“సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తలపెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ ఆన్ సూక్తి అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇక్కడ అన్యాయం అంటే మీరు సాధారణంగా భావిస్తున్న అన్యాయం కాదు, ఈ సూక్తిలో అన్యాయం అంటే షిర్క్ (బహుధైవారాధన) అని అర్ధం. (ఖుర్ ఆన్ లో) హజ్రత్ లుఖ్మాన్ (అలైహిస్సలాం) తన కుమారునికి హితభోద చేస్తూ ‘కుమారా! అల్లాహ్ కి ఏ శక్తినీ సాటి కల్పించకు. అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం’ అని పలికిన మాటలు మీకు తెలియవా?”