దేనికీ బాధ్యుడు కాకుండా, దేనికీ కారణం కాకుండా, తనకు తానే స్వతఃసిద్ధంగా ఉన్నటువంటి బ్రహ్మ. అటువంటి బ్రహ్మనే అధిష్ఠానము అంటాము. ఆ స్వయంప్రకాశ, స్వయంప్రభగా ఉన్న బ్రహ్మ మాయావరణయందు కూడా తన ప్రకాశం వ్యాపించగా, మాయ కారణంగా వ్యాపించగా అక్కడ మాయలో తోచినదంతా బ్రహ్మకి ఏమీలేదు. చిల్లుల కుండలో ఉన్నటువంటి, మహాదీప ప్రకాశము స్వయం ప్రకాశం గానే ఉంది. కుండకు ఉన్న చిల్లుల ద్వారా ప్రకాశం, బయటకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ కుండకు వెలుపల అంతా మాయావరణ. ఆ మాయావరణ యందు చిల్లుల యొక్క ప్రకాశమంతా కూడా వ్యాపించింది. స్వయం రూపమైన బ్రహ్మకు హాని యేమొచ్చింది? ఆయన వికారం చెందాడా? నానా ఛిద్ర ఘటోదర స్థితిగా, స్వయం ప్రభగా ఉన్నటువంటి బ్రహ్మ, ఘటముయొక్క వెలుపల, ఆ రంధ్రముల ద్వారా, ఆ ఛిద్రముల ద్వారా వెలువబడిన బాహ్య ప్రకాశము కూడా, బ్రహ్మము యొక్క ప్రకాశ లక్షణమే అయ్యింది. ఆ ప్రకాశానికి కూడా కర్తృత్వాలు, భోక్తృత్వాలు లేవు. ఆ ఘటము యొక్క వెలుపల అంతా, మాయావరణం చేత, మాయ లేనిది ఉన్నట్లు చూపించడం చేత, ఆ వెలుపల ప్రకాశంగా ఉన్నటువంటి బ్రహ్మకి సర్వకారణత్వం ఆపాదించబడింది. సర్వ సాక్షిత్వం కూడా ఆపాదించబడింది. నిరావరణ బ్రహ్మయందు, సర్వ కర్తృత్వము, సర్వ సాక్షిత్వము, సంగత్వ అసంగత్వములు ఏవీ లేవు.
ఈ రంధ్రముల గుండా మాయావరణలోనికి వ్యాపించినటువంటి, శుద్ధ చైతన్య ప్రకాశమే బ్రహ్మము. ఆ మూలప్రకృతి అనే అవ్యక్త స్థితిలో, మాయావరణమునందు వ్యాపించిన బ్రహ్మ ఆ అవ్యక్త స్థితిని బాధించి, ఆ అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి, రూపాలను, క్రమక్రమంగా, ముందు సూక్ష్మముగా, బ్రహ్మాండముగా వ్యక్తీకరించి, తరువాత స్థూలముగా పిండాండములుగా, జీవోపాధులుగా, జీవుడిగా, ఈశ్వరుడిగా, జగత్తుగా వ్యక్తం చేసింది. కనుక మాయావరణలో, కుండ లోపల ఉన్నటువంటి, ఆ స్వయం ప్రకాశము యొక్క ప్రకాశము, లోపల, వెలుపల కూడా ఉన్నప్పుడు, లోపలిదేమో సత్యమై, స్వయం ప్రకాశమై, స్వప్రకాశమై ఉంది. కుండయొక్క వెలుపల ఉన్నటువంటి మహాదీపముయొక్క బాహ్య ప్రకాశము వ్యాపకమై, తమస్సుని, మూల ప్రకృతిని, అవ్యక్తాన్ని వ్యక్తముగా అయ్యే విధముగా చేసింది కాబట్టి, ఆ బాహ్య ప్రకాశము జగత్తుకి, బ్రహ్మాండానికి, పిండాండానికి కారణమే.
అయితే, మాయావరణలోనే ఆ కారణం ఉంది కనుక, మాయ అంటే ఏది లేదో దానిని చూపిస్తుంది కనుక, బ్రహ్మ పరోక్షముయొక్క కారణత్వము మాయాకల్పితమే కనుక, నిజానికి బ్రహ్మకు కారణము లేదు. అయితే సాధకులు, మాయావరణలో ఉన్నవాళ్ళు, మాయని దాటేదాకా, ఆ సర్వకారణమైనటువంటి బ్రహ్మని, ఆ బ్రహ్మ కారణంగా ఉన్నటువంటి అసద్రూప జగత్తుని, సద్రూప బ్రహ్మని ఒకటిగా చూడాలి. అప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే. చూడబడే ఈ నామరూప ప్రపంచముగా ఉన్నటువంటి, జగత్తు కూడా సర్వమూ బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ
ఈ చూడబడేదంతా బ్రహ్మమే. చిత్ జడములయందు, జడమును విస్మరించి, త్రిగుణాత్మక సృష్టియందు గుణములను విస్మరించి, సర్వవ్యాపక చైతన్యాన్ని మాత్రమే దర్శిస్తే, అప్పుడు సర్వం ఖల్విదం బ్రహ్మ. సర్వవ్యాపక చైతన్యమును దర్శించకుండా, గుణమయంగా, నామరూపమయంగా, అవిద్యాదోషముతో, విషయాసక్తితో చూచినప్పుడు ప్రపంచము నిజము. విషయాసక్తి లేకుండా, గుణములు విస్మరించి, నామరూపములు చూడకుండా, వాటికి ఆధారభూతమైన, కేవల బ్రహ్మచైతన్యాన్ని మాత్రమే చూడగలిగితే, అది సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇలా చూడడం అనేది జ్ఞాన చక్షువుకే సాధ్యము. కాని అభ్యాసం చేస్తే, విషయవాసనలు కొంతకాలానికి క్షయమైపోయి, నామరూప ప్రపంచం తోచటమే ఉండదు, ఇంకా తోస్తూ ఉంటే ఆ ప్రపంచాన్ని మిథ్యాభావంతో చూడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఒకవేళ కనబడితే, దానికి అసంగంగా ఉండడం అనేటటువంటి సాధన చేయాల్సి వస్తుంది. అసంగముగా, కేవల సాక్షిగా ఉండే సాధన చేయాల్సి వస్తుంది. పరబ్రహ్మ స్వరూప నిర్ణయం అయినప్పటికి, ఈ ప్రపంచము తోస్తూనే ఉంది, పోవటం లేదు. అప్పుడు ఏమిటి గత్యంతరం? జగత్తును కూడా బ్రహ్మగా చూచేటటువంటి దృష్టి ఉంటే సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆ విధంగానే ప్రపంచాన్ని చూసే దృష్టి ఏర్పడాలి. మంచివారికి ప్రపంచమంతా మంచిగా కనిపిస్తుంది. చెడ్డవారికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనబడుతుంది. దైవస్వరూపుడికి ప్రపంచమంతా దైవస్వరూపముగా కనబడుతుంది. బ్రహ్మచైతన్యానుభవంలో ఉన్నవాడికి, జగత్తు అంతా బ్రహ్మచైతన్య రూపముగా కనబడుతుంది. దీనికి మనము అభ్యాసం చేయవచ్చును. అసాధ్యమేమీ కాదు.
స్థూల శరీరానికి ఫోటో తీస్తే, నామరూపాలు, రంగులు, ఆకర్షణ ఉంటాయి. అదే సూక్ష్మ రూపానికి తీస్తే, ఒక చిన్న వెలుగు అనేటటువంటిది పడుతుంది. ఎక్స్‌రే ఫోటో తీస్తే, ఎముకలు మాత్రమే పడుతాయి. స్కానింగ్ తీస్తే మాంసము ముద్ద కనిపిస్తుంది. మామూలు కెమేరా అయితే, రంగురంగులుగా అందంగా, అలంకారంగా పడుతుంది. కిర్లియన్ ఫోటో తీస్తే, తేజోరూపం కనబడుతుంది. జ్ఞాన చక్షువు అనే కెమేరాతో చూస్తే, ఇవన్నీ కనబడకుండా, అంతటా ఆత్మే ఆత్మమయంగా కనబడుతుంది. ఇదీ జ్ఞాననేత్రంతో చూసే దృష్టి. ఆ దృష్టితో ఉన్నవాళ్ళే, సర్వం ఖల్విదం బ్రహ్మగా చూడగలుగుతారు. ఇది సాధ్యమే. మామూలు కెమేరాకి, రంగురంగులు కనపడ్డట్టుగా, కిర్లియన్ ఫోటోగ్రాఫ్‌కి, సూక్ష్మతేజమే కనపడినట్లుగా, ఋషులు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కారణ, మహాకారణ శరీరంలో ఉండే వాసన రూపంలో ఉన్నదానిని దర్శిస్తున్నట్లుగా, జ్ఞాన చక్షువుతో ఉన్నవారు, అంతటా ఆత్మచైతన్యాన్నే దర్శిస్తారు. ఎందెందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ మాత్రం కనబడవు.
ఒకవేళ కనబడితే అవన్నీ నేనే అన్నప్పుడేమో విభూతి స్వరూపము. వాటిన్నటిలో నేను ఉన్నాను అనేది సర్వాత్మభావము. వీటన్నటిని నేను చైతన్య స్వరూపముగా చూస్తున్నాను అనంటే, సర్వం ఖల్విదం బ్రహ్మ. అనేక మిఠాయిలు ఉన్నప్పుడు, మిఠాయిని కాకుండా, అందులో ఉన్నది పంచదార మాత్రమే అని చూచినప్పుడు, సర్వం ఖల్విదం బ్రహ్మ. పంచదార చిలకలు, నెమళ్ళు, బాతులు, కుందేళ్ళు, ఏనుగులు అన్నీ పంచదారతో చేసిన బొమ్మలు ఉన్నాయి. చిన్నపిల్లవాడికి, ఆ బొమ్మల రంగులు, సైజులు, ఆకారాలు కావాలి. పెద్దవారికి అది తినేపదార్థం. తీయగ ఉంటుంది అని తెలిసినటువంటి పెద్దపిల్లవాడు బొమ్మ బాగుండక పోయినాసరే ఏనుగును తీసుకుని తింటాడు. చిన్నపిల్లవాడేమో అందంగా ఉన్నటువంటి, చిన్న చిలకను తీసుకుని తింటాడు. ఈ పెద్దవాడి దృష్టి ఏమిటి? అంతా పంచదారేగా అని. చిన్నపిల్లవాడి దృష్టికి పంచదార కనబడడం లేదు. నామరూపాలు కనబడుతున్నాయి. కాసేపు ఆడుకుని, ఆడుకుని ఎప్పుడో తింటాడు. పెద్దవాడు వెంటనే తింటాడు, చూస్తూ ఆనందించడు. అలాగే సర్వం ఖల్విదం బ్రహ్మ అనేవాడు, వెంటనే స్వానుభవంలోకి వెళ్తాడు. నామరూప జగత్తు కనబడుతున్నప్పటికీ, వాటిని చైతన్యము యొక్క వికారాలుగా చూస్తాడు. ఆ పరమాత్మ యొక్క విభూతిగా చూస్తాడు. ఇన్ని రకాలుగా కనపడింది అంతాకూడా, ఆ పరమాత్మే కదా అని చూస్తాడు. ఇదే జ్ఞాననేత్రంతో చూసే దృష్టి. ఇదే సాధకులు అవలంబించవలసినది.- విజ్ఞాన స్వరూప్ గారు