రుద్రమదేవి మరణంపై నేటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చందుపట్ల, మేడిమల్కల్ శాసనాల ప్రకారం ఆమె, సర్వసేనాని మల్లికార్జున నాయకునితో ఒకే సమయంలో మృతి చెందిన తేదీ నిర్థారణ అయింది. కానీ యుద్ధసన్నాహ ఏర్పాట్లలో ఉండగానా? లేదా యుద్ధంలోనా? ఆమె ఏవిధంగా మరణించిన వైనం వెలుగు చూడలేదు.
భారతదేశ చారిత్రక ప్రాభవంలో, మొట్టమొదటి హిందూ మహిళా రాజ్ఞి రుద్రమదేవి. ప్రస్తుత నవ్య తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక పునరుజ్జీవ సంద ర్భంలో ఆ సాహసిక వీరనారి ప్రస్తావన సమయోచితం. 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మండలి రూపొందించిన సిలబస్‌కు అనుగుణంగా తెలంగాణ తెలుగు అకాడమీ, ఇంటర్‌మీడియట్ రెండవ సంవత్సర చరిత్ర పాఠ్యాంశాలలో సంక్షిప్తంగా రుద్రమదేవి కథనాన్ని ప్రస్తావించింది. కానీ ఆమె అంతిమ ఘట్టం వివాదాస్పదమైంది.
గణపతి దేవుని కుమార్తె, చాళుక్య వీరభద్రుని భార్య అయిన రుద్రమ, తండ్రి తరువాత త్రిలింగ సామ్రాజ్యరత్న సింహాసన పీఠం అధిష్ఠించిన తొలి తెలంగాణ తెలుగు మహిళగా కీర్తి పతాకం ఎగురవేసింది. చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ, కత్తిసాము, సైనిక శిక్షణ తండ్రి అడుగుజాడల్లో రాజనీతిజ్ఞురాలిగా పాలనానుభవాన్ని సాధించింది. హన్మకొండ నుంచి గుంటూరు, కృష్ణా, నెల్లూరు నాటి మండల ప్రాంతాలలో విస్తరించిన కాకతీయ సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించి రాయగజకేసరి బిరుదాంకితురాలైంది. ఆమె, ఏకశిలా నగరం రాజధానిగా సామ్రాజ్యపీఠం అలంకరించిన తొలినాళ్ళలో, ఈర్ష్యాద్వేషాలతో, మహిళాధిక్యతను సహించలేని శత్రు, సామంత రాజులను రణరంగంలో ఎదుర్కోవలసి వచ్చేది. రాజద్రోహులకు సింహస్వప్నమైంది.
అఖండ భారతావని చరిత్ర పుటలలో రజియా సుల్తానా, ఝాన్సీలక్ష్మీబాయి వంటి వీర నారీమణుల కోవలో రాణీ రుద్రమ పాలన యాదవరాజు మహాదేవున్ని, పాండ్యరాజు వంటి శత్రురాజులు, రాజద్రోహుల తలలు వంచి తరిమికొట్టింది. యాదవరాజ్యంపై దాడిలో బెడదకోట బీదర్ దుర్గాన్ని స్వాధీనం చేసుకొంది. పెద్దమొత్తంలో కోటి ద్రవ్యం అపరాధ రుసుము విధించింది. తన దేశానికి, యాదవ రాజ్యానికి సరిహద్దులలో జయస్తంభాలపై శాసనాలున్నాయి. 50 లక్షల హొన్నులను వీరసైనికులకు కానుకగా పంపిణీ చేసిన ఘనత ఆమెను వరించింది. శత్రుదుర్భేద్యమైన ఏకశిలానగర దుర్గం ఆమె అసమాన దీక్షాదక్షతలకు సాక్ష్యం.
కాలగర్భంలో మరుగునపడిన చారిత్రక సంపద వెలుగు చూడాలంటే అప్పుడప్పుడు బహిర్గతమవుతున్న శాసనాలు, ప్రాచీన సాహిత్యం, శిథిలావస్థకు చేరుకొంటున్న కట్టడాలు ఆధారంగా అధ్యయనం కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో వెలుగుచూసిన చందుపట్ల శాసనం, రాణి రుద్రమ అంతిమ శ్వాస వివరాలు కొంతవరకు తెలియచేస్తోంది. రాణి రుద్రమకు, ఆమె సేనాని మల్లికార్జున నాయకునికి మోక్షం ప్రసాదించాలని ప్రార్థిస్తూ రుద్రమ దేవి బంటు ‘పువ్వల ముమ్మడి’ స్థానిక సోమనాథ దేవునికి కొంత భూమి దానంగా ఇచ్చినట్లు చందుపట్లలోని శాసనంలో వుంది. శాసనాధారం ప్రకారం రాణి రుద్రమదేవి నవంబరు 27, 1289న మరణించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఇటీవల మరొక చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ మహబూబ్‌నగర్-కర్నూలు జిల్లాల చెంచులు నివసించే నల్లమల కారడవులలో ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలోని మేడిమల్కల్ దగ్గర టైగర్ రిజర్వు అడవులలో మరొక శాసనం లభ్యమైందని ప్రకటించారు. 2016 ఏప్రిల్ నెలాఖరులో వెలుగుచూసిన అద్భుత అన్వేషణ, శ్రీశైలం హైవేపై వున్న మన్ననూర్‌కు 15 కిలోమీటర్ల కీకారణ్యంలో వుంది. ఆ శాసనం ప్రకారం రుద్రమదేవి కూతురు కొడుకు (మనుమడు) ప్రతాపరుద్రదేవుడు మహారాజుగా కాకతీయ సింహాసనాన్ని అధిష్టించిన తేదీ 1290 ఫిబ్రవరిగా నిర్థారణ అయింది. ఇంతవరకు 1296 వరకు రుద్రమదేవి పాలన కొనసాగిందనే అంశం చారిత్రకంగా నిరాధారమని స్పష్టం కావటంతో తెలుగు అకాడమీ, తమ పాఠ్యాంశాన్ని సవరించుకొని 2015 ఆగస్టు నెలాఖరులోనే వాస్తవాన్ని నిర్థారిస్తూ అనుసరించింది.
రుద్రమదేవి మరణంపై నేటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చందుపట్ల, మేడిమల్కల్ శాసనాల ప్రకారం ఆమె, సర్వసేనాని మల్లికార్జున నాయకునితో ఒకే సమయంలో శివైక్యం చెందిన తేదీ నిర్థారణ అయింది. కానీ యుద్ధసన్నాహ ఏర్పాట్లలో ఉండగానా? లేదా యుద్ధంలోనా? ఆమె ఏవిధంగా మరణించిన వైనం వెలుగు చూడలేదు.
కాయస్థ అంబదేవుడు రాణిరుద్రమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొన్న రాజ్య ప్రతినిధి. అతని తిరుగుబాటును అణిచే యుద్ధంలో ఆమె మరణించినట్లు ఏ శాసనం వివరించటం లేదు. 1259 నుంచి మహారాజ్ఞిగా కిరీటధారి అయిన రుద్రమదేవి సుమారు 30 సంవత్సరాలు పాలన కొనసాగించింది. వేంగీ చాళుక్యరాజు వీరభద్రునితో వివాహం కావటంతో కొంత, గోదావరి ప్రాంత నిడదవోలు రాజ్య అత్తింటి బాంధవ్యం నెలకొని వుంది అంటారు. కాయస్థరాజు అంబదేవునితో అప్పటి నెల్లూరు ప్రాంత త్రిపురాంతకం యుద్ధంలో రుద్రమదేవి మరణించిన దనడానికి శాసనాధారాలు లేవు. పైగా కాకతీయ సామ్రా జ్యానికి విశ్వాసి అయిన ‘గంగయ సాహిణి’కి మేనల్లుడైన అంబదేవుడు మార్జవాడి ప్రాంత ప్రతినిధిగా ఒకప్పుడు విశ్వాస పాత్రుడు. రుద్రమ అనంతరం పట్టాభిషిక్తుడైన ప్రతాప రుద్రుడు అంబదేవునిపై దాడిచేయగా, అతడు గండికోట పారిపోయినట్టు తెలుస్తోంది.
ఏదిఏమైనా రుద్రమదేవి, కాయస్థ అంబదేవుని సమరంలో మరణించిందనే వార్తాంశం పూర్తిగా నిరాధారం. తెలంగాణ ప్రభుత్వ ఆర్కియాలజీ విభాగం, ఆమె జీవితానికి సంబంధించిన రెండు తెలుగురాష్ర్టాలలోని శాసన ఆధారాలను కొత్త పరిశోధనలు, అన్వేషణలతో అన్వయించి ఆ వీరనారి అంతిమ క్షణాల వాస్తవాలను వెలుగులోకి ఆవిష్కరిం చాలి. చారిత్రక పరిశోధకులు కొత్త వెలుగు ప్రసరింపచేయాలి.
జయసూర్య