భగవంతుణ్ని భక్తుడు మరవనంత కాలం, మాయ అతడి జోలికి రాదు. మరచిన తక్షణమే అతణ్ని శిక్షిస్తుంది. శిక్ష అంటే, భ్రమల్లో కొట్టుమిట్టాడేలా, పర్యవసానాలు అనుభవించేలా చేయడం! మనిషి జీవితం అదే తీరులో సాగిపోవడమంటే, తన జన్మను అతడు వ్యర్థం చేసుకొన్నట్లే. అలా వ్యర్థం చేసుకొంటున్నాననే స్పృహ సైతం కలగకపోవడమే ‘మాయ’ ప్రభావం!
మనిషి చేసే నిత్య పూజలు, ఆచరించే ఇతర ఆరాధన విధానాలు- అతడు ఆధ్యాత్మిక శిఖరం చేరేందుకు ఉపకరించే తొలి మెట్లు. అక్కడినుంచి అతడు మరెన్నో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
ఉన్నత శిఖరాన్ని చేరాలంటే, ఉత్తమ వ్యక్తిత్వం ఉండి తీరాలి.
ఉత్తమ వ్యక్తిత్వం అంటే,
మనిషికి ఉండే అందచందాలు కావు. భగవంతుడు ఇష్టపడే ఆధ్యాత్మిక వ్యక్తిత్వమే ఉత్తమ వ్యక్తిత్వమంటే!
ఏమిటా ఆధ్యాత్మిక వ్యక్తిత్వం?
భగవంతుడు ఆశించే విధంగా భక్తుడు జీవించడం. మనిషి తన సుగుణాలు కాపాడుకోవాలని భగవంతుడు ఆశిస్తాడు. ఇతరుల పట్ల సమభావం కలిగి ఉండటం, శక్తిని బట్టి సాయం చేయడం, దీనుల్ని ఆదుకోవటం వంటివి భగవంతుడికి అత్యంత ప్రీతి కలిగిస్తాయి.
ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితికి చేరుకొనేందుకు మనిషి అనుక్షణం ఆరాటపడాలి. ఆ ప్రయాణానికి ఆటంకాలు కలిగించే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో సమర్థంగా పోరాటం సాగిస్తుండాలి.
ఆ ఆరాటం ఎంత దీటుగా ఉంటే, ఆ పోరాటం ఎంత శక్తిమంతంగా సాగితే- మనిషి అంత త్వరగా ఆధ్యాత్మిక శిఖరంపైకి చేరుకుంటాడు. అదే అతడి జీవన గమ్యం!