వేదాంతము ఏ సంప్రదాయకమునకును, ఏ తెగకును, ఏ జాతికిని, ఏ లింగమునకును చెందినది కాదు. అందుకే అక్కడ పురుషుడు అనే శబ్దాన్ని వాడారు, వివేక చూడామణిలో కాని, ఉపనిషత్తులలో కాని, ఎక్కడికక్కడ కులం అనే పదము లేదు, వర్ణము అన్నారు. వర్ణము అంటే మనం కులం క్రింద పెట్టాము. కొన్ని వృత్తుల వల్ల కులవృత్తులు అంటారు వాటిని. నేత పని చేసేవారిది ఒక కులం, కుండలు చేసేవారిది ఒక కులం, క్షవరం చేసేవారిది ఒక కులం, బట్టలు ఉతికేవారిది ఒక కులం. ఇలా వృత్తుల చేత వచ్చాయి కానీ, భగవంతుని చేత నాలుగే నాలుగు వర్ణాలు సృజించబడ్డాయి. అవి కులాలు కాదు, వర్ణములు. మరలా ఆ వర్ణములు నా చేత కల్పించబడ్డాయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ, ఎలా కల్పించబడ్డాయో కూడా చెప్పాడు. గుణ, కర్మ, స్వభావాన్ని బట్టి అన్నాడు. దీన్ని బట్టి ఏమైంది? ఎప్పుడూ దుఃఖపడుతూ, ఎప్పుడూ అజ్ఞానంలో ఉండి, ఎప్పుడూ వేదన పడుతూ, ఏ సాధన చేయకుండా, ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఉండేవానిని శూద్రః అన్నారు. వాళ్ళకు ఒక్కళ్ళకే బ్రహ్మవిద్యాధికారం లేదు.
పుట్టుకతో శూద్రులు కాదు. ఎప్పుడూ నిత్య దుఃఖితుడై, ఆ దుఃఖ నివారణార్థం, ఎవరు ఏం చెప్పినా వినకుండా, తమో గుణంతో తన కష్టాలను తానే తెచ్చుకునేటటువంటి స్వభావము, ఎవరికైతే ఉందో వారు శూద్రులు. ఆ స్వభావాన్ని అతను మార్చుకుని, శమదమాదులు పాటిస్తే ఆధ్మాత్మిక దృష్టి, శ్రద్ధ, భక్తి ఉంటే అతడు శూద్రుడు కాడు యోగ్యుడే.
అందువలన ఈ వేదాంతము, ఈ బ్రహ్మజ్ఞానము, ఈ సాధన ప్రతీ మానవుడికి, చేసుకోగలిగితే ప్రతీ జంతువుకీ లభిస్తుంది. గజేంద్ర మోక్షంలో లాగా ఏనుగుకు కూడా మోక్షం వస్తుంది చేసుకోగలిగితే. మానవ జన్మకు వచ్చి, మరలా వెనక్కు వెళ్ళిన జంతువుకి మోక్షం వస్తుంది. పరిణామంలో ఇంకా మానవుడు కాని జంతువుకు మోక్షం రాదు. ఎందుకంటే విచక్షణ, విచారణ, వివేకము, సాధన, అష్టాంగయోగము, సమాధి, సమాధిలో ఉన్నటువంటి తన చైతన్యాన్ని గ్రహించగలిగినటువంటి ఈ పరిణామ సిద్ధాంతం ద్వారా వచ్చిన చైతన్య వికాసము ఆ జంతువు స్థాయికి పూర్తికాలేదు. అది సరిపోదు. మానవ దేహం వచ్చాకే, ఆ చైతన్యవికాసం పూర్తి అయ్యింది. బుద్ధి జీవి అయ్యాడు. ఆ బుద్ధిలో వివేకము, విచారణ, విచక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని వినియోగించుకోకుండా మూర్ఖంగా ఉండే మానవులున్నారు. కేవలము ఆహారము, నిద్ర, భయ, మైథునములతోనే వెళ్ళబుచ్చుకుని పుడుతూ, చస్తూ ఉండే మానవులున్నారు. భోగిస్తూ వ్యసనపరులైనవారున్నారు. కష్టపడి సంపాదించి, తాను అనుభవించక, దాన ధర్మాలు చేయక కూడబెట్టి, వారసులనేవారికి వదిలిపోయేటటువంటి లోభులు ఉన్నారు. చివరకు అవి ఎవరికి చెందుతాయో, ఏమైపోయాయో కూడా ఎవరికీ తెలియని స్థితిలో కష్టపడుతున్నారు. ఇలాగే జరిగిపోతూ ఉంది.
మానవుడు బుద్ధి జీవిగా ఎప్పుడైతే ఏర్పడ్డాడో, అది ఈ రకంగా చక్రభ్రమణంగా చస్తూ పుట్టడానికి కాదు. దీని యొక్క ఉద్దేశ్యము వేరే ఉన్నది. ఈ చైతన్య వికాసాన్ని పరమశాంతిగా, పరమ ఆనందముగా, నిత్యానందముగా, సహజానందముగా మార్చుకునే అవసరానికి వినియోగించాలి. అది బాహ్య ప్రపంచంలో లేదని తెలిసిపోయింది. అంతర్ముఖంలో నీ స్వరూప జ్ఞానం ద్వారా వస్తుందని తెలిసింది. ఇలా అటునుండి ఇటు త్రిప్పుకోవడమే ఆధ్మాత్మిక దృష్టి. ఆ దృష్టితో శ్రద్ధ కలిగి, భక్తితో సాధన చేయాలి. ఇది అందరికీ సమానము.
నవద్వార పురమైనటువంటి ఈ శరీరమునకే లింగ భేదము కానీ, ఈ పురమందు నివశించే పురుషుడు అని పిలువబడేటటువంటి వానికి, జాతి కులము, మతము, స్త్రీ పురుష భేదము ఏవీ లేవు. అందరూ యోగ్యులే. చేసుకోవటం చేతైతే, అందరికీ ఆ సాధన చేసి, గమ్యం చేరడానికి ఏ అభ్యంతరమూ లేదు. అభ్యంతరం చెప్పారు అనేది పాత రోజుల్లో. మళయాళ స్వామిగాని, ఇంకొకరు గానీ, అన్నీ ఖండిస్తూనే ఉన్నారు. వివక్ష లేదని, ప్రమాణం కూడా చూపిస్తున్నారు.
వేదాంతమనగా జ్ఞానము, ఆత్మజ్ఞానము, తనను తాను తెలుసుకొనుట అనెడి తత్త్వజ్ఞానము. ప్రపంచ జ్ఞానము కాదు. శాస్త్రజ్ఞులు చాలా వస్తువులు కనిపెట్టినట్టి జ్ఞానము కాదు. చాలా లోతైనటువంటి పదార్థ తత్త్వమును తెలుసుకున్నట్టి వారు కూడా, బాహ్యప్రపంచంలో జ్ఞానులు అనబడుతున్నారు. కాని ఏది తెలుసుకున్నవాడు, అతడు దానియొక్క వేత్త. శాస్త్రము తెలుసుకున్నవాడు శాస్త్రవేత్త. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త. కనుక జ్ఞానం అనేది బహిర్ముఖ జ్ఞానం కాకుండా, నేనెవరు అనే దానియొక్క జవాబుద్వారా, ఆ జవాబుకు తగినటువంటిదిగా వచ్చినదే జ్ఞానం. ఊరికే తెలిస్తే పాండిత్యము. అనుభవంగా వస్తే జ్ఞానము. తనను తాను తెలుసుకొనుటలో ఫలించేదే జ్ఞానము. ఇది మానవునికి తప్పని సరి.
ప్రతి మానవుడు చెప్పినమాట వింటాడో, వినడో, శిష్యరికం చేస్తాడో, చేయడో, భక్తి మార్గంలో ఇంకా ఉండి, జ్ఞానమార్గానికి తిరగలేదో, ఎవర్నీ ఏమీ అనదు శాస్త్రము. గురువులు అవతార పురుషుల కూడా అనరు. ఊరికే నిజాన్ని, సత్యాన్ని లాలింపుగా, బుజ్జగింపుగా చెప్పి, అవసరమైతే హెచ్చరిస్తూ, స్వర్గ నరకాలున్నాయని చెబుతూ, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెబతూ, ఒక్కొక్కప్పుడు భయపెడుతూ, నిన్ను దారికి తీసకు వచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప, బలవంతంగా ఎవరూ సాధన చేయించరు నీ చేత. చేసే వాళ్ళకు మాత్రము సహాయం చేస్తారు. బాహ్యంగా చేస్తారు, ఆంతరంగికంగా చేస్తారు. కారణం ఏమిటంటే, ఈ బుద్ధిని ప్రాపంచిక విషయాలనుండి మరల్చి, ద్వంద్వాతీత స్థితిలో, చంచల బుద్ధిని స్థిరబుద్ధిగా మార్చినప్పుడు ఆ స్థిరబుద్ధి రూపమే ప్రజ్ఞ. విషయములను నిర్ణయించకుండా స్థిరమై, స్థిర రూపంలో ఉండిపోవడమే, అటువంటి బుద్ధిరూపమే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఇది వైరాగ్యం చేత, వివేకం చేత, సాధన చేత, శ్రద్ధ చేత, భక్తి చేత, ఎవరైతే గురువుకి నాలుగు విధముల శుశ్రూషలు చేస్తారో, వీటన్నింటికి వారికి స్వాతంత్య్రం ఉంది. ఆ స్వాతంత్య్రాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటే తప్ప, అతనికి ఆత్మజ్ఞానం రాదు. ఒకరు చెబితే రాదు, బలవంతం చేస్తే రాదు. ఈ వివేకాన్ని స్వతంత్రంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగించుకున్నవాడికి తప్పక వస్తుంది.
ఎంత తెలివి ఉన్నా, ఎంత వివేకం ఉన్నా ఆధ్యాత్మిక దృష్టి లేకుండా, ప్రాపంచిక దృష్టితో చూస్తే, ఆ ప్రకృతే అతనికి గుణపాఠం చెబితే, కొట్టబడ్డటువంటి వాడు, ఆత్మహత్యా సదృశమైనటువంటి, నిరాశా నైరాశ్యములతో ఉన్నటువంటి వాడు, అప్పుడు ఎవరో పెద్దలు ఇచ్చిన సలహాను అనుసరించి, ఈ మార్గాన్ని తెలుసుకుందాము అనేదానికి ఉపక్రమిస్తాడు. ఈ ప్రకృతే గుణపాఠం చెప్పి, తన వైపుకు లాక్కుంటుంది ఏమీ ఫర్వాలేదని, అలా సహజంగానే పరిణామం చెంది, సాధన చేసుకోవాలి అని ఉపేక్షించరాదు. ఇవాళ ముస్లింస్‌లో నమాజు చేయాలి ఐదు సార్లు, రంజాను ఉపవాసం చేయాలి, అందర్నీ ప్రేమగా చూడాలి, రంజాను రోజున అందరిని కౌగిలించుకుని, అందరికీ మేలుకలగాలని, అల్లాను ప్రార్థించేవారు, తీవ్రవాదంతో ఎందుకు బలవంతం చేస్తారు? వాళ్ళ ఖురాన్‌లో బ్రహ్మజ్ఞానం లేదు. సూఫీ మతంలో ఉంది కానీ, ఖురాన్‌లో బ్రహ్మజ్ఞానం లేదు. దేవుడున్నాడు, దేవుడు ఒక్కడే సర్వోన్నతుడు. వాడిని నమ్మండి, విశ్వసించండి, భక్తితో నమాజు చేయండి, ప్రార్థనలు చేయండి, ధ్యానం చేయండి, మనం కూడా ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మనము ప్రార్థనలు చేస్తున్నాము, వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడికి అది అంతే ఉంది కాని, వస్తు నిర్ణయంగా, మోక్షంగా నీకు అది లభించే అవకాశం ఉందని, ఖురాన్ ఎక్కడా చెప్పలేదు. బైబిల్ మాత్రం చెప్పింది. అందుకే బైబిలుకు వ్యాఖ్యానం వ్రాసాం. బైబిల్‌ను ‘క్రీస్తు ఏసుగా ప్రకటితం’ అనే గ్రంథ రూపంలో అందించడం జరిగింది. ఖురాన్‌లో ఆ ప్రయత్నం చేద్దామని చూశాం. అదేమీ లేనందున వదిలేశాం. అలా బలవంతంగా వచ్చేది బ్రహ్మజ్ఞానం కాదు. స్వతంత్రంగా తెచ్చుకునేదే బ్రహ్మజ్ఞానం. ఎందుకంటే చివరకు నీవు సర్వ స్వతంత్రమైన బ్రహ్మ స్వరూపమును అందిపుచ్చుకోవాలి. - విజ్ఞాన స్వరూప్ గారు