వేదముల యొక్క అంగములను వేదాంగములని చెప్పెదరు.
అవి ఆఱు- శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్త,
జ్యోతిష, కల్ప.
శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః
మాత్రాబలం సామ సంతానః
అనగా అక్షరశుద్ధి (ఉచ్చరణ), స్వరశుద్ధి
(శారీరము), మాత్రాశుద్ధి (కాల దైర్ఘ్యము),
బలము (వేగము), సామము (సమత్వము),
సంతానము (అభంగము) ఇవన్నీ పద్య పఠనములో
ఉండాలి. వీనిని పొందు విధానమే శిక్ష.
ఛందస్సు అనగా పద్యములను వ్రాయు విధానము.
ఋగ్వేదము మఱియు సామ వేదము సంపూర్ణముగా
పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో
గద్యము కూడ ఉన్నది. వేదములలో గల ఛందస్సులు
అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10),
త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములకు
చెందినవి. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు
త్రిపద గాయత్రీ ఛందస్సు. అది
తత్సవితుర్వరేణియం
భర్గోదేవస్య ధీమహీ
ధియో యోనః ప్రచోదయాత్
కొందఱు మొదటి పాదములో వరేణ్యం అనెదరు.
అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే.
ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకమైనది.
బ్రహ్మ-విష్ణు-శివులను త్రిమూర్తులనుట వాడుక.
అదే విధముగా ప్రతి మంత్రమునకు త్రిమూర్తులు
ఉన్నారు. అవి (వారు) ఋషి, ఛందస్సు, దేవత.
నిరుక్తము అనునది నిఘంటువు లేక కోశము.
కల్పము అనగా వేద విధులను చేయు విధానము.
ఛందస్సును మనము చదువుచున్నాము అంటే ఆఱు
వేదాంగములలో ఒక్కటిని పరిశీలించి అర్థము
చేసికొంటున్నాము అన్న మాట!
కావ్యములలో వాడబడునది ఛందస్సు;
మిగిలిన వేళలలో వాడబదునది భాష. ఈశ్వరుడు పార్వతికి
ఛందస్సును బోధించినాడట!
దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును
వ్రాసినాడట. పింగళాచార్యుడు ఇప్పటి కర్ణాటక
దేశ వాసుడని ప్రతీతి.
దశమూల సంఖ్యా గణితములో (decimal arithmetic)
శూన్యము (సున్న) భారతీయుడు ఒకడు పురాణ కాలములో
కనుగొన్నాడని మనము భావిస్తున్నాము. నవీన యుగములో
కంప్యూటర్లు ద్వయ మూల సంఖ్యా గణిత (binary arithmetic)
సిద్ధాంతములపై ఆధార పడి యున్నవి అన్న విషయము
జగద్విదితమే! ఈ బైనరీ అరిత్మెటిక్ ఛందస్సులో
వాడబడుట ఈ సభకు తెలిసిన విషయమే. కావున
నా ఉద్దేశ్యములో శూన్యము (సున్న) తఱువాత గణిత
శాస్త్రమునకు మనము అందించినది ఈ బైనరీ అరిత్మెటిక్కే!
య-మా-తా-రా-జ-భా-న-స-ల-గం ప్రపంచ విజ్ఞానములో
ఒక నూతన కాంతిని చల్లింది అంటే అతిశయోక్తి కాదు!
తెలుగు ఛందస్సు సంస్కృత ఛందస్సు పైన ఆధార పడి
ఉండటమే కాక, క్రొత్త సృష్టిని కూడ చేసినది. సంస్కృత
వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులో ప్రత్యేకత!
ఇప్పటి పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్ళవ కవులు
ఛందస్సు అంటే పురాతనమైనది అనియు, ప్రగతి నిరోధకము
అనియు తలుస్తారు. కాని సినిమా పాటలలో, శ్రీ శ్రీ
గేయాలలో మాత్రా ఛందస్సు సుశోభితమై విరాజిల్లుచున్నది.
పురాతన ఛందస్సులో నున్న అంశాలను అవగాహన చేసికొని
క్రొత్త నడకను, ఛందస్సును కల్పించవచ్చు. కేవలము గణ-
యతి-ప్రాసలు మాత్రమే కాక పద్యాలలో నున్న గమనమును,
సంగీతమును, మాత్రాబద్ధతను పరిశీలించి సభకు పరిచయము
చేయుటయే రెండు సంవత్సరాలుగా నా యొక్క యత్నము మఱియు
ప్రయత్నము. దీనికి ఆదరణ సభ్యులు కొద్దిగా తక్కువగా
ఇచ్చారని చెప్పక తప్పదు. కాని ఒక నాడు ఇది తెలుగు భాషకు
మణి కిరీటము అవ వచ్చును అనే ఆశయముతో ఈ ఉద్యమమును,
కృషిని కొన సాగిస్తున్నాను. ఆది మాత్రము రెండు సంవత్సరాల
మునుపు దీనికి. అంత్యము ఆ శ్రీ హరికే ఎఱుక!
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
Courtesy: http://www.kanneganti.com/