ఆగ్నేయ ఆసియా అందాలకు ఆదర్శం అలనాటి ఆంధ్ర రాజధాని అమరావతి -3
ఇండో-చైనాలో బౌద్ధ వైదికాలు
ఇండో చైనా అంటే కాంభోజ ,లావోస్ ,చంపాల (కంబోడియా ,లావోస్ ,అన్నాం)సమామ్నాయం .ఇండో చైనా లో భారత చైనాల నాగరకతలు కలిసి ఉంటాయి .ఇండో చైనాకు వైదిక బౌద్ధమతాలను ,కళలను భారత దేశం ప్రసాదించింది .పరిపాలన ,చట్టాలను కంఫ్యూషియస్ తత్వాన్ని చైనా ఇచ్చింది .ఆగ్నేయ ఆశియాలో ఒకటి రెండు శతాబ్దాలవరకు ఆరు భారతీయ సంస్కృతీ కేంద్రాలున్నాయి .దక్షిణ అన్నాం -(కాంభోజ -చంపాల్) ,మలయా దక్షిణ ప్రాంతం ,సుమత్రాలోని పాలం బాంగ్ లోయ ,మధ్య జావాలో ,తూర్పు బోర్మియాలో ఎగువ మలయాలోని ఖేడా నగరం లో ఈ కేంద్రాలున్నాయి. ఇవన్నీ వైదిక మత వలసలే
ప్రాచీన చంపా రాజ్యం రెండవ శతాబ్దిలో స్థాపితం .దీనినే కొచ్చిన్ -చైనా అంటారు .దీని ఆది వాసులు పోలినీశియా తెగవారైన ‘’చెం’’తెగవారు .వీరు వైదికమతాన్ని తీసుకొన్నారు .భారతీయులు ఈ రాజ్యాన్ని చంపా అన్నారు .మాగధలో మరో చ౦పా రాజ్యం ఉండటం వలన హుయాన్ త్సాంగ్ దీన్ని’’ మహా చంపా’’ అన్నాడు .ఈరాజ్యాన్ని శ్రీ మారుడు స్థాపించాడు .భారతీయుల ఆధిపత్యం లో చెం తెగవారు వైదికాన్నిభారతీయ సంస్కృతిని స్వీకరించారు .ఈ రాజ్యం అప్పుడు పాండురంగ ,విజయ, కౌధార ,అమరావతి అనే నాలుగు భాగాలుగా ఉండేది .శ్రీమారుడు వీటిని సమైక్యం చేశాడు .ఈకాలం లో సంస్కృత భాషా సాహిత్యాలపట్ల ఆదరం ఎక్కువగా ఉండేది .రజతం సువర్ణ౦ ,స్థావరం అన్గమం వంటి పదాలు పాతుకు పోయాయి .7వ శతాబ్ది దాకా ఇక్కడ బౌద్ధం లేదు.చంపారాజులు భారతీయ రాజులు లాగా పండిత గోష్టులు జరిపేవారు .రాజు పట్టాభిషేకం కూడా వైదిక విధానం లోనే జరిపేవారు .ఉత్తర అన్నాంలో మాత్రం 3వ శతాబ్దిలో బౌద్ధం వ్యాపించింది .వెయ్యేళ్ళు బౌద్ధం ప్రభావం చూపిందిక్కడ .జన సంఖ్యలో 80శాతం బౌద్దులే .ప్రతిగ్రామం లో విహారం, స్తూపం నిర్మించారు .పర్వతం పై కట్టిన ‘’హాంగ్ బిచ్ ‘’స్తూపం యాత్రికులను విశేషంగా ఆకర్షించేది .
సశేషం
ఆధారం -సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్ర గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-25-ఉయ్యూరు