ఇద్దరుతెలుగు విజ్ఞాన శాస్త్ర రచయితళు
1-రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాలస్థాపకులు , ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్ ,మద్రాసు సంగీత అకాడమివ్యవస్థాపక సభ్యులు,ఆధ్యాత్మిక ,విజ్ఞాన శాస్త్ర రచయిత -శ్రీ విస్సా అప్పారావు
విస్సా అప్పారావు (1884 - 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.
వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు, మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. అంతట రాజమండ్రిలోనే స్కూలు అసిస్టెంటుగా కొంతకాలం పనిచేసి; తదుపరి 1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర అసిస్టెంటు ప్రొఫెసర్ గా నియమితులై ఆనర్సు విద్యార్థులకు బోధించారు. 1914 నుండి రాజమండ్రి, అనంతపురం కళాశాలలో పనిచేసి; 1927లో తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. అక్కడ 1936 వరకు పనిచేసి ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకులుగా ప్రఖ్యాతిచెందారు. 1936-38 మధ్య రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి, తర్వాత కొంతకాలం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి; 1941 పదవీ విరమణ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామం మార్కొండపాడులో ఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు 16 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు. వీరు 1966 జూలై 30 తేదీన హైదరాబాదులో పరమపదించారు.
రచనలు
· త్యాగరాజ కీర్తనలు (1947)
· క్షేత్రయ్య పదాలు (1950)
· పరమాణు శక్తి (1952)
· వ్యాసావళి (1956)
· ఆకాశం (1960)
· విజ్ఞానం విశేషాలు (1964)
· నృత్య సంగీత వ్యాసరత్నావళి (1966)
· ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు (1962)
· రామదాసు కీర్తనలు
2- సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు- -శ్రీ వసంతరావు వెంకట రావు .
వసంతరావు వెంకటరావు ఒక సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు.
జీవిత విశేషాలు
ఈయన 1909, ఫిబ్రవరి 21 వ తేదీన జన్మించాడు. తండ్రి పేరు తాతారావు. విజయనగరం మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య (ఎం.యస్సీ) చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం వద్ద భౌతిక శాస్త్ర ప్రయోగ శాలలో కొంతకాలం శిక్షణ పొందారు. మహారాజా కళాశాల, విజయనగరంలో 1935లో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా (1956-69) పదవీవిరమణ చేశారు.
రచయితగా
భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు, రచనలు ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేశాడు. తెలుగులో భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా సమితి తరపున రూపొందించాడు. దాదాపు సహస్ర విజ్ఞాన వ్యాసాలు రాసాడు. వీటిలో అనేకం వ్యాస సంపుటాలుగా వెలువడినాయి. ఈయన రాసిన సైన్స్ గ్రంథాలు 32 లో కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ఎంపిక అయ్యాయి. ఆధునిక విజ్ఞానం[1] పేరుతో ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధి చెందింది. ఈయన సంకలనం చేసిన సూక్తిముక్తావళి అనే గ్రంథం కూడా ప్రసిద్ధి చెందింది.
మానవ మానవ, పడకటింట్లో విజ్ఞానచర్చ, పారిజాతం మొదలగు అనేక పుస్తక రచనలు జన సామాన్యానికి కూడా విజ్ఞానాన్ని చేకూర్చాయి. తెలుగు అకాడమీ లో, 18 పుస్తకాలు డిగ్రీ విద్యార్థులకు వెలువరించారు. విద్యార్థి లోకానికి సంబంధించిన భౌతిక శాస్త్ర సంబందమైన అనేక ప్రయోగాలు నిర్వహించారు. సామాన్య శాస్త్రం మీద, మాతృభాష మీద ఈయనకు గల అపార గౌరవాభిమానాలు, జిజ్ఞాసలు తెలుగువారికి వరప్రదాతలయ్యాయి. సైన్స్ ను అతి సరళ మైన తెలుగు భాషలో విస్తృత ప్రచారం చేసిన ఈయన 1992, ఏప్రిల్ 25 న మృతి చెందారు.
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-25-ఉయ్యూరు .