కనుక మూడు మతాలు, ముగ్గురూ కూడా రైటే. మొదట్లో ద్వైతంతో స్టార్ట్ అయ్యి, తరువాత భగవదైక్యం అనేటటువంటి భక్తియోగంలో విశిష్ఠాద్వైతంగా వచ్చి, భగవంతుడైపోయినప్పడు అది అద్వైతమేగా! మొదట్లో ద్వైతం ఉంటుంది. తరువాత విశిష్ఠాద్వైతం ద్వారా గమ్యం చేరితే, అద్వైతం సిద్ధించే సరికి, రెండవ వస్తువు ఎక్కడ ఉంది? బ్రహ్మ తప్ప అన్యము లేదు అన్నప్పుడు, ఆ బ్రహ్మకూడా నీవే అయినప్పుడు, నీకు ఆ స్వానుభవంలో, స్వస్వరూప సాక్షాత్కారంలో, తెంపులేని నిత్యవర్తమానంలో, పరిపూర్ణ స్థితిలో నిశ్చలంగా ఉండగా, తిరిగి మరలా పునరావిర్భవించాల్సిన అవసరము కాని, గొడవకాని లేదు. మూడు గుణములు నిన్ను కదిలించని స్థితిలో, గుణ రహిత స్థితిలో ఉండిపోతావు. దానికి ఏమి పేరుపెట్టుకుంటే ఎవరికి ఏమి కావాలి?
కనుక ఆ నిర్ణయాలన్నీ ఒక వరుసలో పెట్టుకునే ఆధ్మాత్మిక దృష్టి ఉండాలి. తరువాత శ్రద్ధ ఉండాలి. తరువాత భక్తిలో యోగస్థ స్థితి రావాలి. ఆ భక్తిలో ఈశ్వరానుగ్రహం కావాలి. ఈశ్వరానుగ్రహం చేత, ఈ మార్గంలోకి, జ్ఞానమార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన సాధకుడు సచ్ఛిష్యుడు అవుతాడు.
మనం అంతా ఏమిటంటే, ఈ ప్రయత్నాన్ని, ఈ కష్టాన్ని మొదలు పెట్టకుండానే, అజ్ఞానంలో ఉంటూనే వాదోపవాదాలు కుతర్కాలు చేస్తున్నాము. ఈ కుతర్కాలలో జరుగుచున్నది యద్భావం తద్భవతి. సృష్టిలో జరిగేది కూడా యద్భావం తద్భవతి. దాన్ని యద్భావం తద్భవతి అని నీవు తెలుసుకున్న తరువాత ఈ చక్రాన్ని నేను ఎక్కడ బ్రేక్ చేయాలి? అనేది తెలుసుకోవాలి.
అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి అని రెండున్నవి. పరా, అపరా భేదం తెలిసినప్పుడు అపరా ప్రకృతిని బ్రేక్ చేసేస్తే సరిపోతుంది. పరమును తెలుసుకుని, తానే ఆ పరమని నిర్ణయించుకుంటే, అపరం అనేది మిథ్య, లేనిది అవుతుంది. ఇలా చేస్తే అవుతుందని తెలిస్తే, అప్పుడు పట్టుదలతో సాధించాలి. ముందు తెలుసుకోవాలిగా! జ్ఞాతుం - ముందుగా తెలుసుకోవాలి, ద్రష్టుం అంటే అనుభవ పూర్వకంగా తెలుసుకోవడము. ప్రవేష్టుం అంటే అది తానై ఉండటము. అధిగచ్ఛతి అన్నింటినీ మీరి అంటే బయలు అయి ఉండటము. ఈ నాలుగూ తరువాత చూద్దాం. ముందు ‘జ్ఞాతుం’ దగ్గరే మాట్లాడుదాం.
పై విధముగా మానవుడు తనకు తానే అవరణలో ఉండి, ఆవరణ సహిత అజ్ఞానంలో కొనసాగుతూనే తనయొక్క భవాన్ని తానే స్వయంకృతంగా నిర్మించుకుంటున్నాడు. ఇందు ఏది లోపించినా కూడా అంటే, అధ్యాత్మిక దృష్టి లోపించినా, ఆ దృష్టి ఉండి శ్రద్ధ లేకపోయినా, శ్రద్ధ ఉండి భక్తి లేకపోయినా ముందుకు సాగదు. ఇవన్నీ ప్రాథమిక సాధనలుగా చేసుకుని, ఇవన్నీ వేటికవి పరిపూర్ణం అయినప్పుడే, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది.
ఈశ్వరానుగ్రహం చేతనే, అంతః స్ఫురణ కలుగుతుంది. అంతః స్ఫురణ చేతనే, బాహ్య ప్రపంచంలో ఋజువులు, సాక్ష్యాలు, తర్కంతో అందనివి అన్నీ కూడా అంతఃస్ఫూర్తి చేత అందించబడుతాయి. ఈశ్వరానుగ్రహం చేత, గురుకృప చేత నీకు అందుతుంది. అప్పటి దాకా గురువు అనే భావం నీకు లేదు. అప్పటికింకా భక్తుడివేగా! అయినప్పటికీ ఈశ్వరుడి చేత ఇవ్వబడుతుంది. అప్పుడు సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నవాడు, నీ అంతరాత్మగా అంతఃస్ఫూర్తిని కలిగిస్తాడు.
అంతః స్ఫూర్తిలో తోచి, నీకు స్వానుభవం ఎప్పుడయ్యిందో, బయటి ప్రపంచంలో ఉన్న, కార్యకారణ సంబంధంగా, విజ్ఞానశాస్త్ర సంబంధంగా, ఉన్నవన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. నీ అనుభవమే ప్రత్యక్షప్రమాణంగా మారుతుంది. ఇక అనుమాన ప్రమాణములన్నీ కూడా మనం విచారణతో చేయక్కర్లేదు. అయినప్పటికీ కొంత దూరం వరకూ అనుమాన ప్రమాణమునకు అందేలాగానే మనం ఇంతకు పూర్వము చెప్పుకున్నట్లుగా, సాంఖ్యమతాన్ని, న్యాయమతాన్ని, తర్కవితర్కాల కోసం, మరి ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మార్థాలు ఇవి అన్నీ చెప్పడం ద్వారా గుప్తంగా, చాపకింద నీరులాగా కొంత సాధనలో ముక్తి మార్గంలోనే ఉంటాడు. ఆ ముక్తి మార్గంలో ముక్తి అనేటటుంవంటిది కూడా ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు అన్నీ కూడా, ముక్తి యొక్క లక్ష్యాన్ని వివరంగా కాకపోయినా, పైపైన అందించబడడం జరుగుతుంది.
కనుక మిగితా దర్శనాలు కూడా మనం వాడుకోవచ్చు. పూర్వమిమాంసా వాడుకోవచ్చు. అలాగే న్యాయం, తర్కం. విచారణ పాజిటివ్‌గా చేయాలి. ఇవన్నీ ఏమీ లేవు అనే నిర్ణయాన్ని, ఒక ఆధారంగా, ఒక నాస్తిక వాదంగా, నిన్నునీవు బలపరిచేదిగా, పక్షపాత బుద్ధితో విచారణ చేయరాదు. పాజిటివ్‌గానే విచారణ చేయాలి. అయితే అది అనుభవానికి వస్తేనే నిర్ణయం. కనుక పతంజలి యోగశాస్త్రాన్ని కూడా కొంతమేరకు అష్టాంగయోగాన్ని సంప్రజ్ఞాత, సవికల్ప సమాధులు దాటి, అసంప్రజ్ఞాత సమాధి అనే నిర్వికల్ప సమాధిలో దానిని సహజం చేసుకున్నప్పుడు, నీ మనోబుద్ధులు ఆగిపోతాయి. అలా ఆగడం అనేది సాధ్యం అయినప్పడు, విషయవాసనలు అడ్డురానప్పుడు, ఎక్కడికక్కడ అందుబాటైనటువంటి, ఆ పరమాత్మ చైతన్యము, అక్కడ ఒంటరిదిగా, ఏ అడ్డంకి లేకుండా అందుతుంది. దాన్ని గుర్తించాలిగా! పైగా అది అన్యవస్తువా? నీవే అది అయివున్నావు. కనుక అన్యవస్తువును గుర్తించడం తేలిక. నీకంటే అన్యవస్తువు ఏదో రకంగా నీ బుద్ధికి తోస్తుంది. ఇంద్రియానికి గోచరం అవుతుంది.
కాకపోతే చైతన్యరూపంగా ఉన్న, నిన్ను నీవు నీ ఇంద్రియాలతో చూడలేవు. మనసుతో ఊహించలేవు. బుద్ధితో భావన చేయలేవు. ఊహకి అందదు, భావనకు అందదు. అటువంటి బ్రహ్మ ఒక్కటే అయినది. నేను నేను అనే స్ఫురణలో కూడా చైతన్యంతో, ఆ స్ఫురణకు ఆధారమైన చైతన్యము, బ్రహ్మచైతన్యము ఒక్కటే కనుక నిన్ను నీవు ఎలా చూసుకుంటావు? నీవే అదై ఉన్నావు అనేటటువంటిది, నీ స్వానుభవంలోకి తెచ్చుకోవాలి. ‘తెచ్చుకోవాలి’ అనే మాట ఎందుకు? నీవు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి. నీవు అన్యవిషయములు, అన్యవస్తువులు సత్యమనే భ్రాంతిలో ఉన్నావు కాబట్టి. ఆ విక్షేపంలో ఉన్నావు కాబట్టి. దీనిని తెచ్చుకోవాలి అంటున్నాము. తెచ్చుకోవడమే అనుష్ఠానము, ఉపాసన.
తెచ్చుకోవడానికి వస్తుందా? అది? లక్షణాలచేత తెచ్చుకోవచ్చు. సత్ చిత్ ఆనందం అనే లక్షణం చేతగాని, నిర్వికల్పము, నిర్విశేషము అనే లక్షణం చేత గాని, అచలము - పూర్ణము అనే లక్షణం చేత గాని, ఆకాశ లక్షణం చేతగాని, అమనస్క లక్షణం చేత గాని. ప్రకృతులు అన్నీ కూడా లేకుండా ఉండేటటువంటి, ఒక వర్ణనతో కూడిన, ఒక పదాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఆ లక్షణయుతమైన పదాన్ని నీ లక్ష్యంగా పెట్టుకోవడంద్వారా అవాంగ్మానస గోచరము, ఊహాతీతము, భావనాతీతము అయినటువంటి, ఆ పరబ్రహ్మవస్తువును, సమీపానికి తెచ్చుకోవచ్చు. లేక ఆ సమీపానికి నీవు వెళ్ళవచ్చు. అదే నీకు స్వానుభవం వచ్చేదాకా, ఒక రకమైన ప్రక్రియ వేదాల్లో, వేదాంతంలో, ఉపనిషత్తులలో ఉన్నది. నీకు ఆధ్యాత్మిక దృష్టి, శ్రద్ధ ఉంటే, దానిని నీవు గ్రహించగలవు. ముందు ఆ రెండూ ఉండాలి. అంతర్ దృష్టితో, అంతర్ముఖంతో, అంతఃస్ఫురణగా సద్గురువు అందించిన దానిని గ్రహించాలి అంటే, భక్తి, భక్తి యోగములో ఈశ్వరానుగ్రహము కలగాలి. పతంజలి యోగసూత్రాల ద్వారా కొంత యోగభ్యాసం చేసి ఉండాలి. ఇవన్నీ నిన్ను సంసిద్ధపరచేవే.
సాధన చతుష్టయ సంపత్తి అంటే, ఆ పాఠంలో చెప్పినంత వరకే కాదు. అష్టాంగ యోగము కూడా తెలుసుకోవాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి. యమము అంటే బహిర్ముఖ పదార్థము నందు ఆసక్తి కలుగకుండా చేసే సాధన. నియమము అంటే అంతర్ముఖ ప్రయాణానికి కావలసిన సాధన. నేను ఇలా ప్రవర్తిస్తాను, ఇలా జీవిస్తాను, నేను ఇన్ని గంటలకు నిద్ర లేస్తాను, నేను ధ్యానం చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, విపస్సనా ధ్యానం చేస్తాను. ఆనాపానసతి చేస్తాను. కుండలినీ యోగం చేస్తాను. ఆ గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం మీదగానీ, ఓంకారం మీద గానీ, ఒక్కోగురి, గుర్తు మీద ధ్యానం చేస్తానని నియమం. నియమం పెట్టుకోవడం అనేది సత్కర్మాచరణకు గుర్తు. ఇచ్ఛాపూరితంగా లోక కల్యాణం కొరకు, ఏది చేసినా అది సత్కర్మే అవుతుంది. అలా చేయకుండా విచ్చలివిడిగా ఉండడం ఏదైతే ఉందో, అది బహిర్ముఖంలోనే అంతకంతకూ జనన మరణాలకు లోనయ్యే పద్ధతిని మానుకోవడం అవ్వదు. అంతర్ముఖ ప్రయాణానికి తోడ్పడే సత్కర్మాచరణ సాధనని ఒక నియమంగా, ఒక పద్ధతిగా అవలింబించడమే నియమము.
ఈ రెండిటి ఫలితముగా చిత్తశుద్ధి కలిగితేనే తప్ప, నీవు నీ స్వరూపాన్ని కనుక్కోలేవు, అనుభూతి చెందలేవు. నీకు ఆధ్యాత్మిక దృష్టి రావాలి అంటే, ఇదంతా జరగాలి. అందుకే మోక్షమును నిర్ణయంగా చెప్పట్లేదు కాని, లోకంలో శ్వాసమీద ధ్యాస అని నడిపిస్తున్నారు. దానికి అదే గమ్యం కాదు. అలా కొంతకాలం చేయగా, అంతఃస్ఫురణగా కొన్ని అనుభవాలు రావడం అనేది, స్థూలంగా కాకుండా, సూక్ష్మంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా ఏదో ఒకటి ఉన్నది అనేటటువంటిది తెలియబడుతుంది. స్థూలంగా ఉన్న వస్తువుల మీద ఆధారపడకుండా నీవు ఉంటావు. దాని అనుభవం అక్కడికే. స్వరూపజ్ఞానం పొందడానికి నిన్ను నీవు ఖాళీ చేసుకునే వరకే, ఆ యోగ సాధన యొక్క అవసరం. అప్పటికైనా ఆధ్మాత్మిక దృష్టి రావాలి. ఆ తరువాత ఏమిటి? అని. దానిమీద శ్రద్ధ ఉండాలి. ఏదో ఇంజినీరింగుకు, డాక్టరుకు కొన్ని తెలుసుకుంటే, ఆ తెలుసుకున్న తెలివి నీవు ఉపయోగించుకుంటే కొంత డబ్బు వస్తుంది. పొట్టకూటి కొరకుగా తెలుసుకోవడం కాదు. అక్కడ కూడా శ్రద్ధ అవసరమే కాని, ఆ శ్రద్ధవల్ల బాహ్యప్రపంచ జ్ఞానం వచ్చింది. బాహ్యప్రపంచ జ్ఞానం వలన ఉపయోగం లేదు. పొట్టకూటి కొరకు ఉపయోగమే కానీ, స్వరూపసాక్షాత్కార జ్ఞానానికి పనికిరాదు. దీనికి ప్రత్యేక శ్రద్ధ కావాలి. భగవంతుడు ఉన్నాడు అని ఆస్తిక్యబుద్ధి ఉండాలి. ఆ భగవంతునిపట్ల భక్తి, ఐక్యతాసిద్ధిని పొందేలా యోగం పొందాలి. ఆ యోగస్థితి నుంచి, భగవదైక్య స్థితినుంచి ఆ ఈశ్వరానుగ్రహం కావాలి. ఆ వరుస చెబుతున్నారు ఇక్కడ. ఇందులో ఏది లోపించినా కాని, ఆ పరమార్థము మనకు అనుభవములోకి రాదు, అసంభవము.
మరి ఆసన ప్రాణాయామాలు అంటే ఏమిటి? ఆసనం అంటే యోగంలో కూర్చోవడమే ఆసనము. ధ్యాన సమాధికి మధ్యలో, కొన్ని ఇబ్బందులతో, కొంచెం అటు, ఇటు కదిలితే, అది ఫలితాన్ని ఇవ్వదు. నీవు కూర్చున్నటువంటి సుఖాసనంలో ఇబ్బంది కలుగకుండా ఉంటే, నీ ధ్యానానికి ఆటంకము లేకుండా ఉంటుంది. మరి యమనియమాలు పాటించినప్పటికీ, అదేదో కర్మకాండగా పాటించాడే తప్ప, చిత్తశుద్ధి కలుగలేదు. చిత్తశుద్ధి కలిగేదాకా మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఈ మనసు పనిచేస్తుంటే ధ్యానం కుదరదు.- విజ్ఞాన స్వరూప్ గారు