an
బర్మాను ముంచెత్తిన బౌద్ధం
ఆగ్నేయ ఆసియాలోని చాలాదేశాలను ఇండియా చైనాలు బాగా ప్రభావితం చేశాయి .తూర్పు దేశాలకు బర్మా సింహద్వారం .తూర్పు ఆసియాకు స్థలమార్గం అస్సాం బర్మాల మీదుగానే .బర్మాతో మనదేశానికి రెండువేల సంవత్సరాలనుంచే సంబంధం ఉంది.బౌద్ధంకూడా బర్మాలో అతి ప్రాచీన కాలం లోనే ప్రవేశించింది .క్రీ శ 5వ శతాబ్దిలో బుద్ధ ఘోషుడు లంకనుంచి హీనయాన బౌద్ధాన్ని బర్మాకు తెచ్చాడు అంటారు కానీ చైనా మాత్రం అంతకు ముందు నుంచే అక్కడ బౌద్ధం ఉందంటుంది .ఘోషుడికి ముందే మహాయాన ,బ్రహ్మయానాలు వ్యాపించాయట .తర్వాత వజ్రయానం వైదిక మతం ,దానితోపాటు ధర్మ శాస్త్రం భారత నుంచి వ్యాపించాయట .సంస్కృత ,ప్రాకృతపదాలు బర్మా భాషలో అనేకం చేరాయి .11వ శతాబ్ది మొదట్లోనే బర్మాప్రజలలో జాతీయత మొలకెత్తింది .’’అనవ్రతుడు ‘’అనే రాజు కాలం లో హీన యానం విజ్రుమ్భించి ,మహాయానాన్ని పక్కకు నెట్టేసింది .సంస్కర్త అయిన అతడు భారతీయ లిపికి బదులు బర్మా లిపి ప్రవేశ పెట్టాడు .బౌద్ధ గ్రంధాలను బర్మాభాష లోకి మార్పించాడు .కళా పునరుజ్జీవనం కూడా ప్రారభమై అనేక మందిరాలు వెలిశాయి .తన రాజధాని పెగాన్ అనే ఇవాల్టి ‘’పెగు ‘’లో ‘’ఆనందమందిరం ‘’అనే విహారం అత్యంత సుందరంగా నిర్మించాడు .పగాన్ అప్పటి గొప్ప బౌద్ధ క్షేత్రం .భారత దేశం లోని బౌద్ధ భిక్షువులు విద్వాంసులు ముస్లిం లకు భయపడి నలందా మొదలైన కేంద్రాలనుంచి పగాన్ వెళ్లి తలదాచుకొన్నారు .అప్పుడు బర్మాలో పగాన్ బౌద్దానికి స్వర్ణయుగం.పగాన్ ఇరావతి నడి ముఖ ద్వారం లో ఉన్నందున గుప్తులకాలం నుంచే భారత కు బర్మాకు సముద్రం లో రాకపోకలు౦డేవి .12వ శతాబ్ది చివర్లో ‘ హిలోమినో’’రాజు బుద్ధగయ లోని మందిరం నమూనాలో ఒక స్తూపం నిర్మించాడు .13వ శతాబ్దిలో కుబ్లాయ్ ఖాన్ మనవడు బర్మాను జయించగా ఎగువ బర్మా చైనా సామ్రాజ్యం లో కలిసి పోయింది . 16వశతాబ్దిలో ‘’బుయిన్ నవుంగ్ ‘’రాజుకాలం లో బర్మా మళ్లీ యేకీకృతమైంది .అప్పటినుంచి అక్కడ బౌద్ధం మాత్రమె ప్రధాన మతం .
సందట్లో సడేమియా సయాం
మనం శ్యామ దేశీయులు ఆని పిలిచే సయాం దేశస్తులు తమ సోదరులైన కాంభోజ -కంబోడియా దేశస్తుల నుంచి నాగరకత నేర్చారు .సయాం లో బౌద్ధం ఎప్పుడు ప్రవేశించిందో చెప్పలేముకాని ,5వశతాబ్దికి సయాం అంతా వైదిక సంస్కృతీ గుబాలి౦చింది.తర్వాత హీన మహాయానాలు బర్మా లంక కాబో డియాలనుంచి సయాం చేరాయి .8వ శతాబ్దం లో ‘’హరిపు౦జయ రాజ్యం ‘’బౌద్ధ రాజ్యం . మధ్య ,దిగువ సయాం లలో లవపురి రాజధానిగా ‘’ద్వారావతి’’రాజ్యం వెలిసింది .10వ శతాబ్ది దాకా ఉంది..తర్వాత కా౦భోజులు దీన్ని జయించారు ..13 వ శతాబ్ది తర్వాత చైనాలోని యునాన్ రాష్ట్రం లోని ‘’ధాయ్ ‘’తెగవారు సయాం ను ఆక్రమించి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా మార్చారు .ఇవి వైదిక ,బౌద్ధ రాజ్యాలయ్యాయి .రాజులకు వైదికం నరనరానా జీర్ణించింది .వాళ్ళు చైనా లోని తమ మాతృ భూమి ని ‘’గాంధారం ‘’అన్నారు .అందులో ఒక భాగాన్ని విదేహం అన్నారు. దాని రాజధాని మిధిల అన్నారు .ఈ ధాయ్ గాంధార రాజ్యం 13వ శతాబ్ది దాకా నిలిచింది .తర్వాత కుబ్లాయ్ ఖాన్ జయించి చైనాలో కలిపేశాడు .కానీ ధాయ్ తెగవారు యూనాన్ నుంచి దక్షిణంగా వెళ్లి సయాం ఉత్తర భాగం లో ‘’సుఖోదాయ్ ‘’అనే స్వతంత్ర రాజ్యం స్థాపించారు .వీరిలో గొప్పరాజు ‘’ఖం బె౦గ్ ‘’ 14వ శతాబ్దం వాడు .ఇతని రాజ్యం దిగువ బర్మాలో కొంతవరకు వ్యాపించి ఉంది.రాజధాని నగరం ముందు పెద్ద గంట వ్రేలాడి ఉండేది .కడుపులో పుండు హృదయం లో బాధ ఉన్నవారు యేవేళనైనా ఈ ధర్మ గంట కొట్టి రాజును దర్శించవచ్చు .రాజు ఫిర్యాదు విని వెంటనే తీర్పు చెప్పేవాడు అతని మరణం తర్వాత ‘’మేనం’’ నదీతీరం లో .అయుధ్య -అయోధ్య అనే మరొక రాజ్యం స్థాపితమైంది ..రాజు ‘’రామ థి బోడి’’ .దీన్ని బర్మా వాళ్ళు ధ్వంసం చేయగా 1767 నుంచి బ్యా౦గ్ కాక్ రాజధాని అయింది .సయాం దేశీయులు నేటికీ వైదిక సంస్కృతికి ,బౌద్ధ మతానికి గర్వ పడతారు .వీరి భాషలో ప్రజాపదిక ,రామేశ్వర అయోధ్య, ఇంద్రపురి, స్వర్గాలిక, విష్ణులోక ,ధర్మరాజ ,మహేంద్ర, అవంతి సంస్కృత పదాలు కనిపిస్తాయి .సయాం వర్ణమాల ను ‘’రామ ఖ౦బెగ్ ‘’అనే విద్వాంసుడు కనిపెట్టాడు .సయాం మొదటి నిఘంటువు పేరు ‘’పథాను క్రమ ‘’.బ్యాంగ్ కాక్ నిండా బౌద్ధ వైదిక విగ్రహాలు బహు సుందరం గా కనిపిస్తాయి .ఈ శిల్పం లో మన అమరావతి చాయలు ,,గుప్త ,పల్లవ సంప్రదాయం ఉంటుంది .
ఆధారం -సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్ర గారి వ్యాసం .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్-31-8-25-ఉయ్యూరు .