*బుద్ధ భగవానుని దివ్యోపదేశం*
బుద్ధ భగవానుడు తన ఆశ్రమం లో తన ఆసనం
పక్కన ఒక ఢమరుకాన్ని వుంచుకునేవారు.ప్రతీ దినం
దానిని తానే స్వయంగా శుభ్రం చేసుకునేవారు. ఎన్నినెలలైనా దానిని ఆయన ఒక్కసారి కూడా వుపయోగించిన పాపాన పోలేదు. ఒక రోజు శిష్యులందరూ కూడ
బలుక్కొని “ భగవాన్, ఈ ఢమరుకాన్ని తమరి చెంత
ఎప్పటి నుండో వుంచు కుంటున్నారు, కాని ఒక్కసారి కూడా వుపయోగించలేదు, కారణం ఏమిటో దయచేసి
సెలవియ్యండి” అనిఅడిగారు.అందుకు బుద్ధుడు చిరునవ్వుతో “ నాయనలారా ! ఏరోజునైతే అతి గొప్ప త్యాగం చేసిన వ్యక్తి నాదగ్గరకు వస్తాడో ఆనాడే ఈ ఢమరుకాన్ని నేనుస్వయం గా వాయిస్తాను, ఇంతవరకు అటువంటిత్యాగధనుడు నా వద్దకు రాలేదు కనుక దీనిని వుపయోగించలేదు” అని అన్నారు.ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఆ రాజ్యమంతా పాకింది.తాము త్యాగధనులని నిరూపింుకోవడం కోసం
ఎందరెందరో ధనికులు వచ్చి బుద్ధుని దర్శనం చెసుకొని ఎన్నో విలువైన కానుకలను అర్పించుకొని,తమను ఆశీర్వదించమని కోర సాగారు, వైరాగ్యానికి మారు
పేరైన బుద్ధ భగవానుడు వాటిని తాకనైనా తాకలేదు.
దాంతో తమ త్యాగాన్ని బుద్ధుడు గుర్తించనందుకు
వారంతా నిరాశతో వెళిపోసాగారు. అందులో కొంతమంది కుత్సితులు బుద్ధుడిని విమర్శించడం కూడా చేసారు.ఒకరోజు ఆ దేశాన్ని ఏలే మహరాజు బుద్ధుడిని దర్శింపదలచి ఎన్నో విలువైన కానుకలను తీసుకొని తన పరివారంతో బయలుదేరాడు. దారిలో అతని పల్లకికి ఒక పండు ముసలిది అడ్డం వచ్చి ఆకలిగా వున్నది ,కాస్త అన్నంపెట్టండి”మహారాజును ప్రాధేయపడింది.మహారాజు వెంటనే జాలితో ఒక మామిడి పండును ఆమెకుఇచ్చాడు.
కొంత సేపటికి మహారాజు బుద్ధుని ఆశ్రమానికి వచ్చి
తాను తెచ్చిన విలువైన కానుకలను అర్పించుకొని
పాదాభివందనం చేసి ఒక పక్కన నిలబడ్డాడు. బుద్ధ
భగవానులు అప్పుడు తీవ్రమైన ధ్యానంలో మునిగి
వున్నారు.అప్పుడే ఆ ముసలి కూడా వచ్చి బుద్ధునికి నమస్కారం చేసి మహనీయుల వద్దకు ఖాళీ చేతులతో వెళ్ళకూడదన్న నియమాన్ని అనుసరించి తనకు మహారాజు ఇచ్చిన మామిడి పండును అర్పించుకుంది.వెంటనే బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి ఆ పండునుఅందుకొని ఎంతో ఇష్టం గా భుజించి పక్కనే వున్నఢమరుకాన్ని మోగించారు.అందరూ ఆశ్చర్యపోయారు. బుద్ధుని చర్యఎవ్వరికీ అంతు పట్టలేదు.మహారాజు అహంకారంతో ఎగిరిపడ్డాడు. బుద్ధుడుతనను పరాభవించినట్లు తలచుకొని “ అయ్యా! మీచర్య పక్షపాత ధోరణితో కూడుకొనివున్నది. నేనుమీకు ఎన్నో విలువైన ఆభరణలను, వజ్ర
వైఢూర్యాలను సమర్పించు కున్నాను. తమరుధ్యానంలో వుండి వాటిని కనీసం చూడనైనా చూడలేదు.
తమకు తపో భంగం కలిగించకుడదని నేను ఎంతో సేపటినుండి వేచి చూస్తున్నాను. ఒక్క చిల్లి గవ్వయినా విలువ చేయని ఈ ముదుసలి నేను భిక్షగా ఇచ్చినపండును తీసుకొని మీవద్దకు వస్తే మీరు వెంతనేకళ్ళు తెరిచి దానిని భుజించడమే కాక ఆమె ఎంతో గొప్పత్యాగం చేసినట్లు ఢమరుకాన్ని మోగించారు. ఇదనాకెంతో అవమానం కలిగింది. దయ చేసి మీ వింత ధోరణికి మాకు క్షమార్పణ చెప్పండి” అని
హుంకరించాడు.అప్పుడు దయా సముద్రుడైన బుద్ధ భగవానుడు ఎంతో ప్రేమతో కూడిన స్వరంతో “ నీవు అజ్ఞానంలోవున్నావు కాబట్టి వాస్తవాలను తెలుసుకోలేక నా చర్య వలన అవమానం పొందినట్లు అను కుంటున్నావు.త్యాగం అనే పవిత్రమైన కార్యక్రమంలో ఎంత చేసావన్నది కాదు ఏమి చేసావన్నది ముఖ్యం.భావం బట్టే ఫలితం ఆధారపడి వుంటుంది. నీ వద్ద పర్వతం తో సమానమైన ఆస్థి పాస్థులు వున్నాయి. నీ తర్వాత
వందల తరాలు తిన్నా కరిగి పోని భోగ భాగ్యాలు నీ
స్వంతం. నువ్వు నా వద్దకు వచ్చినప్పుడు రాజుననే
అహంకారంతో కానుకలను నాకు సమర్పించావు.వాటికి
ప్రతిఫలంగా నా వద్ద నుండి దాత అనే గుర్తింపు పొందాలని ఆశించావు. కాని ఈ ముదుసలిది కూటికి గతి
లేనిది. ఎన్నో రొజులు పస్తులు వున్న తర్వాత నీ
దగ్గరకు భిక్షకు వచ్చి నువ్వు ఇచ్చిన మామిడి
పండును తినబోతుండగా దారిలో పోయేవారు నా గురించి చెప్పగా విని, నా దర్శనం చేసుకుందామన్న అభిలాషతో తన వార్ధ్యకాన్ని, నడవలేని స్థితిని కూడా లెఖ్ఖ చెయ్యక నా వద్దకు పరుగు పరుగున వచ్చింది.పెద్దవారి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదన్ననియమాన్ని అనుసరించి కడుపులో మెలి పెడుతున్నతన ఆకలిని సైతం లెఖ్ఖ చెయ్యక ఆ పండును నాకు సమర్పించి గొప్ప త్యాగం చేసింది. ఆమె ఒనరించిన
ఈ అపూర్వమైన త్యాగానికి నాకెంతో ప్రీతి కలిగి ఈ
ఢమరుకాన్ని మోగించి ఆమె త్యాగనిరతిని ఈ లోకానికి చాటాను. మన వద్ద ఎక్కువగావున్నవాటిని ఇతరులకు ఇవ్వడం త్యాగం కాదు.మనకు ఎంతో ప్రియమైన దానిని మనము వదులుకోలేని వాటిని ఇతరుల సంక్షేమం కోసం ఇవ్వడమే అసలైన త్యాగం” అని చెప్పారు.ఆ మాటలకు జ్ఞానోదయమైన ఆ మహారాజు పరిశుద్ధమైన మనసుతో బుద్ధ భగవానుడిని తనఅప రాధాన్ని మన్నించమని వేడుకొని ఆయన
ఆశీర్వాదాలను తిసుకొని తన పట్టణానికి తిరిగి వెళ్ళాడు.అసలైన త్యాగానికి నిర్వచనం పై కధ. అసలైన
త్యాగానికి నిర్వచనం పై కధ. మనం ప్రతీరోజూ ఏవో చిన్న పాటి దాన ధర్మాలను చేస్తూ వాటికి భగవంతుడు మనలను అను గ్రహించ లేదని ఆయనపై అక్కసు
వెళ్లగక్కుకుంటాము. కానీ అసలైన త్యాగం, దానం
అంటే ఏమిటో మనం బుద్ధ భగవానుడు ఇచ్చిన
దివ్యోపదేశం ద్వారా గ్రహించి తదనుగుణంగా నిత్య
జీవితం లో నడుచు కున్నట్లయితే ఆ సర్వేశ్వరునికృపకు శ్రీఘ్రంగా పాత్రులమగుతాము.