స్వతంత్రం ,మానవీయత వ్యక్తిత్వ౦ తో చరిత్ర సృష్టించిన తండ్రీ కొడుకులైన ఆనాటి కలెక్టర్లు సీనియర్, జూనియర్ గిల్లేట్ లు
1946లో కృష్ణాజిల్లా గ్రామోద్యోగుల ప్రధమ సభ బందరు టౌన్ హాల్ లో జరిగింది .సభను ప్రారంభించింది జిల్లా కలెక్టర్ గిల్లేట్ అనే ఐరిష్ జాతీయుడు .చురుకైన మేధావి .1932లో గూడూరు సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ,అరెస్ట్ అయిన కాంగ్రెస్ వాదుల చేత రాట్నాలపై నూలు వడకించి ,సరిగ్గా నూలు వడకని వారిని మహాత్ముని సిద్ధాంతాలకు అనుగుణమైన ‘’శాసనోల్ల౦ ఘటనం’’ చేయటానికి ‘’అనర్హులని నిర్ణయించి ,శిక్ష వేయకుండా వదిలేసి చరిత్ర సృష్టించిన వ్యక్తిత్వమున్న సర్వ స్వతంత్రమున్న జిల్లా ఆఫీసర్ గిల్లేట్ .
ఈయన తండ్రి సీనియర్ గిల్లేట్ కూడా అలాంటి వాడే .ఈయన ఆజానుబాహువు ,స్పురద్రూపి .ప్రజల మన్ననలు పొందిన బళ్ళారి జిల్లా కలెక్టర్ .శాసనోల్లంఘన కాలం లో మధురలో శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య మొదలైన వారికి ‘’మెడనిండా పూలహారాలతో రైల్వే స్టేషన్ లో ఎదురయ్యారట .ఆయనకు ఇంతటి క్రేజ్ ఏమిటని విచారించగా ,గాంధీ మహాత్ముడు బళ్ళారికి వచ్చిన సందర్భం లో మహాత్ముని తానూ టీకి ఆహ్వానించట౦ ఉచితంగా ఉంటుందని భావించి అనుమతించమని పై అధికారులకు లేఖ పెట్టాడు .ప్రభుత్వం అనుమతించలేదు .ఆయన ఒక ఉపాయం పన్నాడు. తన భార్యచేత టీకి ఆహ్వానింపజేసి ,తానుకూడా హాజరయ్యాడు .ప్రభుత్వం సంజాయిషీ కోరింది .దానికి జవాబుగా ‘’నా భార్య ఆహ్వానాన్ని నేను తిరస్కరించటం ,మా ఇద్దరి దాంపత్య ఐకమత్యానికి భంగం కలుగుతుందని భావించి హాజరయ్యాను ‘’ఆని రాసిన మేధావి .కరువు తాండ వించినప్పుడు కరువు నిబంధనల ప్రకారం మనిషి తొమ్మిది పైసలు మాత్రమె ఇవ్వాలని ఉండగా ,ఉదారంగా మనిషికి మూడు అణాల కూలి ఇచ్చిన మానవీయుడు .ఇదేమిటి ఆని పై అధికార్లు అడిగితె ‘’నా కుక్కకు ప్రతిరోజు మూడు అణాలకంటే ఎక్కువ ఆహారం పెడతాను .కనుక మనిషికి అంతకంటే తక్కువ ఇవ్వటం ఉచితం ఆని నాకు అనిపించలేదు ‘’ఆని చెప్పిన మానవత్వం మూర్తీభవించిన జిల్లా ఆఫీసర్ .
ఇక ఈయన కుమారుడు జూనియర్ గిల్లేట్ రైతుల కష్ట నిష్టూరాలను స్వయంగా గ్రామాలు తిరిగి చూసి తెలుసుకొని ,కావాల్సిన సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రజా హృదయాలను గెలుచుకొన్న కలెక్టర్ .’’ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రజలకు ఉరిత్రాళ్ళు కాకూడదు ‘’అవి ఉపయోగపడే ‘’చేత్రాళ్ళు కావాలని స్వతంత్ర అభిప్రాయాలు కల ఉదార హృదయుడు .
ఆధారం- రైతుపెద్ద శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ‘’నా జీవన నౌక ‘’పుస్తకం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-25-ఉయ్యూరు .