మండలి వారి ఆస్థానకవి ,’’సాహితీ గుడి సేవ ‘’కుడు విష్ణుప్రసాద్

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 15, 2026, 6:19:25 PM (7 hours ago) Jun 15
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

మండలి వారి ఆస్థానకవి ,’’సాహితీ గుడి సేవ ‘’కుడు  విష్ణుప్రసాద్

విష్ణూ అంటూ నేను ఆప్యాయంగా పిలిచే గుడిసేవ విష్ణుప్రసాద్ తో పరిచయం 1994ఫిబ్రవరి నెలలో భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,నాకు అత్య౦త ఆత్మీయులు, ఫామిలీఫ్రెండ్  మహాకథకులు, విమర్శకులు, విశ్లేషకులు,,భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు కు మార్గదర్శి  శ్రీ ఆర్. ఎస్.కె .మూర్తి గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ప్రముఖ రచయిత శ్రీ కప్పగంతుల మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలతో  జరిగిన మూడురోజుల సాహిత్య సదస్సులో నేనూ ,మా బామ్మర్ది ఆనంద్ పాల్గొన్నాం .రోజూ షడ్రసోపేతభోజనాలు అద్భుత మైన వెరైటీ టిఫిన్లు ,మాంచి కాఫీటీ లతో పెళ్లి వేడుకగా జరిగాయి సభలు .అందులో మహారచయితలు శ్రీ జానకీజాని ,శ్రీ వాకాటి పాండురంగారావు ,ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం ,శ్రీ బండారు సదాశివరావు ,విశ్వనాథ భక్తుడు శ్రీ నటరాజన్ ,విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ అయిన శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు మొదలైన దిగ్దంతుల  ఉపన్యాసాలు వినే భాగ్యం, చూసేభాగ్యం కలిగింది .ఒక రోజురాత్రి  యువ కవి సమ్మేళనం కూడా  జరిగింది .ఆకవితల కాగితాలు నాకు ఇచ్చి మూర్తిగారు మొదటి రెండు మూడు బహుమతులకు కవితలను ఎంపిక చేయమన్నారు . .నేను, మా బావమరది  సహాయం తీసుకొని కవితలు చదివి మొదటిబహుమతి అప్పటి కుమారి ఇప్పటి శ్రీమతి సింహాద్రి పద్మకు ఇచ్చాం .కండగల కవిత్వం రాసింది ఆమె .అప్పుడే విష్ణుప్రసాద్ కూడా పరిచయమయ్యాడు .ఆసభలలో నేనూ మా బావమరది శ్రీ జానకీజాని గారితో రోజూ సభలు, భోజనాలు అయ్యాక అర్ధరాత్రి దాకా అనేక సాహిత్య విషయాలు ఆయన్ను అడిగి తెలుసుకొనే వాళ్ళం .అయన వాల్మీకాన్నీ ,విశ్వనాథ కల్పవృక్షాన్ని కాచి వడపోసిన వారు .వాటిపై గంటలతరబడి ప్రసంగించే వారు .ఆపరిచయంతోనే ఒక సారి ఉయ్యూరు రప్పించి మా పై అంతస్తు లో సాహితీ సభ ఏర్పాటుచేసి వారితో కల్పవృక్ష రామాయణం పై మాట్లాడించాను. రెండు గంటలు మమ్మల్ని మరోలోకం లో విహరి౦ప జేశారు .ఘనసత్కారం చేశాం. అమితానందం పొందారు .మాఅమ్మాయి మామగారు అత్తగారు కాకినాడ లో ఉండేవారు .వెళ్ళినప్పుడల్లా జానకీ జానిగారిని సందర్శించే వాళ్ళం .వారింట్లో మంచి కాఫీ ఇచ్చేవారు .ఆయన రాసిన పుస్తకాలు నాకు ఇచ్చేవారు. వారు రాసిన ‘’యధా కాష్టం చ కాష్టం ‘’కథా సంపుటి  నాకు ఇస్తే, చదివి నేను స్పందించింది ఆయన చదివి ‘’ఇంతబాగా రాశారు .మీతోపరిచయం ముందే జరిగిఉంటే దీన్ని పుస్తకం లో ప్రకటించే వాడిని ‘’అన్న సహృదయులు జానకీ జాని .ఆయన ప్రతిమాట హృదయ అంతరాళ౦ నుంచి  వచ్చేది .అమితమైన ఆప్యాయత కనబరచే వారు .అసభలలోనే తనికెళ్ళ భరణి కూడా దగ్గరలో ఎక్కడో సినిమా షూటింగ్ ఉంటె చూసుకొని ,పాల్గొ న్నాడు,ప్రసంగించాడుకూడా . .ఆయన ఆటోగ్రాఫ్ తీసుకొన్నా .అప్పుడే విశ్వనాథ అంతే వాసి,హసన్పర్తి నివాసి శ్రీలేఖ సాహితీ నిర్వాహకులు  శ్రీ టి.రంగస్వామి పరిచయమై ఇప్పటికీ సాహితీ స్నేహం కొనసాగిస్తున్నాము ఆయనకు సరసభారాతి పురస్కారం కూడా అందజేశాం .ఈయనా విశ్వనాథ వీరాభిమానే .సంస్థ తరఫున వందకు పైగా పుస్తకాలు ప్రకటించారు .

  మేము ఉయ్యూరులో మా గురువుగారు శ్రీ లంకా బసవాచారిగారి ఆధ్వర్యం లో ‘’సాహితీ మండలి ‘’స్థాపించి ప్రతినెల మూడవ ఆది వారం సాయంత్రం విష్ణ్వాలయం లో సమావేశాలు నిర్వహించేవాళ్ళం .చందా లేదు .ఎవరో ఒకరు మాట్లాడటం ఒకరు అందరికీ టీ,బిస్కెట్లు ఇప్పించటం గా ఉండేది .కొన్ని సమావేశాలు ఉగాది ,సంక్రాంతి కవి సమ్మేళనాలు అప్పటి మా మండువా పెంకుటి ఇంట్లోనే జరిపేవాళ్ళం ఖర్చు అంతా నాదే .తరువాత కాలేజిగ్రౌ౦డ్లో , హైస్కూల్ లో చివరికి లైబ్రరీ లో జరిపేవాళ్ళం .ఒక సంక్రాంతికి కవి సమ్మేళనం నిర్వహిస్తేఅవనిగడ్డ నుంచి  పద్మ ,విష్ణుప్రసాద్ ,తెలుగు లెక్చరర్ సుబ్బారావు గార్లు వచ్చి పాల్గొన్నారు .సుబ్బారావు మంచిపాత రాశాడు .దాన్ని పుస్తకం గా ప్రచురించటానికి కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు కార్యదర్శి పూర్ణచంద్ గార్లు సంఘం తరఫున  ఆర్ధిక సహాయం చేశారు .

  తర్వాత మంచికార్యక్రమాలకు విష్ణుప్రసాద్ వచ్చేవాడు .పద్మ తప్పని సరి .సరసభారతి స్థాపించాక మాకార్యక్రమాలు విస్త్రుతమైనాయి .రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు బెజవాదనుంచి హైదరాబాద్ ప్రమోషన్ పై వెడుతుంటే ఆయనపై గౌరవంగా  ‘’ఆదిత్య హృదయం ‘’అనే పద్య కవిసమ్మేళనం జరిపి పుస్తకంగా తెచ్చాం .అందులో విష్ణుప్రసాద్ గొప్ప కవిత్వంతో హృదయావిష్కరణ చేశాడు .నేనుఫోనులో ‘’విష్ణూ ‘’అంటే ఆతను ‘’గురువుగారూ చెప్పండి ‘’అనేవాడు

  అవనిగడ్డలో మాన్యులు మండలి బుద్ధప్రసాద్ గారు నిర్వహించేసాహిత్య సభలకు నేను హాజరయ్యేవాడిని .విష్ణు ,పద్మ అక్కడ కలిసేవారు .బుద్ధప్రసాద్ గారికి కుడిభుజంగా విష్ణు ఉండేవాడు .ఆర్ .ఎస్. కె .మూర్తిగారు ఒక కథా సమ్మేళనం జరిపారు .అప్పుడు నేనూ వెళ్లాను .అలాగే కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన అన్ని కార్యక్రమాలకు విష్ణు నేనూ హాజరయ్యేవాళ్ళం .కొన్ని కార్యక్రమాలు మాతో నిర్వహి౦పజేసేవారు  .సభలకు పాతిక వేలకు తక్కువ లేకుండా ఆర్ధిక సాయం అందించేవాడు విష్ణు .అలాగే కృష్ణా పుష్కరాలలో కృష్ణా ఉత్సవాలలో అత్యధికంగా శ్రమిస్తూ గేయాలు నాటకాలు నృత్యనాటకాలు రాస్తూ ప్రదర్శి౦పజేసేవాడు .గ్రామీణ క్రీడలని నిర్వహించి వీడియో తీసి పంపేవాడు .దివి సీమ ప్రముఖులపై ‘’దివిసీమ రత్నాలు ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .

  సింహాద్రి వెంకటేశ్వరరావుగారు  అనే తెలుగుపండిట్ ,కవి ‘’దివికవి మిత్రులు ‘’పేరిట ఒక సంఘం స్థాపించి నెలలో మూడవ ఆదివారం నాడు అవనిగడ్డ లో గుడిలోకాని కాన్వెంట్ లో కానీ సభలు నిర్వహిస్తూ నన్నుకూడా మాట్లాడమని ఆహ్వానించేవారు .వెళ్ళేవాడిని . నేను ‘’దివిసీమ గాంధి ‘’అని గౌరవంగా పిలిచే శ్రీ మండలి రాజగోపాలరావు గారుహాజరయ్యేవారు తెల్లని ఖద్దరుపంచ లాల్చి ఖండువాతో తెల్లని గుబురు మీసంతో ఆయన గాంధీ ఆశయాలను నిక్కచ్చిగా పాటించె  మనిషి, ‘’మనీషి’’ . ఆయన ‘’ప్రసాద్ గారూ !మీరు వస్తారని తెలిసి నేను వచ్చాను మీరు రాకపోతే ఇక్కడ సాహిత్య వాతావరణం ఉండదు మీరోస్తేనే దానికి నిండుదనం మీ ప్రసంగం నాకు బాగా నచ్చుతుంది ‘’అనేవారు .ఆయన పులిగడ్డలో ఉండేవారు .వారింటికి రెండుమూడుసార్లు మా దంపతులం వెళ్లాం ఆదంపతులు మమ్మల్ని గొప్పగా ఆదరించేవారు అప్పటికే రావుగారు వయో వృద్ధులు జ్ఞాన వృద్దులుకూడా . ఇంగ్లీష్ బాగా మాట్లాడుతారుతెలుగుతోబాటు చూడంగానే రెండు చేతులు పైకెత్తి నమస్కరించాలని పించే వ్యక్తిత్వం వారిది .ఫోన్ లో తరచు మాట్లాడుకొనేవాళ్ళం .సింహాద్రి రావు గారి సభలలో  పద్మ కానీ , విష్ణు కాని కనపడే వాళ్ళు కాదు .నాగాయలంకలో  సాహితీజీవి ఒక ఆచార్యులుగారు వైద్యం చేస్తూ ,తన కవయిత్రి అయిన సోదరి సాయంతో సాహిత్య సభలు నిర్వహిస్తూ నన్నూ పిలిచేవారు .వెళ్ళేవాడిని .పద్మ కనిపించేది .విష్ణు కనిపించిన గుర్తులేదు .

  చింతలపాటి పూర్ణచంద్రరావు ,మురళీ కృష్ణ సోదరులు  చల్లపల్లి ,ఆ చుట్టుప్రక్కల భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో సాహితీ సభలు, కవి సమ్మేళనాలు నిర్వహించేవారు .వీటికి నేనూ వెళ్ళేవాడిని ఆహ్వానం మేరకు .విష్ణు ,పద్మ తప్పక వచ్చేవారు .శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం ,శతావధానం సోదరులు చాలాపెద్దఎత్తున నిర్వహించారు .సహస్రావధాని శ్రీ మాడుగుల నాగ ఫణిశర్మకూడా చివరిరోజు వచ్చి ఆశీర్వదించారు .అలాగే డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ అష్టావధానాలు ఉపన్యాసాలు సోదరులు ఘనంగా నిర్వహించేవారు .వాటికి విష్ణు పృచ్చకులలో ఒకడుగా ఉండేవాడు .పద్మకూడా. నేను సరే సరి .ఇలాంటి సభలో పాల్గొని నేను బస్ లో ఉయ్యూరువస్తుంటే శ్రీ ఓగిరాల సుబ్రహ్మణ్యం గారు అనే కవి పరిచయమయారు .ఆయన పెదవటపల్లి లో ఉండేవారు .భక్తకవి చాలా శతకాలు రాశారు .నాతొ ముందుమాటలు రాయి౦చారు .అప్పుడు పార్లమెంట్ సభ్యులైన శ్రీ గద్దె రామమోహనరావు గారిచేత ఆవిష్కరింపజేశారు నేనూ వెళ్లాను ,మాట్లాడాను తరచుగా ఉయ్యూరు వచ్చేవారు .వచ్చినప్పుడల్లా రేగు పండ్లు జామకాయలు తెచ్చేవారు .పదేళ్ళక్రితం చనిపోయారు .మాంచి స్నేహశీలి .మాఉయ్యురు సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యేవారు .

దివితాలూకాలో అనునిత్యం సాహితీ సేవలో జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు విష్ణు .ఇటీవల ఫేస్ బుక్ లో ఝమాయించి రచనలు చేస్తున్నాడు చేయిస్తున్నాడు ఎందరికో స్పూర్తి దాయకం గా ఉన్నాడు .

విష్ణుప్రసాద్ అందించిన బహుముఖ సేవలు

సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విష్ణుప్రసాద్ గారు చెరపలేని ముద్ర వేశారు. రచయితగా ఆయన 25కు పైగా గ్రంథాలను రచించడమే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్ వంటి వివిధ మాధ్యమాలలో వందలాది సాహిత్య ప్రసంగాలు, బాలవికాస్ క్విజ్ కార్యక్రమాలను నిర్వహించారు. దివిసీమ కవులు సాహిత్య సేవఅనే అంశంపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనా గ్రంథాన్ని మాననీయ మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితమిచ్చారు. ఆయన రాసిన దివిసీమ వైభవం’, ‘దివిసీమ కుల చరిత్రలుఅనే ఆకాశవాణి ప్రసంగాలను ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీలోకి అనువదించి ముద్రించడం విశేషం.

వ్యాకరణ భారతి, గేయ భారతి, బాల దీపిక, అక్షర భారతితో పాటు భరత బాల శతకం, స్వచ్ఛభారతి శతకం వంటి అనేక శతకాలను ఆయన రచించారు. ఆంధ్రప్రదేశ్ పాఠ్యగ్రంథ రచయితగా, స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించిన ఆయన, ఎస్.సి.ఆర్.టి. (SCERT) ద్వారా 200కు పైగా బాల సాహిత్య గ్రంథాలను అందించారు. ఆయన రాసిన పద్యాలు పాఠ్యపుస్తకాల్లో కూడా చోటు సంపాదించుకున్నాయి.

పలు సంస్థలలో కీలక బాధ్యతలు

దివిసీమ సాహితీ సమితి అధ్యక్షులుగా, ఆరోగ్య భారతి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా, కృష్ణాజిల్లా రచయితల సంఘం సహాయ కార్యదర్శిగా, భారతీయ సాహిత్య పరిషత్ అవనిగడ్డ కార్యదర్శిగా ఆయన సమాజానికి విశేష సేవలు అందించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, కృష్ణా పుష్కరాల సందర్భంగా 10 వేల మంది విద్యార్థులతో నిర్వహించిన భారీ కోలాట నృత్య రూపకానికి గేయ రచన చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతిమ తీర్పుఅనే లఘు చిత్రానికి కథను అందించడంతో పాటు అందులో నటించారు.

పురస్కారాల పరంపర

విద్యా, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన సేవలకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాష్ట్ర ఉగాది పురస్కారాన్నిస్వీకరించారు. అలాగే బాల సాహితీవేత్తగా కిన్నెర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన సాహితీ ప్రస్థానంపై డాక్టర్ సుజాత గారు పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందడం ఆయన సాహిత్య పటిమకు నిదర్శనం.

మాంచి ఆరోగ్యమే అతనిది అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి 6-6-26 శనివారం ఉదయం ‘’దివిసీమ ఆధునిక పండిత కవిరాజు ‘’గుడిసేవ విష్ణుప్రసాద్  మరణించాడు .అతని ఆత్మకు శాంతి కలగాలని ,కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-26-ఉయ్యూరు

 

animage.png
--

SriRangaSwamy Thirukovaluru

unread,
1:39 AM (7 minutes ago) 1:39 AM
to sahiti...@googlegroups.com
🙏🏼

--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z_brRqxUvQhNckTAnXBpCw%3Dm%2BOfwA7LXW_pqAejo%3DuGKA%40mail.gmail.com.
Reply all
Reply to author
Forward
0 new messages