కఠోపనిషత్‌ - 86

26 views
Skip to first unread message

sadhakudu

unread,
Jun 11, 2018, 8:16:18 PM6/11/18
to సాధకుడు online sathsang
 హిరణ్యగర్భునిచే సృజించబడిన విరాట్ఫురుషుని శాస్త్రము అగ్ని రూపమున వర్ణించుచున్నది. గర్భిణీ స్త్రీలు తమ గర్భమందున్న శిశువునకు ఎటువంటి అపాయము కలుగకుండుటకై శుచియైన ఆహారము తీసుకొని కాపాడుచున్నారో అటులనే అధియజ్ఞుడగు విరాడ్రూప అగ్నిని పై అరణి, క్రింద అరణి అను రెండు అరణుల యందు ఋత్విక్కులు కాపాడుచున్నారు. అధ్యాత్ముడగు జఠరాగ్నిని యోగులు మితాహారముచే కాపాడుచున్నారు. అట్టి అధియజ్ఞాగ్నిని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు. విరాడ్రూపమున ఉన్న ఈ అగ్నియు పరబ్రహ్మమే. ఇదియే నీవడిగిన తత్వము.

        ఇపుడు హిరణ్యగర్భతత్వాన్ని గూర్చి వివరించ పూనుకుంటున్నారు. సాధకులందరూ ఈ హిరణ్యగర్భ తత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఎనిమిది తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో జీవ తనువులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈశ్వర తనువులు. ఈ ఎనిమిది తనువుల సమాహారమైనటువంటి ‘నేను’ విశ్వుడుగా ప్రారంభించి, విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు.
        మరల విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు పరిణామం చెందుతూఉన్నాడు. ఈ పరిణామం అంతా కూడ పిండాండ బ్రహ్మాండ పంచీకరణల యందు స్పష్టంగా బోధించబడుతూఉంది.  జాగ్రత్ సాక్షి యైనటువంటి విశ్వుడు, స్వప్న సాక్షి యైనటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి యైనటువంటి ప్రాజ్ఞుడు, తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ- విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. ఇదే ప్రత్యగాత్మ అనంత విశ్వానికి విరాట్ పురుషుడు గా ఉన్నాడు. పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే అక్షర పురుషుడు గా ఉన్నాడో , ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడు.
        ఈ విరాట్ పురుషుడు మరల ఈశ్వర తనువులలో స్థూలదేహాన్ని కలిగి ఉన్నాడు. ఈశ్వర తనువులలో స్థూలదేహ సాక్షి - విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి - హిరణ్యగర్భుడు, కారణ దేహ సాక్షి- అవ్యాకృతుడు, మహాకారణ దేహ సాక్షి- పరమాత్మ. అయితే జీవ తనువులలో తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ, ఈశ్వర తనువులలో మహాకారణ దేహసాక్షి యైనటువంటి పరమాత్మ అభిన్నులు. ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులు. జ్ఞాత, కూటస్థుడు అభిన్నులు.
        అయితే సర్వ వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యానికి హిరణ్యగర్భుడుగా సాక్షిగా ఉన్నటువంటి స్థితియందు అనంత విశ్వాన్ని తన లోకి గ్రహించి, గర్భిణీ స్త్రీ వలే ఉన్నాడట. అదీ పోలిక. ఇక్కడ ప్రతిచోట ఒక ఉపమానాన్ని ఉద్దేశిస్తూ, ఆ ఉపమానాన్ని వివరించి చెబుతూ, అదే రీతిగా సృష్టి యొక్క పరిణామాన్ని కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మొదటినుండి. ఈ నడక చాలా ఉత్తమమైన నడక అన్నమాట. ఇది సిద్ధాంతరీత్యా బోధించినట్లుగా బోధించితే, దర్శనరీతిగా గ్రహించ కలిగి నటువంటివారు సత్శిష్యులు. అలా కాక ఆ సిద్ధాంత రీతిని కొద్దిగా తగ్గించి, అందుబాటు లోకి వచ్చేటట్లుగా వివరణ వ్యాఖ్యాన సహితంగా బోధించినపుడు సూచన స్థాయి నుండి వ్యాఖ్యాన స్థాయికి దిగిపోతుంది బోధ.
        సూచన స్థానంలోనే దర్శన రీతిగా చెప్పగానే గ్రహించేటటువంటి సమర్ధుడైనవాడు శిష్యుడైతే, వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధోపదేశం తరువాత అర్ధమయేటటువంటి వాడు, బౌద్ధికంగా అర్ధం చేసుకుని, వివరణాత్మకంగా అర్ధం చేసుకుని, సాధనగా స్వీకరించేటటువంటివాడు శిష్యుడు. వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధను అందుకోలేనటువంటి వారికి ఉపమాన పద్ధతిగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి వారున్నారో వారిని ఉద్దేశించి, వారికి అర్ధం కావటం కోసమని వ్యాఖ్యానాన్ని ఉపమాన స్థాయికి తీసుకువస్తారు.
ఉపమాన స్థాయి లో బోధించినపుడు అది సర్వులకు అనుసరించేటటువంటి వారందరికి కూడ, వారి వారి జీవితాలలో అనుభవనీయమై ఉన్న అంశాన్ని ఉపమానంగా స్వీకరిస్తారు. అంటే అనుభవనీయమైన స్థితిలో స్వీకరించడడం వల్ల ఉపమాన పద్ధతి సులభంగా అనుసరించే వారందరికీ అర్థం అవుతుంది. కాబట్టి ఇలా అనుసరించే వారు, శిష్యులు, సత్శిష్యులు అని మూడు రకములైనటువంటి వారు ఉంటారు. అయితే శిష్యులలో మరల సాధకులై, నిరంతరాయంగా ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రయాణంలో అలసి విశ్రాంతి తీసుకునే వారు కూడ ఉంటారు. సత్శిష్యులు అలా విరమించె వారు ఎవరు వుండరు. గమ్యం చేరే వరకూ వారు ఆగరు. వారే సత్శిష్యులు.
        ఇక అనుసరించేవారు అవకాశం ఉన్నపుడు చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ [on and off] లో వుంటారు అన్నమాట. అవకాశం కుదరలేదు అండి, సాధ్యం కాలేదు అండి అనేటటువంటి ఎక్షప్సనన్ క్లాజస్ [exceptional clauses] అంటే దాని ఏమంటారు అంటే.. ఎగ్సంప్షన్స్ [exemptions] అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇవ్వాళ అవకాశం చిక్కలేదు అండి లేదంటే ఇవ్వాళ కుదరలేదు అండి, రేపు ప్రయత్నిస్తాను అండి అని తమోగుణ ధర్మం కలిగినటువంటివారు అనుసరించేవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్శిష్యులుగా సూచన కాలంలోనే దర్శన స్థితిని సాధించేటటువంటి సమర్ధతను సంపాదించాలి.
        ఏ పదం గురు వాక్యంగా ఉచ్ఛరించబడితే, ఆ పదాన్ని యధాతథంగా గురువు హృదయం లో ఉండి దర్శించేటటువంటి సమర్ధత సంపాదించిన వారు ఎవరో వారు సత్శిష్యులు. వారికి వ్యాఖ్యానంతో అవసరముండదు. సూచన చేస్తే చాలు, దర్శించ గలుగుతారు. ఇక వ్యాఖ్యానంగా, బోధ గా వివరించి చెప్తే తెలుసుకోగల్గినటువంటి వారు కొంతమంది. వీరు మరొక తరగతికి సంబంధించిన వారు, వీరు శిష్యులు. ఇక బోధించినప్పటికీ కూడ గ్రహించలేనటువంటి, కొద్దిగా మందబుద్ధి గలిగినటువంటి వారి కొరకు ఉపమాన ఉపమేయ పద్ధతిలో చెప్పబడుతుంది. ఇది ఉపమాన ఉపమేయ పద్ధతి. అంటే ఉపమేయమైనటువంటి లక్ష్యార్ధము, ఉపమానమైనటువంటి వాచ్యార్ధము రెండింటి మధ్య గల సామ్యము, పోలిక ద్వారా వివరించి చెప్పబడుతుంది. ఇక్కడ ఉపమానంగా ఏం స్వీకరించారు? గర్భిణీ స్త్రీని స్వీకరించారు. గర్భిణీ స్త్రీ ఒక మనిషా? ఇద్దరు మనుషులా? అని విచారణ చేస్తే ఉండటానికి ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు కూడ ఉండవచ్చు. కవల పిల్లలు కూడ ఉండవచ్చు కదా!
        అలాగే మనిషి చూడటానికి మాత్రం ఒక మనిషే, కానీ అంతర్గతంగా జీవులు ఉండే అవకాశం ఉంది కాబట్టి హిరణ్యగర్భుడు కూడ ఎలా ఉన్నాడంటే అందుకనే గర్భస్థము అనే పదాన్ని వాడారన్నమాట. హిరణ్యము, గర్భస్థము. ఈ సృష్టి అంతా ఆ హిరణ్యంతో పోల్చబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ హిరణ్మయ పురుషుణ్ణి కనక దర్శించగల్గినటువంటి వారు ఈ హిరణ్మయ పురుషుడికి ప్రత్యక్షసాక్షియే ఆదిత్యుడు. సూర్యుడు అన్నమాట. “హిరణ్యగర్భః” అని ఆదిత్య నామాలలో ఒక నామముంది. కాబట్టి సవితాసూర్యుడు. ఆ ‘సవితా’ శక్తిని తన యందుంచుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ సవితాశక్తినే కాంతి రూపంలో, ప్రకాశంగా మనకు అందిస్తూ ఉన్నాడు.
        ఈ నవ గ్రహములు కూడ 9 గా విడిపోయి, సూర్యుని చుట్టూ భ్రమణము, పరిభ్రమణము చేయక ముందు ఇవి సూర్యుని లో అంతర్భాగములుగా ఉన్నాయి. భూమి కూడ సూర్యునిలో అంతర్భాగం గానే వుంది. అలా అంతర్భాగములుగా ఉన్నటువంటివన్నీ ఒకానొక సమయంలో అక్షరపురుషుడు , “నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే” నుంచి ప్రణవాక్షరం ఉద్భవించినటువంటి సందర్భంలో “ఏకమేవాద్వితీయం బ్రహ్మ” గా ఉన్నటువంటి స్థితి నుంచి, అహంబ్రహ్మాస్మి కి మారగానే, అయమాత్మాబ్రహ్మ అనేటటువంటి స్థితి నుంచి అహం బ్రహ్మస్మి అనేటటువంటి స్థితికి మారగానే విచ్ఛిన్నమైంది.
        విచ్ఛిన్నమై 9 భాగములుగా విడిపోయి, వాటియొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఎక్కణ్ణించీ అయితే ఏ ఆధారస్థానం నుండీ విడిపోయినాయో, అదే ఆధారస్థానం చుట్టూ పరిభ్రమించటం ప్రారంభమైంది. ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడ ఒప్పుకున్నటువంటి విధానం. ఇలా అనంతకోటి బ్రహ్మాండాలు విస్తరించాయి. ఒక బ్రహ్మాండానికి ఏ సిద్ధాంతముందో అనంతకోటి బ్రహ్మాండాలకు కూడ అదే సిద్ధాంతం. మరల తిరిగి విరమించేటప్పుడు కూడ ప్రళయకాలంలో ఎట్లా వచ్చినాయో, అట్లాగే విరమిస్తాయి. మరల అదే ఆధారస్థానమైనట్టి హిరణ్మయకోశం లోకి ఇవన్నీ అంశములుగా చేరిపోతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ ఎలా ఉందో అలా ఉన్నాడట హిరణ్యగర్భుడు.- విద్యా సాగర్ గారు
Reply all
Reply to author
Forward
0 new messages