కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ
‘’మహాత్మాగాంధీ పిలుపు విని ,స్వరాజ్య సంరంభం లో పాల్గొని దేశ సేవకు తనను తాను అర్పించుకొన్న త్యాగమూర్తి కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ గారు .చదువు సంధ్యలు పూర్తి చేసి, గౌరవప్రదమైన ఉద్యోగం లో చేరి కుటుంబ భారం వహిస్తాడని గంపెడు ఆశతో ఉన్న తలిదండ్రులను కాదని, రాత్రిం బగళ్ళు కాంగ్రెస్ సందేశాన్ని గురించి కృష్ణా జిల్లా గ్రామాల వెంట తిరిగి ప్రజలను ,కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజితులను చేసిన ఘనత శ్రీ గురజాడ రాఘవ శర్మ గారిదే .
శ్రావ్యమైన కంఠం,మధురమైన కవిత్వం ,నిష్కామమైన ప్రజాసేవ ఆయనది .మిత్రులకు ప్రేమమూర్తి .బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ,ఖద్దరు సంస్థలో కుటుంబ పోషణకు తగినంత మాత్రం సంపాది౦చు కొంటూ ,కవితా వ్యాసంగం చేస్తూ,జ్యోతిషం ,సాముద్రిక శాస్త్రం , వాస్తుశాస్త్రాలలో గొప్ప పాండిత్యం సంపాదించి ,కోరిన వారికందరికీ ఉచితంగా సలహా సంప్రది౦పులనిస్తూ ,పరమ పూజ్యభావంతో ప్రణతులు అందుకొంటున్న నా ప్రియమిత్రులు నా షష్టిపూర్తి సన్మాన సంచికకు సర్వ వ్యవహారాలలో మిత్రుడు శ్రీ మండలి కృష్ణారావు గారికి సలహాలనిస్తూ ,సవ్య సాచిగా శ్రమించారు శర్మగారు .వారికి నా కృతజ్ఞతా పూర్వక వందనాలను సమర్పించటం నా విధి గా భావిస్తున్నాను ‘’అంటూ గొప్ప కీర్తి కిరీటం పెట్టారు శర్మగారికి రైతుపెద్ద ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ,పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తమ స్వీయ చరిత్ర ‘’నా జీవన నౌక ‘’లో .
గురుజాడ రాఘవశర్మ (ఫిబ్రవరి 11, 1899 - ఆగష్టు 8, 1987) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త.[1][2] ఈయన తన కవితల ద్వారా, ఉత్తేజకరమైన రచనల ద్వారా భారతదేశ ప్రజలలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించినాడు. గాంధేయ మార్గాన్ని అవలంభించారు. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు.
జీవిత సంగ్రహం
వీరు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోనున్న గురజాడ గ్రామంలో ఫిబ్రవరి 11, 1899 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: త్రయంబకం, వెంకమ్మ. వీరి నివాసస్థలం బందరు. వీరు వీరంకి సీతారామయ్య, సుదర్శనం నారాయణాచార్యులు, జొన్నలగడ్డ శివసుందరరావు, మండలీక వెంకటశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద వివిధ శాస్త్రాలలో విద్యాభ్యాసం సాగించి మంచి పాండిత్యాన్ని సంపాదించారు. బమ్మెర పోతన తనకు ఉత్తేజాన్ని కలిగించినట్లుగా స్వయంగా చెప్పుకున్నారు. వీరు కూడా కృష్ణుని భక్తులు.
1921 లో మహాత్మాగాంధీ పిలుపు విని ఉపాధ్యాయ వృత్తిని వీడి జాతీయోద్యమంలో ప్రవేశించారు. 1930-31 మధ్యకాలంలో ఖైదీగా రాజమండ్రి, రాయవెల్లూరులలో జైలుశిక్ష అనుభవించారు. 1964లో ప్రముఖ స్వాతంత్ర్య యోధునిగా రాష్ట్రపతితో సన్మానింపబడ్డారు.
మాన్యులు మండలి బుద్ధప్రసాద్ గారు రాఘవ శర్మ గారి పేరు వింటేనే పులకి౦చి పోతారు .ఎంతసేపైనా శర్మగై గురించి అనర్గళం గా మాట్లాడుతారు. అంతటి ఆరాధనాభావం ఆయనకు శర్మగారిపై .
మరణం
వీరు 1987, ఆగష్టు 8 తేదీన పరమపదించారు.
రచనలు
· ముకుందమాల
· వాసుదేవ శతకం
· సువర్చలాంజనేయం
· నవకాళి
· జాతీయ గీతాలు (1973) [3]
· కల్పలత
· రాఘవ శర్మగారి మనుమరాలుడా.గురజాడ రాజరాజేశ్వరి బందరు లో తెలుగు లెక్చరర్ .సరసభారతికి ఆత్మీయురాలు .
·
రాఘవ శర్మగారి సోదరులు గురజాడ వాసి ,శ్రీ గురజాడ పూర్ణ చంద్రశర్మగారు నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఫిఫ్త్ ఫారం చదువుతున్నప్పుడు మాకు తెలుగు మాస్టారు .కమ్మగా పద్యాలు పాడుతూ చక్కగా తెలుగు బోధించేవారు .పాఠం చివర్లో ప్రతి రోజూ పెదరాశిపెద్దమ్మ లాంటి ఏదో ఒక కథను సీరియల్ గా చెప్పటం వారి ప్రత్యేకత. చాలా హుషారుగా ఉత్సాహంగా వినేవాళ్ళం .పంచ కట్టు ,లాల్చీ ఉత్తరీయం ,ముఖాన కుంకుమబొట్టు తో ఉండేవారు .సైకిల్ మీద వచ్చేవారు గురజాడ నుంచి .గొప్ప హనుమ భక్తులు .’’సువర్చలా౦జనేయం ‘’ అనే సంస్కృత శతకం రాసి ప్రచురించారు .మా సువర్చలాన్జనేయస్వామి దేవాలయం అర్చకుడు చి వేదాంతం మురళీ కృష్ణ ఆపుస్తకం నాకు ఇస్తే దాన్ని చదివాను .శర్మగారు తాత్పర్యం గ్రాంధికం లో రాశారు.నేను ఈశతకాన్ని సరసభారతి బ్లాగ్ లో రాసి ,ప్రతిశ్లోక తాత్పర్యం వాడుకభాషలో రాశాను .ఆతర్వాత దీన్ని నేను రాసి, అమెరికాలో ఉంటున్న మా మేనల్లుడు చి వేలూరి మృత్యుంజయ శాస్త్రి(Jay veluri ) విజయలక్ష్మి దంపతులు ముద్రణకు స్పాన్సర్ చేయగా సరసభారతి ప్రచురించి , మా అక్క శ్రీమతివేలూరి దుర్గ, బావగారు శ్రీ వేలూరి వివేకానంద్ గార్లకు వారి వివాహ వజ్రోత్సవం సందర్భంగా అంకితమిచ్చిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -మొదటిభాగం ‘’ లో చేర్చి మా తెలుగుమాస్టారు శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారి ఋణం తీర్చుకొన్నాను .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-25-ఉయ్యూరు .
