బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.
కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.
కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.
నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.
జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.
అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.
కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.
దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై, ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.
అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు
నీ శరీరమందును, నా శరీరమందును, అన్య శరీరములయందును ఏ చైతన్యము సాక్షి రూపముగా నున్నదో, ఆ చైతన్యమే విరాట్ శరీరమందును సాక్షి రూపముగా ఉన్నది. ఇచ్చట వ్యష్టి స్థూల, సూక్ష్మ, కారణ దేహములందు ఏ ప్రత్యగాత్మ విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నదో, అచట సమిష్టి స్థూల సూక్ష్మ కారణ దేహములందు ఏ పరమాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత రూపముగా ఉన్నదో, అదియు, ఇదియు ఒక్కటే. అనగా పరబ్రహ్మమే భేదము లేదు. అఖండ ఆకాశమునందు భేదము లేనప్పటికి, ఘటము, మఠము, మొదలగు ఉపాధుల చేత భేదము పొందినట్లు, కన్పించుచున్నట్లుగా ఈ అఖండ చైతన్యము, ఉపాధులు మూలముగా భేదము పొందినట్లు కనిపించుచున్నది. వాస్తవమున భేదము లేకపోయినప్పటికి, ఈ లోకమందు అజ్ఞానులు ఆత్మధర్మమును, అనాత్మయగు శరీరధర్మములందు చూచి, ఆత్మను అనేకముగా తలంచుచున్నారు. ఎవరు ఈ విధముగా ఆత్మను అనేకముగా చూచుచున్నారో వారు మృత్యువు నుండి మృత్యువును పొందుచున్నారు. సర్వ భేద రహితమైనటువంటి అద్వితీయ బ్రహ్మమును ఎఱిగిన వారు, అమృతత్వమును పొందుచున్నారు.)
చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనకు అందించే ప్రయత్నము చేస్తున్నారు. దీనినే ఆత్మానాత్మ వివేకము అంటారు. ఏక స్వరూపము ఆత్మ. అనేక స్వరూపము అనాత్మ. ఇది ప్రాథమికమైనటువంటి లక్షణము. ఏదైనా ఒక అంశాన్ని మనం విచారించాలంటే, ఇది ఏకత్వములోకి తీసుకువెళ్తుందా? అనేకత్వములోకి తీసుకు వెళ్తుందా? అనేటటువంటి విచారణని చేయాలి. ఎప్పుడైతే అది అనేకత్వ స్థితికి దారి తీస్తుందో లేదా అనేకత్వం అనే లక్షణంతో ప్రకాశిస్తోందో, భాసిస్తోందో, లేదు ఆభాసగా ఉన్నదో, అప్పుడు అదంతా అనాత్మ. ఈ ఆత్మానాత్మ విచారణ మానవులందరూ తప్పక చేయాలి. సాధకులు ముఖ్యంగా చేయాలి. సాధన చతుష్టయ సంపత్తి కలవారు, నిరంతరాయంగా ఈ ఆత్మానాత్మ విచారణ చేయాలి. చేసి ఆత్మ వస్తువును ఆశ్రయించాలి. అనాత్మ వస్తువును త్యజించాలి. ఈ లోకములో రెండు లక్షణములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. వస్తువులకు ఉనికి ఉన్నది. ఒకటేమో ఆత్మ వస్తువు. రెండవది అనాత్మ వస్తువు. మరి రెండూ ఒకచోటే ఉన్నాయి. వింతైన విషయమేమింటంటే, రెండూ వేరువేరుగా వేర్వేరు ప్రదేశాలలో ఉంటే, సులభంగా గుర్తించవచ్చు. కానీ రెండు వస్తువులు ఒక్కచోటే ఉన్నాయి. దీనికొక ఉదాహరణ చూద్దాము.
పంచదార తెల్లగానే ఉంది, ఉప్పు తెల్లగానే ఉంది. ఈ రెండిటిని కలిపేశాము. ఇప్పుడు ఈ రెండిటిని వేరు చేయాలంటే ఎలాగా? రెండూ నీళ్ళల్లో కరిగిపోతాయి. మరి ఎట్లా వేరు చేయాలి? అని ఆలోచన చేస్తే, దానికో ఉపమానం చెప్పారు. అంటే సాధకుడు చీమలాగా, ఆ పంచదారను ఉప్పు కలిసినటువంటిది తీసుకొచ్చి, చీమల ముందు పోసినట్లైతే, చీమ ఏం చేస్తుంది? ఉప్పు అంతా వదిలేసి, పంచదార పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే, దానికి స్పష్టంగా తెలుసు, ఉప్పేదో, పంచదార ఏదో...! అట్లాగే, ఈ ఆత్మ-అనాత్మ రెండూ ఒక్కచోటే ఉన్నాయి.
కానీ, మనిషి మాత్రం ఏమైపోతున్నాడంటే, కలగాపులగంగా అయిపోయి, అనాత్మను ఆశ్రయించి, ఆత్మ వస్తువును గుర్తించ లేకుండా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే శరీర అధ్యాస. దీనిని ఏమన్నారు అంటే శరీర అధ్యాస. ఎప్పటికప్పుడు శరీర అధ్యాసని పొందుతున్నాడు. ఏ స్థితిలో ఉంటే, ఆ స్థితికి సంబంధించినటువంటి శరీర అధ్యాసను పొందుతున్నాడు. అందుకని, ఇక్కడ ఎనిమిది శరీరాల యొక్క ప్రతిపాదన చేశారు. పరిణామ క్రమంలో మానవుడు తన వివేక స్థాయిలో ఎనిమిది శరీర భ్రాంతులను పొందుచున్నాడు. ఎనిమిది అధ్యాసలను పొందుచున్నాడు. జాగ్రదావస్థలో జగత్తుతో తాదాత్మ్యత చెంది, జగత్తును భోగ్యవస్తుగా చూచి భోగ్య పదార్దముల యందు, శబ్దాది విషయములయందు ఆసక్తి కలిగి వ్యవహారశీలియై, వ్యవహారమే సత్యమనుకుంటూ, వ్యవహారం లేనిదే తాను లేనని, తన ఉనికిని, వ్యవహారశీలమైనటువంటి వజగత్ వస్తుభ్రాంతితో ముడిపడి, తాను ఏమయ్యాడు అంటే, ఆభాస రూపుడైనటువంటి జీవుడయ్యాడు, ప్రతిబింబరూపుడైనటువంటి జీవుడయ్యాడు.
అయితే ఈ జగత్ వ్యాపారము నంతటిని సాక్షిగా చూస్తున్నటువంటి వాడెవడో, వాడు విశ్వుడు. ఇదే జీవుడు ఈ శరీరము నుంచి తప్పుకోగానే, ఈ శరీరము ఎందుకు కొరగానిది అవుతోంది. ఈ శరీరము నిరుపయోగము అవుతోంది. ఈ శరీరము నిష్ప్రయోజనము అవుతోంది. ఈ శరీరాన్ని పంచభూతాత్మకమైనటువంటి దేహం కాబట్టి, ఆ పంచభూతాలలోనే మరల కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. దహనం చేసో, ఖననం చేసో, ఏదో ఒక రూపంలో ఈ దేహాన్ని ఏ పంచభూతాలనుంచైతే ఇది ఉత్పన్నమైందో, మరల అదే పంచభూతాలలో కలిసిపోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు. మరి, తరలిపోయిన జీవుడు ఏమయ్యాడయ్యా? తరలి పోయిన జీవుడు తన కర్మఫల విశేషం చేత, తన కర్మల బరువు చేత, తాను చేసుకున్నటువంటి ద్వంద్వాది రూప, విహిత కర్మ, అవిహిత కర్మల చేత, పుణ్యపాపముల చేత, ఏ సుఖదుఃఖాది మిశ్రిత కర్మ చేత, కర్మల సంచిని మోసుకొంటూ మరొక దేహానికి తరలి వెళ్ళిపోయాడు.
కారణం ఏమిటి? అంటే ఈ విశ్వుడు అన్న సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. కాబట్టి, ఈ ఎనిమిది శరీర అధిష్టాన స్థానములని ఏవైతే చెబుతున్నారో, ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులు. కాబట్టి, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటటువంటి ఎనిమిది సాక్షి స్వరూపాలు, పరమాత్మ అనేటటువంటి, సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే, ఈ ఎనిమిది అధిష్ఠాన కేంద్రాలను, ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోగలుగుతారు.
అలా తెలుసుకోలేని వాళ్ళు, ఆ యా వ్యవహారమునే సత్యమనుకుంటారు. ఆయా శరీర వ్యాపారమునే సత్యమనుకుంటారు. ఉదాహరణ చెపుతా... ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. కలలు కన్నప్పుడల్లా ఆయా కలలో అనేక రకములైనటువంటి సినిమాలు వస్తుంటాయి. అవన్నీ తమ జీవితములో ఉన్నటువంటి, తానే నేర్పించినటువంటి, తానే నటించినటువంటి, తానే నర్తించినటువంటి, తానే పాటలు పాడినటువంటి, తానే ఫైటింగులు చేసినటువంటి... సినిమాలన్నమాట. అన్నీ ఆయనే ... కథ, రచయిత, మాటలు, పాటలు, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్నీ ఆయనే. మరి అతువంటి కల అనే సినిమాను ప్రతి రోజూ మానవుడు దర్శిస్తూనే వున్నాడు కాని ఏ తెరమీదైతే, ఈ కల అనే సినిమా జరుగుతుందో, ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి, ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా. మరి ప్రకాశం ఆధారంగా కనబడుతున్న సినిమాని నేనా? ప్రకాశం నేనా? అనేటటుంవంటి విచారణ దృక్పథం... కలగడం లేదు.
ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఆ రోజు కలని ‘అనుభోక్తవ్యం’ అనుభవిస్తూనే ఉంటాడు. అందులో ఏర్పడుతున్నటువంటి సుఖదుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాడు. అట్టి అనుభవరీత్యా మరలా కలలో కూడా అవే సుఖదుఃఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మరి ఇలలోనూ సుఖదుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. లేదంటే మిశ్రితంగా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే కలలో కూడా సుఖదుఃఖాలు మిశ్రితముగా ఏర్పడుతున్నాయి. కాబట్టి, కర్మఫలము త్రివిధములుగా ఉన్నది. అయితే సుఖము, లేకపోతే దుఃఖము, లేక పోతే మిశ్రితము. మరి ఈ రకంగా ఏర్పడుతున్నటువంటి దానిలోనుంచి ఏట్లా బయట పడాలంటే, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేటటుంవంటి శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఉంది. అధ్యాత్మ - ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి విచారణ చేసేటటువంటి దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. తత్త్వజ్ఞానార్థ దర్శనం - ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారితీయాలటా? తత్త్వ జ్ఞానార్థ దర్శనం.- విద్యా సాగర్ గారు