భార్యయే సంగీత గురువైన నిష్కామ గాన బోధకుడు , బ్రిటీష హిస్టరీ ఇండియన్ హిస్టరీ బోధకులు, రచయిత ,విశాఖ ‘’కళాభారతి ‘’నిర్మాత ,ఆంధ్రా ‘’మాలవ్యా ‘’,-శ్రీ సుసర్ల సూర్య భగవచ్ఛ౦కర శాస్త్రి
3-3-1900 కోనసీమ ముంగండ అగ్రహారం లో శ్రీ సుసర్ల గోపాల శాస్త్రి ,శ్రీమతి సోదెమ్మ దంపతులకు శ్రీ సుసర్ల సూర్య భగవచ్ఛ౦కర శాస్త్రి జన్మించారు .అమలాపురం కాకినాడలలో ప్రాధమిక విద్య పూర్తి చేసి ,విజయనగరం లో బిఏ చదివి ,రాజమండ్రిలో బిఎడ్ చేసి ,మహారాజా సంగీత నృత్య కళాశాల ద్వారా గానంలో శిక్షణ పొందారు .సంస్క్ర్య్తం పై బాల్యం నుంచి మాంచి పట్టు ఉండనే ఉంది .
వీరి సహధర్మ చారిణి వీరి గాత్ర గురువు .తండ్రినుంచి లభించిన రచనా స్పూరితో శాస్త్రిగారు’’శశిరేఖాష్టకం ‘’రాశారు .ఉపాధ్యాయులై తురిమేళ్ళ ,రేపల్లె లలో చరిత్ర బోధన చేశారు .బ్రిటీష హిస్టరీ ఇండియన్ హిస్టరీ పుస్తకాలు రాశారు .1940ప్రాంతంలో శంకర జయంతి నృసింహ జయంతి ఘనం గా జరిపారు .ఆ సందర్భంగా కీర్తనలు గానం చేసేవారు .
నూతక్కి ,తెనాలి ,మాచర్ల పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేసి ,పదవీ విరమణ తర్వాత విశాఖ చేరారు .మహారాణి పేట దగ్గర ‘’శారదా విద్యానిలయం ‘’అనే ట్యుటోరియల్ కాలేజి స్థాపించారు .ఆరేళ్ళు సమర్ధంగా నడిపారు .’’అమరభారతి ‘’పేరసంస్కృత విద్యా శిబిరం నిర్వహించారు .1965 తిరువయ్యూరులో జరిగిన శ్రీ త్యాగరాజ ఉత్సవాలకు హాజరయ్యారు . విశాఖ వచ్చి త్యాగరాజస్వామి పేర ఒక కళా ప్రదర్శన మందిరం నిర్మించాలని ఆలోచించారు .చేతిలో రూపాయి లేకపోయినా కొండంత ఆత్మ స్థైర్యం తో,చెక్కు చెదరని సంకల్ప బలం తో నిర్మాణ ఉద్యమానికి ముందడుగు వేశారు .అప్పటి విశాఖ జనాభా 6లక్షలు .మనిషికి రూపాయి ఇచ్చినా సరిపోతుందని భావించి శ్రీ పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులు పొంది జోలె పట్టుకొని ఇల్లిల్లూ తిరిగారు .మందిరం లో శోభకోసం భారత దేశ ప్రఖ్యాత వాగ్గేయకారులు,సంగీత ఋషుల చిత్ర పటాలు గీయించి సిద్ధం చేశారు .ఒకరకంగా కాశీ విశ్వ విద్యాలయం కోసం శ్రీ మదనమోహన మాలవ్యా ఎలా ఎలా కష్టపడ్డారో అలా కష్టపడ్డారు శాస్త్రిగారు .తన కళా స్వప్న హర్మ్యం కట్టడమై కళ్ళ ఎదుట సాక్షాత్కారించక ముందే 27-3-1988 న శ్రీ సుసర్ల సూర్య భగవచ్ఛ౦కర శాస్త్రి గారు 88వ ఏట శంకర సాన్నిధ్యం చేరారు .అయన కళా స్వప్నం ‘’కళాభారతి ‘’ఇప్పటికీ కనువిందు చేస్తూ ,కళాసేవలో పునీత మౌతోంది .
వీరి ఫోటో దొరకలేదు
ఆధారం -శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-25-ఉయ్యూరు .