చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రిగారు రచించిన ‘’శ్రీరామ కదామృతం’’అనే బృహత్ గ్రంధం పై’’ సమగ్ర సమీక్ష పరిశోధన నిబంధనం ‘’రచించి ,ఆంద్ర విశ్వ విద్యాలయం చేత పి హెచ్ డి పొందిన వారు శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .పొన్నూరు లోని శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగించి, పదవీ విరమణ చేసిన సాహితీ మూర్తి .వీరి జననం కృష్ణా జిల్లా ఉప్పులూరు కావటం విశేషం .శ్రీ తూములూరు వెంకట రామ శాస్త్రి ,శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 15-2-1953 లో జన్మించిన శాస్త్రిగారు శ్రీమతి నాగ పద్మావతి గారిని వివాహమాడారు .
రామాయణం –సమాజ దర్పణం ను రెండుభాగాలుగా రచించి ,శ్రీ రామ ,వాల్మీకి , వానుమ ద్వాణి లను వినిపించిన ఆధ్యాత్మిక తేజో విరాజితులు .పావనీ శతకం ,శ్రీ త్రికూటేశ్వర త్రిశతి ,శ్రీ కపోతేశ్వర శతకం ,శ్రీ పొన్నూరు వీరాంజనేయ శతకం ,భావ దేవశతకం వంటి భక్తీ శతకాలను ‘’పిలిస్తేపలికే పద్య ధార’’తో వీనుల విందుగా, గుండెల నిండుగా రాసిన సాహితీ చైతన్య మూర్తి .తమ బావ గారు –అంటే అక్కగారి భర్త గారు శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి అపార సంస్క్రుతాంధ్ర వైదుష్యానికి ,సంస్కృత శతావదానానికీ అనుక్షణం అబ్బురపడి ఆ మధుర స్మృతులను పంచుకొనే సహృదయ మూర్తి శ్రీ శాస్త్రిగారు
.’’స్తవ నీయుండు ,నరోత్తముండు ,సుగుణోద్దాముండు,ధన్యుండు రాఘవ నారారాణశాస్త్రి తాడెపలి విఖ్యాతుండు ,కారుణ్య మూర్తి ,వివేక స్థిర వర్తనుడు మద్దీక్షా గురుండు ,ఆత్మ తత్వ విదుండా’’రుషి వర్యు ‘’గొల్తు ‘’ అని ఘనం గా కీర్తించే గురుభక్తి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిది .ఇంతవరకు పద్యాలలో యోగ విద్య ను రాయని లోటును తీరుస్తూ ‘’ యోగ వైభవం ‘’రాసి రికార్డ్ సృష్టించారు . సాహిత్య సాంస్కృతిక ప్రసంగాలతో ప్రజలకు వందనం అభివందనం గబ్బిట దుర్గాప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ పత్రాలను అందరికి అంతర్జాలం ద్వారా తెలియ బర్చాను .అందులో వారు నాకొక గొప్పసూచన చేశారు .శ్రీ ఎం .కృష్ణమాచారియార్ గారు ఆంగ్లం లో రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’తెప్పించుకొని చదవమన్నారు .ఈ విషయాన్ని గుర్తించిన నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు సుమారు వెయ్యిపెజీలున్న ఆ గ్రంధాన్ని నాకు తెలియ కుండానే ఆర్డర్ ఇచ్చి తెప్పించి నాకు పంపారు .అద్భుతం అనిపించింది చదువు తుంటే .దాని ఆధారం గా గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం నెట్ లో రాయటం ప్రారంభించాను .ఇందులో ఉన్న దాదాపు అందరుకవులను ,అన్ని ప్రక్రియలను గురించి రాయగలిగాను .దీనికి శ్రీ సాయిబాబాగారికి శ్రీ మైనేని వారికీ ఎంతైనా రుణపడి ఉంటాను .
మొదటిభాగానికి ముందుమాట రాసిన డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు కూడా ఇంకా రాయవాసిన కవులు చాలా మంది ఉన్నారని వారిని గూర్చి కూడా రెండవ భాగం లో రాయమని మంచి సలహా ఇస్తూ ఆ కవుల వివరాలు గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఇవ్వగలరని వారి ఫోన్ నంబర్ నాకు ఇవ్వగా కిందటిఏడాది సెప్టెంబర్ లో వారితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నాను .వారి వలననే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు ,శ్రీ తూములూరు వారి బావగారు ,శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులు అయిన శ్రీచెరువు సత్యనారాయణ శాస్త్రిగారు,శ్రీ కొలచిన యజ్ఞనారాయణ దీక్షితులు గార్ల గురించి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పై వారు రచించిన పుస్తకాలు పంపగా రాయగలిగాను .శాస్త్రి గారి ద్వారానే శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారిని పరిచయం చేసుకొని సీతారామ శాస్త్రి గారు పంపిన తమవీ ,తమ తండ్రి గారు శ్రీ నారాయణ శాస్త్రి గారి గ్రంధాలనాధారంగా వీరిద్దరి సంస్కృత సేవను వివరించాను .అలాగే శ్రీ ములుకుట్ల నరసింహావధాని గారు రచించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలు శ్రీ తూములూరు వారు నాకు అందజేయగా అవధాని గారి గూర్చి సవివరంగా రాయగలిగాను .
.చీరాల విశ్రాంత లెక్చరర్ ,సంస్కృత భాషా సేవకులు ,ఆత్మ జ్యోతి మాసపత్రిక సంపాదకులు శ్రీ రావి మోహన రావు గారినీ శ్రీ తూములూరు వారు పరిచయం చేయగా ,వారు పంపిన వాటి ఆధారం గా శ్రీ చింత గుంట సుబ్బారావు గారి గురించి రాశాను .శ్రీ మోహన రావు గారి ద్వారాశ్రీ గరిమెళ్ళ సోమయాజులుగారు పరిచయమవ్వగా వారు పంపిన రచనల నాదారంగా శ్రీ గరిమెళ్ళ వారి గూర్చి రాశాను .గుంటూరు జిల్లా జిల్లెళ్ళమూడి అమ్మ సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి తో ఉన్న పూర్వ పరిచయాన్ని పురస్కరించుకొని వారిద్వారా జిల్లెళ్లమూడి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారి ఫోన్ నంబర్ తెలుసుకొని , హైదరాబాద్ లో వారి స్వగృహం లో కలిసి ఇంటర్వ్యు చేసి ,వారు అందజేసిన తమ రచనల నాధారంగా శర్మ గారి గీర్వాణ కృషి ని పరిచయం చేయగలిగాను.
ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రాహ్మణ్య శాస్త్రి గారు వారంతకు వారే నాగురించి తెలుసుకొని వారి గ్రంధాలను పంపగా వారి గూర్చి రాసే భాగ్యం దక్కింది .ఈ రెండవ భాగం తీగ కదలటానికి ముఖ్య కారకులు ,నాపై అమితమైన ప్రేమ ఆదరణ కురిపిస్తూ,అభినందిస్తూ ‘’ప్రసాద్ గారూ !సంస్కృతం చదువుకొన్న మేమెవ్వరం చేయ లేని మహత్కార్యాన్ని మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు గర్వం గా ఉంది’’అని ఎప్పటికప్పుడు ఫోన్ లో దీని ప్రగతిని తెలుసుకొంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన శ్రీ తూములూరు వారి సౌజన్యానికి ఎంతో రుణపడి ఉంటాను .
శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారి పరిచయం లో మరో గొప్ప ముందడుగు పడింది .వారు ఆచార్య శ్రీ బిరుద రాజు రామ రాజు గారు ఆంగ్లం లో రాసిన ‘’కంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంద్ర టు సాంస్క్రిట్ లిటరేచర్ ‘’‘’గ్రంధం చదివారా అంటే, లేదని చెప్పాను .ఎక్కడైనా దొరుకుతుందేమో నెట్ లో వెతకమని శ్రీ మైనేని వారిని కోరటం వారు వెంటనే దాన్ని ఆర్డర్ ఇచ్చిస్వర్గీయ సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి గారి కుమారులు శ్రీ బసవ రాజు గారి తో ఫోన్ లో మాట్లాడగా తమ వద్ద ఉన్నదని చెప్పి కొరియర్ లో 700 పేజీలున్న దానిని భద్రం గా ఉచితంగా పంపి అందజేశారు. దీన్ని ఆధారం గా ఆంధ్రదేశం లోని సంస్కృత కవులను ,వారిరచనలను చదివి రాయగలిగాను .పుస్తకం ఇంగ్లీష్ లో ఉండటం ,కవుల రచనలను సంస్కృత లిపిలోనే శ్రీ రాజు గారు ఇవ్వటం వలన అర్ధం చేసుకొని రాయటం కష్టమని పించినా ఇష్టంగా చేస్తున్నందుకు మహా తృప్తి నిచ్చింది . అదే సమయం లో శ్రీ మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారి ‘’సంస్కృత వాజ్మయ చరిత్ర ‘’దృష్టిలో పడి శ్రీ గోపాలకృష్ణ గారిని వాకబు చేయమని కోరటం ,వెంటనే వారు రెండుభాగాలుగా ఉన్న ఆ ఉద్గ్రందానికి ఆర్డరిచ్చి తెప్పించి నాకు పంపటం యిట్టె జరిగి పోయింది .గ్రంధం బృహత్తరమైనదే కాని, ఒకరిద్దరు కవుల గురించి తప్ప, ఇది నాకు పెద్దగా ఉపయోగ పడలేదనే చెప్పాలి .
ఇంకెవరు మిగిలారా అని ఆలోచిస్తుంటే శ్రీ తూములూరు వారిచ్చిన సూచనతో శతావధాని డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని వారితో నాకున్న పూర్వ పరిచయం తో కోరగా 2008 లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో సంస్కృత భాష పై జరిగిన సెమినార్ సందర్భంగాఆంద్ర ప్రదేశ్ లో ’’భారత స్వాతంత్ర్యానంతర సంస్కృత కవులు ,రచన’’లపై వెలువరించిన ‘’సంహూతిః’’(సామూహిక పిలుపు )అనే సంస్కృత, ఆంద్ర ,ఆంగ్లాలలో రచనలున్న గ్రంధాన్ని ఆత్మీయంగా పంపారు .ఇందులో ఆంద్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా ఉన్న సంస్కృత కవులు వారి రచనా విశేషాలణు ఆయా జిల్లాలో ప్రముఖులైన సంస్కృత కవులు రాసిన వ్యాసాలున్నాయి . కాని కవుల గురించి సమగ్రమైన సమాచారం ఇందులో లేదు . అదే ఆధారంగా రాశాను .దీని సాయం తో అందులోని కవుల కవితా గీర్వాణాన్ని రాసి దాదాపు సమగ్రం గా రాశానేమో నననే భ్రమ కలిగింది .
రెండవ భాగం ప్రారంభించి నెట్ లో రాస్తున్న దగ్గర్నుంచి శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు మదిలో మెదులుతూనే ఉన్నాను .వారిని ప్రత్యక్షంగా చూసిన వాడిని ,వారి విద్వత్తు ఎరిగిన వాడిని కనుక వారి గురించి ఎక్కడైనా ఏదైనా లభిస్తుందేమో నని ఎదురు చూశాను .ఫలితం దక్కలేదు .చివరికి శ్రీ తూములూరు వారు ఇచ్చిన ఫోన్ నంబర్ ప్రకారం బెజవాడలో ఉన్న శాస్త్రి గారి కుమారులు డా. శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారికి ఫోన్ చేయగా పరమానందం పొంది శ్రీ మాణిక్య శాస్త్రి గారికి ఢిల్లీ లో రాష్ట్రపతి పురస్కారం అందజేసినప్పుడు వెలువడిన ప్రత్యేక సంస్కృత సావనీర్ ను,పంపారు .దానిలో శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు తమ తండ్రిగారు శ్రీ మాణిక్య శాస్త్రి గారిపై హిందీలో రచించిన వ్యాసం ఆధారం గా కస్టపడి చదివి అర్ధం చేసుకొని శ్రీ మాణిక్య శాస్త్రిగారి పాండితీ ప్రకర్షను వివరి౦చ గలిగాను .
స్వర్గీయ శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యు ల గురుపూజోత్సవానికి 3-9-16 న ఉయ్యూరు వచ్చిన మా గురుపుత్రులు శ్రీ కోట సీతా రామాంజనేయులు గారు నాకు కానుకగా అందజేసిన ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి రచన ‘’జగద్వంద్యుడైన గురుదేవుడు ‘’గ్రంధం ఆధారం గా శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్ధ స్వామి వారి జీవితం ,సంస్కృత రచన గురించి రాయగలిగాను .సాహిత్య అకాడెమీ ప్రచురించిన శ్రీ శశిశ్రీ రచన శ్రీ పుట్టపర్తి నారాయణా చార్య ‘’పుస్తకం ఆధారంగా సరస్వతీ పుత్రుల గీర్వాణ కవితా ప్రతిభను రాయగలిగాను .మా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి కోరికపైనా ,వారు నెట్ ద్వారా పంపిన వాటి ఆధారంగా శ్రీ కున్హన్ రాజా ,డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి,శ్రీ డా .బూరగడ్డ నరసింహా చార్యులగురించి రాశాను .
భారత దేశానికి చుట్టు ప్రక్కల ఉన్న సింహళం ,నేపాల్ లలో ఉన్న సంస్కృత కవుల గురించి రాయగలిగాను .మనదేశం లో వివిధ రాష్ట్రాల కవుల గురించి ,ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణా లలో జిల్లాల వారీగా ఉన్న కవుల గురించి వారి సాహిత్యం గూర్చికొద్దో గొప్పో రాసే అవకాశం లభించింది . కావ్యం నాటకం ,నవల ,వ్యాసం ,సంగీతం ,నాట్యం ,వాస్తు ,జ్యోతిషం ,కామశాస్త్రం ,రాజకీయం ,దేశ చరిత్ర ,రాజ వంశ చరిత్ర , భక్తీ, శతక సాహిత్యం ,నిఘంటువులు ,అలంకార ,ఛందస్ శాస్త్రాలు , ,హిందూ బౌద్ధ జైన మతాలు దర్శనాలు , ద్వ్యర్ధి, త్ర్యర్ది ,చతురర్ధ, అనేకార్ధ,కావ్యాలు , చాటువు , స్తుతి స్తోత్ర ,అవధానాలు మొదలైన అన్ని ప్రక్రియలు రాసిన వారందరి గురించి రాయటం నాఅదృష్టం.
ప్రతి కవి పైనా పుస్తకాలలో ఉన్న విషయాలే కాక అదనపు సమాచారం దొరుకు తుందేమో నని ఇంగ్లీష్, తెలుగు వీకీ పీడియా వెతికి అందిన సమాచారం నిక్షిప్తం చేశా .ఇందరు మహాను భావులు ఇన్నిరకాలుగా నాకు సహకరించటం వలన గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం పూర్తి చేయగలిగాను .నాకు సంస్కృత ,తెలుగు భాషలలో లోతైన పాండిత్యమూ లేదు అవగాహనా లేదు ..తెలిసిన విషయాలనుమాత్రమే రాశాను .ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి చెప్పినట్లు ‘’నేను తేనే టీగ లాగా ఎక్కడ మధువు లభిస్తే దాన్ని సేకరించి భద్ర పరచాను ‘అంతే’. ‘’.ఇంకా ఎందరో మహా కవులు మిగిలే ఉంటారు .వారందరికీ వందనాలు . అందుకే ఇది సంపూర్ణమూమూ కాదు ,సమగ్రమూకాదు అని సవినయం గా మనవి చేస్తున్నాను . సంస్కృత భాష పై ఉన్న మమకారం, మా తండ్రి గారిచ్చిన సంస్కారమే నన్నుమొదటి భాగం లో 146 మంది ,రెండవ భాగం లో 482 మొత్తం 628 మంది గీర్వాణ కవులపై రెండుభాగాల ఈ ఉద్గ్రంధాన్ని రచింప జేసింది .ఇందరుకవులను ,వారి గురు ,శిష్య పరంపరను గురించి రాసే గొప్ప అదృష్టం నాకు దక్కిందని పరమ సంతృప్తి గా ఉంది .వీరందరినీ కూడా లెక్కిస్తే దాదాపు 70 0మంది కవీశ్వరులు లెక్కకు తేలుతారు . ‘’Dates are the greatest obstacle in the history of India ‘’అన్న జర్మనీ పండితుడు మాక్స్ ముల్లర్ మాట నిజం .మనప్రాచీన కవుల కాలాలు నిర్దుష్ట౦ గా లేక పోవటం పెద్ద ఇబ్బందే .తెలిసిన వారి కాలాలను గుర్తించాను .కొన్ని ఊహించి పేర్కొన్నాను .ఇందులో లోపాలు ఉండవచ్చు .కాలాల లోతు పాతులు తెలుసుకొనే చారిత్రిక పాండిత్యమూ నాకు లేదు .అటు కృష్ణమాచారి గారికీ , ఇటు బిరుద రాజు వారికీ అందని కవుల కాలాలను చూసి వీరిని ‘’కాలం తెలియని కవులు ‘’గా పేర్కొన్నాను . పుస్తకంచదివి౦చేట్లుగా ఉండాలని ,ఈతరం విద్యార్ధులకు అందు బాటు లో ఆసక్తికరం గా ఉండాలని తపన పడ్డాను .ఎంత వరకు సఫలీ క్రుతుడనయ్యానో తెలియదు .
ఈ గ్రంధ రచనకు మా ఇలవేలుపు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారల ఆశీస్సు ,శ్రీ శారదా దేవి కరుణా కటాక్షం ,పెద్దల ప్రోత్సాహం ,సాహితీ బంధువుల ఆదరణ కారణం .నేను నిమిత్త మాత్రుడిని .ఇందులో నేను చేసింది తలస్పర్శ మాత్రమే.
ఇంతటి బృహద్గ్రందానికి సమీక్ష లాంటి ముందు మాట ఎవరితో రాయి౦చాలా అని ఆలోచిస్తే ,దీని ప్రేరణకు కారకులు అనేక కవుల గ్రంధాలను నాకు ఆప్యాయంగా పంపినవారూ సంస్కృత ఆంద్ర ఆంగ్లాలలో నిష్ణాతులైన కవి ,పండితులు ,పొన్నూరు సంస్కృత కళా శాలలో ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన ,నా శ్రేయోభిలాషి మార్గ దర్శి,డా . శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు మనసులో మెదిలి , వారిని ఫోన్ లో సంప్రదిస్తే రాస్తానని నాకు వెంటనే ఫోన్ లో చెప్పారు .వారి సౌజన్యానికి కృతజ్ఞతలు .అతి తక్కువ సమయం లోనే విపులమైన ,విలువైన ముందుమాట ‘’నటి –నుతి ‘’రాసి, గ్రంధం స్థాయి పెంచిన శ్రీ తూములూరు వారి కి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను ఒక్క నమస్కారం చేయటం తప్ప .
తెలుగు వారిలో సంస్కృత రచనలు చేసిన సర్వశ్రీ విశ్వనాధ ,చెరువు ఆంజనేయ శాస్త్రి ,చింత గుంట సుబ్బారావు ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ,శతావధాని పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ మొదలైన వారి పై రాయాల్సి ఉంది .వీరి గుఱించిన సమాచారం పొన్నూరు సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,చీరాలకాలేజి రిటైర్డ్ జియాలజీ లెక్చరర్ ,వందలాది సంస్కృత రచనలను స్వంత ఖర్చు తో ముద్రించి ఉచితంగా అందజేస్తున్న శ్రీ రావి మోహన రావు ,ప్రస్తుతం విజయ వాడలో ఉంటున్న సంస్కృత మహా పండితులు శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ,విజయ వాడ లెక్చరర్, శతావధాని, విశ్వనాధ సంస్కృత రచనపై పరిశోధన చేసిన ,స్వయంగా సంస్కృత రచనలు చేసిన శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జిల్లెళ్ళమూడి సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మహా వక్త ,ప్రస్తుత విజయవాడ వాస్తవ్యులు డా.మల్లాప్రగడ శ్రీమన్నారయణ గార్లను సంప్రదించి వారి వద్ద ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించమని ఫోన్ నంబర్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు ‘’గీ ర్వాణం మొదటి భాగాని’’కి ముందుమాట రాసిన డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారు .శర్మగారికి కృతజ్ఞతలు .అలాగే నేను పై వారిని సంప్రదించాను .అందరూ సహృదయత తోస్పందించి వారి వద్ద ఉన్న సమాచారాని విలువైన పుస్తకాలను నాకు పంపించారు
గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కాలేజిప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి తో రెండు నెలలక్రితం శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి ద్వారా పరిచయ భాగ్యం కలిగింది. అప్పటినుంచి ఫోన్ లో తరచుగా పలకరించుకొంటున్నాం .నా మూడవ గీర్వాణానికి నేనుకోరిన కవుల గ్రంధాలు ,వివరాలు అందజేశారు .వారు స్వయంగా మహా కవులు గొప్ప కవితా ధార వారిది .చంద వోలు కు చెందినబ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారలు రచించిన ‘’శ్రీ రామ కదామృతం’’గ్రంధం పై సమగ్ర పరిశోధన చేసి ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్ డి పొందారు .’’రామాయణం –సమాజ దర్పణం ‘’అనే రెండుభాగాల గ్రంధం ,శ్రీ రామ వాణి,వాల్మీకి వాణి,హనుమద్వాణి మొదలైన గ్రంధాలు రాశారు .
ఇవి కాక ముఖ్యంగా శ్రీ రాజ రాజేశ్వరీ శతకం ,శ్రీ వీరాంజనేయ శతకం ,శ్రీసత్యనారాయణ శతకం ,శ్రీ త్రికూటేశ్వర శతకం రాశారు .
చేజెర్ల వెళ్లి శ్రీ కపోతేశ్వర స్వామి ని దర్శించి ,అక్కడి రిటైర్డ్ మండల రెవిన్యు అధికారి శ్రీ దొడ్లేటి సత్యనారాయణ ,గ్రామస్తుల కోరికపై శ్రీ కపోతేశ్వర శతకం రాసి సార్ధకత తెచ్చారు .ఈ వ్యాసానికి ఈ పుస్తకమే ఆధారం అని మనవి చేస్తున్నాను. అందులో నుంచి ఒక పద్యం –
‘’కరుణాన్తః కరణుండునాన్ శిబి పరీక్షం జేయ ,నింద్రాగ్నులన్ –సురలె పావుర మౌచు ,డేగ యగుచున్ ,జూపట్టి రందాది ,మున్
శరణంచున్ దన జేర వచ్చిన ప్రదేశంబిద్ది ,చేజెర్ల యై –వరలెన్ ,రేడు ప్రతిష్ట జేసి నిను ,దేవా ! శ్రీ కపోతేశ్వరా’’
శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1
ప్రధాని మోడీ పిలుపు ననుసరించి ప్రపంచమంతా యోగ మాయ లో మునిగి పోతోంది .ఇప్పటి వరకు తెలుగులో యోగా పై వచన రచనలే వచ్చినట్లు జ్ఞాపకం .పద్యాలలో యోగ వైభవాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు చెప్పగలం అని రుజువు చేశారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .వారికి పద్యం నల్లేరు పై బండి .చాలా సరళం గా సాగిన రచన ఇది. శృతి లయలతో పద్యానికి శోభ కలుగు తుంది .కాని అది నేడు గ్రహణం పట్టింది .ఛందస్సులో రాసినవే శాశ్వతాలు అని కవి గారి నమ్మకం .ముందుగా యోగ వైభవాన్ని బోధించిన పతంజలి మహర్షికి నమస్కరించి ,యోగాన్ని పరంపరానుగతంగా నేర్పు తున్న వారందరికీ శత కోటి వందనాలు సమర్పించారు .యోగా చేస్తే -’’ఉదర దోషంబు తొలగు ,నూబ కాయ మడుగు నంద మారోగ్యంబు నంద గలుగు –సుఖము సంతాన సౌఖ్యంబు చూర గొనగ –సాధకులకు యోగ మొక రసాయనంబు ‘’అని దాని వలన పొందే లాభాలను తెలియ జెప్పారు .దేవ ,పితృ,రుషి రుణాలు తీర్చుకొని తరిస్తారు .కాని యోగ సాధన జగతికభ్యుదయ మొసగు ‘’అని రూఢిగా చెప్పారు . యంత్రాల సాయం తో అన్ని సుఖాలు పొందుతున్నాం .’’శరీర రక్షణ ముపకరింప ,యోగ రక్షణము కల్పింప వలయు ‘’నని సుద్ది చెప్పారు .’’సకల రోగ నిరోధక శక్తికి యోగం అభయమిస్తుంది మానసిక శారీరక బాధలు నాడీ రోగాలకు దివ్యౌషధం యోగ .వజ్రాసనం ఉదర రోగాలపాలిటి వజ్రాయుధం .వ్యసనాలకు బానిస కాకూడదు .’’యోగాభ్యసనమే అభి వ్రుద్ధిపధము ‘’అని ఢంకా బజాయించి చెప్పారు .సుప్త పవన ముక్తాసనం అపూర్వ ఫలాలనిస్తుంది .భస్త్రిక చేస్తే నరాలకు ఊర్జవం వస్తుంది .ఎన్నోరకాల ఆసనాలున్నాయి గురుముఖతా నేర్చి అభ్యాసం చేయాలి .’’జీవులకు యోగమె సిద్ధు లెనయ ‘’అంటారు .
‘’వజ్రము నవ రత్నములలో వాసికెక్కు –నటులెఆసనములను వజ్రాసనంబు –అరుగుదలయు నారోగ్యంబు నలర జేయు –కాళ్ళు ముడిచి కూర్చుండి మోకాళ్ళ పైన –చేతులుంచి ఏకాగ్ర మౌ చిత్త మెనయ - వెన్నెముక నిటారుగా నిల బెట్ట వలయు –సకల జీవులన్ నరులకే సాధ్యమగును-నాత్మ యోగంబు సిద్ధింప ననువు పడును ‘’అంటూ పద్యం లో వజ్రాసనం ఎలా వేయాలో సులభంగా చెప్పారు .’’యమ నియమములా సనములు ,ప్రాణ నియతి –ధ్యాన ధారణ యోగముల్ తత్సమాది –‘’అని యోగం లో 8విభాగాలను వివరించారు .ఇలాంటి యోగామ్రుతాన్ని అందరూ గ్రోలి సుఖ శాంతులు పొందాలి .శ్వాస కోశ బాధలకు ‘’కపాల భాతి ‘’దివ్యాస్త్రమే .’’ఆత్మ యన ప్రాణ మది పరమాత్మ తోడ –జేర్చుటయే యోగ మానంద సిద్ధి ఫలము –పరిమితంబైన వ్యక్తి ,అపరిమిత మగు – విశ్వ శక్తితో జేరి వివేక మెనయ ‘’అని యోగ రహస్యాన్ని విప్పి చెప్పారు .యోగం లో ప్రాణాయామం ఊపిరి ఉండే దాకా చేయాలి .కారణం ‘’బ్రతుకు లూపిరితోడ ,సంబద్ధ మగుట –నభ్యుదయ సాధకము యోగ మరయ బ్రజకు ‘’అని యోగ అభ్యుదయ సాధనమన్నారు .యోగం శాంతి సౌఖ్యాలిచ్చే ప్రశస్త ఔషధం. యోగ సాధన వలన ఆత్మ శోధనం అలవడుతుంది .నేను, నాది అనే సంకుచిత పరిధి దాటి విశ్వ చైతన్య శక్తిలో చేరిపోతాం .’’చిత్త వ్రుత్తి నిరోధింప శీఘ్ర గతిని –బుద్ధి వికసించు నెందు నపూర్వముగను –కోరికలు జయింప బడుచు ,క్రోధ లోభ –మద మత్సరము లు విముక్తమగును ‘’అని యోగం అందించే పరమ విభూతిని వివరించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు.
శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )
సగం అన్నం అందులో సగం నీరు మిగిలింది గాలికి వదలితే సంపూర్ణ ఆరోగ్యమే .మాయ ఆవరించిన ఈ ప్రపంచం లో మాయ తొలగిపోతే బ్రహ్మమయమే అవుతుంది .యోగులకు అసాధ్యమేదీ లేదని చెబుతూ చక్కని పద్యం చెప్పారు శాస్త్రి గారు –‘’నేల జొచ్చు ,నింగి కెగయు ,గాలి నాపు -,నీరు ప్రవహింపగా జేయు నిప్పు నణచు –ప్రకృతి ఎల్ల స్వాధీనమై పరగు నెపుడు –యోగులకు నసాధ్యమను టెందు లేదు ‘’అంటారు .యోగులు శరీరాన్ని ఎముకల గూడుగా భావిస్తారు .అందుకే దేహం పై మొహం వదిలి సోహం అంటూ కర్మమును బ్రహ్మమును వీడక ఆత్మ ధర్మాన్ని అన్ని చోట్ల పాటిస్తూ జీవిస్తారు . ఎవడు తింటే సర్వ భూతాలూ తినినట్లు అవుతుందో వాడే సద్గురువైన వాసుదేవుడు .గురు శాపమే బలిని అధోలోకాలకు చేర్చింది .కనుక గురు అనుగ్రహ బలమే సుఖ శాంతులకు మూలం .’’కష్టముల కోర్చి హనుమ భాస్కరుని వద్ద –విద్యలను నేర్చి యోగ ప్రవీణుడయ్యె ‘’అని హనుమంతుని యోగ వైభవ సాధన గూర్చి తెలియ జేశారు .మనసు నిగ్రహం గా ఉంచుకోవటం యోగ మార్గాలలో ఒకటి .
‘’ బ్రహ్మ మెరుగు సాధనము తపమ్ము ,ఋషులు –మునులు నిశ్చల చిత్తులై ముక్తి గా౦చుదురు ‘’రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటానికి యోగమే పరమ సాధనమైనదని గుర్తు చేశారు .’’ఆశలు నెరవేరగాహర్ష –మందు కు కృషి –ఆత్మ విశ్వాస ము గలుగుటవసరంబు ‘’అని ధర్మ సూక్ష్మంతెలియ జేశారు .బుద్ధిజాడ్యాన్ని తొలగించి ,సిద్ధి నిచ్చి ,ఆత్మ విజ్ఞాన మిచ్చి ,చాలాకాలంగా నిద్రాణ మై ఉన్న ‘’జీవ శక్తి మేలు కొలుపు -యోగాసనాల్ మేలు గూర్చు ‘’అని ప్రాణ శక్తి ఉద్దీపనకు సర్వ విధాలా సహకరించి జీవితాన్ని ఉత్తేజ పరచేది యోగాసనాలే నంటూ స్పష్టం గా చెప్పారు .’’త్రికరణాలు కలుషితమై ,కోపం తారా స్థాయిలో ఉంటె ,అలాంటి క్రోధాన్ని అణగ చేయగల ఏకైక మార్గం యోగా .
‘’అందరికి గల ప్రాణ౦ బానంద రూప –మదియు బరమాత్మ కు బ్రతీక మగుచు వెలుగు –‘’ఆత్మ వత్సర్వ భూతంబు ‘’లాదరింప –దగుననెడి సూక్తికిన్ బరమార్ధ మిదియే ‘’అని వేదోపనిషత్ ధర్మాన్ని కమ్మని పాదం గా మలిచి సుబోధకం చేశారు .అలాగే ‘’దేహమున నవయవముల్ దీప్తి దనర –సూత్ర నేతి యు ,గజకర్ణి సుఖము నిచ్చు ‘’అంటూఈ రెండు అభ్యసిస్తే సుఖానికి కొరత ఉండదని హామీ యిస్తారు .యోగం వలన బుద్ధి వికసిస్తుందని చెబుతూ పద్య రూపం లో ‘’బుద్ధి వికసించు యోగ విభూతి కతన ‘’అంటారు .ప్రాణాయామం అంటే యెంత తేలికో అంత తేలిక పదాలతో పద్యాలలో అందంగా బంధించి మన ముందు నిలిపారు –‘’ఒక ముక్కు బంధించి ,వేరొకట బీల్చి –రెండు బంధించి తగు నూపిరి బిగ బట్టి –తొలుత మూసిన ముక్కుతో వెలువరింప –ప్రముఖమైన ప్రాణాయామ పధ్ధతి యగు –నాడులనది శోధించు ననవతరంబు ‘’అంటూ ప్రాణాయామం నాడీ శోధనకు దివ్యౌషధం అన్నారు .శ్వాసలకు యోగ పరిభాషలో ఉన్న పూరక ,రేచకాలకు నిర్వచనం చెబుతూ గాలిపీలిస్తే పూరకమని వదిలితే రేచకమని వివరించారు .
‘’పడక కుదరదు,నిద్రయు పట్ట దెపుడు –నిలబడుతకు కూర్చుండుట కలమట పడు –నడుము నొప్పితో గనపడు నరక మెపుడు –తొలగునది భుజంగాసన మలవడ౦గ’’అని భుజంగాసనం చేసే మేలును వర్ణించారు . ఈ విశ్వానికి పరమ యోగా గురువు ఆ శ్రీ మహా విష్ణువే నని చెబుతూ –‘’యోగ నిద్ర బూనెడు హరి ,యుత్తమ గతి –మనల కుపదేశ మొనరించు మమత తోడ –దేహముకన్న భిన్నమౌ దేహి యనుచు –విశ్వ రూపు డైనను తాను వేరగుటను ‘’ అని విష్ణు యోగ రహస్యాన్ని చేదించి చెప్పి మనల్ని ‘’ఫాలో ఆన్ ‘’అవమన్నారు .యోగాభ్యాసం చేస్తే –యవ్వనం తరగదు ,ముసలితనం ముఖం లో కనిపించదు ,కాలం తెలియదు గ్లాని ఉండదు .నిత్యోత్సాహంగా మానవుడు ఉండాలంటే యోగమే శరణ్యం అంటారు .’’రక్త పోటును ,మధు మేహ రక్కసులన –బరగు నుగ్ర రోగ౦ బుల బారి బడక –బ్రతుకు సుఖ మయంబుగ జేయు జతన మందు –యోగమే శరణ్య మఖిలాభ్యుదయమునకు ‘’అని’’ నవీన పత౦జలి ‘’లా ఉద్ఘోషించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .బ్రాహ్మీ ముహూర్తం లో లేచి పక్షుల కలరవాలను వీనుల విందుగా వింటూ ప్రక్రుతి ప్రశాంత అందాలను ఆస్వాదిస్తూ శుభ్రమైన ప్రాణవాయువు పీలుస్తూ యోగా చేస్తే ఆయురారోగ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయంటారు .ఇవి సాధకులకు అనుభవైక వేద్యమైనవే కదా .మితాహారం సత్సాంగత్యం వలన పవిత్ర జీవితం కలిగి ‘’బ్రహ్మ మీ జగంబను జ్ఞాన పధము జూపు ‘’ .
‘’తిష్ట కుదిరిన వారికి నిస్ట కుదురు –నిష్ట కలిగిన ధ్యాన గరిస్టు డగును-ధ్యాన యోగ సాధన పరమాత్మ జేర్చు –పరమద్వైత సుఖమనుభవమున గను’’అని యోగాభ్యాసం తో చివరి మెట్టు అయిన ముక్తి పదం లభిస్తుందని నిర్ద్వందంగా తెలియ జేశారు .జీవికి కావాల్సింది అదే .దాన్ని అందుకోవటానికి యోగం పరమ ప్రమాణమైన సాధనం .శీర్షాసనం ఏకాగ్రత కలిగిస్తుంది .పౌష్టికాహారం ,పళ్ళు పాలు ఆకుకూరలు యోగ సాధకునికి మేలు చేస్తాయి .’’నిన్ను నీవు తెలిసికొనుట’’కే యోగా అవసరం . ‘’పనిలో దైవాన్ని చూడాలి .విషయ వాంచలు దూరమై ఆత్మనిగ్రహం ,అంతర్ముఖత్వం యోగా వల్ల లభిస్తాయి .ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ –కనుక సౌర శక్తిని ఆస్వాదించి ఆరోగ్యం పొందాలి .సూర్యుడు త్రిమూర్తులకు మూల శక్తి ,ఆత్మ శక్తి కూడా .
చివరగా ఫల శృతి చెబుతూ శాస్త్రిగారు –‘’కాల మతి వేగముగ సాగు,కష్ట సుఖము--లకు ,వియోగ సంయోగములకు నతీత-మగుచు ధనమదికారంము నడ్డు కావు –బలము ,బలగమ్ము నద్దాని నణప లేవు –యోగులకు పునరావృత్తి యుండ బోదు ‘’అని యోగులకు పునర్జన్మ ఉండదని పునరావృత్తి రాహిత మోక్ష సామ్రాజ్యం లో శాశ్వతం గా ఉండి పోతారని యోగ విభూతిని శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు తేట తేట తెలుగు మాటలతో మృదు మధురంగా యోగ రసామృతాన్ని మన చేతిలో పద్య రూపం లో ఉంచి రికార్డు సృష్టించారు .అంతర్జాలం లో ఉన్న ఈ 131పద్యాలను అందరూ చదివి ఆస్వాదించి శాస్త్రి గారిని అభినందించాలని కోరుతున్నాను . ఈ యోగ వైభవ పద్య శతకం ప్రధాని మోడీ గారి దృష్టిని ఆకర్షించాలని కోరిక .
శాస్త్రిగారి ఫోన్ నంబర్ -8106766197
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు
మనవి –14-2-16 ఆదివారం రధ సప్తమి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో జరిగిన సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతానికి ముఖ్య అతిధిగా ,విచ్చేసి ,ధార్మిక ప్రసంగం చేసి ,వారి రచన ‘’శ్రీరామ వాణి’’పుస్తకాన్ని సరసభారతి ప్రచురించగా నాచేత ఆవిష్కరణ చేయించి పొన్నూరు నుండి అతి విలువైన బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ సిద్ధాంతి గారి ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలను నాకు అందజేసిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తిశాస్త్రి గారి సహృదయత ,సౌజన్యాలకు నమస్సులు పలకటం తప్ప నేను ఏమిచ్చి ఋణం తీర్చుకో గలను ? అందుకే ములుకుట్ల వారిపై రెండు భాగాలలో వ్యాసం రాసి దాన్ని శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారికి వారిని అడగకుండా చెప్పకుండా ‘’ఆన్ లైన్ ‘’అంకితమిచ్చి కొంత వరకు రుణ భారం తగ్గించు కొన్నాను .శాస్త్రిగారు పెద్దమనసుతో మన్నిస్తారని భావిస్తాను –దుర్గాప్రసాద్
ఇంతటి మహా విద్వామ్సునితో మహాకవితో నాకు పరిచయం కలగటం నా అదృష్టం భాగ్యం .వారి ప్రోత్సాహమే లేకపోతె గీర్వానకవులు ఒకటవ భాగం తోనే ఆగిపోయేడు .మూడు భాగాలు రాశానంటే శాస్త్రిగారి హృదయపూర్వక ఆశీస్సులే కారణం .వారు నాకంటే చిన్నవారని అంటారు నేను నమస్కరించినపుడల్లా .నాకు వారి వైదుష్యమే కాని వయసుతో పనిలేదని చెప్పేవాడిని వినయంగా .’’బాబుగారూ ‘’అని ఎంతో ఆత్మీయంగా ఫోన్ లో మాట్లాడే వారు ఎన్నెన్నో సాహితీ విషయాలు నా ముందు పరిచేవారు వారి అనుభవమే ఒక ఉద్గ్రంధం .కృష్ణా జిల్లా రచయితల సంఘం వారు శ్రీకాకుళం లో శ్రీ కృష్ణ దేవరాయల మహోత్సవం జరిపినప్పుడు మళ్ళీ వారిని చూశాం .
నేనూ మా శ్రీమతి 2017 ఏప్రిల్ లో లో అమెరికా వెళ్ళబోతూ మార్చి 17న మేమిద్దరం మా మనవడు చరణ్ మా ఆత్మీయురాలు శ్రీమతి సీతంరాజు మల్లికగారు కారులో కోటప్పకొండ చేజెర్ల దర్శించి పొన్నూరు వెళ్లి శ్రీదక్షినామూర్తి శాస్స్త్రి గారింట ఆ దంపతుల ఆతిధ్యం అందుకొని డా .శ్రీ నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గృహానికీ వెళ్లి ఆ దంపతులను ఉగాది పురస్కారానికిఆహ్వానించి ,అక్కడి నుంచి పిట్టలవానిపాలెం చందోలులో ఉన్న నా బిఎడ్ క్లాస్ మెట్లు నన్ను బాబాయ్ అని పిలిచే నేను అబ్బాయ్ అని పిలిచే వారణాసి సుబ్బయ్య శర్మ,వేదాంతం కృష్ణమూర్తి ఇళ్ళకు వెళ్లి రాత్రికి తిరిగి ఇంటికిచేరాం .ఇక్కడ మరో విషయం దక్షిణా మూర్తి శాస్త్రిగారే ,తనతో పాటు పని చేసిన నిష్టలవారి ఫోన్ నంబర్ ఇచ్చి పరిచయం కలిగించి వారిపై గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ రెండవ భాగం లో నాతొ రాయించారు .దీనికీ వారికి ఎంతైనా రుణ పడి ఉంటాను . మా శ్రీమతిని చూస్తె శాస్త్రిగారికి విఅరీతమైన ఆరాధన .అమాంతం కాళ్ళమీద వాలిపోయేవారు ‘’అమ్మా !మీరు ప్రక్కన ఉండబట్టే ప్రసాద్ గారు ఇంత సాహితీ సేవ చేయగలుగుతున్నారు .మీ ప్రోత్సాహం అందరికీ స్పూర్తి ‘’అనేవారు .
అందుకే సరసభారతి నిర్వహించిన శ్రీ దుర్ముఖి నామ ఉగాది వేడుకలలో శాస్త్రిగారికి మా తలిదండ్రులు కీ శే విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మ గారాల స్మారక ఉగాది పురస్కారాన్ని అందజేసి కొంత లో కొంత ఋణం తీర్చుకోన్నాను .
ఇంతటి సాహితీ మహోన్నత మూర్తి ,పుంభావ సరస్వతి ,నాకు అత్యంత ఆప్తులు ,మార్గదర్శి నా సంస్క్రుతకవుల రచనకు ఉత్సాహ ప్రోత్సాహం అయిన శ్రీ డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు ఈ కార్తీకమాస సోమవారం8-11-21సాయంత్రం శివైక్యం చెందినట్లు వారి కుమారులు వాట్సాప్ మెసేజ్ పంపారు .శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ ,ఆకుటుంబానికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-10-11-21-ఉయ్యూరు
