దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఇంటి) సమీపంలో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోసాగారు. ఆ సమయంలో నేను కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర కూర్చొని వున్నాను. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను కోపంతో రెండవ వ్యక్తిని దూషించటం మొదలుపెట్టాడు. కోపంతో అతని ముఖం జేవురించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వైఖరి చూసి “నాకో మాట తెలుసు. ఈ మాటను గనక ఆవ్యక్తి పలికితే అతని కోపం పటాపంచలయిపోతుంది. ఆ మాట – అవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీం” అని అన్నారు. ప్రజలు ఈమాట విని ఆవ్యక్తితో “నీవు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాన్ని వినలేదా?” అని అన్నారు. దానికా వ్యక్తి “నేను పిచ్చివాడ్ని కాను” అన్నాడు.(*)
(*) అల్లాహ్ విషయంలో తప్ప మరేదయినా విషయంలో కోపం వస్తే అది షైతాన్ ప్రేరణ వల్ల వచ్చిందని గ్రహించాలి. అప్పుడు “అవూజు బిల్లాహి మినష్షైతాన్” అని పఠించాలి. దాంతో షైతాన్ పారిపోతాడు. కోపం కూడా తగ్గిపోతుంది. ఈవ్యక్తి ‘నేను పిచ్చివాడ్ని కాను’ అన్నాడంటే అది అతని అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తోందని గ్రహించాలి. ఉన్మాదం ఆవహించినప్పుడు మాత్రమే అవూజు బిల్లాహ్ పఠిస్తారని అతను భావించాడు. కాని కోపం కూడా ఒక విధమైన ఉన్మాదం అని అతను గ్రహించలేదు. కోపం వచ్చినప్పుడు మనిషి సమతౌల్యాన్ని కోల్పోతాడు. (సంకలనకర్త)