ఉదాహరణము - 1

27 views
Skip to first unread message

J. K. Mohana Rao

unread,
Jul 12, 2004, 10:09:28 AM7/12/04
to chan...@yahoogroups.com, racch...@yahoogroups.com

తెలుగు సాహిత్యములోగల పలు ప్రత్యేకతలలో
ఉదాహరణము మిక్కిలి ప్రసిద్ధి యైనది.
ఉదాహరణము అనగా ప్రతియొక విభక్తితో మూడు
చొప్పున పద్యములు వ్రాసి చివర అన్ని విభక్తులతో
ఒక పద్యమును వ్రాయుట. విభక్తి లేకుండ భాషను
ఉపయోగించుట అసాధ్యము. ఇరువదియాఱు పద్యములతో
వ్రాయబడిన ఇట్టిది ఒక లఘు కావ్యము లేక క్షుద్ర
కావ్యము. క్రింద ఉదాహరణకావ్యపు లక్షణములను
ఇచ్చుచున్నాను-

1) ప్రతి విభక్తిలో మూడు పద్యములు ఉండవలయును.
ఈ విభక్తి పద్యములో నిస్సందేహముగా
కనబడవలయును. ఒకటియో రెండో ఇతర విభక్తులు
ఉండుట దోషము కాదు.

2) మొదటి పద్యము వృత్తముగా నుండవలయును.
వృత్తములలో శార్దూల, మత్తేభ విక్రీడితములు,
చంపకోత్పల మాలలను మాత్రమే వాడవలయును. కవులు
ఇతర విధములైన వృత్తములను, కందమును, ద్విపదను
కూడ వాడినారు.

3) రెండవ పద్యము ఒక రగడగా నుండవలయును.
నవవిధ రగడలలో ఏదియైనను ప్రయోగనీయమే.
హంసగతిరగడ కూడ ఉపయోగించబడినది. ఈ రెండవ
పద్యమైన రగడను కళిక అనెదరు. రగడలను
గుఱించిన నా శీర్షికను చదువ ప్రార్థన.

4) కళికను ఎల్లప్పుడు మఱియు అను పదముతో లేక దాని
పర్యాయ పదముతో ప్రారంభించవలయును. ఈ నియమము
బహుశా ముందు ఉన్న పద్యముతో అన్వయము కొఱకు
అనుకొంటాను.

5) కళిక పిదప ఉత్కళిక ఉండాలి. ఉత్కళిక కళికలో
సగము. కళిక మధురగతి రగడ (నాల్గు
చతుర్మాత్రలు) అనుకొన్న, ఉత్కళిక అందులో అర్ధ
భాగమైన రెండు మాత్రలు. ఉత్కళికకు యతి నియమము
లేదు.

6) కళికోత్కళికలు అష్టపాదులు.

7) కళికలో ప్రతి పాదాంతమున విభక్తి ప్రత్యయము
ఉండవలయును. ఉత్కళికకు చివరి రెండు పాదములలో
మాత్రమే విభక్తి యుండవలయును. మిగిలిన పాదములకు
అంత్యప్రాస అవసరము. సంబోధనలో పాదాంతములో
సంబోధన ఉండవలయును.

8) కళికలో ప్రతి పాదము స్వతంత్రముగా నుండవలయును.

9) ఉత్కళిక ఏకసమాసముగ భాసించవలయును.

10) చతుర్థీ విభక్తి ఉత్కళిక విభక్త్యాభాస
యుక్తము. అనగా చతుర్థీవిభక్తి ఉత్కళికలో
మొదటి ఆఱు పాదములలో విభక్తి ప్రత్యయము
ధ్వనించవలయును. కాని అది నిజముగా విభక్తి
ప్రత్యయము కాదు! వినుటకు విభక్తి, చదువుటకు
ఒక విభక్తి ప్రత్యమును బోలు పదము.

11) చివరి పద్యములో కవి పేరు, కావ్య వస్తువు
రెండును ఉండాలి.

12) కొందఱు ఈ ఇరువదియాఱు పద్యములతో ఆదిలో లేక
అంతములో ఒక పద్యము చేర్చెదరు. అనగా ఇరువదియేడు
పద్యములు ఉండును అన్న మాట. ఈ సంఖ్య ఇరువదియేడు
నక్షత్రముల సంఖ్యతో ఒప్పును. అప్పుడు ఇది తారావళి
యగును.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages