తొలి సంస్కృత గద్య కావ్యం ‘’దశకుమార చరిత్ర కర్త’’-ప్రజాకవి దండి
సంస్కృతం లో వచనం ఋగ్వేదం లో ఉంది .ప్రౌఢం.చాందోగ్య ఉపనిషత్ లో గద్యం సరళం .సంస్క్రుతభారతంలో రెండు పేజీల గద్యం ఉంది.కానీ విష్ణుపురాణం గద్యను ఉదాహరిస్తారు .రీతి గద్యానికి పతంజలి ఆఖ్యాన ఖాయికలు ఉదాహృతాలు .కానీ ఇవి అలబ్ధాలు .లౌకిక గద్య అశోకుని కాలం లో వచ్చిన తధాగతుని తొలి చరిత్ర అయిన ‘’లలిత విస్తరం ‘’ ఆనాటి గద్య రామణీయకానికి ఇది మణి మకుటం అన్నారు తిరుమల రామ చంద్ర .సందర్భాన్ని బట్టి ప్రౌఢంగా, సరళంగా కూడా సాగింది .ఇదీ పురాణం అన్నారుకనుక కావ్యం కాదు .అశోకుని కాలం లో, తర్వాతకాలం లో శిలాశాసనాలపై వచనం కనిపిస్తుంది .ముఖ్యంగా క్రీ.పూ.150 నాటి రుద్రదాముని గిర్నార్ శాసనం సరళతరంగా ఉన్నది -‘’ప్రమాణ మానోన్మాన స్వరగతి వర్ణ సారసత్వాదిభిః పరమ లక్షణ వ్యన్జనై రుపేతకాంత మూర్తినా ,స్వయమదిగత మహాక్ష త్రపనామ్నా --‘’
లౌకిక సంస్కృత వాజ్మయం లో దండికవి ‘’దశకుమార చరిత్ర ‘’మొదటి గద్య ప్రబంధం .దండికి తర్వాత వారే సుబందు .భాణ భట్టులు .అంటే దశకుమార చరితం బాణుని కాదంబరి కంటే ముందు న్నది .దండిది పడలాలిత్యం .దండి గంగరాజైన దుర్వినీతుని ఆస్థానం లో ఉన్న దామోదరుడు అనే పేరుగల భారవి పల్లవ రాజైన విష్ణు వర్ధనుని (నరసింహ విష్ణువు )ఆహ్వానం పై పల్లవ రాజధాని కాంచీ పురం వెళ్లాడు .ఈరాజు క్రీశ ఆరవ శతాబ్ది మొదటిపాదం లో వాడు .అప్పటికే భారవి కిరాతార్జునీయం కావ్యం రాశాడు .భారవి కుమారుడు మనోరధుడు .మనోరధుని కొడుకు దండి .అంటే దండి భారవి మనుమడు .
దండి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి కాంచి లో నిరాశ్రయుడు గా ఉన్నాడు .కంచిలో అకస్మాత్తుగా విప్లవం చెలరేగింది .ప్రజలంతా నగరం వదిలి అరణ్యాలకు వెడితే దండి కూడా అడవులలో ఉన్నాడు .విప్లవం తగ్గార మళ్లీ కంచి చేరి ,కొంతకాలానికిపల్లవ రాజాస్థాన కవి అయ్యాడు దండి .ఇతని రచనలు అవంతీ సుందరికద ,కావ్యాదర్శం ,దశ కుమార చరిత్ర .పల్లవరాజు కుమారుడు కోసమే కావ్యాదర్శం రాశాడు ఆని విజ్ఞుల అభిప్రాయం .ప్రాచీనుడైన కావ్యాదర్శ టీకా కారుడు’’తరుణ వాచస్పతి ‘’-‘’నాసిక మధ్యా పరితః చతుర్విద్య విభూషితా -ఆస్తి కాచిత్పురే యస్యా అష్ట వర్ణా హ్వయా నృపాః’’అనే ప్రహేళికలో కాన్చీనగర పల్లవ రాజుల సూచన ఉందని చెప్పాడు .కథ కంచికి పోయింది అనే సామెత దండి దశకుమార చరిత్ర రచనతో వ్యాపించిందే అన్నారు శ్రీమాన్ తిరుమల రామచంద్ర .
దశకుమార చరిత్ర ఒళ్ళు గగుర్పొడిచే ఆఖ్యానాలతో ,కుతూహలం కలిగించే కధనం తో అపూర్వంగా ఉంటుంది .ఇది పదిమంది రాకుమారుల చరిత్ర .పూర్వ ,ఉత్తర పీఠికలతో ఉన్నది .కథలు భూమిమీదా , ఆకాశం లో ,సముద్రాలమీదా జరుగుతాయి.మిత్ర గుప్తుని సముద్ర యానం లోయుద్ధాలు మోసాలు దానాలు జాతరలు దొంగతనాలు ప్రేయసీప్రియుల రహస్య సమావేశాలు ,చదువుతుంటే ఎక్కడో అద్భుత లోకం లో విహరిస్తున్నట్లుఅనిపిస్తుంది .సహజత ,వాస్తవికత సజీవ పాత్ర చిత్రణ దండి ప్రతిభకు నిదర్శనం .అప్పటి సమాజం లో దేన్నీ వదలిపెట్టలేదు .సమకాలీన సమాజాన్ని రూపు కట్టించిన ప్రాచీన రచనలలో దశ కుమార చరిత్రను మించింది వేరే ఏదీలేదు అన్నారు రామ చంద్ర .సమాజపు వెలుగు నీడలను అద్భుతంగా దృశ్యమానం చేశాడు దండి .దొంగ సన్యాసులు కపట బ్రాహ్మణులు ,మోసకారులైన వేశ్యలు ,కపట కులటలు,గజ దొంగలు దండి దృష్టినుంచి తప్పించుకోలేక పోయారు .అందుకే దండి ప్రజాకవి .ప్రజాస్వామ్యం లోని సుఖ దుఖాలు భావోద్వేగాలు ,రాగద్వేషాలు కావ్యమంతా గుబాళించాయి .అప్పటికే దేశం లో శిధిలమైన జైన ,బౌద్ధ విహారాల స్థితి ,శాక్య భిక్షుణుల దూతీ కర్మ ,కామోత్సవాలు జానపదోత్సవాలు ,నారికేళ ,బక జాతీయాలైన కోడి పందాలు ,కర్పూర తా౦బూలంతో స్వాగత సత్కారాలు ,అతిధి సత్కారాలు ,వివిధ వృత్తులు ,వెదురు గొట్టాలతో నీళ్ళు తోడడం అన్నీ కళ్ళకు కట్టించాడు దండి .రచనా రామ ణీయకం గా దండి లేఖిని అగ్ర శ్లాఘ్య .ఆఖ్యానక కావ్యాలకు మొదటి మేలు బంతి .జీవం తొణికిసలాడే పాత్రలు .హాస్య వ్యంగ్య సంభరిత సంభాషణా చాతురి .కథా ప్రవాహాన్ని ఆపని వర్ణనలు ,ముఖ్య కథను మరుగు పరచని ఉపకథలు .శ్లేష క్లిష్టం ,సమాసభారం కాని సరళ శైలి ,మనోహర రసాభి వ్యక్తి , వీటి నన్నింటికీ మించి అర్ధ స్పష్టత .ఇవన్నీ పండిత పామర మనసులను చూరగొన్నాయి .ఈ గుణ రత్న గణం వల్లనే ప్రాచీన ఆలంకారికులు -
‘’జాతే జగతి వాల్మీ కౌ కవిరిత్యభిధా భవత్ -కవీ ఇతి తతో వ్యాసేకవయః త్వయి దండిని ‘’ఆని ప్రశంసించారు .మురిసిపోయిన పలుకుల రాణి సరస్వతీ దేవి ‘’కవిర్దండి కవిర్దండి ‘’అన్నదట .
దశకుమార చరితం దండి స్వోపజ్ఞం ,స్వకపొల కల్పితం . కానీ కథాసరిత్సాగరం’’మృగాంక దత్త చరిత్ర’’ను పోలి ఉందికనుక కథా సరిత్సాగరం దీనికి మూలం కనుక దండి బృహత్కథను అను సరించి ఉండకూడదా ?’’భూత భాషా మయీం ప్రాహు రద్భుతార్ధం బృహత్కథా’’ఆని చెప్పిన దండికి బృహత్కధ తెలియ దనుకోవటం చెవిలో కాబేజీ పెట్టటమే .
కేతన దీన్ని పద్యకావ్యంగా అనువదించాడు .శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి, శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గార్లు ప్రౌఢ గ్రాంధికం గా అనువదిస్తే, శ్రీ విద్వాన్ విశ్వం సరళ సుందర వ్యావహారికంగా అనువదించాడు .
ఆధారం -శ్రీ తిరుమల రామ చంద్ర గారి ‘’దండి దశకుమార చరితం ‘’వ్యాసం
వ్యావహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తిగారి జయంతి -తెలుగు భాషా దినోత్సవ శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-25-ఉయ్యూరు ..