ప్రకాశం పంతుల గారి ‘’దార్శనిక ప్రకాశం ‘’-2
స్వరాజ్యపత్రిక
ప్రకాశంగారిజీవిత ఘట్టాలలో స్వరాజ్య పత్రిక స్థాపన ఒకవిశిష్ట విషయం .1921నవంబర్ లో పంతులుగారు దీన్ని స్థాపించగా నిర్భయతకు నిలువెత్తు అద్దంలా నిలిచింది .ఎన్నో సార్లు పరప్రభుత్వం దీనిపై నిషేధానికి ప్రయత్నించినా పప్పులు ఉడకలేదు .ప్రజల ప్రాధమిక హక్కులకేమాత్రం భంగం కలిగిస్తూ ఉన్నప్పుడుఈ మిగిలిన ఏపత్రికలు సాహసించి ఖండించటం కాని ,స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి రాయటానికి కానీ సాహసించలేదు .అప్పుడు ఆపనులను స్వరాజ్యపత్రిక చేసి ప్రజాభిమానం పుష్కలంగా పొందింది .బ్రతికిన పదేళ్లు ‘’మగసిరి ‘’గా బ్రతికింది .ఆపత్రిక తెచ్చిన ఖ్యాతి ,,ప్రయోజనం ఖర్చయిన డబ్బు ,పొందిన కీర్తి లెక్క వేసుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది గర్వంగా ఉంటుంది .ఆపత్రికలో తయారైన వారే కోటం రాజు రామారావు ,కోలవెన్ను రామ కోటేశ్వరరావు ,కృపానిది ,ఖాసా సుబ్బారావు ,కుందూరు ఈశ్వర దత్తు ,క్రొవ్విడి లింగరాజు గార్లు .అఖిలభారతయశస్సు పొందిన మేటి జర్నలిస్ట్ లు .వీరంతా ప్రకాశంగారి శిష్యులమని ఆనందంతో గర్వంగా చెప్పుకొంటారు .ముఖ్యకారణం ఆయన వీరికిచ్చిన స్వేచ్చ ,స్వాతంత్ర్యం .
1928 సైమన్ కమిషన్ బహిష్కరణ లో ప్రకాశంగారు చూపిన ధైర్యసాహసాలు ‘’ఆంధ్రకేసరి ‘’బిరుదుకు తార్కాణం .’’గుండు దెబ్బకు జనక బోడన్నా -చొక్కాని తీసి గుండె దానికి పందెమిడెనన్నా ‘’అంటూ గేయాలతో కీర్తించారు .1926,1937 రాష్ట్రీయ శాసన సభా ఎన్నిలలో కాంగ్రెస్ కు ఎనలేని బలం చేకూర్చారు ప్రకాశం గారు .విరామం లేకుండా పగలూ రాత్రీ సంచారం చేశారు .’’నా కారు ఆ రోడ్డు మీద పోనివ్వండ్రా,కాంగ్రెస్ కు వోట్లు ఎందుకు పడవో చూస్తాను ‘’ఆని తొడగొట్టి వోట్లు వేయించిన సాహసమూర్తి .
రెవెన్యు మంత్రిగా ప్రకాశం గారి సేవలు నిరుపమానం .భారతం లోని 18పర్వాలు లాగా ఆయన 18పర్వాల రిపోర్ట్ తయారు చేసి ప్రచురించి ‘’నేను దీనికోసమే బతికి ఉన్నాను ‘’అంటూ అసెంబ్లీలో కన్నీరు కార్చిన కరుణామయుడు ప్రకాశం .ముఖ్యమంత్రిగా 1946లో ఆయన వచ్చినప్పుడు ఆయన బడ్జెట్ ను ‘’ప్రజల బడ్జెట్ ‘’ఆని ప్రసిద్ధి పొందింది .ఆయన ఏర్పాటు చేసిన ఆహార కమిటీలు ,ఉత్పత్తి ,కొనుగోలు సంస్థలు అమెరికా దేశం వారిచే కొనియాడ బడ్డాయి .పుట్టిన నాటినుంచి చనిపోయేదాకా ఆయన అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు .కొన్నిటిని స్వయంగా సృష్టించుకొన్నాడు .అయితే వాటన్నిటిని జయప్రదంగా నిర్వహించుకోవటం ఆయనకు పరిపాటి .సాహసం అంటే ఆంధ్రకేసరికి సరదా .ఆట విడుపు . నిరంతర దేశ సంచారం చేస్తూ ,ఎక్కడ ప్రభుత్వ కఠిన బలప్రయోగం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యే వారు ‘’ఎవర్రా ! ప్రజలపై దౌష్ట్యం చేసింది ?అంటూ గర్జిస్తూ అదలిస్తూ ,బెదిరిస్తూ ,ప్రజల ప్రేమాభిమానాలు పొందిన ఆంధ్రకేసరి యావద్భారతానికే ‘’కేసరి ‘’.రాష్ట్రానికే కాక దేశానికీ గొప్ప వెలుగు ప్రసాదించిన మహనీయుడు ప్రకాశం పంతులు .ఆయన పేరు బిరుదు సార్ధక నాయాలు .1934లో గుడివాడలో శ్రీ మాగంటి అంకినీడు గారిఆధ్వర్యం లో సన్మానించి ప్రకాశంగారికి వెయ్యి నూట పదహార్లు నిధి ఇవ్వాలని పట్టాభిగారిని అధ్యక్షులుగా రమ్మంటే అంగీకరించకపోతే గొట్టిపాటి బ్రహ్మయ్య గారుఅధ్యక్షలై నిర్వహించారు .ప్రకాశం గారి త్యాగమయజీవితమే తనను ఆయన భక్తుణ్ణి చేసి౦ది అని పొంగిపోయిచేప్పారు రైతుపెద్ద బ్రహ్మయ్య గారు .సభలలో ఎత్తైన వేదికలు ఎక్కాల్సి వస్తే ఎవరైనా ప్రకాశంగారికి సాయంగా పట్టుకోవాలనిముందుకువస్తే ఒప్పుకోకుండా ,బ్రహ్మయ్య గారు మాత్రం చేయిపట్టుకొంటే నవ్వుకొంటూ ‘’వీడు బ్రహ్మయ్యలె .Extra cautious ‘’అనే వారు .
1955లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఏలూరులో జరుగుతుంటే ,అనంతపురం కర్నూలు కడప పరిశీలకుడుగా బ్రహ్మయ్య గారు వెళ్లి రిపోర్ట్ రాస్తూ కూర్చుంటే ,ప్రకాశంగారు ఆయన దగ్గరే రావటం చూసి లేచి నిలబడితే ‘’లేవకు నేను నీ మీదే కూర్చుందామని వచ్చాను’’ఆని నవ్వి ప్రక్కన కుర్చీ వేయించు కొని కూర్చున్నారు .చల్లపల్లి రాజా కు అసెంబ్లి టికెట్ ఇవ్వరాదని నేను భావిస్తే గోపాలరెడ్డి ప్రకాశం గారితో చెప్పగా ఏం చేద్దాం ఆని బ్రహ్మయ్య గారిని అడిగితే బ్రహ్మయ్య గారికి ఆంగ్రేస్ పట్ల ఉన్న నిబద్ధత ,త్యాగం గుర్తు చేసి చల్లపల్లి రాజా అభ్యర్ధిత్వానికి ఒప్పుకోనేట్లు పది హేను నిమిషాలు వేదికపై మాట్లాడి బ్రహ్మయ్యగారికి బారిస్టర్ అయ్యారు ప్రకాశం గారు .అదీ ఆయన వాదనా పటిమ .ఆయన్ను పంతులుగారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేసిన మంత్రముగ్ధ మైన ప్రసనగం అన్నారు బ్రహ్మయ్య గారు .ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశాలలో బ్రహ్మయ్య గారు తయారు చేసిన ‘’బ్రహ్మయ్య అవార్డ్ ‘’రిపోర్ట్ లో ఆంధ్రరాష్ట్ర నిర్మాణాన్ని విమర్శిస్తూ రాసిన దాన్ని మెచ్చిదగ్గరకు వచ్చి అభినందించారు పంతులుగారు . అనేక సందర్భాలలో రైతుపెద్ద బ్రహ్మయ్య గారిపై అమిత వాత్సల్యం చూపారు .ఈయనకూ ఆయనపై గాఢభక్తీ పెరిగింది .మద్రాస్ ముఖ్యమంత్రిత్వానికి ప్రకాశం ,పట్టాభి పొతే పడితే ప్రకాశంగారినే సమర్ధించి పనిచేశారు బ్రహ్మయ్య గారు..
దేశ సేవలో ,స్వరాజ్య సంరంభం లో, స్వరాజ్య పత్రిక నిర్వహణలో ప్రకాశం గారు సంపాదించిన కోట్లాది రూపాయలు హారతి కర్పూరంగా హరించుకు పోయింది .1937లో రాజాజీమంత్రి వర్గం లో రెవిన్యూ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ‘వచ్చినప్పుడు ’ఆయన దుస్తులలో దోవతికాని చొక్కాకానీ ,ఉత్తరీయం కాని చిరుగులు లేనివి లేనే లేవు’’ .గమనించిన బ్రహ్మయ్యగారు ఆంధ్రా స్టోర్స్ నుంచి ధోవతి ,ఉత్తరీయం ,తమిళనాడు స్టోర్స్ నుంచి కుట్టిన చొక్కా కొని తీసుకొచ్చి వేసుకోమంటే ‘’ఒరే బ్రహ్మయ్యా !ఆంధ్రా స్టోర్స్ లో చొక్కా దొరకలేదట్రా ‘’అన్న ఆంధ్రాభిమాని ప్రకాశం పంతులుగారు .
ఆధారం -రైతుపెద్ద శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ''నా జీవన నౌక
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-25-ఉయ్యూరు .
