Sri Adi Shankaracharya's Atma Bodha : Shlokam 46 : www.srichalapathirao.com

0 views
Skip to first unread message

Jnani

unread,
Jan 24, 2019, 10:55:44 AM1/24/19
to

Om Sri Gurubhyonamaha

*To Subscribe our Whatsapp Group* :  https://chat.whatsapp.com/DJ8qQIZrc750MNrB65QW1A

మనం కొత్తగా ఒక పట్టణానికి వెళ్లాం. మన బంధువుల ఇల్లు ఏ బజారులో ఉందో అడ్రసు తెలుసు. కాని ఇంతకు ముందెప్పుడూ వారింటికి వెళ్ళలేదు. కనుక ఆ ఇంటిని వెతుకుతూ బయలు దేరాం. అయితే పొరపాటు పడి మరొక వీధి గుండా వెళ్తున్నాం. అలా వెళ్తూ వెళ్తూ ఊరి పోలిమేరలవరకు వెళ్ళాం. ఇక ఎటు వెళ్ళాలో తెలియలేదు. అప్పుడు ఆ దారిన వచ్చే వ్యక్తిని అడిగాం. అతడు అన్ని గుర్తులు చెప్పి ఇలా ఈ దిక్కుగా వెళ్ళండి అన్నాడు. అతడు చెప్పిన ప్రకారం వెళ్లి మనం చేరుకోవలసిన ఇల్లు చేరుకున్నాం. దానితో ఆందోళన తొలగింది. ఆనందం కలిగింది.
    అలాగే మనం మన స్వస్థానం చేరుకొనేందుకు బయలుదేరాం. అనేక జన్మలు ఎత్తాం. కొన్ని జన్మలు మన లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా గడిపాం. కొన్ని జన్మలు లక్ష్యం తెలుసుకొనే అవకాశం లేకుండా గడిపాం. కొన్ని జన్మల సుకృతం కారణంగా ఏదో జన్మలో మన లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాం. కాని ఎలా ప్రయాణించాలో మార్గం తెలియటం లేదు. అందుకే దారీ తెన్నూ కానక, దిక్కులు తెలియకుండా ఎటుపడితే అటు ప్రయాణిస్తున్నాం. అలా ప్రయాణించే మనకు మన లక్ష్యాన్ని చేరుకొనేందుకు సరియైన మార్గాన్ని చూపించే గురువు ఏదో ఒక జన్మలో తటస్థ పడతాడు. మనం ఆయన చూపించిన మార్గాన్ని బాగా పరిశీలించి తెలుసుకొని; విశ్వసించి; ఆ  మార్గంలో ప్రయాణిస్తే తప్పక ఎప్పటికైనా సరే మనం  చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకుంటాం. గమ్య స్థానాన్ని చేరుకుంటాం. అలాగాక మన ఇష్టంవచ్చినట్టు ప్రయాణిస్తే ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేం.
ఇంతకూ మన లక్ష్యం-గమ్య స్థానం ఏమిటి? అదే మోక్షం. అదే బ్రహ్మం. అయితే మన లక్ష్యం మనకు తెలియటం లేదు. ఎందుకంటే ఈ జీవ భావం వల్లనే. ఈ దేహంతో తాదాత్మ్యం చెంది నేను అంటూ-ఈ దేహానికి చెందిన వాటిని నావి అంటూ-అహంకారంతో-మమకారంతో ఇక్కడ ఈ జన్మలలోనే ఇరుక్కు పోయాం. ఈ నేను-నాది అంత త్వరగా వదలవు. సన్యాసులను కూడా వదలవు. ఋషీకేశ్ లో ఒక సన్యాసి ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. కొందరు స్వామీ! మాట్లాడండి - బోధ చేయండి అంటే - ఏం మాట్లాడేది. ఇల్లు విడిచాను, తల గొరిగించాను, కాషాయం వేశాను, భిక్షాటన చేస్తున్నాను - అయినా పూజింపబడాలని కోరిక; భిక్షాన్నాన్ని ఒకరాతి మీద పెట్టుకొని తింటాను. మరొకడు ఆ రాతి మీద కూర్చుంటే నా రాతి మీద కూర్చున్నాడే అనే భావన - ఈ అహంకార మమకారాలు ఎప్పటికి వదులుతాయి అంటాడు.  నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాం. అందుకోసం కొందరు వ్యక్తులను చేరదీసి నా వాళ్ళు అని; కొన్ని వస్తువులను సేకరించి నావి అని భావిస్తూ వాటితో ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ వస్తువులు గాని, వ్యక్తులు గాని శాశ్వతమైనవి గావు; శాశ్వత ఆనందాన్ని  ఇచ్చేవీ కావు. అవి కొంతకాలం ఆనందాన్నిచ్చినట్లే ఇచ్చి చివరకు దు:ఖాన్ని మిగిల్చి పోతున్నాయి. మనం ఈ దు:ఖాన్ని తొలగించుకోవటానికి, సుఖాన్ని పొందటానికి మరి కొన్ని వస్తువుల కోసం, మరి కొందరు వ్యక్తులకోసం ప్రయత్నిస్తూ ఉంటాం. మళ్ళీ అంతే. ఎన్నటికీ "మార్పు లేని, శాశ్వతమైన, దు:ఖమిశ్రితం కాని ఆనందాన్ని" మాత్రం పొందలేం గాక పొందాలేం. ఎందుకంటే ఆనందం అనేది ఈ ప్రాపంచిక వస్తువుల ద్వారా లభించేది కాదు. అది మనలోనే ఉన్న శాశ్వత, నిత్య, సత్య వస్తువైన ఆత్మ ద్వారా-బ్రహ్మము ద్వారా, బ్రహ్మానుభూతి ద్వారా మాత్రమే వస్తుంది. ఈ విషయం తెలియకనే దిక్కులు తెలియక పరిభ్రమించే మానవుడి లాగా ఇక్కడ పరిభ్రమిస్తున్నాం.  ఏవేవో పనులు చేస్తున్నాం.  క్షణం తీరిక లేకుండా చేస్తున్నాం. ఎన్ని జన్మలెత్తినా ఇంకా ఇంకా ఎత్తుతూనే ఉన్నాం. నిరాశా నిస్పృహలతో కొట్టు మిట్టాడుతూనే ఉన్నాం.  పుడుతూ-చస్తూ-పుడుతూ చస్తూ దు:ఖ సముద్రంలో మునిగి పోతూనే ఉన్నాం.
    కనుక ఈ ప్రపంచాన్ని సత్యమని భావించి, నేను దేహాన్ని - అని అభిమానించుకొని, ఈ ప్రపంచంలోని వస్తువులను నావి అనుకుంటూ వీటి కోసమే జీవితాన్ని వినియోగిస్తే మనకు మిగిలేది దు:ఖమే; అశాంతే; జనన మరణ రూప సంసారమే. కనుక సద్గురువులను ఆశ్రయించు; సత్ శాస్త్రాలను ఆశ్రయించు, వారు చూపించిన మార్గంలో ప్రయాణించు. ఈ ప్రపంచంపైన, ఈ దేహంపైగల భ్రమను , మమకారాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి ఆత్మతో తాదాత్మ్యం చెందు. నీవు ఆత్మవేగాని జీవుడివి కాదు. దేహానివి కాదు.  కనుక జీవుడిగా ఉండకు-ఆత్మగా-బ్రహ్మంగా ఉండు. ఇదే నీ కున్న ఏకైక మార్గం. ఇదే ముక్తి మార్గం. ఇదే జన్మ సాఫల్య మార్గం. ఇదే నీ లక్ష్యం.  ఈ అహంకార మమకారాలు తొలగాలంటే-ఆత్మ యొక్క (నీ యొక్క) యదార్ధ తత్వాన్ని-యదార్ధ స్వరూపాన్ని తెలుసుకొనుటవల్ల కలిగే జ్ఞానం వల్లనే సాధ్యం.

*To Subscribe* :  https://chat.whatsapp.com/DJ8qQIZrc750MNrB65QW1A

*సేకరణ* : http://www.srichalapathirao.com/catalog >> శ్రీ ఆదిశంకరాచార్యులవారి ఆత్మబోధ
(Those who would like to go through complete Vyakhya for each shlokam, can order for Ebook or Printed Book or discourse CD/DVD from the above catalog URL)

Reply all
Reply to author
Forward
0 new messages