అయితే, ఈ విచారణ క్రమానికి బలం, సమర్థత, సాధన - అంటే నాలుగు సంధ్యలలో నువ్వు చేసేటటువంటి సాధన. జప తప సాధనలు ఏవైతే ఉంటాయో, ధ్యానసాధనలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాయామ, ఆసన శుద్ధులు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా కలిగిన చిత్తశుద్ధి యొక్క బలం చేత, వాటి ద్వారా ఈశ్వరుని యందు కలిగిన విశ్వాసం చేత, దైవ విశ్వాసం చేత, దైవ బలాన్ని అందుకున్నటువంటి వాడై, ఈశ్వరానుగ్రహాన్ని అందుకున్నవాడవై, ఈ అభిమానాన్ని సులభంగా తొలగించుకోగలుగుతావు. ఇదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఈశ్వరానుగ్రహం అని అందరూ అంటూ ఉంటారు. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటంటే, ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అనేటటువంటి తెర సులభంగా తొలగిపోయి, ఈశ్వర సాక్షాత్కారం కలగడమే ఈశ్వరానుగ్రహం. ఇలా మనమందరం, సాధకులందరం తప్పక సాధించాలి. సాధన సాధ్యమిది.
మరియు తపస్సులన్నిటికంటెను, జలము మొదలగు పంచభూతముల ఉత్పత్తి కంటెను, పూర్వమే ఏదియున్నదో, అది బుద్ధి రూప హృదయాకాశమును ప్రవేశించి భూతములతో కూడా ప్రకాశించుచున్నదో, దానిని జ్ఞానులు చూతురు. అదే ఇది. నీవడిగిన ఆత్మ తత్త్వమిదియే.
ఈ రకంగా ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం పొందిన తరువాత, ఆ ఈశ్వర సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత, సదా నేను ఈశ్వరుడననే నిర్ణయంలో నిమగ్నమై పోయి ఉండడం చేత, సత్వగుణం శుద్ధ సాత్వికమై ప్రకాశించడం మొదలౌతుంది. అట్టి శుద్ధ సాత్విక స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆత్మనిష్ఠులు అవుతారు. వాళ్ళకి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర సాక్షాత్కారం తరువాతే, ఆత్మసాక్షాత్కర జ్ఞానం కలుగుతుంది. ఇది తప్పక నిర్ణయం అన్నమాట.
కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో, మొదట ఈశ్వర సాక్షాత్కారాన్ని మానవులందరూ పొందాలి. సగుణ సాకార పద్ధతిగా కాని, నిర్గుణ నిరాకార పద్ధతిగా కాని, ఈ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతూ ఉంది. సాధారణంగా 99శాతం అందరికీ కూడా సగుణ సాకార పద్ధతిగానే, ఈశ్వర సాక్షాత్కారం, ఇష్ట దేవతా సాక్షాత్కారం జరుగుతుంది. ప్రథమంగా ఆ దైవం తన కళ్ళ ఎదుట మూడు అవస్థలలోనూ ఉన్నటువంటి పరిస్థితిని దర్శనవిధిగా సాధిస్తాడు. ఈ దర్శనం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ దర్శనం మూడు అవస్థలలో చెదిరిపోనిదన్నమాట. అది భావయుక్తమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, మనోభావ రూప, బుద్ధి చలన రూప, చిత్త ప్రవృత్తి రూప, దృశ్యములు కావన్నమాట. యథార్థ దర్శనం, ఎవరికైతే సాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో, అది మూడు అవస్థలలో చెదిరిపోదు. సదా తన కళ్ళముందు నిలచే ఉంటుంది.
అలా పొందినటువంటి దర్శనాన్ని అనుగమించగా, అనుగమించగా, అనుగమించగా, అనుసరించగా క్రమేపి ఆ దర్శన స్థితితో నీకు సంభాషించే శక్తి కలుగుతుంది. సదా దానితో సంభాషిస్తూ ఉంటాడు. సదా దానితో**** ఉంటాడు. ఆ దర్శన స్థితిలో ఉన్నటువంటి దైవతము కూడా నీతో సంభాషిస్తూ ఉంటుంది. ఆ శక్తి నీ చైతన్యమే. ఆ దైవము నీ చైతన్యమే. ఆ ఈశ్వరుడు కూడా నీ చైతన్యమే. అది ‘నా చైతన్యమే’ - చైతన్యమే ఆదిదైవతముగా ఉన్నది, చైతన్యమే అధ్యాత్మముగా కూడా ఉన్నది. కాబట్టి, నేను చైతన్యమే, ఈశ్వరుడు కూడా చైతన్యమే. అనేటటువంటి స్ఫురణ కలగగానే దైవం ఇక బయట ఉండడు. దర్శనంగా ఉండడు. తానైపోతాడు ఇంక. తనకి ఆ దర్శనానికి అభేద స్థితి కలుగుతుంది. ఇట్టి అభేద స్థితి యందు, అంతటా దైవాన్నే చూస్తాడు. అంతటా తన ఇష్టదైవాన్నే చూస్తాడు. అంతటా ఈశ్వరుడినే చూస్తాడు. అంతటా ఈశ్వరీయమైనటువంటి విభూతిని దర్శిస్తాడు. అంతటా ఈశ్వర చిద్విలాసాన్ని గమనిస్తాడు. సర్వాన్ని ఈశ్వరుని యొక్క భావ ప్రతిభా పాటవ విశేషములతో ఈ సృష్టిని అంతాకూడా, ఈశ్వరుడే తనకు తాను ప్రత్యక్షమయ్యేటట్లుగా తాను ప్రకృతి ద్వారా వ్యక్తమౌతున్న విధానం ఎట్లా అవుతున్నాడో, గమనించగలుగుతాడు.అట్టి ప్రతిభావిశేషం కలుగుతుంది, ప్రజ్ఞా విశేషం కలుగుతుంది. అట్టి చైతన్యవికాసం కలుగుతుంది. ఇది కలుగ గానే, అంతటా ఉన్నది చైతన్యమే. ఒక్క చైతన్యమే, అంతటా ఉన్నది. అనేటటువంటి స్ఫురణ మనకి కలుగుతుంది
ఈ రకంగా ఆత్మసాక్షాత్కర జ్ఞానాన్ని కూడా పొందుతాడు. ఇట్లా ఎవరైతే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారో, అంతటా ఉన్నది ఒకే ఒక ఆత్మ. అన్నింటిని తన యందు దర్శించుట, తనను అన్నింటి యందు దర్శించుట అనేటటువంటి అభేద స్థితికి చేరుతాడో, అప్పుడిక తాను పొందదగినది, పొందకోరేది, మరొకటి ఏదీ లేదు కదా! తను అనుభవింపదగినది, అనుభవింపకోరేది, తనకు అన్యమైనటువంటిది రెండవ వస్తువు లేదు కదా! ఈ రకంగా తానైనటువంటి స్థితిలోకి చేరిపోతూ ఉంటాడు. ఇట్లా చేరడం ద్వారా ఆత్మనిష్ఠుడు అవుతాడు.
జ్ఞాత బ్రహ్మానుసంధానం చేయడం ప్రారంభిస్తుంది. తన మూలం అయినటువంటి కూటస్థుడిని ఎఱిగే ప్రయత్నం చేయడం మొదలుపెడుతుంది. జ్ఞాత మిగిలినటువంటి 24 తత్త్వాల యందు ప్రవహించడం, ప్రసరించడం విరమిస్తుంది. తద్వారా తానైన నిష్ఠను పొందగలిగిన స్థితిని పొందుతుంది. తన మూలాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తు్ంది. ఈ రకంగా జ్ఞాత బ్రహ్మాను సంధానంలో ఉంటుంది. ఈ రకంగా బ్రహ్మనిష్ఠను సాధించేటటువంటి దిశగా పరిణామం ప్రారంభమౌతుంది. ఇట్లా ఆత్మదర్శన సిద్ధిని పొందగోరే వారందరు ఈ సూక్ష్మమైనటువంటి, సూక్ష్మతరమైనటువంటి, సూక్ష్మతమమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రత్యగాత్మ స్థితికి తప్పక చేరాలి. సాధకులందరూ కూడా, ఈ రకమైన ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. ఈ రకమైనటువంటి నిర్ణయ క్రమాన్ని పొందాలి. ఈ రకమైనటువంటి దర్శనవిధిని అనుసరించాలి.
(కల్పాంతమందు ప్రళయమగును. అట్టి ప్రళయ సమయమున భూతములన్నియు లయమై అవ్యక్తమే మిగిలియుండును. జీవులు కూడా తమ తమ కర్మవాసనలతో కూడి, సూక్ష్మ శరీరముతో అవ్యక్తమందే నిలిచి యుందురు. మరలా సృష్టి ప్రారంభ సమయమున ఆకాశాది పంచభూతములకంటే ముందుగా హిరణ్యగర్భుడు జన్మించును. అతడే దేవాది సకల శరీరములను సృజించెను. ఆ శరీరములందు జీవునితో పాటు పరమాత్మయు అంతర్యామి రూపమున నివసించును. అట్టి పరమాత్మను జ్ఞానులు మాత్రమే చూచుచున్నారు. మరియు ప్రాణ స్వరూప హిరణ్యగర్భుడు స్థూల ప్రపంచమందలి శబ్దాది విషయరూప అన్నమును భుజించుట చేత, అదితి అని చెప్పబడుచున్నాడు. ఇంద్రాది దేవతా స్వరూపముగా నుండుట చేత సర్వ దేవతామయుడనబడుచున్నాడు. వ్యష్టి ప్రాణులందు లౌదాత్మము నొందుటవలన సర్వ భూతమయుడుగా ఉన్నాడు. అట్టి హిరణ్యగర్భుడు ఏ పరమాత్మను ధ్యానించుచున్నాడో, అటులనే నీవును నీ బుద్ధి గుహలయందు ప్రవేశించినట్టి, పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము.)
ముఖ్యమైనటువంటి క్రమసృష్టి యందు, కల్పాంతమందు మరలా ప్రళయం వచ్చినప్పుడు, లయమైనప్పుడు ఈ సృష్టి క్రమం ఎట్లా ఏర్పడిందో, ఆ పంచీకరణ విధానం ద్వారా ఎట్లా అయితే బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్ మహత్ మహదో మహదహంకారః మహదహంకారో ఆకాశః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః ఆగ్నయోరాపః ఆపయోః పృథ్వి పృథ్వియోః ఓషధీః ఓషధియోః అన్నం అన్నమివ జీవః - ఈ రకమైనటువంటి క్రమ సృష్టి ఏదైతే ఉందో, ఇది మరలా కల్పాంతంలో విరమించి ప్రళయం అవుతుంది. ఆ ప్రళయానికి మరల తిరిగి అవ్యక్తమే మిగులుతుంది. బ్రహ్మము, అవ్యక్తము. ఇంతే ఉండేది. మరలా అవ్యక్తము నుంచి అన్నీ సృజించబడుతాయి. ఆ మహతత్తమనేటటువంటి హిరణ్యగర్భుడు ముందు వచ్చేటటువంటి ప్రాదుర్భవమైనటువంటి స్థితి. ఆ హిరణ్యగర్భుడు ఆదిదైవతానికి అధిష్ఠానం. సర్వ దేవతా స్వరూపము కూడా ఆ హిరణ్యగర్భస్థానం నుంచే వ్యక్తమౌతోంది. సృష్టి క్రమమంతా ఆ హిరణ్య గర్భస్థానము నుంచే వ్యక్తమౌతోంది. ఇది ఆరవ కోశము. షట్కోశము. కాబట్టి మానవుడు తనకు తాను పంచకోశముల వరకే తెలుసుకుంటే సరిపోవడం లేదు. ఈ హిరణ్యగర్భుడి వరకు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆరవకోశమైనటువంటి ఆది దైవతాన్ని తెలుసుకోవాలి. సర్వదేవతలు ఇంద్రాది సమస్త దేవతలు, బ్రహ్మనిష్ఠులు, దిక్పాలకులు, ఇంద్రియాది అధిష్ఠాన దేవతలు... సమస్తము పంచీకరణలో చెప్పబడినటువంటి విధానంలో పృథ్వీ పంచకంలో ఏ అధిష్ఠాన దేవతలుంటారో చెబుతారా ఎవరైనా?- విద్యా సాగర్ గారు