ఆగ్నేయ ఆసియా అందాలకు ఆదర్శం అలనాటి ఆంధ్ర రాజధాని అమరావతి -1
‘’భారత దేశం లోనేకాదుఆసియా అంతటా తత్వ జిజ్ఞాస, మత తృష్ణ నుమ్మరంగా ఉన్న సమయంలో సిద్ధార్ధుడు అవతరించాడు అన్నారు ‘’ఆచార్య నీల కంఠశాస్త్రి .మారుని జయించిన మహాబలుని జీవితం ,సామ్రాజ్యాన్ని కాలదన్నిన సిద్ధార్ధుని త్యాగం ,సత్యాహి౦సలు అనే అమృత౦ఒలికించిన సమంత బద్ధుని సుచరితం ,సరళం సర్వ జనీనమైన నైతిక జీవన సిద్ధాంతం అందర్నీ ముగ్ధుల్ని చేసి ప్రపంచానికి ప్రసాదించిన వరాలు .అందుకే ఆసియ అతడిని ఆరాధించింది ,అతని దివ్య చరిత్రలో కరకు రాళ్ళు కూడా కరిగి కళ గా ప్రవహించాయి .ముఖ్యంగా ఆగ్నేయ ఆసియాలో బర్మా మలయా,జావా ,సుమత్రాది దేశాలు భారత దేశానికి ప్రతిరూపాలుగా మారి తన్మయం చెందాయి అన్నారు శ్రీమాన్ తిరుమల రామచంద్ర .
భారతీయులు స్వీయ ధర్మ సంస్కృతీ విస్తరణకు ప్రయత్నించి నంతగా సామ్రాజ్య విస్తరణకు ప్రయత్నించలేదు .రెండు వేల ఏళ్ల నాడు పొంగులు వారిన భారతీయ సంస్కృతి త్రివిక్రమునిలా మూడు అంగలు వేసి,ఆసియా అంతటా ఆక్రమించి ,నవ నవోత్తేజం కల్పించి భ్రమర కీట న్యాయంగా మార్చేసింది .ఈ సంస్కృతీ త్రివిక్రముని మొదటి పరిక్రమం కృష్ణ వేణి నుంచి ప్రారంభం కాగా ,నాగార్జునాచార్యుడు నామ రూపాలు తీర్చగా ,అమరావతి అందాలు దిద్దింది అన్నారు రామ చంద్ర .ఇలా భారతీయ ధర్మ సామ్రాజ్యం ఇటు తూర్పు బర్మా ,,సయాం ,మలయా ,ఇండో చైనా ,ఇండొనీషియా టిబెట్ ,మంగోలియా ,మంచూరియా ,చైనా కొరియా ,జపాన్ లకు ,అటు ఆఫ్ఘనిస్తాన్ ,పశ్చిమాసియా లకు బుద్ధుని ముందు ,ఆతర్వాత కూడా విస్తరించింది .ఆకాలం లో వ్యాపారులు సప్త సముద్రాలు దాటి వెళ్లగా ,సన్యాసులు భిక్షులు కొండలు గుట్టలు ఎడార్లు దాటి వెళ్లారు .బెహారులు మన దేశం లోని సరుకులను విదేశాల సరుకులతో వినిమయం చేసుకోగా ,భిక్షువులు సన్యాసులు ప్రజలు తరించి పుణ్యలోకాలు చేరడం కోసం తమ ధర్మాన్ని విదేశీయులకు ఉపదేశించారు .భారత గహపతులు అంటే శ్రేష్ఠులు (*వ్యాపారులు )విదేశాలలో నిగమాలు అంటే వర్తక సంఘాలు స్థాపించుకొని స్వధర్మ అనుసరణకోసం మందిరాలు విహారాలు ,నెలకొల్పారు . వీటిద్వారా విదేశాలలో భారత సంస్కృతి అల్లిబిల్లిగా అల్లుకు పోయింది .నేగములు అంతే వర్తకులు రాజానుగ్రహ పాత్రులయ్యారు .ధర్మప్రచారకులు ప్రజాదరణ పొందారు .ఈ విధంగా వాణిజ్యం సంస్కృతీ ఒకదానినొకటి అల్లుకుపోయి ,భారతీయులు అడుగు పెట్టిన చోటల్లా భారతీయ జీవన విధానం వేళ్ళు పాతుకు పోయింది .
లంకకు లావణ్యం
లంకాద్వీపాన్ని సరిస్పతి అంటే సముద్రుడు తన తరంగ హస్తాలతో వేరు చేసినా ,నిజానికి అది భారత దేశం ముక్కయే .ప్రాక్ ఇతిహాస కాలం నుంచి ,రామాయణ కాలం నుంచి మనకు లంకకు అవినాభావ సంబంధం ఉంది.ఈ సంబంధం దేవానాం ప్రియదర్శి అశోకచక్రవర్తి పునర్నవం చేశాడు .తధాగతుని తధ్యమార్గాన్ని ,సందేశాన్ని బోధి వృక్ష శాఖతోపాటు తన సోదరుడు మహేంద్రుని ,సోదరి సంఘ మిత్రతో పాటు లంకకు పంపాడు .అప్పటి లంకాధిపతి ‘’తిస్సుడు ‘’ఈ అర్హతులకుస్వాగతం చెప్పి ,బౌద్ధ ధర్మ దీక్షితుడయ్యాడు , అతని రాజధాని’’ అనూరాధపురం ‘’తధాగతుని దివ్య లీలలు చెక్కిన సుందర శిల్పాలతో నేటికీ రమణీయంగా ఉంది.ఇప్పటికి రండు వేల ఏళ్లక్రితమే లంకరాజు’’ ‘’కట్టగామణి’’ ‘’అభయగిరిలో మహావిహారం నిర్మించాడు .బుద్ధుడు ఉపదేశించిన హీనయానం మొదట పాతుకొన్నది లంక లోనే .తర్వాత బర్మా, సయాం లకు పాకింది .
సశేషం
ఆధారం -సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్రగారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -31-8-25-ఉయ్యూరు