవుచున్నాను.

వృత్తము ఒక వృత్తము! వృత్తమునకు గణములు-
ర-జ-ర-జ-ర-జ-గ-ల; అథవా పది హ-గణములు;
యతి- (1, 7, 14)
గణిత-సాహిత్య రీత్యా లఘువులతో అంతమయ్యే వృత్తలు
సాధ్యమైనా నామకరణము చేయబడిన వృత్తములలో
నాకు తెలిసి మూడు వృత్తములు మాత్రము లఘువులతో
అంతమవుతాయి. అవి- కిరీటము (ఎనిమిది భ-గణములు),
మౌక్తికదామ (నాల్గు జ-గణములు) మఱియు వృత్తము.
సంస్కృత సాహిత్యములో పాదాంతములోని లఘువును
గురువుగా కూడ పరిపాటించెదరు!

పాదాంతములో లఘువు లేకుండుట తెలుగు వ్యాకరణ
రీత్యా కొద్దిగా కష్టమేమో? దీని పరిణామము
పాదాంతములో పదములను విరుచుట, జాతి, ఉప-జాతికి
చెందిన తెలుగు పద్యములను ఆదరించుట అని నా
ఉద్దేశ్యము.

సుగంధికి గణములు-
ఏడు హ-గణములు, ఒక గురువు; యతి- (1, 9)
ఉత్సాహను (ఏడు సూర్యగణములు, ఒక గురువు) 128 విధములుగా
వ్రాయవచ్చును. అందులో అన్ని సూర్య-గణములు గ-లమై
ఒప్పిన ప్రత్యేకత సుగంధికి చెందుతుంది.

శ్యేని కి గణములు-
ర-జ-ర-లగ; యతి- (1, 7)

ఈ మూటిని ఈ క్రింది విధముగా వ్రాసిన యెడల గర్భకవిత్వము
ఏ తీరున సాధించవచ్చునో అన్నది అర్థమవుతుంది.

వృత్తము: [UIUIUI] [UIUIUIU] [IUIUIUI]
సుగంధి: [UIUIUIUI] [UIUIUIU]
శ్యేని: [UIUIUI] [UIUIU]

వృత్తము- పది హ-గణములు (1, 7, 14)
బారు బారులై నభాన పక్షులే కనంబడెన్ దిగంత మందు
ధార లాయె వాన ధాటి ధాత్రిపై ప్రపాతమై నదమ్ము చేరె
తోరణాల పూలు తోచె తోటలో సు-కాంతులన్ ప్రభాత వేళ
హారి సద్వసంత మాట లాడెనే యనన్యమై నవాశ నింప

సుగంధి- ఏడు హ-గణములు, ఒక గురువు (1, 9)
బారు బారులై నభాన పక్షులే కనంబడెన్
ధార లాయె వాన ధాటి ధాత్రిపై ప్రపాతమై
తోరణాల పూలు తోచె తోటలో సు-కాంతులన్
హారి సద్వసంత మాట లాడెనే యనన్యమై

శ్యేని- ఐదు హ-గణములు, ఒక గురువు (1, 7)
బారు బారులై నభాన పక్షులే
ధార లాయె వాన ధాటి ధాత్రిపై
తోరణాల పూలు తోచె తోటలో
హారి సద్వసంత మాట లాడెనే

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages