కఠోపనిషత్‌ - 94

162 views
Skip to first unread message

sadhakudu

unread,
Jun 19, 2018, 8:35:37 PM6/19/18
to సాధకుడు online sathsang
కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు. పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే. కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్‌ ఆత్మ విరాట్‌ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే. వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
      కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు. జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.
        ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు. ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటుంవంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.
        భగవాన్‌ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్‌ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్‌ ఈశ్వరత్వం అంటున్నారు.
        ఈశ్వరత్వం స్యాత్‌.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము. ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.
        కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు. సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటువంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము. చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనలనుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము. మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి

ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశము నందే పరమాత్మ సాక్షాత్కారమును పొందును. స్వచ్ఛమైన అద్దమునందు ముఖము నిర్మలముగా కనిపించునట్లు శుద్ధాంతఃకరణము నందు పరమాత్మ సాక్షాత్కారము లభించును.)
        ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపమానము. భగవద్గీతలో కూడా ఈ మాయ ఎలా ఉన్నది అంటే, దుమ్ము పట్టినటువంటి అద్దం ఎలా ఉందో, శిశువు చుట్టూ మావి ఎలా ఉందో....’ధూమేన వ్రియతే వహ్నిః యథా దీపో మలేనచ’ అనేటటువంటి పద్ధతిగా... పొగచేత నిప్పు, మావి చేత శిశువు... దుమ్ము ధూళి చేత అద్దము కప్పబడినప్పడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని, నువ్వు ఎట్లా గుర్తించ లేవో, అట్లా త్రిగుణ మాలిన్యము అనేటటువంటి జీవభావము గనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీర తాదాత్మ్యత భావన గనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ, భోక్తృత్వ అభిమానములు గనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీర త్రయము, దేహత్రయము, గుణత్రయము, అవస్థాత్రయము... వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యము అంతా ఆవరించి ఉన్నట్లయితే, నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. పొందాలి అంటే ఈ మాలిన్యాన్నీ తొలగించుకోవాలి. కాబట్టి, ధ్యానము అంటే అర్థం ఏమిటంటే? ఈ త్రిగుణ మాలిన్యమును తొలిగించుకోవడమే, ఈ శుద్ధ అంతఃకరణాన్ని పొందగలగడమే ధ్యానము అంటే.
        కాబట్టి, ‘ధ్యాన సాధన’ చేసేవారందరూ తప్పక గుర్తించవలసిన అంశం ఏమిటంటే, వారు వారివారి మనోఫలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికి, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి తాదాత్మ్యత స్థితులు ఏర్పడినప్పటికి, వాటికి ఔననక, కాదనక ఉపేక్షించి ఉండి, సాక్షీ భావం వహించి, ఉదాసీన వైఖరిని అవలంబించి, ఊరక చూస్తూ ఉండాలి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత, ప్రతి దినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగేటటువంటి సమర్థత సంపాదిస్తారు.
         ముఖ్యముగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చెయ్యమన్నటువంటి సాధన వలన, ఏ సంధ్యకి ఆ సంధ్యే ఆ మధ్యకాలంలో ఏర్పడేటటువంటి మనోమాలిన్యా్న్ని, ఆ ధ్యానకాలంలోనే తొలిగించి వేసేటటువంటి సత్కర్మ, సత్‌ క్రతువు చేస్తూ ఉంటాము. ఈ ఆంతరిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇట్లా ఎవరైతే చతుస్సంధ్యలలో చేసి, జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యావస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని, ఎవరైతే తొలగించుకుంటూ ఉంటారో, ఏ రోజుకారోజే ప్రారబ్ద కర్మ విశేష ఫలాన్ని, ఆగామి కర్మగా మారకుండా అనుభవిస్తూ ఉంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే హృద్ గుహలో ఈ పరమాత్మని అనగా ప్రత్యగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కారింప చేసుకుంటారు.
        కాబట్టి, మౌళికమైనటువంటి, ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఆచరణ శీలురైనటువంటి వారుమాత్రమే, మనన శీలురైన వాళ్ళు మాత్రమే, శ్రవణ, మనన, నిధి ధ్యాస పరులు మాత్రమే, నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే, నిరంతరాయముగా నీ జీవితములో ఏర్పడుచున్న ఐదైదులు ఇరవైఐదు ఇంద్రియములు, పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా... ఏ ఏ ఇంద్రియ స్థానంలో త్రిగుణ మాలిన్యము ఏర్పడుతుందో, గుర్తించి, గ్రహించి, ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతముగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మత ద్వారా సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన.
        ఈ సాధనకు తోడ్పడేటువంటి సాంఖ్య విచారణ అంతా నువ్వు తెలుసుకోవాలి. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, ఋణత్రయ విచారణ, తాపత్రయ విచారణ ఈ రకంగా మలత్రయ విచారణ ఇలా రకరకాల విచారణలు అన్నీ కూడాను వివేక చూడామణిలో, బ్రహ్మవిద్యలో చక్కగా బోధించబడ్డాయి. ఇది ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశం. అలా పరిశీలించి మీరు వాటిని నిజజీవితంలో వినియోగించుకోవాలి. ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా, తినకపోతున్నా, కూర్చొన్నా, నిలబడినా, ఆలోచించినా ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా, ఆయా ఇంద్రియ స్థానములు అన్నీ కూడా, తత్‌ ఇంద్రియాధిష్ఠాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని, ఇట్టి ఇంద్రియములకు కానీ, తనకు కానీ, ఎట్టి కర్తృత్వ భోక్తృతాభిమానములు లేవని, కేవలము కారణ స్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులుకానీ, తాను అబాధ్యుడను అని తనను తాను బుద్ధి కంటే వేరైన వాడినని, బుద్ధి సాక్షి అని, ప్రత్యగాత్మనని చైతన్యమునని శుద్ధాహమని వేరు పరుచుకోవాలి. ఇలా సాక్షి భావనను ఆశ్రయించి ఎవరైతే ప్రతి రోజూ ఈ నిర్మలాంతఃకరణమున కొరకై సాధన చేస్తారో, వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యగాత్మ సాక్షాత్కారాన్ని, తదుపరి ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులనేటటువంటి బ్రహ్మాత్మైక్యభావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు.
        కాబట్టి, ఆచరణ శీలురు కానటువంటి ‘శుష్క వేదాంత తమో భాస్కరం’ అనేటటువంటి గ్రంథాన్ని సద్గురు మళయాళ యతీంద్రులు రచించారు. ఎవరైతే మెట్ట వేదాంతం చెబుతుంటారో, అంటే ఆచరణ శీలురు కానటువంటి శాస్త్ర వాదులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అనేక సంవత్సరాల నుంచి ఏదైనా గానీ
మీరు చెప్పారనుకోండి ఇదంతా తెలిసిందేనండీ, ఇదంతా మేము విన్నదేనండీ, ఇదంతా గ్రహించిందేనండీ అంటారు. తెలుసుకున్నావు, విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకున్నావు... మరేం సాధించావు? అంటే, ఇంకా ఏమీ సాధించలేదండీ అంటారు. మరి ఏం సాధించకపోతే ఇంతకాలం నుంచి విని శ్రవణం చేయడం ద్వారా ఏమి నువ్వు పొందావు మరి? నాకు అంతా కూడా తెలిసిందేనండి. సిద్ధాంతం అంతా తెలిసిందేనండి. ఏమి చేయాలో తెలియదండి! సిద్ధాంతం అంతా తెలిసినాక, ఏమి చేయాలో తెలియకపోవడం అంటే ఏమిటి? శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. కాబట్టి శ్రద్ధతో చేసే దానినే శ్రవణము అన్నారు. పైగా శ్రవణకాలమందే ఏ సాధన చేయాలనేటటువంటి నిర్ణయానికి రాకపోవడం మరొక దోషం. చిత్తవిక్షేపం బలంగా ఉందన్నమాట. కాబట్టి, ఆ విక్షేపదోషాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి. మల, విక్షేప, ఆవరణ దోషాలనేటటువంటి దోషత్రయాన్ని బాగా పరిశీలించాలి. అలా పరిశీలించి తమను తాము ఉద్ధరించుకోవడానికి, తన్ను తాను ఉద్ధిరించుకోవడానికి, “ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానామవసాధయేత్” ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. తనను తెలుసుకోవాలి. తాను ఏదై ఉన్నాడో, సర్వకాల సర్వ అవస్థలయందు మార్పుచెందక, పరిణామ రహితముగా ఏ స్థితి యందు, తానైనటువంటి ఆత్మస్థితి యందు తానున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులే. - విద్యా సాగర్  గారు
Reply all
Reply to author
Forward
0 new messages