కఠోపనిషత్‌ - 85

164 views
Skip to first unread message

sadhakudu

unread,
Jun 10, 2018, 8:33:46 PM6/10/18
to సాధకుడు online sathsang
కాబట్టి, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ప్రాదుర్భవించింది? అంటే, ప్రాణ చలనం చేత ప్రారంభమయ్యింది. అసలు ప్రాణ చలనమే లేకపోతే? ఏ జీవులూ లేరు. కాబట్టి, విశ్వయోని నుంచి జీవ సృష్టి అంతా వచ్చింది అన్నారు. ‘విశ్వయోని’ అనే పేరు పెట్టడంలోనే తెలుసుకోవాలన్నమాట. సాకారం కాదు. నిరాకార పద్ధతి. నిరీంద్రియ పద్ధతి. ప్రాణచలన ప్రభావ రూపమైనటువంటి హంస యొక్క చలనం ప్రారంభమయ్యింది. తద్వారా జీవపదార్థం జీవాణువుల యొక్క చలనం ప్రారంభమయ్యింది. లేకపోతే శుక్ల శోణితాలు తమంత తాము ఎలా చెలిస్తున్నాయి? తమంతట తాము ఎట్లా కలుస్తున్నాయి? తమంతట తాము సంవిత్‌ బిందువుగా ఎలా ఏర్పడుతున్నాయి? తమంతట తాము జీవాణువులుగా మరలా ఎలా విభజన పొందుతున్నాయి? కాబట్టి, చలనమంతా ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఈ వాయుచలనం మీద ఆధారపడి ఉంది.
        కదల్చగలిగేటటువంటి శక్తి, ఎండించ గలిగేటటువంటి శక్తి, లయింప జేయగలిగే శక్తి, దేనినైనా కూడా తనయందు ఇమిడ్చుకోగలిగినటువంటి శక్తి, అంతా కూడా ఈ వాయువు చేతిలోనే ఉంది. పోషించాలన్నా ఈ వాయువే. లయింప చేయాలన్నా కూడా ఈ వాయువే. సమస్త అగ్ని పంచకము, సూర్యుడులో ఉన్నటువంటి ప్రాణశక్తి ‘రై’ అనేటటువంటి శక్తిగా విడుదల అవుతు ఉంటుంది. ప్రళయకాలమందు అంటే ఈ సూర్యుడు మొత్తం నవగ్రహాలను వెనుకకు తీసుకుని, తన ఆత్మరక్షణను విరమిస్తాడు. ఆ వెంటనే ఎలా అయితే ఇది ఇప్పటి వరకూ తమ తమ కక్ష్యలలో పనిచేస్తూ ఉన్నాయో, కక్ష్యలన్నీ కొలాప్స్‌ [collapse] అయిపోతాయి. తన యందు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఢీకొని విరమణ చెంది, మరలా ఆ సూర్యుడి యందు లయమైపోతాయి. ఆ సూర్యుడు కూడా లేకుండా పోతాడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా! ఆ నక్షత్రం కాస్తా డెడ్‌ స్టార్‌ [Dead Star] అయిపోతుంది. బ్లాక్‌హోల్‌ [Black Hole] అయిపోతుంది. కృష్ణబిలం అయిపోతుంది. వెంటనే ఆ కృష్ణ శక్తి వలన అప్పటి వరకూ ఉన్న సమస్త బ్రహ్మాండ సృష్టి కూడా తనలోనికి లాగేసుకునింది. లాగేసుకునేప్పటికి ఎక్కడినుంచైతే విచ్ఛిన్నమై, ఉత్పన్నమైనాయో మరలా ఆ స్థానమునందే ప్రళయకాలమందు లయించబడిపోతాయి. చిట్ట చివరికి లయించబడేది ఏమిటంటే ఆకాశ పంచకం. ఆ ఆకాశ పంచకం ఎట్లా లయించబడుతుంది?
ఆకాశంలో ఆకాశం - గురుమూర్తి చెప్పుకున్నాంగా!
ఆకాశంలో వాయువు - చంద్రుడు,
ఎవరమ్మా? ఆకాశంలో వాయువు?
చంద్రుడు - ఆ మనస్సు కదా!
మనస్సు యొక్క అధిదేవత - చంద్రుడు.
        కాబట్టి, ఈ చంద్రుడు కూడా వెళ్ళి పోతాడు. ఈ రకంగా బృహస్పతి వెళ్ళిపోతాడు. ఆ రకంగా రుద్రడు వెళ్ళి పోతాడు. ఇట్లా అందరూ ఈ అధిష్ఠాన దేవతాగణం అంతా చిట్ట చివరికి జ్ఞాత స్థానంలోకి లయం అయిపోతుంది. క్షేత్రజ్ఞుడు వెళ్ళిపోతాడు. క్షేత్రములు వెళ్ళిపోతాయి. ఆ అక్షర పురుష స్థితిలోకి చేరిపోతాయి. బ్రహ్మము అయినటువంటి గురుమూర్తి స్థితిలోకి చేరిపోతాయి. ఆ బ్రహ్మము కూటస్థుడు. ఈ అధిష్ఠాన దేవత సముదాయము, పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు ఇదంతా బ్రహ్మాండం అన్నమాట. ఇదంతా సూక్ష్మాతి సూక్ష్మం. ఆదిదైవతం. ఇదేమో బ్రహ్మాండం. పిండాండానికి వచ్చేటప్పటికి ఆ యా రకములైనటువంటి గోళకములు, ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు ఆ రకమైనటువంటి ఇంద్రియ వ్యవస్థ అంతా కూడా పిండాండం. ఈ రకమైనటువంటి దేవతా వ్యవస్థీకరణ అంతా కూడా బ్రహ్మాండం. ఇదంతా కూడా ఆదిదైవతం అన్నమాట. ఇది బ్రహ్మాండ పంచీకరణ. ఈ రకంగా పిండాండము, బ్రహ్మాండము.... ఒక దానియందు ఒకటి ఇమిడి ఉన్నట్లుగా తోస్తూఉన్నది. ఈ రకంగా ఈ సమస్థ సృష్టి, స్థితి, ప్రళయములకు ముందున్నటువంటి .... ఎందుకని ఆ పైన 1, 2, 3 అని వేసి ఉంటుంది. ఒకటి, రెండూ, మూడు ఏమిటి?
బ్రహ్మణోరవ్యక్తః
అవ్యక్తాన్‌ మహత్‌
మహదోర్‌ మహదహంకారః - అన్నప్పుడు కూటస్థుడుగా వ్యక్తం అయ్యింది. అలాగే మహదహంకారముగా జ్ఞాతగా వ్యక్తం అయ్యింది. కాబట్టి, బ్రహ్మాండ ప్రతిబింబం అంతా పిండాండం. బింబమేమో బ్రహ్మాండం. ప్రతిబింబమేమో పిండాండం.
ఈ రెండిటి యందు రెండు అహములున్నవి. ఒకటి జ్ఞాత, రెండు కూటస్థుడు. ఈ రెండు అహములు కలిస్తే అఖండంబైన ఎఱుక. కూటస్థుడు అనేది అఖండ ఎఱుక. ఈ రకంగా ఖండ, ఖండాలుగా ఐదైదులు ఇరవై అయిదుగా తోస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా ఒక్కటిగానే ఉన్నది. ఈ పిండ బ్రహ్మాండములు ఒక్కటే. ఈ రకమైనటువంటి సాంఖ్యవిచారణ క్రమం ద్వారా ఏ మహతత్వ నిరూపణ అయితే అవుతోందో, ఏ అవ్యక్త నిరూపణ అయితే అవుతోందో, ఏ బ్రహ్మమైతే నిర్ణయించబడుతున్నాడో,
బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌ - అనేటటువంటి సూత్రాన్ని ఆశ్రయించి, సదా ఎల్లకాలము జనన మరణ చక్రములకు లోను కాకుండా, కాలత్రయమునకు లోను కాకుండా, అవస్థాత్రయమునకు లోను కాకుండా, శరీర త్రయానికి లోనుకాకుండా, దేహత్రయానికి లోనుకాకుండా ఏ రీతిగా అయితే బ్రహ్మము నిలబడి ఉన్నదో, అట్టి బ్రహ్మము నేను. అట్టి పరమాత్మను నేను. అట్టి పరబ్రహ్మనిర్ణయాన్ని నేను. అనేటటువంటి పద్ధతిగా తన బుద్ధి గుహయందు, తన హృదయాకాశము నందు, ఇట్టి నిర్ణయాన్ని ఎవరైతే పొంది, ఆ నిర్ణయముతో స్థిరముగా ఉన్నారో, వారే ముక్తులు. ఈ రకంగా ముక్తిని సాంఖ్య తారక అమనస్క విధిగా సాధించాలి అనేటటువంటి సూచనని తెలియజేస్తున్నారు. కాబట్టి, మానవులందరూ హిరణ్య గర్భస్థితిని తప్పక తెలుసుకోవాలి. వ్యష్టి ప్రాణులంతా కూడా ఈ ఆది దైవతం ఆధీనంలో ఉండడం చేత, వీళ్ళందరూ కూడా, అప్పటికి చివరికి వారి యందు చేరి పోతూఉంటారు.
    ఇట్లా బుద్ధి గుహయందు పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము. ధ్యానం చేయడం ద్వారా, నిరంతరాయంగా చేయడం ద్వారా, సహజ సమాధి నిష్ఠులవ్వడం ద్వారా, సహజ ధ్యాన పద్ధతిగా, మానవుడు ఈ స్థితిని సాధించాలి. ఈ స్థితి యందు నిలకడ చెందాలి. ఇట్లా ఎవరైతే హిరణ్య గర్భుడిని తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే ఈ ఆరవ కోశాన్ని బాగుగా ఎరుగ గలుగుతున్నారో, ఎవరైతే షడూర్మి రహితంగా ఉంటున్నారో, ఎవరైతే షడ్వికార రహితంగా ఉంటున్నారో, ఎవరైతే వాసనాత్రయం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే నిర్వాసనామౌనాన్ని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే ఈశ్వరీయ మౌనస్థితిలోనికి చేరారో, ఎవరైతే కాలత్రయము చేత బాధింప బడక యున్నారో, ఎవరైతే కర్మత్రయం అనేటటువంటి బంధం లేకుండా ఉన్నారో, ఎవరైతే కర్మఫల ప్రదాతగా ఉన్నారో, అట్టి ఈశ్వరీయమైనటువంటి స్థితిని, సాధుకులందరు తప్పక సాధించాలి.
    ఈ రకమైనటువంటి, విశేషమైనటువంటి ఆత్మ విచారణని మానవులు ప్రతి నిత్యమూ, అనుక్షణమూ ఆశ్రయించి, తనను తాను విరమింప చేసుకుని, పృథ్విలో పృథ్వి దగ్గర నుంచి, ఆకాశంలో ఆకాశం అనేటటువంటి ఆధార స్థానం వరకూ, ఆధార ఆధేయ విమర్శ పద్ధతిగా, జడచేతన విమర్శ పద్ధతిగా, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా దీనిని చక్కగా విచారణ చేసి, నేను జ్ఞాతను, నేను కూటస్థుడను, అనే నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరము తప్పక ఉన్నది. ఈ రకంగా ఇంద్రియాల దగ్గర నుంచి, గోళకముల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి పంచ భూత తన్మాత్రల యొక్క అధిష్టములైన జ్ఞానమునకు, అక్కడి నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మహతత్త్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు, ఆ తదుపరి ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి, అభేదత్వానికి మానవుడు సాధన ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇట్లా ఎవరైతే ప్రయాణం పూర్తి చేశారో, ఎవరైతే ఈ చిట్టచివరి స్థితికి చేరుకున్నారో, వారే దేశికేంద్రులు. వారే ముక్తులు. వారే జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు. వారే మోక్షమును అధివసించినటువంటి వారు.

ప్రశ్న: గురువు గారు ఇక్కడ మీరు ఈశ్వర దర్శనం గురించి చెప్పారు కదా! ఈశ్వర సాకార దర్శనం అవుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రతి రూపాన్ని వెనుక ఒక భగవద్ శక్తే నడిపిస్తుంది అన్న భావన ఉంది. నిరాకారంతో ఇది వున్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధముగా వుంటుంది అన్నది ఏమన్నా చెబుతారా?
సమాధానం: స్వప్రకాశ దర్శనంగా వుంటుంది. - విద్యా సాగర్ గారు
Reply all
Reply to author
Forward
0 new messages