వైద్యో నారాయణో హరి:

20 views
Skip to first unread message

pattap...@gmail.com

unread,
Mar 26, 2009, 6:18:05 PM3/26/09
to తెలుగు సాహిత్య వేదిక
రోడ్డున పోతున్న వాళ్లందరూ గుంపుగా చేరారు. “అయ్యయ్యో!..
పాపం...”అన్నారు. అక్కడ ఆగి చూసిన కొందరు “హయ్యో..! అబ్బబ్బా ..! పా...పం
కదా..!” అంటూ అమితమైన జాలి చూపించారు. కాసేపయ్యాక, “దానికలా
అవ్వాల్సిందేలే..” అని అసహనమైన జాలి నిండిన స్వరంతో ఎవరో అన్నారు.
అంతలోనే, “ఏం మనిషి వాడు! అలా కొట్టేసి వెళ్లిపోడమేనా?, ఛీ. ఛీ... వాడు
మనిషా..? పశువా..?” అన్నారెవరో ఆవేశంగా. “అబ్బ ఎంత రక్తమో!... చూస్తేనే
కళ్లు తిరుగుతున్నాయి. బాబోయ్ చూళ్లేను.” అంటూ కళ్లు మూసుకొని
వెళ్లిపోయాడొకాయన.
అంతలో ఎవరో ముందుకోచ్చారు. మాట్లాడుతున్న వాళ్లందరూ చూసేవాళ్లే కాని
ఎవరూ ముందుకొచ్చిన పాపాన పోలేదు. చూసీ.. చూసీ... ఇక చూళ్లేక ఎవరో
ముందుకొచ్చి దాన్ని కొంచెం జాగ్రత్తగానే కర్రపుల్లతో చెట్టు కింద
పడుకోబెట్టారు. రోడ్డు మీద దాని రక్తం గడ్డకట్టి నల్లటి మరకలా
ఎండిపోయింది. ప్రాణం ఉందనడానికి గుర్తుగా డొక్కలు మాత్రం ఎగరేస్తూ,
అరిచేందుకు కూడా ఓపిక లేదేమో అలాగే ఉండిపోయింది. ఎంత తొందరగా అక్కడ
చేరారో అంతే తొందరగా అందరూ ఎవరి దారిన వాళ్లు మేల్లగా జారుకున్నారు. “ఆ..
ఎంతసేపున్నా అంతేకదా! మరి కాసేపట్లో అది చావడం ఖాయం. అంతమాత్రానికి మనం
ఉండీ చేసేదేమీ లేదుకదా” ఎవరో నిర్దయగా అంటూ వెళుతున్నారు. రోడ్డు మీది
గుంపు మెల్లగా కరిగిపోయింది. అక్కడ గుంపుగా చేరిన వారిలోని మానవత్వం కూడా
ఆ మధ్యాహ్నపు ఎండమావిలా మాయమైపోయింది. జరిగిన సంఘటనకి మూగసాక్షిగా
రోడ్డుమీద నెత్తుటి మరక అలాగే ఉంది. చెట్టుకింద మరి కాసేపట్లొ చావు కోసం
ఎదురుచూస్తో మౌనంగా అది రొప్పుతూనే ఉంది.
*** *** ***
మధ్యాహ్నం అయింది. భోజనాల టైమైంది. అంతకు ముందు రెండ్రోజులూ మబ్బుపట్టి
ఓకమోస్తరు చినుకులు పడ్డాయి. ఆ ప్రభావంతోనే మూడోరోజు ఎండతీవ్రంగా
కాస్తోంది. అది ‘రీసెర్చ్ స్కాలర్స్’ హాస్టల్ కి వెళ్లే రోడ్డు. మైన్
రోడ్ లోంచి కుడివైపుకి తిరిగాక ‘సి’ హాస్టల్ మీదుగా ముందుకు వెళితే,
ఎస్టీడీ మలుపు తిరిగాక ఎదురుగా కనిపించేదే ‘రీసెర్చ్ స్కాలర్స్ ’హాస్టల్.
ఎస్టీడీ ని ఆనుకునే ఒకపెద్ద మేడి(అత్తి)చెట్టు ఉంటుంది.
ఏ చెట్టూ లేనిచోట అన్నట్టుగా ఆ మేడిచెట్టే వేసవికాలంలో ఎస్టీడీ బూతుకి
నీడనిచ్చే కల్పవల్లి. రోడ్డుకి రెండు వైపులా చెట్లు దట్టంగానే ఉంటాయి.
అది యూనివర్శిటీ హాస్టలే గాని అక్కడ స్కాలర్సే కాదు చాలా రకాల ప్రాణులు
కూడా జీవనం చెస్తుంటాయి. అయితే స్కాలర్స్ జీవన స్రవంతిలో అవి కలవలేదు.
యూనివర్శిటీని పచ్చని పర్యావరణం నిండిన అడవిలో కట్టడం వల్ల జంతు జీవన
స్రవంతిలోనికే స్కాలర్స్ వెళ్లి నివసిస్తున్నారని వాళ్లెప్పుడూ
గుర్తించరు. హాస్టల్ లోపలే చెట్లూ చేమలూ, రాళ్లూ రప్పలూ, కొండాలూ బండాలూ,
వాటి తోపాటుగా కోతులు, కుక్కలూ, పిల్లులూ బల్లులూ నిత్యం కనిపిస్తోనే
ఉంటాయి. ఇంకా లేళ్లు, దుప్పులూ, అడివి పందులూ వంటివి అప్పుడప్పుడూ మేమూ
ఉన్నామని గుర్తు చేస్తుంటాయి.
ఇక వర్షాకాలం వచ్చి మబ్బు పట్టిందంటే ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నా మమ్మల్ని
పట్టించుకోలేదు. అందుకే మేమే మిమ్మల్ని పట్టించుకుంటున్నామని
క్రేంకారావాలతో నెమళ్లు పలకరిస్తుంటాయి.
ఎస్టీడీ బూతు రీసెర్చి స్కాలర్స్ హాస్టల్ రోడ్డు మలుపులో చాలాకాలం
నుంచే ఉంది. సెల్ ఫోన్లు వచ్చాక ఎస్టీడీ కి రద్దీ తగ్గింది కాని
ఒకప్పుడు స్టూడెంట్స్ తో కిటకిటలాడుతూ ఉండేది. అంతకు ముందున్న అమ్మాయి
పెళ్లి చేసుకొని మానేయడంతో ఇప్పుడు వేరే అతను అందులో పని చేస్తున్నాడు.
అసలే వేసవికాలం, అందులోనూ మధ్యాయ్నం కావడంతో ఎస్టీడీ ఖాళీగానే ఉంది.
అంతకు ముందు క్యాంపస్ అంతా స్టూడెంట్సు సైకిళ్లే వాడేవాళ్లు. రాన్రానూ
ఫెలోషిప్ లు పెరగడంతో బైకులు క్రమంగా సైకిల్ షెడ్డుల్ని ఆక్రమించేశాయి.
అక్కడక్కడా సైకిళ్లు కనిస్తున్నా హవా అంతాను బైకులదే. డిపార్టుమెంట్ లకి
వెళ్లినవాళ్లు, సైన్సు ల్యాబుల్లో ఎక్స్ పెరిమెంట్లు చేసి వచ్చే
స్టూడెంట్ల బైకులతో పొద్దున వెళ్లే సమయంలోనూ, మధ్యాహ్నం వచ్చేటప్పుడూ
వెళ్లేటప్పుడూ, ఇంకా సాయంత్రాల సమయంలోనూ ఆ రోడ్డు కాస్త
రద్దీగానేఉంటుంది.
*** *** ***
హాస్టళ్ల్లలో వంట చేసేటప్పుడు, భోజనాలయ్యాకా మిగిలిపోయె పదార్ధాలని
తినేందుకు అలవాటుపడ్డ జంతు సమూహం ఆ చుట్టుపక్కలే ఉండేది. కుక్కలు కొన్ని
స్టూడెంట్స్ కి బాగా మచ్చికయ్యేవి. ఎక్కడా అవిఎవరినీ కరిచిన సంఘటనలేవీ
వినిపించేవి కాదు. వర్షాకాలంలో రాత్రుళ్ళు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే
తేళ్లు ఇప్పటికీ ఓక్కరిని కూడా కుట్టలేదు. ఇలాంటివి గమనించినప్పుడు ఆ
ప్రదేశంలో మనుషులకీ జంతువులకీ మధ్య ఏదో తెలియని అనుబంధమేదో
ఉండనిపిస్త్తుంది. ఈ మద్య ఎస్టీడీ దగ్గర కుక్క పిల్లలు కనిపిస్తున్నాయి.
మొన్నామధ్యనే కళ్లు తెరిచినట్లున్నాయి. ఒక్కోటీ ఇంతలావున బొద్దుగా బలే
ముద్దు ముద్దుగా ఉన్నాయి. నాలుగు పిల్లలు. అందులోకి ఒకటి తెల్లగా బలే
చలాకీగా ఉంది. రోడ్డు మీద ఎండగా ఉండడంతో అవి అటూ ఇటూ తిరుగుతూ
ఆడుకుంటున్నాయి. అప్పుడప్పుడూ బైకులు, సైకిళ్లూ వాటిని తప్పించి వెళుతూనే
ఉన్నాయి.
“ఒసేయ్ ! రోడ్డు మీద ఆటలేంటే పిచ్చిమొద్దుల్లారా. పక్కకెళ్లండి.” అని
ఎవరో ఆ కుక్కపిల్లల్ని రోడ్డు పక్కకి తరిమి వెళ్లారు. కుయ్..కుయ్... మంటూ
అవి పక్కకి వెళ్లాయి. కాని కాసేపవగానే తెల్ల కుక్కపిల్ల ఒక్కటీ ‘...
నాయిష్టం. నీకెందుకూ... ’ అన్నట్టుగా మళ్లీ రోడ్డు మీదికొచ్చింది.
మిగిలిన మూడు పిల్లలూ వద్దని కుక్కపిల్లభాషలోనే వారించాయి. అయితే
దానికేమో కుర్రతనం జాస్తాయె మరి! అందుకే విన్లేదు. ‘మీరెల్లండ్రా!
పిరికిపింజల్లారా!’ అని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉరికి రోడ్దెక్కింది.
రోడ్డు మీదెళ్లే బైకుల్ని చూస్తుంటే దానికి మహా సంబరంగాఉంది. మధ్య మధ్యలో
అటూ ఇటూ రోడ్డుని క్రాస్ చేస్తూ ఉంటే దానికి మరింత మజాగా ఉంది. అప్పటికీ
రెండు మూడు బైకులు దాన్ని తప్పించి నిదానంగా వెళ్లాయి. మొదట దానికి భయం
వేసింది. ఆ తర్వాత సరదా వేసింది. మూడోసారి మరింత థ్రిల్లింగ్ ఉంటుందని
బైకుని క్రాస్ చెయ్యడానికి ఎదురు చూస్తో ఉంది. హాస్టల్ నుంచి వెళ్లే
వాళ్లకి మాత్రం అది కనిపిస్తుంది. వచ్చేవాళ్లకి అక్కడ మలుపు ఉండటం వల్ల
కనిపించదు.
మధ్యాహ్నం అయింది. ఎండ కాస్త ఎక్కువగానే ఉంది. భోజనం వేళ కావడంతో బైక్
మీదవస్తూ రోడ్డు మలుపు తిరగ్గానే వెనక చక్రం కింద ఏదో పడిన శబ్దం
వచ్చింది. బైకు ఆగలేదు. “కుయ్యో..! మోర్రో...!” అని కుక్కపిల్ల కీచుగా
అరిచింది. చూస్తే ఏముంది వెనకకాళ్లు నుజ్జునుజ్జుగా అయిపోయాయి. దాని
లేతరక్తం మెల్లగా రోడ్డు మీద పరుచుకుంటొంది. కుక్కపిల్ల గోలగోలగా అరుస్తో
ఉంది. ఎస్టీడీ లొ ఉండే మనిషి దాన్ని చూశాడు. “అయ్ బాబో..! సచ్చిపోనాదేటి?
కుక్కపిల్ల..” అంటూ బయటికొచ్చాడు. అప్పటికి రోడ్డు మీద ఎవరూలేరు.
ఐదునిముషాలు గడిచింది. అక్కడే రోడ్డు మీద గుంపు తయారైంది. వచ్చే పోయే
వాళ్లందరూ దాని చుట్టూ మూగి తలోమాటా అన్నారు. జాలి చూపించారు. సానుభూతి
కురిపించారు. ఇలా జరగడం విధి అన్నారు. దానికి ఇవాళ్టితో భూమ్మీద నూకలు
చెల్లిపోయాయని అన్నారు. అల్లాంటి చావుదానికి ముందే రాసుందని అన్నారు.
అసలుకి ‘ఆఫ్ట్రాల్ ఓక కుక్కపిల్ల’ అయ్యుండి రోడ్డు మీద దాని ఇష్టం
వచ్చినట్లు తిరగడం వల్లే దానికి ఇలాంటి దారుణం జరిగిందని అన్నారు.
ఎలాగైతేనేం చివరికి తప్పు దానిదేనని తేల్చారు. ఎవరి దారినవారు
వెళ్లిపోయారు.
*** *** ***
చెట్టు కింద కుక్కపిల్ల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతొంది. వెనక కాళ్లు
నడుము కొంతా నుజ్జయిపోయాయి. రక్తం చాలా పోయింది. చుట్టు దాని తోటి
పిల్లలు చేరి కాసేపు దాని గాయాన్ని నాలుకతో శుభ్రం చేశాయి. ఏమీ ఛేయలేక
మౌనంగానే ఏడుస్తూ అవి తలో దిక్కుకూ వెళ్లిపోయాయి. సాయంత్రమైంది. ఆ
రాత్రంతా దానికి ప్రాణం పోతూ వస్తూనే ఉంది.
తెల్లవారింది. లోకమంతా మేల్కొంది. ఒక్క తెల్లకుక్కపిల్ల తప్ప. ఎస్టీడీలో
ఉండే వ్యక్తి ఓసారి దాన్ని దూరం నుంచే గమనించాడు. ‘ప్చ్.. పాపం’ అని
పెదవి విరిచాడు. రోడ్డు మీది రక్తపు మరకను చూసి ల్యాబ్ కి వెళుతున్న
ప్లాంటు సైన్స్ స్టూడెంట్స్ ఇద్దరు ఆగి, ఎస్టీడీ వ్యక్తిని అడిగారు. అతను
నిన్న మధ్యాహ్నం జరిగిందంతా చెప్పి, వాళ్లకి చెట్టు కింద పడి ఉన్న
కుక్కపిల్లని చూపించాడు. దాన్ని సమీపించిన ఆ ఇద్దరికీ అప్పటికే కుక్క
గాయానికి పడుతున్న పురుగులు కనిపించాయి. ఎక్కడో సుదూర తీరాల్లో కొన ఊపిరి
ఉండీ లేనట్లుగా ఉన్న దాన్ని జాగ్రత్తగా, నెమ్మదిగా కాగితపు అట్ట
ముక్కమీదికి చేర్చి హెల్త్ సెంటర్ కి తీసుకు వెళ్లారు. వారి చేతుల్లో
ఉన్న కుక్కపిల్ల వాలకం చూసి కాంపౌండరు ‘చచ్చింది సార్!’ అన్నాడు. ప్రాణం
ఉందని వాళ్లు డాక్టర్ దగ్గరికి వెళ్ల్లబోయారు. అప్పుడే బయటికొచ్చిన
డాక్టరు వారి చేతుల్లోని కుక్కపిల్లను చూసి ‘ఇది బ్రతకడం కష్టం బాబూ,
ట్రీట్ మెంటు కూడా దండగే’ అన్నాడు. వాళ్లు మరీ బ్రతిమాలాడంతో డ్రెస్సింగ్
చేయడానికి కొన్ని మందులిచ్చి పంపించి వేశాడు. లాభం లేదని వాళ్లు దాన్ని
వెనక్కు తీసుకొచ్చేశారు. వెనక నుంచి వాళ్లను చూసి చాదస్తమని కొందరు,
చదువుకున్న మూర్ఖులని కొందరూ హేళనగా
నవ్వుకున్నారు.
మరుసటి రోజు మధ్యాహ్నమైంది. హాస్టల్ దగ్గరగా చెట్టు కింద పేపర్ పై
దాన్ని పడుకోబెట్టారు. నెమ్మదిగాడ్రెస్సింగ్ చేశారు. మెల్లిగా గ్లూకోజ్
పట్టించారు. కాని దాని కళ్లు మూతలు పడి పోయున్నాయి. ప్రాణం ఉందనడానికి
గుర్తుగా శ్వాస మాత్రం ఆడుతోంది. పాలు తీసుకొచ్చి పట్టించబోతే తాగే
శక్తి గాని, సహకరించే అవయవం గానీ పాపం దానికి అందుబాటులో లేవు. ఆ రోజంతా
వాళ్లు దానికి వంతులవారిగా కాపలా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా శ్వాస
మాత్రం ఆడుతోంది. మరి ఎటువంటి చలనమూ దాని శరీరంలో కనిపించలేదు. ఎలాగైనా
దానికి ప్రాణం పోయాలని పరితపించినవారి ఆశలు అడియాశలయ్యేలాగే
కనిపిస్తోంది. చీకటి లోకాన్నంతా మెలమెల్లగా అలముకొంటోంది. దాని శరీరంలో ఏ
కొద్దిపాటి చలనం కలిగినా మరియిక గండం గడిచినట్లేనని వాళ్ల నమ్మకం.
చెయ్యవలసిందీ,వాళ్లకు చేతనైందీ అంతాచేశారు. కానీ లాభం లేకపోయింది. ఆఖరి
ప్రయత్నంగా వాళ్లు భగవంతుడి మీద భారం వేశారు. చీమలు పట్టకుండా
చిన్నకంచెలాంటిది ఏర్పాటుచేసి హాస్టల్ లోపలొకి వెళ్లిపోయారు.
*** *** ***
మూడో రోజు కూడా మామూలుగానే తెల్లవారింది. వెంటనే వాళ్లిద్దరూ వచ్చి
కుక్కపిల్లను చూశారు. అక్కడ కుక్కపిల్ల లేదు. చుట్టూ చూశాక వాళ్ల కళ్లని
వాళ్లే నమ్మలేక పోయారు. నాలుగు అడుగుల దూరంలో తెల్లకుక్కపిల్ల నీళ్ల పైపు
దగ్గర పడుకొని నెమ్మదిగా నీళ్లు తాగుతోంది.
వైద్యో నారాయణో హరి:

edakulapally venkatesham

unread,
Mar 28, 2009, 9:47:48 AM3/28/09
to syak_...@googlegroups.com
annayya chaala bagundi.telugu sahitya vedkaloa pettanu.meeku time unte ee kathanu naaku print out ivvandi.andrapraba lo veddam.
 
VENKATESH E
9912950309

 
Reply all
Reply to author
Forward
0 new messages