నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు,t,తర్కాన్ని తక్రం( మజ్జిగ)- గా గుటకాయస్వాహ చేసిన ,న్యాయ భూషణ ,న్యాయ శాస్త్ర స్థాపక బిరుదులుపొందిన ,- మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు
నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు .1877లో గోదావరి జిల్లా కోన సీమ లో పేరూరు అగ్రహారం లో జన్మించారు .తండ్రి గారు మహాశ్రీ విద్యోపాసకులైన అనంత రామావధానులు గారు .తల్లి గారు వెంక మాంబ తాత గారు శ్రీ పార్ధివలింగ పూజాపరాయణులు ,శ్రీ విద్యోపాసకులు,సత్కర్మ పరాయణులు అయిన సుబ్బావధానులు గారు .వీరిది ద్రావిడ బ్రాహ్మణకుటుం.శాస్త్రిగారి చిన్నతనం లోనే తండ్రి మరణించారు .అమ్మ గారే వీరిని కంటికి రెప్పలాగా కాపాడారు .ఎనిమిదవ ఏటనే ఉపనయం చేశారు .పదహారవ ఏటనే వైయాకరణ చూడామణి బిరుదాన్కితులైన మంధా చెన్నయ్యశాస్త్రి గారికి శిష్యులై సంస్కృతకావ్య నాటకాలను ,న్యాయ వేదాంత గ్రంధాలను అభ్యాసం చేశారు.తర్కశాస్త్రం మీద మోజు కలిగి అతి దుర్బోధకంగా ఉండే ఆ శాస్త్రాన్ని పంచదార పానకం లా గుటకాయస్వాహాగా పుచ్చుకొని ,ఆ నాటి మేటి తర్కశాస్త్రజ్నులనే ఆశ్చర్యంలో ముంచారు .ఆయన దిషణాదిక్యతకు అందరు ముచ్చట పడ్డారు.
విజయనగర మహారాజ సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్ర ప్రధానాచార్యలు గుమ్మలూరి సంగమేశ్వరశాస్త్రి గారి వద్ద న్యాయ శాస్త్రాన్ని పది ఏళ్ళు అభ్యశించారు .దీనికి మెరుగులు దిద్దు కోవటానికి నైయాకరణ సార్వ భౌములు అని పిలువబడే పిథాపుర ఆస్థాన విద్వాంసు లైన శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి సమక్షం లో రెండేండ్లు న్యాయ శాస్త్రాన్ని చదివి అసాధారణ పండితులని పించుకొన్నారు .పిఠాపురం ,ఉర్లాం సంస్థానాలను దర్శించి తమ నిరుపమానమైన పాండిత్య ప్రకర్ష ను నిరూపించి శాస్త్రపరీక్షలో నెగ్గి ,ప్రధమ స్థానాన్ని పొంది అనేక బహుమానాలను గెలుచుకొన్నారు .
తమ స్వగ్రామం లో న్యాయ శాస్త్రాన్ని ,వేదాంతాన్ని అనేక మంది శిష్యులకు బోధించారు .వీరి కీర్తి నెల నాలుగు చెర గులా వ్యాపించింది .1902 లో విజయ నగర సంస్కృత మహా విద్యాలయం లో న్యాయ శాస్త్రాధ్యాపకు లుగా నియుక్తులైనారు ..1913 లో సంగమేశ్వర శాస్త్రి గారి నిర్యాణం తరువాత వీరు ప్రధాన న్యాయ శాస్త్ర పండితులుగా పదోన్నతి పొందారు .మహా రాజావారి అభ్యర్ధన మేర కు రాజస్థాన్ లోని జయపూర్ సంస్థానం వెళ్లి అక్కడ మహా విద్వత్ సభలో తమ ప్రజ్ఞా,పాండిత్య ప్రతిభ ను ,వాదకౌశలాన్ని ప్రదర్శించి ‘’న్యాయ భూషణ ‘’బిరుదును పొందారు ..విజయ వాడ లోని త్రిలింగవిద్యా పీథం వారు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకట రమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యం లో న్యాయ స్థాపక ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .1937 లో లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సంస్కృత కళాశాల ప్రధాన పండిత పదవిని అలంకరించారు .అయిదేళ్ళు పని చేసి విశ్రాంతి పొందారు .ఆ నాటి బ్రిటీష్ ప్రభుత్వంవారు శాస్త్రి గారి విద్వత్తు కు అబ్బుర పడి ‘’మహామహోపాధ్యాయ ‘’అనే అరుదైన బిరుదు నిచ్చి సత్క రించారు .వీరికి ముందు నలుగురు మాత్రమె ఈ బిరుదు ను పొందారు .న్యాయ, వేదాన్తాలను జీవితాంతం బోధించటమే గాక మంత్ర ,జ్యోతిషాలలో అద్భుత ప్రావీణ్యంసంపాదించారు .అతి గహన మైన ఉదయనా చార్యుల రచన ‘’కుసుమాంజలి ‘’ని అతి సరళ భాష లో అనువాదం చేసి తమ పాండితీ గరిమను నిరూపించారు .అలాగే గదాధర భట్టాచార్యుల ‘’హేత్వాభాస సామాన్య నిరుక్తి ,’’సవ్యభి చార సామాన్య నిరుక్తి ‘’అనే నవ్య న్యాయ శాస్త్ర గ్రంధాలకు ‘’లలిత ‘’అనే పేరు తో వివరణాన్ని రాసి ,తమ న్యాయ శాస్త్ర కౌశలాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తిని ప్రదర్శించి కోవిదుల మన్నన లందుకొన్నారు .మాధవా చార్యుల వారి ‘’సర్వదర్శన సంగ్ర హం ‘’లోని అనేక భాగాలకు ఆంధ్రాను వాదం చేశారు .అయితే అది అముద్రితమే ..డెబ్బది మూడు సంవత్స రాలు ధన్య జీవితాన్ని గడిపిన న్యాయ శాస్త్ర కోవిదులైన శాస్త్రి గారు 1949 న పరమ పదించారు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-25-ఉయ్యూరు .

--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-ZcfS7JbwA89Bygjp4WoZS-U4usDB%3DgboLx%3DYX82WUFw%40mail.gmail.com.

To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAMix2KyAuyecLMHi0J1DwefuT22X7ALTaLiobk5yB3isXW0KTQ%40mail.gmail.com.