ఎంత స్పష్టముగా చెబుతున్నాడో చూడండి. ఎన్ని ఉపమానాలు చెబుతున్నాడో చూడండి. ఇన్ని రకాలైనటువంటి అనాత్మ వ్యవహారమంతా ఉంది. మరి ఇట్టి అనాత్మ వ్యవహారములలోనుంచి నిత్యమైనటువంటి అఖండమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వ విలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి ఆత్మ వస్తువును మానవుడు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దివ్యత్వము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే జన్మరాహిత్యము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే అమృతత్వము సాధ్యమౌతుంది. మానవుడు ఎప్పటికీ ఈ సత్యాలను గుర్తుపెట్టుకుని జీవిస్తూఉండాలి. తన ఆ జీవన పర్యంతమూ జనన మరణాలతోసహా, మృత్యుకాలంలో సహా, సహజమైనటువంటి తన స్వస్వరూప జ్ఞానాన్ని, స్వయం ప్రకాశాన్ని ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వారికి మృత్యువే లేదు. ఎందుకని అంటే, వారు ఆ మృత్యువును దాటినటువంటి వారు. వారు జనన మరణాలను దాటినటువంటి వారు. సశరీరులైన ఉన్నటువంటి అశరీరులు. శరీరము నందే ఉండి ముక్త స్థితిలో ఉన్నటువంటి వారు. వారికి శరీరము వలన ఏ రకమైనటువంటి సంగత్వము లేదు. అధ్యాస లేదు. ఈ రకంగా అనాత్మ యొక్క విశేషాలని వివరిస్తూ, అట్టి విశేషాలని త్యజించాలని చూపిస్తూ, అష్టవిధ శరీరాలలో సాక్షిగా ఉండాలనేటటువంటి బోధను మనకు అందిస్తున్నారు.
నచికేతా! అట్టి బ్రహ్మను తెలియుటకు సదాచార్యుల ఉపదేశము వలన మనస్సును సంస్కరింపవలయును, యమ నియమాదుల చేత బుద్ధిని శుద్ధమొనర్చవలెను. అట్టి శుద్ధ బుద్ధి చేతనే, ఏకరసమైన ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు. బ్రహ్మము ఒక్కటే వాస్తవమనియు, దానికి వ్యతిరేకముగా ఏదియూ లేదని, దృఢనిశ్చయము చేయవలెను. అట్టి నిశ్చయము వలన అవిద్య నశించును. బ్రహ్మము ఏకము అను నిశ్చయము లేని వారికి, అవిద్య నానాత్వ బుద్ధిని కలిగించును. నానాత్వ బుద్ధి కలవారు మాటిమాటికి జనన మరణములను పొందుచున్నారు.
మరల స్పష్టముగా నిర్వచిస్తున్నారన్నమాట. ఏకరసమైనటువంటి, శుద్ధ బుద్ధి చేతనే, ఏక రసమైనటువంటి ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు. అర్థమైందా? అండీ! అంటే ప్రపంచములో నువ్వు ఎన్ని మార్గాలలో వెతికినప్పటికి, ఎన్ని శోధనామార్గములు ప్రయత్నము చేసినప్పటికీ, అవన్నీ నిన్ను ఎక్కడకు తీసుకొచ్చి వదిలేస్తాయి. అంటే శుద్ధ బుద్ధి దగ్గరకు తీసుకొచ్చి వదిలేస్తాయి. ఆ శుద్ధ బుద్ధి చేత, నువ్వు పొందదగినటువంటి, ఏకైక వస్తువు బ్రహ్మము. ఏకైక వస్తువు ఆత్మ. మరి అట్టి, ఏకత్వస్థితిని చెందించేటటుంవంటి, శుద్ధ బుద్ధిని సాధించడమే మానవుని యొక్క ప్రయత్న ఫలము. ఏమండీ! నన్ను పూజలు చేయమంటారా? జపం చేయమంటారా? ధ్యానం చేయమంటారా? యోగం చేయమంటారా? ఆసనాలు వేయమంటారా? ప్రాణాయామం చేయమంటారా? ఏం చేయమంటారు? విచారణ చేయమంటారా? లేదా సత్ క్రతువులు ఏమైనా యజ్ఞయాగాది కర్మలు చేయమంటారా? లేదా, నవవిధ భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాటిని ఏమైనా ఆచరించమంటారా? లేదా ఇతరత్రా దూషిత కర్మలలో నేను ఏమైనా ప్రయత్నం చేస్తే, నేను ఏమైనా ఉద్ధరించబడగలగుతానా? అనేటటువంటి ప్రశ్నలన్నీ మానవులకు కలుగుతూ ఉంటాయి. ఏం చేస్తే నేను బయట పడగలను? ఏం చేస్తే నేను ఉద్ధరింపబడగలను. ఏం చేస్తే, నేను పొందవలసినటువంటి దానిని పొందుగలుగుతాను? ఏమి చేస్తే నేను ఈ స్థితిని అధిగమించగలుగుతాను? అనేటటువంటి ప్రశ్నలు జననం నుంచి మరణం వరకూ వస్తూనే ఉంటాయి. కారణం ఆయా పరిస్థితులు కానీ, ఆయా అవసరములు కానీ, ఆయా ఆకాంక్షలు కానీ, ఆయా మోహ సదృశమైనటువంటి పరిస్థితులు కానీ, ప్రేరణలు కానీ, కామ క్రోధాది అరిషడ్వర్గములు కానీ, త్రిగుణాత్మకమైన వ్యవహారము కానీ, అవిద్య, మోహము కానీ... వీటన్నిటిలోనుంచీ మానవుడు తప్పించుకోవడం రావాలి. వివేకంతో తప్పించుకోవాలి. విచారణతో తప్పించుకోవాలి. ఎదురుగా వెళ్ళి గోడ వుంటే, ఢాం అని గుద్దుకొని, ముక్కు పగిలిందండి, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారండీ? అంటే, నాయనా! గుద్దుకోకముందుకదా నీవు ఆలోచించాలి, తల పగలక ముందు కదా ఆలోచించాలి? అని అంటారు పెద్దలు.
అంటే, ముందు విచారణ. తదుపరి ఆలోచన. తదుపరి ఆచరణ, ఆ తదుపరి ఫలము. ఇలా ఉండాలి ఎప్పుడూ కూడ. కానీ, ఎప్పుడైతే మనో వేగానికి లోనవుతావో, ఎప్పుడైతే భ్రాంతికి లొంగుతావో, ఎప్పుడైతే భ్రమాజన్యమైనటువంటి అజ్ఞానానికి లొంగుతావో, అప్పుడు ఏమౌతామంటే, ముందు ఆచరణ, తదుపరి ఆలోచన, ఆ తదుపరి విచారణ. వ్యతిరేకమైపోతుంది. అప్పుడు ఎంత ప్రయత్నించినా దీనిని జ్ఞాన స్థాయికి తీసుకొని వెళ్ళలేము.
కాబట్టి, ఒక నిర్ణయము తీసుకునే ముందే, ఒక ఆలోచనని చేసే ముందే, ఒక ఆకాంక్షని అమలు పరిచేముందే, విచారణ చేయి. వస్తువును ఆశ్రయిస్తుందా? అసత్తును ఆశ్రయించిం ఉందా? బ్రహత్వానికి చేరుస్తోందా? ప్రపంచానికి చేరుస్తోందా? పంచీకరించబడినదంతా... నానాత్వముగా ఉన్నటువంటి, అనేకత్వముతో ఉన్నటువంటిది కదా! మరది మిథ్యాభూతము కదా! అది లేనిది కదా! మరి అటువంటి లేని దానిని నేను ఆశ్రయించడం సమంజసం కాదు కదా! అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనను కలిగియుండాలి.
ఈ రీత్యానే మనం ధర్మశాస్త్రాలన్ని, మానవులకు ఏయే సమయాలలో ఎలా జీవించాలి అనేటటువంటి దానిని నిర్ణయంజేశాయి. బ్రహ్మచారి తప్పక బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావల్సిన విద్యను సంగ్రహించాలి. ఇప్పుడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమము కాస్తా పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి బదులుగా, ముక్తివిద్యను సాధించడానికి బదులుగా, భుక్తి విద్యయందు మునిగిపోయాడు. తర్వాత ఏమైపోయింది? పాతికేళ్ళు అయిపోయింది. అయిపోయినప్పటికి ఏమైపోయింది? బ్రహ్మజ్ఞానం రాలేదు. ఇంకేం చేస్తాం బాబోయ్? ఇప్పటికే లేట్ అయిపోయింది, వివాహం చేసేయండి, వివాహం చేసేయండి. బ్రహ్మజ్ఞానం లేకుండా ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, అవసరార్థం చేసుకున్నదే కదా అది. అట్టి అవసరార్థం చేయబడినటువంటి వివాహం వలన జీవితం అంతా, దేనిని తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు అంటే, అట్టి అవసరార్థమైనవి తీర్చుకునే పనిలోనే ఉంటాడు. అప్పటికికప్పుడు ఆ అవసరం వస్తూఉంటుంది. ఆయా అవసరాల చేత కొట్టుకుని పోతూ ఉంటాడు. ఆ కొట్టుకు పోయినటువంటి ప్రవాహ వేగంలో, జీవితం క్షణభంగురంగా అయిపోతుంది. చేసి ఇక అంతా చేసి కళ్ళు తెరిచి చూసే సరికి, పిల్లలు సంసారం అన్నీ ఏర్పడుతాయి. ఆహా ఇల్లు ఏర్పరచుకున్నాను, ఆహా భార్యను ఏర్పరచుకున్నాను, ఆహా పిల్లలను ఏర్పరచుకున్నాను, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆహా! ఇల్లు బాగుంది. ఆహా పిల్లలు బాగున్నారు, ఆహా భార్య బాగుంది, ఆహా సంసారం బాగుంది. వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను అనేటటువంటి సాపేక్ష పద్ధతిగా వస్తూపలబ్ధి చేత, నేను ఇంత బంగారం కొన్నాను. నేను ఇన్ని వస్తువులు కొన్నాను, నేను ఇంత విలువైన వస్తువులు కొన్నాను, నేను అంత విలువైన వస్తువులు కొన్నాను. నేను ఇంత విలువైనటువంటి వాటిని దాచకున్నాను. నేను ఇంత విలువైనటువంటి వాటిని వ్యయం చేశాను. నేను ఇన్ని దేశాలు తిరిగాను. నేను ఇంత గొప్ప కులంలో పుట్టాను. నేను ఇంత గొప్ప క్షేత్రంలో పుట్టాను. నేను ఇంత వంశ వారసత్వాన్ని కలిగియున్నాను. నేను ఇంత కులగోత్రాలు కలిగియున్నాను. నేను ఇంత ఉత్తమమైన మతంలో పుట్టాను లేదా ఉత్తమమైన ధర్మంలో పుట్టాను లేదా ఉత్తమమైనటువంటి అపేక్షలో పుట్టాను లేదా విలువైన రత్నాది ఆభరణాలను సంగ్రహించాను. ఈ రకంగా తనను తాను ఉద్గడింప చేసుకొనేటటుంవంటి అనాత్మ వస్తూపలబ్ధిని ఆశ్రయించి, తన గురించి తాను చెబుతూఉంటాడు.
నాయనా! నీ జీవితంలో నీవు ఏమి సాధించావు నాయనా? అనే ప్రశ్న నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ వస్తుంది. నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ గృహస్థాశ్రమము మీద ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ప్రశ్నలు వస్తే, వెనక్కి తిరిగి చూస్తే, ఇవే కనబడుతూ ఉంటాయి. ఘట శరావాదులు, అంటే, మన ఇంట్లో ఒక వేయి గిన్నెలు ఉన్నాయండి. మా ఇంట్లో ఒక పది సోఫాలున్నాయండి. మా ఇంట్లో పది అంతస్థులు ఉన్నాయండి. మా ఇంట్లో పది కిలోల బంగారం ఉందండి. మాకు పది మంది కుటుభ్యసభ్యులున్నారండి. ఈ రకంగా అనేకత్వ నానాత్వ భ్రాంతికి చెందినటువంటి సమస్త వస్తూపజాలము యొక్క విశేషములన్నింటిని చెప్పుతూ, అవి తానే అయిఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ వాటితో తాదాత్మ్యతను పొంది, అవే సుఖమును ఇస్తున్నాయనేటటువంటి భ్రమకు గురై, మోహాన్ని చెంది, గృహస్థాశ్రమాన్ని గడిపేశావు. గడపగా, గడపగా, గడపగా, గడపగా ఏమైందంటే... వ్యామోహం క్షీణించిపోయింది, ఇంద్రియాలు అశక్తమైపోయాయి, వృద్ధాప్యం వచ్చేసింది.
ఇప్పుడు ఈశ్వరా, ఈశ్వరా, ఈశ్వరా అంటుంటాడు. ఎందుకని? అశక్తత చేత. కాళ్ళు సహకరించడం లేదు నాయనా, నడవాలంటే, నీ దేవాలయానికి రావాలంటే. కాబట్టి, ఇక్కడి నుంచే ఓ నమస్కారం. నీ నామ స్మరణ చేయాలంటే, బుద్ధి నిలకడగా ఉండడం లేదు నాయనా, కాబట్టి, తోచినప్పుడు చేస్తా, ఈశ్వరా నీకో నమస్కారం. కాబట్టి వృద్ధాప్యంలో ఈ రకమైనటువంటి అవస్థలను అన్నిటిని ఏకరువు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమి అడుగుతూ ఉంటాడు? ఇంకా ఎప్పటికయ్యా? నన్ను తీసుకుపోయేది నువ్వు అని అడుగుతూ ఉంటాడు. జీవితకాలమంతానేమో వస్తూపలబ్ధికై శ్రమించి, కాంక్షాయుతంగా జీవించి, దాచుకున్నటువంటి వస్తువులు, తయారు చేసుకున్నటువంటి సంసారం, తయారు చేసుకున్నటువంటి జగత్ భ్రాంతి, తనకు చిట్టచివరి కాలంలో ఉపయోగపడకపోయేటప్పటికి, ఆ చివరి కాలంలో, ఈశ్వరా ఈశ్వరా అని పలవరిస్తాడు. మరి ఈ జీవన ప్రయాణం అంతా, ఆ జీవన పర్యంతమూ, తాను చేసినటువంటి కర్మ సహితమైనటువంటి, విశేషములన్నీ, ప్రయత్నములన్నీ, వెంటనే విడిచిపెడుతాయా? విడువవు కదా! ఆయా కర్మ భ్రాంతి మమకార రూపంలో, అహంకార రూపంలో, అభిమాన రూపంలో, అజ్ఞానరూపంలో, అవిద్యా రూపంలో, మోహ రూపంలో సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి.
ఇవన్నీ కలిపితే, రజోగుణ, తమోగుణ సముదాయ సంబంధంతో కలిపిన సూక్ష్మ శరీరం. మరి ఆయా సందర్భోచితమైనటువంటి స్థితులు కలుగుగా, వృద్ధాప్యమందు సదా సాధించినవి, సదా సాధించవలసినటువంటివాటి యందు ఆకాంక్ష, చింత. కాంక్ష ఏమైపోయింది ఇప్పుడు వృద్ధాప్యంలో? చింతగా మారిపోయింది. ఇంకా అది అలా అవ్వలేదు, ఇంకా ఇలా అవ్వలేదు, ఇంకా వాడు ఇల్లు కట్టుకోలేదు, వాడు పెళ్ళి చేసుకోలేదు, ఇంకా మనవడు స్థిరపడలేదు, ఇంకా మునిమనవడు స్థిరపడలేదు, ఇంకా ఆ దేశాన్ని చూడలేదు, ఇంకా ఈ దేశాన్ని చూడలేదు. ఇంకా ఆ రకమైన భ్రాంతి పొందలేదు, ఇంకా ఈ రకమైన భ్రాంతి పొందలేదు. అది భ్రాంతి అనేటటువంటి దానిని నిజవస్తు స్థితిని గుర్తించలేక, అదే సత్యమని మిడత వలె దీపం ముందు పరిభ్రమిస్తూ కడకు రెక్కలు కాలి, ఆ దీపం చేతనే మృత్యువుకు గురై పోవుచున్నాడు. ఈ రకంగా మృత్యుపాశంలో చిక్కుకున్నాడు.
మరి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఏమని చెపుతాము. దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గమున్నది. ప్రయత్నించి శుద్ధ బుద్ధిని సంపాదించుట. నన్ను ఏం చేయమంటారండీ? నాయన! శుద్ధ బుద్ధిని సంపాదించు. నన్ను ఉద్యోగం చేయమంటారా? మానేయ మంటారా? ఎవ్వరూ చెప్పరూ. వేదాంత విద్యా విశారదులు ఈ ప్రపంచంలో ఎవరికీ వ్యవహార శైలియందు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడానికి ఒక ఆధారం ఉండదు. ఎందుకని అంటే, నువ్వు ఏ వివేకంతో వ్యవహరించావు అన్నదానికే ప్రాధాన్యత. అట్టి వివేకశీలి అయినటువంటి వాడు, సామాన్యమైనటువంటి కర్తృత్వ కర్మాచరణ యందు అసంగముగా ఉన్నాడా లేదా? అనేటటువంటి దానిని గుర్తించాలి. అట్టి అసంగత్వ లక్షణం నువ్వు కనుక నిలబెట్టుకోపోయినట్లయితే, అట్టి సాక్షిత్వ లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకోకపోయినట్లయితే, సదా పుస్తకాల పురుగువలె చదివినప్పటికిని, సదా శాస్త్రములను అభ్యసించినప్పటికి, సదా నీవు వ్యాపార సహితుడవి అగుతున్నావు కానీ, నిర్వృత మానసాన్ని పొందినవాడివి అవ్వడం లేదు. అట్టి నిర్వృత మానసం లేకుండా, ‘వినివృత్త కామాః’ అని అంటోంది భగవద్గీత. వినివృత్త కామా - వృత్తి, కామములయందు నిః - నివృత్తత. విరమించుట. అనేటటువంటిది విశేషముగా జరగాలి. వాసనలతో సహా లేకుండా పోవాలి. వాటి రసం ఇంకి.. ఇంగువ యొక్క రసం ఇంకి బట్ట ఎలా అయితే ఇంగువ పోయినప్పటికి అదే వాసన వస్తుంది. చేతితో ఉల్లిపాయపట్టుకుంటే, ఉల్లిపాయ వదిలేసినప్పటికి చేతికి ఉల్లిపాయ వాసన ఎట్లా అంటుతుందో, ఈ రకంగా అనేక పదార్థముల యొక్క రసము మనలో శోషించి, అవే పదార్థముల యొక్క స్ఫురణ కలుగుతూ నానాత్వ భ్రాంతి కలిగిస్తూ, అట్టి నానాత్వ బుద్ధి చేత, మరల జనన మరణములందే తిరుగుతూ ఉంటారు.
కాబట్టి, తప్పక సాధకులందరూ నిరంతరాయంగా సాధన అనగా, ధనము అనగా మార్పు చెందనటువంటిది. ఆ సాధనని ఆ మార్పు చెందనటువంటి స్థితిని సాధించుట కొరకు, పొందుట కొరకు, ఆ లక్షణంతో ఉండుట కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకొనుట కొరకు, స్థిరత్వము అంటే, అర్థం అది. జీవితంలో ఎప్పటికి స్థిరపడుతావు నాయనా? అనే ప్రశ్నకి అర్థము, లక్షణము ఏమిటంటే, స్థిరమైనటువంటి స్థితిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తే, అప్పుడు స్థిరపడి పోయినట్లే. ఈ రకంగా ఆత్మవస్తువును గుర్తిస్తూ, అనాత్మను నిరసిస్తూ, ఈ ఆత్మానాత్మ వివేకమును సంపాదించాలి.
ఎంతకాలమైతే ఆనాత్మ వస్తూప లబ్దియందు నీ ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి ఉంటావో, చాలా మంది ఈ రకమైనటువంటి అంశాలను మానవజీవితంలో కలిగిఉన్నారు. ఏదో పుట్టావు, ఏదో పెరిగావు, ఏదో ఒకటి చేయాలి, చేశాను. చేస్తే ఏదో ఒక ఫలితం రావాలి, వచ్చింది. వచ్చినదానిని ఏదొ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నాము. నిలబెట్టుకున్న తరువాత దానిని ఏం చేయాలి? నిలబెట్టుకున్న దానిని పది మందిలో ప్రదర్శించాలి. ప్రదర్శించాము. ప్రదర్శించిన తరువాత ఏమైంది? పరువా? ప్రతిష్ఠ వచ్చినాయి. ఆ పరువు ప్రతిష్ఠ పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి. మరలా ప్రయత్నించాలి. ఇలా నిరంతరాయంగా అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి, అంశాలయందే చిత్తం లగ్నంమై ఉండడం చేత, జగత్ వ్యాపార సహితమైన వాటియందే, చిత్తం లగ్నమై యుండుట చేత, ఎంత మంది నన్ను ఇవాళ పొగిడారు, ఎంతమంది నన్ను ఇవాళ విమర్శించారు అని లెక్కపెట్టుకునే వారు కూడా ఉన్నారు. ఎంత మంది ఇవాళ నమస్కారం చెప్పారు, ఎంతమంది నమస్కారం చెప్పలేదు? అనేటటుంవంటి అధికార మదాంధత్వమును పొందినటువంటి వారు కూడ ఉన్నారు. మరి ఇవన్నీ ఎటు దారితీస్తున్నాయి అంటే, అజ్ఞానాంధత వైపు దారి తీస్తున్నాయి. - విద్యా సాగర్ గారు