కఠోపనిషత్‌ - 93

84 views
Skip to first unread message

sadhakudu

unread,
Jun 18, 2018, 8:11:54 PM6/18/18
to సాధకుడు online sathsang
నీ సహజశైలికి భిన్నముగా ఉన్నాయి. నీ స్వరూప జ్ఞానానికి భిన్నంగా ఉన్నాయి. నీ స్వయం ప్రకాశత్వానికి భిన్నంగా ఉన్నాయి. నీ ఆత్మజ్ఞానానికి భిన్నముగా ఉన్నాయి. వివేకం ఈ ఆత్మవస్తువును గుర్తించి, అట్టి వస్తువుగా నిలిచి ఉండి, మిగిలిన వాటిని నిరసించుట, తద్భిన్నమగు వాటిని నిరసించుట. అసనము అంటే స్వీకరించుట. నిరసించుట అంటే నిరాకరించుట. ప్రయత్న పూర్వకముగా నిరాకరించుట. ప్రయత్న పూర్వకముగా త్యజించుట. అదే సాధన. కాబట్టి, నా జీవితంలో నేను ఎలా ఉంటున్నాను? ఈ శాస్త్రములు, సద్గురువులు బోధించినటువంటి రీతిగా, జ్ఞాన పద్ధతిగా, ఆత్మ విచారణ పద్ధతిగా, ఉండగలుగుతున్నానా? లేదా? మిగిలిన సాధనోపాయములు, ఆజన్మార్జితమై ఉన్నటువంటి అనేక సాత్విక, రాజసిక, తామసిక వ్యవహారశీలములయందు, అనిష్టమైనటువంటి వాసన బల సంస్కార విశేషములను రద్దుపరుచుకోవడానికి, సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడానికి, శుద్ధ బుద్ధిని సాధించడంలో, సహకారి కారణములుగా, సాధనములు ఉపయోగపడతాయేమో గాని, ఆత్మవిచారణ అనేటటువంటి, కట్టకడపటి సాధన, ప్రథమము నుంచీ చేయాలి. మొదటి నుంచి చివరి దాక చేయవలసినది ఆత్మ విచారణ. అట్టి ఆత్మ విచారణ యందు రతుడైనటువంటి వాడు, మునిగియున్నటువంటి వాడు, ఆత్మోపలబ్ధియే తన జీవిత లక్ష్యంగా భావించేటటువంటి వాడికి మాత్రమే ఏ సాధనైనా సహకరిస్తుంది. ఏ వ్యవహారమైనా సహకరిస్తుంది. ఏ అవ్యవహారమైన సహకరిస్తుంది. అది ఇది అది అని చెప్పడానికి వీలు లేదు. జనన మరణాలతోసహా అట్టి ఆత్మయందు అంశీభూతములై యున్నవి. అట్టి సర్వవ్యాపక స్థితియందు సమావిష్టమైపోయినవి. అటువంటి స్థితిని మానవుడు సాధించాలి అని, యమధర్మరాజు గారు బోధిస్తూఉన్నారు.
        నచికేతా! ఆ పరమాత్మ అందరి శరీరముల మధ్య భాగమందు ఉంటున్నాడు. అంగుష్ఠ మాత్ర హృదయాకాశమున ఉంటున్నాడు. అంతటా నిండి యుండుట చేత పురుషుడని చెప్పబడుచున్నాడు. ఈ పురుషుడే కాలత్రయమునకు నియామకుడు. ఈ విధముగా తెలిసిన వారు, అట్టి పురుషుని నుండి, తనకు భయము కలుగునని తలంపడు. వాని నుండి రక్షణను కోరడు.
        మానవులందరూ సాధారణంగా ఈశ్వరా పాహిమాం. నన్ను రక్షించు నన్ను రక్షించు అని వేడుకుంటూ ఉంటారు. పాహిమాం, పాహిమాం, పాహిమాం నిరంతరాయంగా జీవులందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణి వేడుకునే పద్ధతి ఏమిటంటే, మాంపాహి, మాం పాహి పాహిమాం. నన్ను కాపాడు, నన్ను కాపాడు అని అడుగుతూ ఉంటారు. అంతే కానీ, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి, నాకు ఈశ్వరుడు తప్పు ఏమీ అవసరం లేదు, నాకు బ్రహ్మము తప్ప ఏమీ అవసరం లేదు, నాకు ఆత్మవస్తువు తప్ప ఏమి అవసరం లేదు. అని మాత్రం అనడు. నువ్వు ఎప్పుడూ వేరే. నువ్వు ఎప్పుడూ వేరే. నేను అనుభవించే జగత్తు మాత్రం నాకు కావాల్సిందే. ఒక వేళ ఈ జన్మలో చిట్టచివరికి ఏదైనా నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు కూడా కావాలి. అంతేకానీ, జగత్తు లేకుండా నువ్వు మాత్రం నాకు అవసరం లేదు. అనుభోక్తమైనటువంటి, భోగ్యవస్తువు అయినటువంటి, ఈ జగత్తు లేకుండా, నిన్నేంచేసుకుంటానయ్యా నేను? నీ వల్ల నాకు ప్రయోజనం ఏముంది? కాబట్టి, నేను కష్టాలలో పడుతూ ఉంటాను, జగత్ వ్యాపారంలో పడుతూ ఉంటాను. అనేకమైనటువంటి నానాత్వంలో పడుతూఉంటాను. కాంక్షలలో పడుతూఉంటాను, మోహంలో పడుతూఉంటాను. వివేకం లేకుండా వ్యవహరిస్తూ ఉంటాను. నిన్ను మాత్రం నేను కోరేది ఒక్కటే, ఏమిటది? పాహిమాం, పాహిమాం, పాహిమాం.
        ఇది సవ్యమైనటువంటి పద్ధతేనా? ఇది సరైన పద్ధతేనా? అనిటటువంటి విచారణ చేసుకోవల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండీ, మా అల్లుడు గారికి, సరైన ఉద్యోగం ఇప్పించండి, ఏమండీ, మా అల్లుడుగారి బుద్ధి సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ మా అమ్మాయిని సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. ఏమండీ! నన్ను మా ఆయన సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. ఏమండీ! మా పిల్లలూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ! మా మనవళ్ళూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఇలా ఎన్ని రకాలుగా ఏ పేరుతో పిలిచి కోరుతూ ఉన్నప్పటికీ, ఈ కోరికలన్నీ ఒకే ఒక కోరికలోకి వెళ్ళిపోతున్నాయి, ఏమిటది? పాహిమాం.
        అయితే, ప్రాధమికమైనటువంటి బాల్యదశలో ఇది అవసరం. ఎందుకంటే, అక్కడ ఉచితానుచితములు తెలియనటువంటి అవస్థ కాబట్టి, బాల్యావస్థ యందు భక్తియనే పునాది, విశ్వాసము ఏర్పడ వలసినటువంటి అగత్యమున్నది కాబట్టి, బాల్యము నందే ఈశ్వరానురక్తత ఏర్పడవలసినటువంటి అవసరము ఉన్నది కాబట్టి, బాల్యావస్థ దాటే వరకూ ఈ భక్తిని ఆశ్రయించాలి. పాహిమాం అని ఆర్తితో వేడుకునేటటువంటి లక్షణాన్ని పొందాలి. నిరంతరాయంగా ఈ ఆర్తిని తహని నిలబెట్టుకోవాలి. భక్తి విశ్వాసాలు నిలబెట్టుకోవాలి. ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నించాలి. కానీ.. చాలా ముఖ్యమైనటువంటిది ఈ ‘కానీ’. చిత్తశుద్ధి లేకుండా ఆత్మవస్తువు యొక్క లక్షణాలను గుర్తించకుండా అంధుడు ఏనుగును నిర్ణయించినట్లుగా నిర్ణయించ పూనుకుని ఉంటే, అప్పుడు ఎప్పటికీ, సమగ్రమైనటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని పొందలేడు. ఎందువల్ల? ఆ పరమాత్మ అందరి శరీర మధ్యభాగములందున్నాడు.
        సర్వభూతస్థమాత్మానాం హృద్దేశోర్జున తిష్ఠతి - ఇలాంటి ప్రయోగాలతో భగవద్గీత యందు తన అధికారిత్వాన్ని, తన అధిష్ఠాన స్థితిని, తన ఆశ్రయాన్ని, తన సర్వాధార స్థితిని, పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు. ఎక్కడున్నావయ్యా? అని అర్జునుడు పదే పదే అడుగుతాడు. ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. మన తరఫున. మన ప్రశ్నలన్నింటికి కూడా పరమాత్ముడు సమాధానాలు తీరుస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాసభగవానుడు ఆ సమాధానాలన్నీ ఇస్తూ ఉన్నాడు భగవానుడి ముఖం నుంచి. ఏమని చెబుతున్నాడు? పైగా? అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః నాయనా! సర్వ జీవుల హృదయాకాశమునందు వారి వారి బొటన వేలు ఎంతుందో అంతమేరకు ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. ఏమిటండీ, ఈ బొటన వేలు వ్యవహారం? ఏం మిగిలిన వేళ్ళు చెప్పవచ్చు కదా! అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః - ఇది ఒక సంజ్ఞా రూపకమైనటువంటి బోధ. ఐదు వేళ్ళు ఉన్నప్పటికి, అంగుష్ఠం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు.
        కాబట్టి, అంగుష్ఠం యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడున్నాడు. వాడు లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అనేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ. ఇంకొకటి కూడా ఉంది. దీనిని ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిగా అసయంజసమని అనిపిస్తుంది నాకు. ఎందుకని అంటే, ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాము? స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాం? ఆత్మ నాలుగు స్థితులందున్నట్లుగా తోస్తున్నది. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఇంకా దేనికి జోడిస్తే ఆ ఆత్మ. పుణ్యాత్మ, పాపాత్మ, వ్యవహారాత్మ. దేనికి జోడిస్తే అదైపోతుంది.

కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు. పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే. కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్‌ ఆత్మ విరాట్‌ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే. వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
      కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు. జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.
        ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు. ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటుంవంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.
        భగవాన్‌ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్‌ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్‌ ఈశ్వరత్వం అంటున్నారు.
        ఈశ్వరత్వం స్యాత్‌.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము. ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.
        కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు. సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటువంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము. చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనలనుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము. మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి.- విద్యా సాగర్  గారు
Reply all
Reply to author
Forward
0 new messages