వర్రే రాణి గారి కవితలు- నా పిచ్చిగానీ..... అతను రాడు! ----- కొండచిలువ

25 views
Skip to first unread message

Sreenivas Bondili

unread,
May 19, 2013, 1:40:00 AM5/19/13
to sahi...@googlegroups.com

సదస్యులకు నమస్సులు,

2 ఫిబ్రవరి 1997 నాటి వార్త ఆదివారం అనుబంధంలో యీ కవితలు అచ్చయ్యాయి. కవయిత్రి వర్రే రాణి గారు. మీరు కూడా ఆస్వాదించండి.

శ్రీనివాసుడు


నా పిచ్చిగానీ....... అతడు రాడు!

రుచించక

ఎవ్వరో కొరికి పడేసిన రొట్టెముక్క

చంద్రుడు


విసిగిపోయి

ఏ యిల్లాలో వదిలేసిన శ్వాస

చల్లగాలి!


కనుగుడ్లనే

దురాక్రమిస్తున్న కాటుకని

కసిగా యే ఆడపిల్లో విసిరిపడేసినట్లు

చీకటిరాత్రి!


వస్తానని చెప్పి

ఎంతకీ రావటం లేదేమో చెలికాడు-

ఏడుస్తూ కీచురాయి!


కొడిగట్టీ

వొత్తినే నూనెగా చేసుకు వెలిగే దీపం

ఎదురుచూపు!


అతను రాడు.


నా పిచ్చిగానీ

వాడిపోయిన పూలతోటకి

ఎవరుమాత్రం యెందుకొస్తారూ?

 

కొండచిలువ

మా కొండచిలవ మాట్లాడుతుంది

అప్పుడప్పుడూ

పోట్లాడుతుంది కూడా


నేను బానిస పాత్రలో

రాణించినప్పుడు

అది యజమాని పాత్రోచితంగా

నన్ను దగ్గఱకు తీసుకుంటుంది


నేను యెక్కడైనా

కాసింత లోటు చేసిన్నప్పుడు

అది శిక్షాస్మృతై నన్ను కబళించివేస్తుంది


మా కొండచిలవ

పేంట్లేసుకుంటుంది

ఇంగ్లీష్ మాట్లాడుతుంది

సాహిత్యచర్చలూ చేస్తుంది


కానీ నన్ను మాత్రం

నాలుగ్గోడల సాక్షిగా చుట్టుకుని

నమిలిమింగేస్తుంది


నేనిప్పుడు పాముల చర్మ వలిచే

కోర్సులకోసం

కనిపించిన ప్రకటనల్లా ఆశగా

వెదుక్కుంటున్నాను


రచన : వర్రే రాణి

 

 

 

 

Reply all
Reply to author
Forward
0 new messages