ఎం. వి. ఎల్. పురస్కారం -2(చివరిభాగం )
ఆయనను మొదటి సారి వినటం చూడటం
రేడియో నాటికలలలో ఎమ్వి ఎల్ ను వినేవాళ్ళం .అ స్వరం రసరమం గా ఉండేది చక్కని ఉచ్చారణ ప్రస్పుట భావ ప్రకటన ఆయన ప్రత్యేకం .మా టిఎల్ కాంతారావు కూడా ఆయన్ను మెచ్చుకోనేవాడు .బందరులో టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ కు వెళ్లినప్పుడు ఒక సాయంత్రం టౌన్ హాల్ బయట నారాయణ రెడ్ది గారి ఉపన్యాసం ఉందని తెలిసి వెళ్ళా.దాదాపు అరగట పైన ఆయన మాట్లాడినా ‘’చప్ప చప్పగా ‘’ఉన్నట్లు అనిపించింది .తర్వాత ఎమ్వి ఎల్ గారు మాట్లాడారు గంట సేపు ప్రేక్షక జన’’ స్పెల్ బౌండ్ ‘’గా విన్నారు ఆస్వరంలో భాస్వరం దట్టింన్చినట్లుంది అలవోకగా ,మహా మాధుర్యంగా ,నూజివేడు రసాల సారంగా ఉందనిపించింది .అప్పుడు తెలిసింది వాట్ ఈజ్ ఎమ్వి ఎల్ ఆని .ఈ విషయం చాలా సార్లు చెప్పాను రాశాను కూడా .ఈయనముందు సినారె బాగా తేలిపోయాడు ..ఆని నా అభిప్రాయం ఏ విషయం పై మాట్లాడారు అన్నది మాత్రం గుర్తు లేదు
మొదటి సారి ఆయనతో మాట్లాడటం .
ఒకసారి నూజి వీడు నుంచి బెజవాడ కు ఎక్స్ప్రెస్ బస్ లో వస్తున్నాను .నాప్రక్కన ఎం వి ఎల్ .’’కలా నిజమా’’ అని పించింది .ముత్యాలముగ్గు సినిమా వచ్చినట్లు లేదు అప్పటికి .మా ఇద్దరికీ మాటలు కలిశాయి .నాకుకూడా కొంత సాహిత్యాభిలాష ఉన్నట్లు గ్రహించాడు .శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు మాకు బంధువులు ఆని తెలుసుకొని ‘’శాస్త్రి గారు గొప్ప కథకులు ఆ కథలు చదివారా “”?ఆని అడిగారు .నేను’’షేక్స్ పియర్ మొహం పెట్టి నోరు వెళ్ళబెట్టి ‘’లేదు ‘’ఆన్నాను .అయ్యో చాలా’’ మిస్ అయ్యారు’’అన్నాడు .’’శాస్త్రిగారి అవధానాలు ఆర్ష గ్రంథరచన గురించేతెలుసు .ఈ సంగతి అసలు నకుతెలీదు’’అన్నాను .అప్పుడాయన ‘’’బెజవాడ కాలేజిలో తెలుగు లెక్చరర్ జంధ్యాల మహతీ శంకర్ శాస్త్రిగారి కథలు సేకరించి నాలుగైదు భాగాలుగా ప్రచురించారు .మార్కెట్ లో ఉన్నాయి. తప్పక చదవండి ఆయనకు గొప్ప పేరు తెచ్చిన ‘’డిప్రెషన్ చెంబు ‘’కథ పాలగుమ్మి పద్మరాజుగారి ‘’గాలివాన ‘’కు సాటి అయినది .ఎందుకో మనవాళ్ళు ఉపెక్షించారు కానీ శాస్త్రిగారి కధలు విశ్వ సాహిత్యస్థాయి కలవి ‘’.ఆయనకు దగ్గరగా రాగల కథకులు లేరు మాస్టారూ ‘’అన్నారాయన .అప్పుడు తెలిసింది నాకు శాస్త్రిగారి కథా సాహిత్యం గురించి .ఆయన తమ్ముడు చిరివాడవాసి వేలూరి కృష్ణమూర్తి గారి అబ్బాయి వివేకానంద గారికి మా చిన్నక్కయ్య దుర్గ ను ఇచ్చి పెళ్ళి చేశాం .ఆఊరి వారే వేలూరి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి రామ కృష్ణకు మా అన్నయ్యగారామ్మాయి వేదవల్లి నిచ్చాం . చిరివాడ వెళ్ళినప్పుడల్లా శాస్త్రిగారి దర్శనం లభించేది .ఒకటి రెండు సార్లు వారింటికి వెళ్లి ప్రక్కనా కూర్చుని మాట్లాడిన అదృష్ట వంతుడిని.. శాస్త్రిగారి కథాపుస్తకాలునేను కొని చదివాను అద్భుతః అనిపించాయి తర్వాత వాటిని విశ్లేషిస్తూ సరసభారతి బ్లాగ్ లో రాశాను .పరమానందం కలిగింది ఈ విధంగా ఎమ్వి ఎల్ కు చాలా రుణ పడి ఉన్నాను .ఫేస్ బుక్ లో లైవ్ చేయటంమొదలెట్టాక శాస్త్రి గారి కథలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసి ప్రాయశ్చిత్తం జర్పుకున్నాను ఇన్నాళ్ళు ఆయన కథాసాహిత్యం తో పరిచయం లేనందుకు .
ఆయన కుమార్తెకు సరసభారతి పురస్కార౦
బొడ్డ పాటి చంద్ర శేఖర్ మా సరసభారతి మిత్రుడు .ఆయన ఏమ్విఎల్ గురించి అక్కడి ట్రస్ట్ గురించి ‘’ఎలమావి తోట ‘’నవల గురించి చెప్పారు .ఈ ఉగాదికి ఏమ్విఎల్ భార్యగారికి సరస భారతి పురస్కారం ఇవ్వాలనిపించి అడిగితె ఆమె కూడా చనిపోయారని కుమార్తె అనూరాధ ఉన్నారని చెప్పగా ఆమెను పిలిచి ఉగాది పురస్కారం అందజేశాం .అప్పటి నుంచి ఆమె నన్ను ‘’పెదనాన్న గారూ “’ఆని మెసేజ్ లో, ఫోన్లలో అంటూ మాట్లాడింది .నాకొక అమ్మాయి నూజివీడు లో దొరికి నందుకు సంతోషంగాఉంది .అలాగే మద్రాస్ లో సోషల్ వర్కర్ శ్రీమతి లేళ్ళ శ్రీదేవి పరిచయమై నన్ను’’ బాబాయి గారు ‘’అంటుంది .భర్త సంగీతంలో నిష్ణాతుడు రిసెర్చ్ చేసిన వాడు .ఈమధ్యనే బెజవాడ ఆభార్యా భర్తలు వచ్చి ఉయ్యూరు మా ఇంటికి వస్తే సత్కారం చేశాం .అనూరాధను తండ్రిగారు రాసిన కానుక పుస్తకం ఉందా ఆని అడిగితె ఆదీ, ముత్యాలముగ్గు వెండితెరనవల ,ఆయన కవితల పుస్తకం పంపింది .మొదటి రెండూ లైవ్ చేశాను .ఆమె చూసింది కూడా .’’ అంతకు ముందే ఎంవిఎల్ గారి సమగ్రపరిశోధన ‘’‘’ముళ్ళపూడి రమణ రచనలు ‘’కూడా నెట్ లో నుంచి డౌన్ లోడ్ చేసి లైవ్ చేశా.అలాగే గుంటూరులో ఉన్న ప్రొఫెసర్ సుశీలమ్మగారి పరిశోధనా పుస్తకమూ చేశా .వీటన్నిటిలో ఏమ్విఎల్ చేసిన పరిశోధన ఉత్తమోత్తమ మైనది అనిపించింది .ఆయన ‘’కానుక’’ .తెలుగు సాహిత్యం లో మణిపూస .శ్రీరమణ ‘’మిధునం ‘’అంత గొప్పది .కానీఎవరూ కానుక విలువ గుర్తించలేదని పించింది .కానుక తెలుగు సరస్వతి క౦ఠాభరణమైన’’ కానుక ‘’.దానికి అదే సాటి . ఆయన కృషిని గుర్తించలేదని నేనూ అనూరాధ బొడ్డపాటి ఫోన్ లో మాట్లాడుకొంటూ అనుకొన్నాం .అప్పుడు నాకు తనికెళ్ళ భరణి చెప్పిన రసగంగాధర కర్త జగన్నాధ పండిత రాయలు అన్న ఒక మాట జ్ఞాపకం వస్తోంది ‘’బంగారం మట్టితో కలిసిఉన్నా ,బయటికి తీసి నిప్పులో కాల్చి తీగలుగామార్చినా బాధ పడలేదట .తనను అల్పమైన ‘’గురివింద గి౦జల’’తో తూకం వేసితూచినందుకు బాధ పడిందట .గొప్ప కొటేషన్. శ్లోకం కూడాఉంది .2008లో బాపు రమణ లనుమద్రాస్ లో వారింటికి వెళ్లి రెండు గంటలు ఉండి మాట్లాడిన విషయాలు మరువలేనిది మా జన్మ చరితార్ధం అనిపించింది .అంతకు ముందు చిట్టెన్ రాజుగారు హైదరాబాద్ లో బాపురమణల స్నేహ షష్టి పూర్తి మహోత్సవం చేస్తే ప్రత్యక్షంగా చూసిన అదృష్టవంతుడిని .అలాగే నూజి వీడులో ఏమ్విఎల్ ట్రస్ట్ వారు ‘’బాలు- ఎమ్విఎల్ ‘’స్నేహోత్సవం జరపటం అద్భుతః .అభినందనీయం .అందులో నన్ను పాల్గోనేట్లు చేయటం నాకు దక్కిన మహా గౌరవం .
నాకు తెలిసిన ఏమ్విఎల్ సాహితీ వ్యక్తిత్వం
పురాణం వారి ‘’మధురవాణి ఇంటర్వ్యూలు’’లోఆరుద్ర ‘’ఏమ్విఎల్ ఒకఅద్భుతమైన చిన్నవాడు . చాలా కుశాగ్రబుద్ధి .అతనూ,పురాణం కలిసి ‘’మిని పోయిట్రీ కొత్తగా ప్రారంభించారు’’అన్నాడు ..అతని కవితలు రసగులళికలే . మచ్చుకు కొన్ని ‘’.1-బాధలు సూదులు అనుకొంటే -జీవితం పిన్ మిషన్ ‘’2-సంతృప్తి ని అచ్చుకిస్తే -లోకమే-ప్రింటింగ్ మెషిన్ ‘’3 ఈ తరం తరంగం లా విరుచుకు పడుతుంది -కురంగంలా పరుగులు పెడుతుంది -మొందడి రాళ్ళమీద విరిగి పడినా -వేటగాళ్ళ గురి తగిలి పడినా ‘’.ఆయన కవితా శీర్షికలు అద్భుతం .కవితకే వన్నె తెచ్చేవి .
ఆయన ‘’కోడె కారు ‘’కవులను వెన్ను తట్టి ప్రోత్సహించాడు .’’తాగుడు మూతలు ‘’శీర్షిక నిర్వహించి మెప్పించాడు .అయన స్వరం సప్తస్వర మాధుర్యం -ప్రహ్లాద భరితం అనుభవైక వేద్యం -ఆయన్ను ‘’సాంస్కృతిక రాయబారి’’ అన్నారు అందరూ .
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి’’ప్రచురణగా ‘’తెలుగు పలుకుబడులు ‘’ప్రచురించాడు ఎమెస్కో ‘’పుస్తక ప్రపంచం ‘’మాసపత్రికకు 1969-70 లో సంపాదకుడు .1976లో ఉడుగర (కానుక )రాశాడు .’’మలుపు -మెరుపు ,నేడు సాత్యం ,నవలల రచయిత కూడా .’’తెలుగు వ్యుత్పత్తి పద కోశం’’ రాసిన పండితుడు .1974లో యులిసిస్ ‘’కవితాసంపుటి వెలువరించాడు .జగమెరిగిన సత్యం ‘’ముత్యాలముగ్గు నిర్మాత ‘’.గోరంతదీపం ,స్నేహం ,మావూరి పాండవులు ,తూర్పు వెళ్ళే రైలు ,ఓ ఇంటి బాగోతం సినిమాలకు సంభాషణా రచయిత ..ఆణిముత్యాలు ,వాణిముత్యాలు,యువ జ్యోతి శీర్షికలను వివిధ పత్రిఅకలలో నిర్వహించిన సామర్ధ్యం ఆయనది .రేడియో లో అనేకప్రసంగాలు చేశాడు నాటికల్లో నటించాడు
నూజి వీడు నుంచి బరంపురం -బళ్ళారి దాకా అనేక సభల్లో అనర్గళంగా అసామాన్యంగా ప్రసంగించిన మహా వక్త .స్నేహపాత్రుడు ,ఆత్మీయుడు
19-9-1944లో జన్మించి 1986లో 42ఏళ్లకే మరణించాడు మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు అనే ఎమ్వి ఎల్ ..
ఆయన చనిపోయిన 60ఏళ్లకు MVL సాహితీ సమాఖ్య నూజివీడులో 61వ జయ౦తిఉత్సవ ప్రత్యెక సంచిక 20025 జనవరిలో ప్రచురించారు .దాదాపు పాతికేళ్ళుగా ట్రస్ట్ వారు కార్యక్రమాలు ఆయన జన్మదినం నాడు నిర్వహిస్తూ ఆయన సాహితీ సేవను స్మరిస్తూ సాహిత్య సంగీత నృత్యరంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరిస్తూ చిరస్మరణీయం చేస్తున్నారు .
ప్రతిభా సంపత్తి పూర్తిగా వెల్లడి కాకముందే -అకస్మాత్తుగా అస్తమించిన రవి కవి పవి ‘’.ఎమ్వి ఎల్.
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-25-ఉయ్యూరు .
