వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులు (29-8-1863 -22-1-1940

381 views
Skip to first unread message

gabbita prasad

unread,
Sep 1, 2018, 7:24:29 AM9/1/18
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Vani Kumari Tummalapalli, Vasanth Swamy, Vuppaladhadiyam Venkateswara, mrvs murthy, madhavarao bandla, silarm...@yahoo.com, Josyula Nageswara Rao, Lavanya Pasumarthy, sastry.su...@yahoo.in, sridakshina murthy sastry tumuluru, chandrasekhar boddapati, Padma Bulusu, samba....@gmail.com, kasturi v, GopalaKRao Potluri, Padmaja Veeturi, Radha, Ramky Adusumilli, Sai Pavan, Pavan Velury, usha parupudi, mallikarjuna kishore

శ్రీ గిడుగు రామమూర్తి గారి జయ౦తి (155) తెలుగు  భాషా దినోత్సవం గా సరసభారతి,స్థానిక రోటరీ క్లబ్ సంయుక్తంగా 29-8-18 బుధవారం నిర్వహించిన సభలో నేను మాట్లాడిన నాలుగు మాటలకు  పరిపూర్ణత కోసం అదన౦గా మరో పదిమాటలు కలిపి మీకోసం  –

 వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులు (29-8-1863 -22-1-1940

          జనన ,విద్యాభ్యాసాలు ,ఉద్యోగం

‘’గ్రా౦ధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు –వ్యవహార భాష ఘనుడు గిడుగు

తేట తేనియల తెల్లనిపాల మీగడ గిడుగు –కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు ‘’అనిపించుకున్న శ్రీ గిడుగు  వెంకట రామ మూర్తి పంతులుగారు గిడుగు రామమూర్తిగా, గి .రాం .పంతులు గారుగా లబ్ధ ప్రతిస్టులు .29-8-1863 న శ్రీకాకుళం జిల్లా ముఖ లింగ క్షేత్రం దగ్గరున్న పర్వతాల పేటలో శ్రీ వీర్ర్రాజు ,శ్రీమతి వెంకమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి రెవిన్యు డిపార్ట్ మెంట్ లో అధికారి .ప్రాధమిక విద్య1877 వరకు  పుట్టిన చోటనే పూర్తి చేసి,తండ్రి చోడవరం బదిలీ అయి అక్కడి దోమకాట్లకు విషజ్వరం కు  బలై 1875 లో మరణించగా , విజయనగరం మేనమామగారింట ఉండి మహారాజా కాలేజిలో 1875 నుండి 80 వరకు చదివారు .79 లో మెట్రిక్ పాసైనారు  .కాలేజీలో శ్రీ గురజాడ అప్పారావు గారు సహాధ్యాయి .1880 నుండి నెలకు 30 రూపాయల జీతం తో రాజాగారి స్కూల్ లో ఫస్ట్ ఫాం విద్యార్ధులకు చరిత్ర  బోధించారు .అప్పుడే ముఖ లింగ క్షేత్రం లోని శాసనలిపి స్వయంగా నేర్చి ఎన్నో చారిత్రకాంశాలు వ్యాసాలుగా రాశారు .ముఖ్యంగా ఆయన రాసిన’’ గా౦గ వంశీయుల’’ పై ఇంగ్లీష్ లో రాసిన ప్రామాణిక వ్యాసాలు వారి పరిశోధనా పటిమకు గొప్ప నిదర్శనాలు .ఇవి ఇండియన్ యాన్టిక్వరి,మద్రాస్ లిటరేచర్ అండ్ సైన్స్ జర్నల్స్ లో ప్రచురితాలై విశేష కీర్తి నార్జించాయి .సవర భాష దక్షిణ ముండా భాష .ముండా ఉపకుటుంబానికి చెందిన ఈ సవర భాష ను శాస్త్రీయంగా పరిశోధించిన ప్రధమవ్యక్తి గిడుగువారు .ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం లో ముండాభాషలు ఒక శాఖ .క్రీ.పూ. 15 వ శతాబ్ది నుంచి సవరలు మనదేశంలో ఉన్నారు .వీరిని’’ శబరలు ‘’అని ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్నది .

 

     కాలేజీ లెక్చరర్ అవ్వాలంటే చరిత్రలో డిగ్రీ తప్పని సరి .1886 లో ఇప్పటి ఇంటర్ అప్పటి ఎఫ్.ఎ.పాసై 1894 లో తనకభిమానమైన చరిత్ర లో డిగ్రీ మొదటి తరగతిలో ,యూని వర్సిటి రెండవ రాంక్ తో సాధించారు .వెంటనే పర్లాకిమిడి కాలేజి లెక్చరర్ గా పదోన్నతి పొందారు .30 ఏళ్ళు సుదీర్ఘ సర్వీస్ పూర్తీ చేసి ఎఫ్. ఏ. విద్యార్ధులకు చరిత్ర బోధించి ,1911 లో స్వచ్చంద  పదవీ విరమణ చేశారు .

               బోధనా విధానం –మెరికల్లాంటి శిష్యులు

    పాఠం చెప్పటం అంటే ఏమిటో రామమూర్తి పంతులుగారు తన బోధన వలన తెలియ జేశారు .గ్రీకు చరిత్ర బోధిస్తుంటే ప్రాచీన  గ్రీకుల నీతి నియమాలు ,ఆధ్యాత్మిక తత్త్వం ,రాజ్యపాలన ,సారస్వతం లను , ఆర్యుల ప్రాచీన చరిత్రనుండి సామ్యాలు ,భేదాలు తులనాత్మకంగా పరిశోధించి బోధించేవారని ,అలాగే రోమన్ చరిత్ర చెప్పేటప్పుడు కుటుంబ విశ్వాసాలలో తండ్రికున్న అసాధారణ అధికారాలను ప్రాచీనార్యుల నాగరకత తో పోల్చి హృదయానికి హత్తుకోనేట్లు బోధించేవారని గిడుగువారి ప్రియ శిష్యుడు శ్రీ పారనంది జగన్నాధా చార్యులు తెలియ జేశారు. ఆచార్యులవారు గిడుగు వారి  శిష్యులే కాదు తత్వ శాస్త్రం ,మనస్తత్వ శాస్త్రం లను ప్రత్యేకంగా నేర్చి విపుల గ్రంథ రచన చేశారు .

  గిడుగువారి పెద్ద కుమారుడు శ్రీ గిడుగు వెంకట  సీతాపతి 1903 లో ఎఫ్. ఏ .చదివి,19 07లో రాజమండ్రి లో ఉధ్యాయ శిక్షణ పొందుతున్నప్పుడు ‘’అంతర్జాతీయ ధ్వని లిపి’’నేర్చుకున్నారు .దీనితో ఏ భాషలోనైనా మాట్లాడినట్లే రాసుకో వచ్చు ,చదువుకోవచ్చు .కొడుకు సీతాపతి గారివద్ద తండ్రి రామ మూర్తిగారు అంతర్జాతీయ ధ్వనిలిపి నేర్చుకున్నారు .అంటే ఆయనకు వివిధ విషయాలు అవగాహన చేసుకోవటం లో యెంత అభిరుచి ఉందొ తెలుస్తోంది .తండ్రిలాగానే సవరభాషను నేర్చి అందులోని పాటలను సేకరించి వాటిని ఇంగ్లిష్ లోకి అనువదించారు .సవర సంగీతం పై ఇంగ్లిష్ లో పెక్కు వ్యాసాలూ రాశారు .తండ్రికి తగ్గ తనయుడనిపించారు  .సీతాపతి గారి సవర భాషా సేవలను గుర్తించి వాషింగ్టన్ లోని ఇంటర్  నేషనల్ అకాడెమి 1940 లో డి .లిట్. ప్రదానం చేసి గౌరవించింది .విద్వాంసుడు, భాషా శాస్త్ర వేత్త ,శాసన పరిశోధకుడు ,ఉత్తమ అనువాదకుడు,గొప్ప అధ్యాపకుడు   సీతాపతి గారు. .’’తెలుగు విజ్ఞాన సర్వస్వం ‘’కు సంపాదకత్వం వహించిన మేధావి .’’ బైబిల్ ‘’ను సవర భాషలో రచించారు సవరభాష లాటిదే అయిన ఫరంగీ భాషపైనా పరిశోధించారు .ఇంతటి ఘనవిద్యలన్నీ గురువైన తండ్రి రామమూర్తిగారి వలన అబ్బినవే .తండ్రికి లేని నటన లో ప్రావీణ్యం ఉన్న నటుడుకూడా అయిన సీతాపతిగారు’’ పల్నాటి యుద్ధం, రైతు బిడ్డ ,పంతులమ్మ’’ మొదలైన సినిమాలలో నటించి తండ్రికి మించిన తనయుడయ్యారు .గుబురు మీసాలతో ఆయన కొట్టొచ్చినట్లు కనిపిస్తారు .

   పంతులుగారి మరొక అభిమాన శిష్యుడు శ్రీ బుర్రా శేషగిరిరావు .సీతాపతి సహాధ్యాయి .19 03లో ఎఫ్ .ఏ .చదివి పంతులుగారి ప్రభావం వలన చరిత్రకు, తెలుగు భాషాభిమానానికి పరిశోధనలకు  ఆకర్షితులై ,ఎం యే .పాసై విజయనగరం మహారాజా కాలేజి లో సహాయ అధ్యాపకులుగా 30 ఏళ్ళు ఆంగ్ల భాష శాఖాధ్యక్షులుగా ,ఆ శాఖ ప్రదానాధ్యాపకులుగా సేవ లందించారు .  గొప్ప పరిశోధకులైన బుర్రావారు ‘’దక్షిణ దేశం లో జైనమత వ్యాప్తి ‘’ఉద్గ్రంధం రచించారు .భాషా సాహిత్యాలపై లోతైన అవగాహనతో లెక్కకు మించిన వ్యాసాలూ రాశారు .ఆయన రాసిన ‘’విమర్శాదర్శం’’తొలి తెలుగు విమర్శ గ్రంధం గా చరిత్ర సృష్టించింది . ఆనాడు గిడుగు రామమూర్తి గారిని సమర్ధించిన వ్యావహారిక భాషా వాదులలో బుర్రావారు ,గురజాడ ,పి .టి .శ్రీనివాస అయ్యంగార్ ,చిలుకూరి నారాయణరావు ,ముఖ్యులు .బుర్రావారు విజయనగరం లో తమ ఇంటివద్ద ‘’ఆంద్ర భారతీ తీర్ధ ‘’అనే రిసెర్చ్ యూని వర్సిటి స్థాపించి ,విదేశాలలో బ్రా౦ఛీలుకూడా ఏర్పాటు చేసి పరిశోధకులకు అండగా నిలిచారు .కవి పండితులకు ,కళాకారులకు బిరుదులిచ్చి సత్కరి౦చే వారు .బుర్రా వారి బుర్రకు పదును గిడుగు వారే అని  వేరే చెప్పక్కరలేదు .

  పరిశోధక పరబ్రహ్మ  శ్రీ చిలుకూరి నారాయణరావు 1908 లో ఎఫ్. ఏ. పర్లాకిమిడి లో చదివేటప్పుడు గిడుగువారి శిష్యుడు .మిల్టన్ సానెట్ ను గురువుగారు క్లాసులో ఒకసారి చదివి ఎవరైనా అప్పగించగలరా అని ప్రశ్నిస్తే  రావుగారు లేచి మరో సారి చదవమని కోరి చదవగానే అప్పగించిన ఘనుడు .అప్పటినుంచి గురువుగారి అత్యంత ప్రియ శిష్యుడై నారు .తెలుగులో ఎం. ఏ. చేసి ,సంస్కృత ,ప్రాకృత ,ఆంగ్ల, మరాటీ ,తమిళ కన్నడాది బహుభాషా కోవిదులై ,ఘనాఘన పండితుడని పించుకొన్నారు .తొలి తెలుగు పరిశోధకులు నారాయణరావు గారు ‘’ఆంద్ర భాషా చరిత్ర ‘అనే పరిశోధనాత్మక గ్రంథం రాసారు .వీరికి  గిడుగు గురువుగారు విషయ సేకరణలో చాలా తోడ్పడ్డారు .తెలుగులో అన్ని  సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసిన వారు రావు గారు ..240 గ్రంథాలు రాసిన సాహితీ మూర్తి .1915 నుంచే గిడుగువారి ప్రభావంతో వాడుక భాషలో రచనలు చేయటం ప్రారంభించారు 1950 లో’’గుజరాతీ చరిత్ర ‘’రాసి ఆంద్ర భారతీ తీర్ధ నుండి  ‘’మహోపాధ్యాయ ‘’బిరుదు సత్కారం పొందారు .ఆంద్ర విశ్వ విద్యాలయం 1947 లో ‘’కళాప్రపూర్ణ ‘’తో సత్కరించింది .ఇదంతా గిడుగు గురు కటాక్షమే .  గిడుగు వారి మరో శిష్యుడు శ్రీ తాపీ ధర్మా రావు గారు .రామమూర్తి గారి  లాగా చరిత్ర బోధించే వారు మద్రాస్ లో లేరని గ్రహించి పర్లాకిమిడి వెళ్లి ఎఫ్. ఏ. లో చేరి, గిడుగువారి  అ౦ తేవాసియై  సార్ధత సాధించారు. ‘’గురువుగారు చరిత్ర చెబుతుంటే పాత్రలు ప్రత్యక్ష మైనట్లు ఉండేవి ‘’అని తాపీ ఉవాచ .మొదట్లో గురు తిరస్కారం చేసి  గ్రాంధిక భాషలో రాసిన తాపీ ,తప్పు తెలుసుకొని’’ కలం తాపీ’’తో  వ్యావహారిక సొగసులు తీర్చి దిద్దారు .చేమకూరకవి ‘’విజయ విలాసం ‘’   కు ధర్మారావుగారి ‘’హృదయోల్లాస వ్యాఖ్య ‘’పండితుల కళ్ళు తెరిపించి కొత్త పుంతలు తోక్కించింది . ఆయన కొత్తపాళీ ,దేవాలయాలపై బూతుబొమ్మలు పుస్తకాలకు విశేష గిరాకీ ఉన్నసంగతి మనకు తెలిసిందే .ముద్దుబిడ్డ మొదలైన సినిమాలకు పాటలూ రాశారు వీరికుమారుడు తాపీ చాణక్య ‘’రోజులు మారాయ్’’అనే సూపర్ డూపర్ హిట్ సినిమా దర్శకుడు .ఇందరు ప్రముఖ శిష్యులకు గురువు గిడుగు  ఖ్యాతి వర్ణించ  తరమా ?

                      గిడుగు వారి భాషోద్యమం

    పదవీ విరమణ చేసినప్పటినుంచి గిడుగు వారు వ్యావాహారిక భాషోద్యమ వేగాన్ని పెంచారు .సవర విద్యార్ధులకు తమ ఇంట్లోనే వసతి భోజన సౌకర్యాలు కలుగ జేసి పుస్తకాలు రాసి ,స్కూళ్ళు పెట్టి,  అధ్యాపకులకు స్వయంగా జీతాలు చెల్లించి , వారి విద్యకు అన్నివిధాల సాయం చేశారు .దీన్ని గుర్తించిన ప్రభుత్వం 1913 లో ‘’రావు బహదూర్ ‘’బిరుదునిచ్చి సత్కరించింది .అప్పుడే కొత్తగా వస్తున్న భాషాశాస్త్ర పుస్తకాలు చదివి ,30 ఏళ్ళు తీవ్ర కృషి చేసి , వ్యాకరణ నిర్మాణం నేర్చుకొని 1931 లో’’ సవర భాషా వ్యాకరణ౦’’ ,1936 లో ‘’సవర –ఇంగ్లిష్ నిఘంటువు’’ నిర్మించారు .వీటిని ప్రభుత్వం అచ్చు వేసి అందుబాటులోకి తెచ్చింది .ఆయనకు ‘’కైజర్ –ఏ- హింద్ ‘’అనే స్వర్ణపతకాన్ని ప్రభుత్వం 1934లో  అందించి  గౌరవించి సత్కరించింది .మన్య ప్రాంతాలలో నిరంతరం తిరగటం వలన గిడుగు వారికి తరచుగా విష దోమకాటు వలన మలేరియా వచ్చేది .అప్పటికి అందుబాటులో దానికి మందు ‘’క్వినైన్’’.తన పరిశోధనలు, సవరభాషా వ్యాప్తి పై దృష్టి నిలిపిన పంతులుగారు ఆరోగ్యం లెక్కచేయలేదు .మలేరియా వచ్చినప్పుడల్లా క్వినైన్ మాత్రలు అధికంగా వాడేవారు. దీనితో వారికి వినికిడి సమస్యవచ్చి క్రమగా చెవుడు గామారి చివరికి ‘’పుట్ట చెవుడు ‘’తో విపరీతంగా బాధపడ్డారు .

 

  ఆయనకు వ్యావహారిక భాష పై అంతటి అభిమానం కలగటానికి ఒక సంఘటన  కారణం గా ఉంది .అప్పుడు జే .ఏ .యేట్స్ దొర ఉత్తరాంధ్ర స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా ఉండేవాడు .ఆయనకు స్కూళ్ళల్లో తెలుగు బోధన కావ్య భాష లోనా? లేక వారు మాట్లాడుకొనే వ్యావహారిక భాషలోనా ?అనే విషయం పై ఆరా తీయాలనిపించి విశాఖ పట్నం మిసెస్ ఎ .వి .యెన్ ..కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ పి.టి .శ్రీనివాస అయ్యంగార్ ని అడిగాడు .ఆయన దీనిపై తానేమీ సరిగ్గా చెప్పలేనని ,ఆ వివరాలన్నీ గురజాడకు ,గిడుగుకు బాగా తెలుసునని చెప్పాడు .వారిద్దరిని కలిసి ప్రాధమిక విషయాలన్నీ అవగాహన చేసుకొని ,సంతృప్తిపడక  విద్యార్ధులు తాము మాట్లాడే భాషలో అధ్యయనం చేస్తేనే బాగా రాణిస్తారని గిడుగు గురజాడ ల అభిప్రాయాన్ని బలపరచాడు .ఇలా అధికారి కూడా తమకు తోడ్పడటం తో ఉద్యమతీవ్రత పెంచారు సభలు సమావేశాలు జరిపి పండితులతో వాదించి వారి అభిప్రాయాలను మార్చుకోనేట్లు చేశారు .ఉద్యమవ్యాప్తికోసం ‘’తెలుగు ‘’అనే పత్రిక 1919-20 లో స్థాపించి నిర్వహించారు .1906 నుండి 1940 వరకు అవిశ్రాంత పోరాటమే చేశారు .1925 లో తణుకులో’’ఆంద్ర సారస్వత పరిషత్’’ సభలో  నాలుగు గంటలు సుదీర్ఘ ఉపన్యాసం చేసిన వ్యావహారిక భాషా పోరాట యోధులు పంతులుగారు .ఈ పోరాట ఫలితంగా 1912-13 సంవత్సరం లో స్కూల్ ఫైనల్ విద్యార్ధులు  కావ్యభాషలోకాని ,వ్యావహారిక భాషలోకాని  పబ్లిక్ పరీక్ష రాయవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .ఇదే మొట్టమొదటి విజయం .1930 లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పర్లాకిమిడి రాజా పర్లాకిమిడి తాలూకాను ఒరిస్సాలో చేర్చటానికి తీవ్ర ప్రయత్నం చేస్తే, తెలుగువారందరి తరఫునా నాయకత్వం వహించిన ఎదిరించి నిలిచిన ధీశాలి గిడుగు .కాని రాజు బలవంతుడు కనుక ఆతాలూకాను, పట్టణాన్నీ కూడా బలవంతంగా ఒరిస్సాలో కలిపేశాడు . తెలుగు వారికి తీవ్ర అన్యాయం జరిగిందని భావించి 1936 లో ఒరిస్సా రాష్ట్ర ప్రారంభోత్సవం నాడు  ఉదయమే పర్లాకిమిడి వదిలిపెట్టి రాజమహేంద్రవరం చేరి అక్కడే కడదాకా ఉండిపోయిన భాషాభిమాని

   1936 లో నవ్య సాహిత్య పరిషత్ శివ శంకరస్వామి ఆధ్వర్యం లో ఏర్పడి రాష్ట్రం లోని కవులు రచయితలూ సభ్యులు గా చేరి వ్యావహారిక భాషోద్యమాన్ని ఊరూరా ప్రచారం చేసి గిడుగువారికి కొండంత అండగా నిలిచారు .1937 లో శ్రీ తాపీ ధర్మారావు ‘’జనవాణి ‘’పత్రిక పెట్టి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళారు. 1938 లో ఆంద్ర విశ్వ విద్యాలయం ‘’కళాప్రపూర్ణ ‘’బిరుదునిచ్చి సత్కరించింది .కొడుకు సీతాపతిగారికీ ‘’కళాప్రపూర్ణ ‘’నిచ్చింది .తండ్రీ కొడుకులు ఆంధ్రా యూని వర్సిటి నుంచి కళాప్రపూర్ణ పొందటం వీరిద్దరికే దక్కిన అరుదైన అదృష్టం .

  ఇంతటి బహుముఖీన ప్రతిభా వ్యుత్పత్తులున్నసృజన శీలి, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు ,ఆంధ్రుల ప్రాతస్మరణీయుడు,సవర భాషకు ప్రాణ ప్రదాత , కారణ జన్ముడు శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులుగారు 22-1- 1940  న 77 వయసులో మరణించారు .గిడుగు వారి పుట్టిన రోజు ఆగస్ట్ 29 ని’’తెలుగు భాషా దినోత్సవం ‘’గా మనం నిర్వహించుకొంటున్నాం .

 

ఆయన గురించి కొందరు ప్రముఖుల ప్రశంసలు –

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి

"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"

విశ్వనాథ సత్యనారాయణ

·         "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట"

·         "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు"

పులిదిండి మహేశ్వర్

·         "గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,

తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు"

 

    గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుది విన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -

‘’దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు, వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?

స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

 

ఆధారం –ఆంధ్రజ్యోతిలో శ్రీ అల్లం సెట్టి చంద్ర శేఖరరావు గారి రచన ‘’గురువు గా గిడుగు ‘’ ,ఆంద్ర భూమి, ఆంద్ర ప్రభ, వీకీ పీడియా  

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-18 –ఉయ్యూరు

 

 

image.png
image.png
image.png
image.png
image.png
image.png

--




గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
             8520805566

Land Line : 08676-232797


Reply all
Reply to author
Forward
0 new messages