తత్ త్వం - అనేటటువంటి పద్ధతిగా త్వం - తాను ఎలా ఉన్నాడు? తాను ఏ స్థితిలో ఉన్నాడు? తాను ఏ నిర్ణయంతో ఉన్నాడు? తాను ఏ లక్షణంతో ఉన్నాడు. తాను ఏమి సాధించాలి? ఆ సాధించ వలసినటువంటి లక్ష్యాన్ని సంబంధించిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలను తాను పొందటం ఎలా? దీనికి అడ్డంగా వున్నటువంటివి ఏమిటి? అంటే ప్రవృత్తి, నివృత్తి. వాసనా నివృత్తి. నిర్వాసనా స్థితి. మరి వాసనాక్షయం అంటారు. మరి ఆ రకమైనటువంటి వృత్తులన్నీ, దశవిధ ప్రళయాలున్నాయి. ఈ ఎనిమిది శరీరాలలోనూ దశవిధ ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి. వృత్తి ప్రళయము, నిత్యప్రళయము, శరీర ప్రళయము, బ్రహ్మప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదా శివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము. ఈ రకంగా ఆ దశవిధ ప్రళయాలు జరుగుతూ వున్నాయి. అవి పుడుతూ ఉన్నాయి. కొంతకాలము ఉంటూ ఉన్నాయి. మరల కొంతకాలము తరువాత లేకుండా పోతున్నాయి. ఈ రకంగా మరి పది జరగుతున్నాయి కదా! ఆయా వ్యవహార స్థితులలో మరి వాటయందు పుడుతూ వున్నాడు, పోషించబడుతున్నాడు మరలా లయించబడుతున్నాడు. కాబట్టి, జీవుడనేవాడు నిత్యప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. జాగ్రదావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. స్వప్నావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. సుషుప్తి అవస్థలో అడ్రస్ లేకుండా పోయినట్లు తోస్తున్నాడు. మరలా జాగ్రదావస్థకి తిరిగి వచ్చేసరికి, నేను ఉన్నాడంటున్నాడు. మరి ఏ నేను ఉంటున్నాడు? అన్న ప్రశ్నని వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.
ఈ రకంగా శరీర తాదాత్మ్యత చేత, వ్యవహార తాదాత్మ్యత చేత, వ్యావసాయిక తాదాత్మ్యత చేత, వృత్తి తాదాత్మ్యత చేత, ఈ తాదాత్మ్యత అనుబంధము చేత, సంగత్వ దోషము చేత, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి మాలిన్యం యొక్క దోషం ఒప్పుకొనటం చేత, ఇన్ని రకాలైనటువంటి అంశాలని, తానే అనుకోవటం చేత, అఖండముగా ఉన్నటువంటి, తన స్వరూపమునందు ఘటము, మఠము, పటము... అనేటటువంటి భేదములు తోస్తున్నాయి. కారణమేమిటి? స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాదులు తోస్తున్నాయి. దాని అర్థం ఏమిటి? ఉన్న ఆకాశం ఒక్కటే, కానీ.. ఓ కుండ వచ్చింది. ఆ కుండలో ఆకాశం మరల వేరే అనేటటువంటి భ్రాంతి కలిగింది. చిన్న కుండ, పెద్ద కుండ, ఇంకా పెద్దకుండ, ఇంకా పెద్ద కుండ.... ఘటం సైజు మారింది అంతే! ఘటం సైజు పెరిగినంత మాత్రాన ఆకాశంలో భేదమొచ్చిందా? అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అంటే, ఉదాహరణ చెబుతాను... ఇప్పుడే పుట్టిన పిల్లవాడున్నాడు. 90 ఏళ్ళ వృద్ధుడున్నాడు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడిలోనూ, అవే సప్త ధాతువులే ఉన్నాయి. 90 ఏళ్ళ వృద్ధుడిలోనూ అవే సప్త ధాతువులే ఉన్నాయి. స్థూలంగా ఏ మార్పులేదు. పోనీ సూక్ష్మంగా ఉందందామా? అవే మనో బుద్ది ప్రాణములు. ఆ ప్రాణ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జన్మించిన శిశువులో, 90 ఏళ్ళ వృద్ధుడిలో కూడా ఆ ప్రాణమనోబుద్ధులే ఉన్నాయి. మరి ఇంకా పోనీ కారణ స్థితిలో తేడా ఉందందామా? ఇప్పుడు పుట్టిన పిల్లవాడు నిద్రావస్థలో ఎలా ఉన్నాడో, 90 ఏళ్ళ వృద్ధుడు కూడా నిద్ర అవస్థలో అలానే ఉన్నాడు. మరి ఏమిటి మారింది అంటే, జ్ఞానాజ్ఞానముల యొక్క పరిణామము మారుచున్నది. ఇంకా ఏమీ మారటం లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడు, 90 ఏళ్ళ వృద్ధుడు ఒక్కటే అని తీర్మానం చేశామనుకో, అప్పుడేమయ్యింది? కుండను పెట్టి తీర్మానం చేసినట్లయ్యింది. ఈ కుండలో ఉన్న ఆకాశం, ఆ కుండలో ఉన్న ఆకాశం... అంతా ఒక్కటే కదా! కాబట్టి, ఈ కుండ, ఆ కుండ ఒక్కటే. 90 ఏళ్ళ వృద్ధుడు, ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఒక్కటే అని చెప్పవచ్చునా? అంటే, ఆత్మ దృష్ట్యా ఒక్కటే! కానీ, అనాత్మ దృష్ట్యా అనేకంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు శరీర అభాస కలుగుతోంది.
ఎప్పటికప్పుడు నిజానికి అఖండమైనటువంటి ఆత్మ స్వరూపంలో ఏ భేదము లేకపోయినప్పటికి, భేదములను ఆపాదించుకుని చూచుట అనే అభ్యాస బలము వలన అనేక రకములైనటువంటి అంతరములు ఏర్పడుతున్నాయి. కాబట్టి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఇతర మానవులతో ఎలా ఉన్నారు? నువ్వు నేను ఒక్కటేనా? వీడు వాడు ఒక్కటేనా? అదీ ఇదీ ఒక్కటేనా? అనేటటువంటి పదాలు మాట్లాడుతున్నాము. అంటే అప్పుడేమయ్యింది అంటే, మనం చిన్నప్పటి నుండి జనన కాలం నుండి మరణ కాలం వరకూ భేద దృష్టిని పెంచి పోషిస్తూఉన్నాము. అభేద సిద్ధి కొరకై ప్రయత్నించ వలసిన మానవుడు, భేద దృష్టి యందు బలపడిపోవడం చేత, వస్తువుల యందున్నటువంటి భేదాన్ని గుర్తించడంతో మొదలు పెట్టి, అంటే, ఉప్పు పంచదార ఒకటేనా? కర్పూరం ఉప్పు ఒకటేనా? తెల్లని వస్తువులన్నీ ఒకటేనా? వాటి వాటి లక్షణాలు వేరు వేరుగా ఉన్నాయి కదా! కాబట్టి, లక్షణ రీత్యా గుర్తించాలి కదా, అనేటటువంటి ప్రతిపాదనని మనం చిన్నప్పుడే చెప్పుకున్నాము. కారణం ఏమిటి అంటే, ఆత్మవస్తువుని లక్షణరీత్యానే గుర్తించ గలుగుతున్నాము. అట్టి లక్షణాన్ని గుర్తించేటటువంటి బుద్ధి వికాసం ఎందుకు అవసరమయ్యా అంటే, అఖండంగా ఉన్నటువంటి ఆత్మవస్తువుని గుర్తించటానికి లక్షణ రీత్యానే గుర్తించాలి కాబట్టి, వస్తువుగా దానిని చూపెట్టటం కుదరదు కాబట్టి.
కానీ, తాను అల్లుకున్నటువంటి గూటిలో, తానే చిక్కుకుని అక్కడే మరణించేటటువంటి సాలె పురుగు వలే, తాను అల్లుకున్న గూటిలో తానే చిక్కుకుని, తన మనోజాలంలో తానే చిక్కుకుని, తన మనో భ్రాంతిలో తానే చిక్కకుని, తన బుద్ధిగతమైనటువంటి వివేకాన్ని, అవివేకంగా మార్చుకుని, అజ్ఞానంగా మార్చుకుని, అవిద్యగా మార్చుకుని, అభ్యాస దోషం చేత, అనేకత్వం అనేటటువంటి భ్రాంతికి గురై, అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై, భేద స్థితికి లొంగిపోయి, చిట్టచివరికి మృత్యువు పాలౌతున్నాడు. ఈ రకంగా అద్వితీయ బ్రహ్మము తానై ఉన్నప్పటికి, అసలు ద్వితీయమే లేనటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ, స్వకీయమైనటువంటి ఆభాస చేత, స్వయం కృతమైనటువంటి అపరాధం చేత, మృత్యువు నుండి మృత్యువునే పొందుచున్నాడు.
కాబట్టి, ఈ ఆత్మను అనేకముగా తలంచడం అనేటటువంటి దోషాన్ని మనము చేయరాదు. ఇక్కడ అనేకమంది జీవాత్మలున్నారండీ అనకూడదు. ఇక్కడ అనేకమంది దివ్యాత్మలున్నారండీ అనకూడదు. ‘ఆత్మలు’ అని బహువచన ప్రయోగం చేయకూడదు. ఆత్మకు ఏక లేక బహు అనే రూపాంతరం లేదు. ఈ ఆత్మ శబ్దం సంస్కృత శబ్దం. దీనికి వచనం లేదు. ఆత్మ - ఆత్మలు అనరాదు. కాబట్టి, అఖండముగా నున్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఆ లక్షణ రీత్యా ఏక పద్ధతిగా, ఏకత్వం అనేటటువంటి ఏకైక లక్షణ రీత్యా అందరూ మానవులే. అందరూ మానవులే అన్న దాంట్లో కూడా ఒక దోషము ఉంది. మానవులు అనే బహువచన శబ్దం
అంతా మానవత్వాన్నే కలిగియున్నారు. మానవత్వాన్ని కలిగియున్నవారందరూ మానవులే. కాబట్టి, అలా లక్షణ రీత్య నిర్ణయం చేసేటటువంటి ఎదుగుదలను మానవుడు సాధించాలి. ముఖ్యంగా సాధకులు సాధించాలి. నీ చుట్టు పక్కల ఉన్నటువంటి నీ సంసారంలో, నీవు గుర్తించేటటువంటి మనుషులు కానీ, నిన్ను గుర్తించే మనుషులు కానీ, ఏవైతే, ఎవరైతే ఉన్నారో, వారంతా ఎవరు? నీ ఇంట్లో ఉన్నవస్తువులు కానీ, నువ్వు ప్రపంచంలో గుర్తుపట్టేటటువంటి వస్తువులు కానీ, ఇదంతా కూడా ‘ఇదం’, ఇదం అంటే నేను కాదని. ‘ఇదం’ - అనేటటువంటిది అంతా కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? ఆ ఇదం కి ఉన్న లక్షణాలకి వ్యతిరేకంగా ఏ సాక్షిత్వము అయితే ఉన్నదో... అంటే అర్థం ఏమిటి? నీవు ఒక వస్తువును చూస్తూఉన్నావు. చూస్తూఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? ఆ ఘటము నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్ళు పట్టావయ్యా! కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయయ్యా! అది దాని లక్షణం. కుండనువ్వా? నీళ్ళు నువ్వా? చల్లదనం నువ్వా అంటే, ఈ మూడు నేను కాదు. కారణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని. సర్వదా సాక్షిని. సర్వ సాక్షిని. కాబట్టి, నాకేమీ అంట లేదు, కుండ అంట లేదు, నీళ్ళు అంట లేదు, చల్లదనము అంట లేదు. నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం. మరి కుండ అవసరం లేదా? మంచి నీళ్ళు అవసరం లేదా? అందులో చల్లటి మంచి నీళ్ళు అవసరం లేదా? అది భౌతిక అవసరం.
ఆత్మ అభౌతికం. ఆత్మ సూక్ష్మం. ఎన్ని అవసరాలున్నప్పటికీ, అవసరాలమేరకు పని చేసేటటువంటి వాడు, అనిత్య వస్తువులయందు రమించకుండా, కలిసిపోకుండా, తాదాత్మ్యత లేకుండా, సంగత్వ దోషం లేకుండా, తాను తానుగా ఉండి, తానైనటటువంటి స్థితిలో నిలిచి ఉండి, బట్టబయలే బ్రహ్మము అనేటటువంటి జన్మరాహిత్య లక్షణానికి ఆశ్రయంగా ఉండేటటువంటి, తత్త్వజ్ఞాన లక్ష్యం దృష్ట్యానే, వ్యావహారిక లక్షణాలను చూస్తాడు. ఈ రకంగా వ్యావహరిక దృష్టి అనేటటువంటిది సామాన్యమైపోయింది. అప్రధానం అయిపోయింది. అనిత్య వస్తూపలబ్ది చేత ప్రేరేపించబడడం లేదు. పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అనేక వస్తువుల ఉపలబ్ది జరుగుతూ ఉంటుంది.
పుట్టినప్పుడు ఏ ఒక్కడు కూడా వస్త్రం కప్పుకుని రాలేదు. మొట్టమొదటిది వస్త్రం కప్పడంతోనే మొదలౌతుంది. వస్తూపలబ్ది. జన్మించడానికి ఆధారమైనటువంటి, ఆశ్రయించినటువంటి... బొడ్డుతాడు కోయడానికి బ్లేడు కావాలి. వస్తూపలబ్ది దానితోనే ముడిపడి ఉంది. మరి అలా ఇవన్నీ నీకు అవసరాలే అయివున్నప్పటికి, ఇవేవీ నీవు కాదు. నీ యొక్క వాస్తవికమైనటువంటి ఉనికి, నీదదికాదు. నీవు అఖండమైనటువంటి ఆత్మస్వరూపుడవు. నీవు ప్రత్యగాత్మ, విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నట్లుగా తోచుచున్నప్పటికి లేదా సమిష్టిగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహములైనటువంటి విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటువంటి దేహములు కానీ, సాక్షులు కానీ, ఇవేవియూ నీవు కాదు. వీటి అన్నిటికి అతీతమైనటువంటి, అఖండముగా ఉన్నటువంటి పరమాత్మవు, పరబ్రహ్మవు. ఆ పరబ్రహ్మము కూడా బట్టబయలందు లేనిది అనేటటువంటి చిట్టచివరి నిర్ణయమును పొందటానికి, జన్మరాహిత్యమును పొందడానికి, అమృతత్వాన్ని పొందడానికి మాత్రమే నేను ఈ మానవోపాధిలోనికి వచ్చాను అనేటటువంటి, స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని, లక్షణాన్ని, ఆశ్రయించి, మనం ప్రయాణం చేయాలి. అందుకని ఏమన్నాడు? జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం అనే లక్షణత్రయాన్ని, సాధకులకు నిర్దేశించారు. ఎవరైతే ‘సూణోధావతి’ అనేది సూత్రం అన్నమాట జహర్లక్షణానికి. అంటే ఏమిటి? అంటే ఎర్రరంగు ప్రవహిస్తుంది అన్నామండి. ఎర్రరంగు ప్రవహించడం ఏమిటి అయ్యా అంటే? ఎర్రరంగు జెండాలు పట్టుకున్నటువంటి వారందరూ కూడా నదిలో ప్రయాణము చేస్తూఉంటే, నదంతా ఎర్రగా కనబడి, ఎర్రరంగు ప్రవహిస్తోందిగాతోచింది. తోచినటువంటి ఎర్ర రంగు ప్రధానమా? అది ప్రవాహం ప్రధానమా? అలా ప్రవహించే అవకాశం ఉందా?
ప్రత్యక్ష పరోక్ష అనుమాన విహిత అవిహిత... ఇలా ప్రమాణ సహితాలన్నింటినీ విచారణ చేయగా, షట్ప్రమాణ సహితమైనటువంటి విచారణ చేయగా, యథార్థం బోధ పడింది. కాబట్టి యథార్థం ఏమిటి? అనంటే, నది ప్రవహిస్తోంది, నదిలో కొంతమంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. వారు ఎర్రరంగు జండాలు పట్టుకున్నారు. దూరం నుంచీ చూడగా, ఒక భ్రాంతి కలిగింది. ఎర్రని నది ప్రవహిస్తోంది. నది ఎర్రగా ఉండడం ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే తప్ప, ప్రయోజనము లేదు. ఈ రకంగా జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం... ఈ రకంగా లక్షణత్రయాన్ని చక్కగా గురుసమక్షంలో విచారణ చేయాలి. అంటే అర్థం ఏమిటి? ఏది ప్రధానం? ఏది అప్రధానం? ఏది మనం పట్టుకోవాలి? ఏది మనం త్యజించాలి? నిత్యానిత్య, ఆత్మానాత్మ, సదసద్, కార్యకారణ, దృక్ దృశ్య వివేకములనేటటువంటి పద్ధతులుగా దీనిని ఏ వివేక పద్ధతిలోకి వస్తుందో విచారణ చేసుకుని, ఆ విచారణ ద్వారా ఏది ప్రధానమో దానిని గ్రహించి, ఏది అప్రధానమో దానిని త్యజించాలి. భాగత్యాగ నిర్ణయము అంటారు. ఈ భాగత్యాగ నిర్ణయము లేకపోతే, వివేకము అసాధ్యము. అవివేకమే ఉంటుంది ఎప్పటికి కూడా. అజ్ఞానమే ఉంటుంది ఎప్పటికి కూడా. అవిద్యే ఉంటుంది ఎప్పటికి కూడా. బంధమే ఉంటుంది ఎప్పటికి కూడా. కాబట్టి, అవివేకాన్ని, అజ్ఞానాన్ని, అనాత్మని, అవిద్యని, బంధాన్ని - వీటన్నింటినీ తొలగించగలిగేటటువంటి ఏకైక వజ్రాయుధం వివేకం – జ్ఞానం.
కాబట్టి, అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరైతే సంసిద్ధులై ఉన్నారో, అట్టి ఆత్మోపరతియందు స్థితుడైయున్నాడో, అట్టి ఆత్మోపవస్తు లబ్ధిచే మాత్రమే సంతుష్టత చెందేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో, అటువంటి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అటువంటి సచ్ఛిష్యుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి ఉత్తమ తరగతికి సంబంధించిన సాధకుడు ఎవరైతే ఉన్నారో, అతడు ఆభాసయుతమైనటువంటి ప్రతిబింబ సహితమైనటువంటి అనాత్మ వస్తువులచేత, సంతుష్టత చెందడం లేదు. అవి ఏనుగుపై ఒక మనిషి నిలబడి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తుకు వెళ్తుందో, అంత ఎత్తు ధనరాశిని నీకెచ్చదన్ననూ, అఖండ మండలాకారముగా వ్యాపించి ఉన్నటుంవంటి, భూమండలాధిపత్యమును నీకిచ్చెదనన్ననూ, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వ్యాప్తమై ఉన్నటువంటి సమస్త జీవ తను చతుష్టయాధిపత్యమును ఇస్తాను అని అన్నప్పటికినీ, సకల చతుర్దశ భువనాధిపత్యమును ఇస్తాను అనేటటువంటి ఆధిపత్యమును ఇస్తానన్నప్పటికి ఎవరైతే అవుననడో, ఎవరైతే వాటిని తృణప్రాయముగా, గడ్డిపోచవలె చూస్తాడో, అటువంటి తీవ్ర వైరాగ్యోపరతుడు మాత్రమే, అటువంటి కాంక్షారహితుడు మాత్రమే, అటువంటి మనోవాసనారహితుడు మాత్రమే, అటువంటి వివేకశీలి మాత్రమే, ఈ ఆత్మవస్తువును పొందగలుగుచున్నాడు. - విద్యా సాగర్ గారు