కఠోపనిషత్‌ - 88

45 views
Skip to first unread message

sadhakudu

unread,
Jun 13, 2018, 8:14:15 PM6/13/18
to సాధకుడు online sathsang
అందువలనే ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిరణ్య గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా. ఋషులైపోతారు అన్నమాట.. ఎవరైతే ఈ హిరణ్యగర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠులై మహర్షులౌతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి.
        ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట. అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో, దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉందన్నమాట. అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని మధిస్తూ ఉంటారు. అరణి అంటే అర్ధం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కఱ్ఱలుంటాయి. ఈ రావి, జువ్వి అనే కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి, వాటిని పైన పెట్టి, మధిస్తారన్నమాట.
        ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది, క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, అది బాగా బలవత్తరంగా తిప్పుతారు. ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన, రెండు కఱ్ఱలలో కూడ ఆంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమౌతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండినటువంటి అగ్ని ని ఇతరితర హవ్య ద్రవ్యాలను మండింపచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి, యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.
        ఈ రకంగా ఋత్త్విక్కులు అరణి చేత మంధించబడినటువంటి అగ్నిని ఎలా అయితే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇది ఎప్పటినుండీ ప్రారంభమైంది?- ఋగ్వేదకాలం నుండి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానం ప్రారంభమైంది. కాబట్టి అప్పటినుండి అనుచానంగా, సాంప్రదాయంగా, గురుశిష్య పారంపర్యంగా ఈ అరణి ద్వారా అగ్నిని మంధించేటటువంటి, అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము. ఏమిటి అసలీ అరణి? దీనిలో ఉన్న తాత్త్విక దృక్పథమేమిటి?- అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడుపబడుచున్నది. పరమాత్మ- జీవాత్మ ఏదైతే ప్రత్యగాత్మ – పరమాత్మ వున్నాయో ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉన్నది. అగ్ని చేతనే సర్వ సృష్టి పోషింపబడుచున్నది. సర్వ సృష్టి సృష్టించబడుచున్నది. సర్వ సృష్టి లయింపబడుచున్నది. పునః ప్రాదుర్భవించేది కూడ ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్ని స్థానమును, అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశం అవసరం అందరికీ ఉన్నది. దీనికి అందుకంటే చయన విద్య, అగ్ని విద్య అని కొన్ని నామాంతరములు కూడ ఉన్నాయి.
        సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవాలి. అధికమైన ఆహారాన్ని తినకూడదు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో, వారు శరీరభావాన్ని, శరీర తాదాత్మ్యతను సులభంగా పొందుతారు. కారణం భోజనం  ఫుల్లుగా [full] తిన్న తరువాత నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీరభావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పూట పోయే నిద్ర కూడ శరీర తాదాత్మ్యతాప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎపుడూ తురీయనిష్ఠలో ఉంటారు.
        అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడైఉండుటచేత, తాను సాక్షీ భూతుడై ఉండుటచేత, తాను సాక్షీ మాత్రుడై ఉండుటచేత, సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత, సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు. దీనికొక ఉపమానం ఉంది. ఎట్లా అంటే సూర్యునియందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు.
కాబట్టి సూర్యస్థానంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో, అట్లే తురీయనిష్ఠుడైనటువంటి, బ్రహ్మనిష్ఠుడై సిద్ధించినటువంటి, హిరణ్యగర్భ స్థితిని సాధించినటువంటి, సిద్ధించినటువంటి మహానుభావులు ఎవరైతే మహర్షి ఎవరైతే ఉన్నారో, అతనికి అజ్ఞానాంధకారమనే సుషుప్త్యావస్థ లేదు. కేవలము భౌతికమైనటువంటి శరీరము తనకు తా ధన్యవంతమగుట గాని, తనకు తా విరమించడం గాని ఒక పనిముట్టువలే జరుగుతూ ఉంటుంది. జరగడమే ఉంటుంది గాని, అతను అవస్థాత్రయమునకు లొంగుట ఉండదు.
        ఈ రకంగా అగ్నిని మనం ఆశ్రయించి, అగ్నిని ఆరాధించి ఆ అగ్ని యొక్క ఆధారముగా... ‘హవ్యవాహనుడు’.. అందుకే ఆయన పేరు “హవ్యవాహనుడు”. ఈ అగ్ని యందు అర్పించబడేటటువంటి సమస్తమూ కూడ హవిస్సులు. వీటిని ఆధారముగా మనం దివ్యత్వాన్ని పొందటానికి శ్రోతస్సులు అంటాం. ఈ రకంగా హవిస్సులే వారి దివ్యత్వాన్ని సాధించినపుడు శ్రోతస్సులు అవుతున్నాయి, అంటే శ్రుతి భాగములు అవుతున్నాయి.
        ఏవైతే శ్రోతస్సులవుతున్నాయో, అట్టి శ్రుతి భాగములన్నీ కూడ ఏ పరమాత్మనైతే జపిస్తూ ఉన్నాయో, ఏ పరమాత్మనైతే నిర్ణయిస్తూఉన్నాయో, ఏ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తున్నాయో అట్టి పరమాత్మను నేనే అనేటటువంటి స్థితికి చేరాలి. అలా ఎవరైతే సిద్ధ స్థితిని పొందుతారో, అలా ఎవరైతే దేశికేంద్రులైనటువంటి స్థితిని సాధిస్తారో, అలా ఎవరైతే అఖండ ఎరుకైననటువంటి పరబ్రహ్మమును దాటుతారో, లేని ఎరుకైనట్టి పరబ్రహ్మమును దాటతారో, పరమాత్మ స్థితిని దాటి బయలు అనేటటువంటి స్థితికి చేరతారో, ఇట్టి అధియఙాగ్నిని జాగరణ శీలురైన ఋత్విక్కులు ప్రతి నిత్యమూ కాపాడుచున్నారు.
        కాబట్టి ఈ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని ఆంతరికం యజ్ఞం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ తురీయనిష్ట అనేటటువంటి ఆంతరికయఙం నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అట్లా ఈ ఆంతరిక యజ్ఞంలో ఎవరైతే తనను తాను లేకుండా చేసుకుంటున్నారో, తనను తాను దగ్ధం చేసుకుంటున్నారో, ప్రారబ్ద ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం కాగా, త్రిపుటి అంతా దగ్ధం కాగా - కర్మ త్రయం, దేహత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం, ఈ రకంగా త్రిపుటి అంతా ఏదైతే ఉందో ఆ త్రిపుటి అంతా కూడ ఈ జ్ఞానయజ్ఞంలో ఈ జ్ఞానాగ్నిలో ఈ అంతరిక యజ్ఞంలో దగ్ధమైపోగ జీవభావము నిశ్శేషముగా లేనిదై బ్రహ్మనిష్టుడౌతున్నాడు. అపుడు హిరణ్యగర్భ స్థితిని సాధిస్తాడు.
        తురీయనిష్ట చేత పొందదగినటువంటి ఆరవ కోశమైనటువంటి ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్యగర్భ స్థితి అత్యుత్తమమైనటువంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి. ఈ హిరణ్యగర్భ స్థితి నుంచి ఏ జ్ఞానాగ్ని ద్వారా అనంతంగా ఉన్నటువంటి, అవధులు లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడ దగ్ధమైపోతుంది మరల. సంచితం ఎలా అయితే లేకుండా పోయిందో, జ్ఞాన పరమైన రుణానుబంధము ఎట్లా లేకుండా పోతుందో అట్లే అఖండ విశ్వమూ కూడ ఈ హిరణ్యగర్భ స్థితి యందు లయమై పోతున్నటువంటి ఆ లయ స్థితిని తాను దర్శన విధిగా దర్శిస్తాడు. అట్లా విరాడ్రూపంగా ఉన్నటువంటి అనంత విశ్వమూ ఈ అగ్ని యందు లేకుండా పోతుంది. ఈ అగ్నియే, ఈ హిరణ్మయకోశమే పరమాత్మగా మారిపోతుంది, పరబ్రహ్మము అయిపోతుంది. అఖండ ఎరుక లేని ఎరుక అయిపోతుంది.
        ఆ విధంగా పూర్ణ గురువు సహాయంతో అనంత విశ్వము పిల్లలాటలవలే తోచేటటువంటిది ఎరుక లేని పద్ధతి. సంకల్పము- సంకల్పాతీతము, శూన్యము- శూన్యాతీతము. లేకుండా పోవుట అనేది శూన్యము, అలా ఎరుక లేకుండా పోవుట, లేని ఎరుక అగుట శూన్యాతీతమగుట. అలాగే కాలము- కాలాతీతము. కాలుని సహాయ సహకారంతో, కాలుని అనుగ్రహంతో, ఆ కాల పురుషుని యొక్క కృప చేత, ఈ అఖండ ఎరుకను దాటి, బయలు అనేటటువంటి దర్శనాన్ని పొంది, ఆ బయలు స్థితిలోకి చేరుతారు.- విద్యా సాగర్ గారు 



Reply all
Reply to author
Forward
0 new messages