ఓం ఇతి జ్యోతి స్వరూపం ‘జ్యోతి’ అంటే ప్రకాశిస్తుంది అని అర్థము. ప్రకాశము అంటే పరమాత్మగా ప్రకాశిస్తుంది. పరమాత్మ ప్రకాశమది. ఆత్మ ప్రకాశము, బ్రహ్మ ప్రకాశము, పరమాత్మ ప్రకాశము, అదీ జ్యోతి అంటే! ఇంకో శబ్దములో తరించాలి అంటే, వెన్నుపూసని నిట్టనిలువుగా పెట్టుకుని, కుండలనీ శక్తిని జాగరణ చేసి, సహస్రారమందున్నటువంటి సహస్రదళ స్థానానికి లక్ష్యం పెట్టుకుని, తురీయంలోకి వెళ్ళాలి.
మూడు అవస్థలలో ఉండి, మూడవస్థలకి అతీతముగా కూడా ఉండేది ‘తురీయము’. నిశ్శబ్దము మూడు అవస్థలలో ఉంది. మూడవస్థలకి సాక్షిగా ఉంది. ‘నిశ్శబ్దము’ తనకు తానే నిశ్శబ్దముగా శాశ్వతముగా ఉంది. అదీ తురీయమంటే. ‘శబ్దము’ ఒకప్పుడు ఉంటోంది, ఒకప్పుడు ఉండడం లేదు. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారములుగా మూడు రకాల శబ్దాలు ఉంటే, ఈ మూడు రకాల శబ్దాలకు మూలమైనది ‘నాదం’. ఈ ‘నాదమే తురీయము’. నాదాంతములో నాదము అంతమైతే ‘నిశ్శబ్దము’ ఉంది. నిశ్శబ్దమేమో శాశ్వతము. నిశ్శబ్దములో పరిణామము లేదు. నిశ్శబ్దములో వికారము లేదు. నిశ్శబ్దములోనుంచి ఏమీ పుట్టలేదు. నిశ్శబ్దములో ఏమీ లయం కాదు. శబ్దమే తనకు తానే పుట్టి, తనకు తానే కళల రూపములో ఉండి, ఆ ధ్వని తనకు తానే లయం అవుతూ ఉంటుంది. కనుక ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’ కారములని ఎలా తీసుకున్నప్పటికీ, ‘ధ్యాత’ యొక్క ప్రకాశము, ‘ధ్యానము’ యొక్క ప్రకాశము, ‘ధ్యేయవస్తువు’యొక్క ప్రకాశము. అలా తీసుకుంటూ విశ్వ, తైజస, ప్రాజ్ఞుల యొక్క ప్రకాశముగా తీసుకోవచ్చు. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతుల ప్రకాశముగా తీసుకోవచ్చు. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తీసుకోవచ్చు. ఈ ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కార మాతృకలు ఇప్పుడు చెప్పిన అన్నిటికికూడా సంకేతము.
‘లింగము’, ‘గుర్తు’ అంటే సంకేతము. ఈ సంకేతాలన్నీ కూడా ఈ గుర్తులు అన్నీ కూడా ‘ఎఱుకే’. ‘గుర్తు’ లేకపోతే, ‘ఎఱుక’ లేకపోతే, ‘శబ్దము’ లేకపోతే, ‘విశ్వ తైజస ప్రాజ్ఞుల అనుభవం’ లేకపోతే, ‘తురీయానుభవము’ కూడా లేకపోతే అప్పుడు ఏ అనుభవము కూడా లేకపోతే, ఏ ప్రపంచానుభవము లేకపోతే, ఏ శరీర సంబంధానుభవములు లేకపోతే, ఏ ఇంద్రియ సంబంధ అనుభవములు లేకపోతే, ఊహ లేకపోతే, ఆలోచన లేకపోతే, సాక్షిత్వము లేకపోతే ఇవన్నీ లేకపోతే ఏదైతే ఉన్నదో, అది ప్రణవాతీతము. అది పరబ్రహ్మము. అది తురీయాతీతము. తురీయాతీతమే పరబ్రహ్మ. సాధనలో ఏమిటంటే, తురీయాన్ని దాటి, తురీయాతీత స్థితిలో మనం ఉంటే, మనం ఆ పరబ్రహ్మమే.
ఇక్కడ అతీతమైన మాట వాడుతున్నాము. తురీయాతీతము, ప్రణవాతీతము అని. వ్యక్తావ్యక్తములుగా ఉన్న శబ్దానికి కూడా అతీతము. ఆ అతీతస్థితినే పరము అంటాము. ఆ పరమైనదే పరబ్రహ్మ. ఆ పరమైనది ఉన్నది ఉన్నట్లున్నది. కనుక ‘ఓం’కి వెనుక ప్రక్క ఒక సున్నా పెడితే, ఆ సున్నాయే పరం. ప్రణవమే సృష్టికి మూలము, మూలాధారము, మూలకారణము, మూలకారణాంశము. ఈ సృష్టి అంతా కూడా మూలకారణమైన ‘ఓం’ యొక్క అంశము ఉన్నది. అంటే, ప్రతీ దాంట్లో స్థూల సూక్ష్మ కారణాలు కలిసి ఉన్నాయి. స్థూలం ఏమో కార్యరూపంలో అనుభవానికి పనికి వస్తుంది పనిముట్టుగా! సూక్ష్మమేమో అనుభవిస్తుంది. ‘కారణం’ ఏమో ఏ అనుభవం రావాలో, ముందస్తుగా వాసనా రూపంలో ఉండి, ఆ కారణము. కార్యరూపము కాగానే, అనుభవాలు వస్తూ, పోతూ ఉంటాయి. కనుక కార్యకారణాలు ఉన్నంత వరకూ, అవి ప్రణవానికి, ఓంకారానికి లోబడి ఉన్నాయి.
కార్య, కారణాలకి అతీతమైనది, పరమైనది, ఈ ప్రణవానికి, ఓంకారానికి ఎట్టి సంబంధము లేకుండా తనకు తానే స్వతఃసిద్ధమై ఉండి, దాని నుండి ప్రణవము పుట్టలేదు. దాని నుండి ఓంకారము పుట్టలేదు. అందువల్ల ప్రణవ స్వరూపుడికి, ఓంకార స్వరూపుడికి ఆ పరబ్రహ్మము మూలము కాదు. ఇలా ‘మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు’ అంటే, ఆ ప్రణవ స్వరూపుడికి చెబుతున్నమాట. క్రింద నుంచి చెబుతున్నాము. ‘మూలం లేని గుర్తెరిగే స్థూల శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే సూక్ష్మ శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే కారణ శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే విశ్వ తైజస ప్రాజ్ఞులు ఏమీ లేరు’, ‘మూలం లేని గుర్తెరిగే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతులు ఏమీ లేరు’, ‘మూలం లేని గుర్తెరిగే క్షరాక్షరులు ఏమీ లేనే లేరు’. ముందుగా సంకల్పమే అవ్యక్తముగా ఉండి, సంకల్ప రూపంలో తిరిగి వ్యక్తమౌతుంది కనుక ‘విస్మృతి’గా ఉన్నప్పటికీ, అవి అవ్యక్తముగా ఉన్నటువంటి స్మృతులే. స్మృతి రూపంలో వ్యక్త రూపంలో బహిర్గతమౌతున్నాయి. కనుక స్మరణ, విస్మరణలు లేవు.
క్షేత్రము, క్షేత్రజ్ఞుడు లేడు. క్షరము, అక్షరము లేదు. ఇట్లా అష్ట తనువులు లేదు. స్థూల, సూక్ష్మ, కారణాలే కాకుండా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులే కాకుండా, తురీయంలో ఉన్న ప్రత్యగాత్మ, పరమాత్మలు కూడా ఈ తురీయమే సర్వకారణము. ఈ తురీయమే కారణము, మహాకారణము. కనుక స్థూల, సూక్ష్మ, కారణ సృష్టికి తురీయం మూలమైంది. ఆ తురీయంగా, మూలంగా ఉన్నటువంటి ప్రణవము. ఓంకారానికి అవ్యక్తంగా ఉన్నది. అనాహత శబ్దమే ప్రణవము, ఆ తరువాత ఉపక్రమించేటటువంటి, ఉపక్రమణకు, ఆ తరువాత విజృంభించేటటువంటి గుణమయ ప్రపంచానికి, నామ రూప వస్తువులకి కారణమైంది. కాని, దానికి కారణమేంటి? ప్రణవానికి కారణమేంటి? ఆ ప్రణవం పైన ఏదైతే ఉందో, అతీతంగా ఏదైతే ఉందో, ‘పరం’ అనే పేరుతో ఏదైతే ఉందో, అది స్వతఃసిద్ధంగా, దానికదే ఉండి, ‘ఏకమేవా అద్వయం బ్రహ్మ’గా ఉండి, దానియందు ‘నానా అస్తి న కించనః’ నానా రకాలుగా ఏదైనా కాని, ఏ ఒక్కటి కూడా అస్తిత్వాన్ని పొంది ఉండలేదు. కనుక ఈ అస్తిత్వము, నానాత్వము భేదాలతో వచ్చినటువంటివి అన్నీ కూడా ఓంకారము వల్లే స్థూల, సూక్ష్మ, కారణ సృష్టిగా, ఆ సృష్టియే స్థూల రూపం వచ్చేసరికి, నామ, రూప, వృత్తి నటనలుగా ఉంటున్నది. మోక్షము కావాలంటే, వీటి అతీత స్థితికి వెళ్ళాలి. అతీత స్థితి వీటికి మూలమా? కాదా? ఇంతసేపూ మనం చెప్పుకునేది ఏమిటంటే, దీనికి అతీతంలో మూలం లేదని, క్షేత్రజ్ఞుడు అయిన వాడు, అక్షర పరబ్రహ్మ అయినవాడు, ప్రత్యగాత్మ అయినవాడు, పరమాత్మ అయినవాడు ప్రణవ స్వరూపుడు అయినవాడు కూడా తనకు మూలంలేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, తాను గొడ్రాలి బిడ్డ సామెతగా, తాను లేకనే ఉన్నట్లుగా తోచాడని, తాను కూడా మాయా కల్పితుడే అని తెలుసుకుని, తాను దృక్ మాత్రమయినటువంటి ఎఱుక, తాను దృశ్యమైన ఎఱుక దృశ్య తాదాత్మ్య రూప ఎఱుక, సకల ఎఱుకలనుండి అతను విడుదల పొందాలి.
ఎఱుకే లేక ఉన్నట్లు తోచింది కాబట్టి, ఎఱుకకు మూలం లేదు. ఎఱుక దృశ్యం కాదు. ఎఱుక దృశ్యం అయినదంటే అది భ్రాంతి. ఎఱుక దృశ్యం కాలేదు అంటే అది అవ్యక్తము, ఎఱుక యొక్క అవ్యక్త స్థితి. లేనెఱుకే అవ్యక్త స్థితిలో ఘన రూప అఖండ ఎఱుకగా ఉండి, వ్యక్త స్థితిలో ఖండ ఎఱుకలై, మూడు గుణాల చేత, మూడు ఖండ ఎఱుకలై, తమో గుణం చేత, జడజగత్తు అనే ఎఱుకయై, రజోగుణం చేత జీవుల, ప్రాణుల ఉనికిగా ఎఱుక పుట్టి, సత్వగుణ ఎఱుక త్రిమూర్తులుగా, అధిష్ఠాన దేవతలుగా, ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైన అధిష్ఠాన దేవతలుగా ఉన్నది. ఈ సత్వగుణ ఎఱుకనేమో కేవలపుటెఱుక అంటారు. ఈ తమో గుణ ఎఱుకనేమో, మలినపుటెఱుక అంటారు. అసలు ఉన్నది తమోగుణం, సత్వగుణమే! రజోగుణం లేదు. ఆత్మయేమో సత్వగుణం, అనాత్మయేమో తమోగుణం. రజోగుణం లేదు. చిత్తేమో సత్వగుణం, జడమేమో తమోగుణం. అక్కడ కూడా రజోగుణంలేదు. చిత్ జడముల కలయికలో, చిత్ జడ గ్రంధిలో ఒక ‘నేను’ అనేటటువంటిది రజోగుణ సంబంధముగా తోచింది. ‘నేను’ అనేటటువంటి జీవుడు రజో గుణ సంబంధముగా తోచాడు. అంటే తమో సత్వ గుణముల యొక్క మిశ్రమముగా ఈ రజోగుణం ఆవిర్భవించింది. అందుకని ఈ రజోగుణాన్ని మిశ్రపుటెఱుక అంటాము. చిత్ జడముల యొక్క గ్రంధిలో పుట్టినది. అలాగే ఆత్మ, అనాత్మల యొక్క సందులో పుట్టినది. తమో, సత్వ గుణముల యొక్క సందులో పుట్టినది, వాటి యొక్క మిశ్రమము వలన కలిగినది, రజోగుణం కనుక రజోగుణాన్ని మిశ్రపుటెఱుక అంటారు.
ఇట్టి ఎఱుకకు మూలం లేదు. అన్ని కాలాల్లో ఏదైతే ఉందో, అది ఉన్నదున్నట్లున్నది. అది దీనికి మూలంకాదు. అది దేనికీ మూలం కాదు. కాని దాన్ని బయలు అనుకుంటే, బయలందు లేని ఎఱుక బయలులోకి చేరి, ఎఱుక తనంతట తానే లేకనే ఉన్నట్లు తోచినది. మళ్ళీ ఎఱుక లయమైనప్పుడు, లేనెఱుక లేకుండా పోయింది. అట్లాగే ఓంకారములో లేని శబ్దము ఉత్పన్నమై, ఓంకార రూపమై, అకార, ఉకార, మకార సృష్టి చేసింది. మాయ మూలకారణాంశము అవ్వడం వలన అకార, ఉకార మాతృకల చేత, సంకేతముగా ఉన్నటువంటి, స్థూల సూక్ష్మ ప్రపంచములన్నీ కూడా లేకనే ఉన్నట్లు కల్పించబడ్డాయి. మాయ యొక్క లక్షణాలు, మూడు గుణాలు ఈ మూడు ప్రపంచాలకు ఉన్నవి. మాయ లేనిది కనుక మూడు ప్రపంచాలు లేనివే. మాయ లేకనే ఉన్నట్లు ఉంది కాబట్టి, మూడు ప్రపంచాలు కూడా లేకనే ఉన్నట్లు ఉన్నాయి. కనుక ‘ఓం’ కి మూలం లేదు కాబట్టి, ‘ఓం’కి మూలం సున్నా! ఈ ‘సున్నా’ అంటే ఎఱుక పద్ధతిలో ‘సున్నా’! అంటే క్షేత్రజ్ఞుడు లేడని, అక్షర పురుషుడు లేడని, వ్యక్తావ్యక్తములు లేవని, మరి ఈ రకంగా కార్యకారణాలు ఏవీ లేవని, దానికదే ఉన్నదున్నట్లున్నదని, అవి స్థూల, సూక్ష్మ, కారణాలు కావని, వీటన్నింటికి ఆధారమైనటువంటి ప్రణవ బ్రహ్మము, ప్రణవేశ్వరుడు కూడా కాదని, ఈ లేనివాటికి ఎవరైతే ఆధారమో వారున్నూ లేనివారే. ఈ లేని ప్రపంచానికి ఎవరైతే ఆధారమో, అట్టి బ్రహ్మకూడా లేనివాడే. ఇవన్నీ లేనెఱుక కాబట్టి, కారణ బ్రహ్మము కూడా లేనెఱుక. లేనెఱుక లేదు కనుక ఎఱుక బ్రహ్మము లేనివాడే. ఎఱుక బ్రహ్మము దాకా తెగ్గొట్టేస్తే, ఆ పైన ఎవరున్నారంటే బయలు. అన్ని రకాలుగా ఎఱుక సంబంధముగా ఉన్నవి ఏవీ లేవు అనేటటువంటి నిర్ణయంగా ‘ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు’ అని చెప్తున్నాము. దాన్ని ‘సున్న’గా పెట్టాము. ఆ ‘సున్న’ ఎఱుకకు మూలం కాదు.
నువ్వు అనుకుని కలగన్నావా? ఫలానా కలరావాలని కలగన్నావా? కల రాకూడదని పడుకున్నా కూడా కల వస్తోంది కదా! నీ ప్రమేయం లేకుండా కల వచ్చినట్లుగానే, ఆ ప్రణవాతీతమైనటువంటి ఉత్తబట్టబయలందు, నాద బిందు కళాతీతమైనటువంటి ఉత్తబట్టబయలందు, ఈ ప్రణవమనేది ప్రణవనాదమనేది, ప్రణవ బ్రహ్మమనేది, బ్రహ్మనాదమనేది, కారణ బ్రహ్మ, సర్వకారణ బ్రహ్మ, సర్వ కారణ ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మాయచేత, లేకనే ఉన్నట్లు తోచారు. కలలో తోచినట్లు తోచారు. మూలకారణ అంశము కాబట్టి, తోచినవాడు, వీడు వేరుకాదు, వీరు కూడా మాయా స్వరూపులే. ఓంకారేశ్వరుడు, ప్రణవస్వరూపుడు మాయా స్వరూపులే. వీరంతా లేనివారే. ఉన్నంత కాలము లేని వారిగా, ఉన్నట్లున్నారు కాబట్టి, వీళ్ళని లేనెఱుక అనాలి. కలనుండి మేల్కొంటే ఏమీ లేదు. అలాగే ఇది లేనెరుక. లేనెఱుక ఎలా పోతుంది? యద్భావం తద్భవతి. భావాన్ని బట్టి ఎఱుక ఉన్నది. ఎఱుకను బట్టే ఉండుట ఉన్నది. ఎఱుక ఎట్టిదో, అట్టిదిగా ఉండడం జరుగుతుంది. ఎఱుక జీవుడు అంటే జీవుడుగా ఉండడం జరుగుతుంది. ఎఱుక ఈశ్వరుడు అంటే ఈశ్వరుడుగా ఉండడం జరుగుతోంది. ఎఱుక స్త్రీ అంటే, స్త్రీగా ఉండడం జరుగుతోంది. ఎఱుక అక్షరుడు అంటే, అక్షరుడుగా ఉండడం జరుగుతోంది. ‘యద్భావం తద్భవతి’. అభావమందు ఎఱుకేలేదు. ఎఱుకే లేనప్పుడు అవ్వడం కూడా లేదు, ఉండడం కూడా లేదు, కనుక లేకుండుట అనేదే సత్యం.
మరి ఉన్నది లేకుండా పోవాలంటే ఏమి చేయాలి? దాని మూలంలోకి వెళ్తే, ఇది లేకుండా పోతుంది. ఎలా? పృథ్వి జలంలోకి వెళ్తే, పృథ్వి లేదు. జలం అగ్నిలోకి లయమైతే జలం లేదు. అగ్ని వాయువులోకి లయమైతే అగ్ని లేదు. వాయువు ఆకాశంలోకి వెళ్తే వాయువు లేదు. అకాశము మహదహంకారములోకి పోతే ఆకాశము లేదు. మహదహంకారము మహత్తులోకి పోతే మహదహంకారము లేదు. మహత్తు అవ్యక్తంలోకి పోతే, మహత్తు లేదు. ‘అవ్యక్తం’ తిరిగి వ్యక్తం కాకపోతే, ఉన్నది బయలు. అదే పరమ పదము.
‘అవ్యక్తం’ తిరిగి మహత్తైతే అదే తిరిగి వస్తుంది. పునరావృత్తి కలిగి ఉన్నది. కనుక దీనికి చక్ర దోషం వచ్చింది. అవ్యక్తంలోకి తిరిగి వ్యక్తం అవ్వకూడదు. వ్యక్తావ్యక్తం కానిది ఒకటి పెడితే చక్రదోషం పోతుంది. ఆ చక్రదోషం పోవాలి అంటే, బయలే నిర్ణయం కావాలి. కనుక బయలు దేనికీ మూలం కాదు కనుక, ఎఱుకలో ఆఖరి మెట్టుగా, మలినపుటెఱుక పోగొట్టి, శుద్ధ చైతన్యానుభవంగా ఉన్న పరమాత్మ ప్రకాశానుభవం అన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని, చివరికి విజ్ఞాన స్వరూపం కావాలంటే, ఆ విజ్ఞాన స్వరూపుడు బయలై ఉండాలి.- విజ్ఞాన స్వరూప్ గారు