అసలు రోజు మొత్తం మీద ‘నేను ఈశ్వరుడు’ అనే తలపు కలుగుతోందా? కలగటం లేదు కదా! నేను అది అయ్యి ఉంటే, నాకు అది తోచి ఉండాలి కదా! నా సహజ స్థితిలో నాకది ఎప్పటికీ తోచడం లేదు కదా! నేనేదో మూడడుగులు, నాలుగడుగులు వెడల్పు ఉన్నటువంటి మనిషిగానే, మానవ శరీరంగానే తోస్తున్నానే గాని, నాకు ‘నేను ఈశ్వరుడను’ అన్న తలపే రావడం లేదు కదా! మరి ఎట్లా అవుతాను నేను? అనేటటువంటి సందేహం అందరికి ఉండవచ్చు. అందుకని ప్రతి ఒక్కదానిని సనాతన ధర్మంలో ‘నాహం కర్త, హరిః కర్త’ - అనే పద్ధతిగా ప్రార్ధన చేయమన్నారు. దీనికి ‘నిష్కామ కర్మ’ అని పేరు.
ఈ ‘నైష్కర్మ్యసిద్ధి’ ని సాధించకుండా, ఈ నిష్కామకర్మను సాధించకుండా మానవుడు ఈ అభిమానాన్ని ఏమీ చేయలేడు. అప్పుడు ప్రతీ ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి మొట్టమొదటి నియమము, సిద్ధి ఏమిటయ్యా అంటే, నిష్కామకర్మ. సర్వకర్మఫలములను నాకర్పించుము - అంటున్నాడు భగవద్గీతలో. ‘సర్వధర్మాన్ పరిత్యజ్య’ - అని కూడా అంటున్నాడు. ‘మాం ఏకం శరణం వ్రజ’ – శరణాగతుడవై చేయి. నీవు లేనివాడుగా చేయి. లేక ఉన్నవాడుగా వ్యవహరించు. ఇదేమిటండీ, ఉన్నవాడుగా వ్యవహరించాలంటేనే నానా తిప్పలు పడుతుంటే, లేక ఉన్నవాడిగా ఎట్లా వ్యవహరిస్తారు అంటే, నీ గాఢనిద్రావస్థలో నువ్వు లేవు కదా! అయినా సామాన్య వ్యవహారం చేస్తూనే ఉన్నావుగా! మరి అప్పుడు ఏమైనా విశేషాలు ఉన్నాయా? కర్మఫలం ఉన్నదా? లేదు కదా! అట్లే మెలకువలో, స్వప్నంలో కూడా సామాన్య వ్యవహారం చెయ్యి. కర్తవ్యం వరకే చెయ్యి. ధర్మం వరకే చెయ్యి. నేను కర్తను కాదని చెయ్యి. నేను భోక్తను కాదని చెయ్యి. కర్త ఈశ్వరుడు. నేను అన్న స్థానంలో ప్రతీ ఒక్కరూ కూడా ఈశ్వరుడిని పెట్టుకోవాలి.
అందరు తల్లులు పిల్లలని పెంచుతూ ఉంటారు. నేనే ఈ పిల్లవాడిని కన్నానండి. నానా కష్టాలు పడి పెంచానండి. ఈ పిల్లవాడి చిన్నప్పుడు ఎవ్వరి సహాయం అందలేదండి. నేను అలా కష్టపడ్డానండీ, నేను ఇలా కష్టపడ్డానండి, ఎన్ని కష్టాలుపడో పిల్లవాడిని పెంచుకున్నానండి. అని పిల్లవాని తోటి మమకారానుబంధాన్ని కలిగి ఉంటారు. ఇది స్త్రీ సహజమైనటువంటి, ప్రకృతి సహజమైనటువంటి లక్షణముగా మనం స్వీకరిస్తాము. అయితే ఇందులో సత్యం ఎంత ఉందని మనం ఎప్పుడైనా విచారించామా? అలా విచారణ చేస్తే ఏమౌతుందంటే, ఆత్మవిచారణ దృక్పథంతో చూచినప్పడు, సర్వజీవులను సృష్టిస్తున్నవాడు ఎవడు? ఈశ్వరుడు కదా! సర్వ జీవులను పోషిస్తున్నవాడు ఎవడు? ఈశ్వరుడే కదా! మరి నేను కన్నాను అనటంలో అక్కడ నిమిత్తమాత్రపు ధర్మమే ఉంది కాని, వాస్తవికమైనటువంటి సత్యము లేదు. అట్లే, నేను పోషించాను, నేను పెంచాను అనడంలో కూడా నిమిత్తమాత్రపు ధర్మము, నిమిత్తమాత్రపు కర్తవ్యమే కలదు కాబట్టి. (అయితే) నీవేమి చేయడం లేదు అని అక్కడ చెప్పడం లేదు. కాని, ‘ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా చేస్తున్నాను’ - అనే భావన వల్ల ఈ అభిమానపు తెరను తొలగించుకోగలుగుతాము.
అనేకమంది మనకు జీవితంలో సహకరిస్తూఉంటారు. అనేకమంది సహాయాన్ని మనం పొందుతూ ఉంటాము. పొందినప్పుడల్లా ఎవరు సహాయం చేశారమ్మా నీకు? అని నేను అడిగితే ‘ఈశ్వరానుగ్రహం’ అండి, దేవుని దయవలన నేను ఈ పనిని పూర్తిచేయగలిగాను. పూర్తి చేయగలిగాను అనడంలో కూడా అహం ఉంటుందన్నమాట. ఈ పని పూర్తి చేయబడింది. ఈ పని పూర్తి చేయడం జరిగింది. కేవలం ఈ సృష్టిలో అన్ని పనులు జరగటమే ఉంది కానీ, చేయడం లేదు. ఆ సమయానికి అన్నీ కలిసి వస్తే, అది జరుగుతోంది. ఏ ఒక్కటి లోపించినా కూడా అది జరగడం లేదు. మరి అట్లా కుదురుస్తున్నటువంటి కాలానికి, అలా కుదురుస్తున్నటువంటి కాలరూపుడైన ఈశ్వరుడికి, అలా ఫలితాలు వచ్చేటట్లుగా చేస్తున్నటువంటి కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడికి చెందాలే కాని, నీకు చెందటం అసమంజసం కదా! అన్యాయం కదా! అధర్మం కదా! మరి ఆ రకమైనటువంటి అభిమానాన్ని భుజాన వేసుకోవడం వల్ల, ‘మమకారము, అహంకారము’ - ఈ రెండూ బలపడుతున్నాయి. తద్వారా ‘ఈ జగత్తు నాకు భోగ్యమైనటువంటిది. నేను అనుభవించడానికి తగినటువంటిది’ అనేటటువంటి దృష్టితో జగత్తును చూస్తున్నాము. ఓహో! ఇది చాలా బాగుంది. ఇది ప్రియం. ఇది అప్రియం. ఈ ప్రియము, అప్రియము.... ప్రియం మోదం ప్రమోదాలుగా మారి, మోహంగా మారి, అనుభూతమౌతూ, బంధించుతూ, అభిమానగ్రస్థమయ్యేటట్లు చేస్తూ, మెల్లగా నడిపిస్తుంది.
కాబట్టి సాధకులందరు తప్పక సాధించవలసినటువంటి లక్షణం ‘నిష్కామకర్మ’. మరి అట్టి తటస్థ లక్షణాన్ని, సాక్షిత్వ సాధనని స్వీకరించినటువంటి వారు మాత్రమే, తనను తాను బుద్ధి నుంచి వేరుపరచుకుంటారు. ఎవరైతే అట్లా బుద్ధినుంచి వేరుగా అయ్యారో, వేరు పడ్డారో, స్వానుభూతమై, బుద్ధి సాక్షిణి, ‘సాక్షిణీ, సాక్షి వర్జితా’ అని లతితా సహస్రనామంలో కూడా వస్తుంది. కాబట్టి, బుద్ధి సాక్షిణి, అయినటువంటి స్థితికి చేరాలి. ఆ మహతత్త్వానికి చేరాలి. అప్పుడు సహజముగా నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. నేను ఈశ్వరుడను, అనీశ్వర భావం పోతుంది. నిరీశ్వర భావం పోతుంది. సదా అదే భావనలో ఉండడానికి నీవు ఉద్యుక్తమౌతావు.
ఎందుకంటే, అది ఆనందప్రదం. అది సహజముగా ఆనందనిలయం. కాబట్టి, ఒకటి చేయడం ద్వారానో, ఒకటి చెందడం ద్వారానో, ఒకటి చేయకపోవటం ద్వారానో ఇప్పటి వరకూ కలుగుతున్న వన్నీ, సంతోషములు, సుఖదుఃఖములు. నిజానికి ఆనందములు కావు. కారణ రహితమైనటువంటి సుఖము ఏదైతే ఉందో, అదే, దాని పేరే ఆనంద ప్రతిబింబము. అక్కడ సుఖదుఃఖాలు అనే అలలు లేవు. సాగర గర్భము వలె గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది. నిరంతరాయమైనటువంటిది. నిరుపమానమైనటువంటిది. నిశ్చలమైనటువంటిది. అటువంటి నిశ్చలము - నీరవత్ స్థితికి చేరుకునేటటువంటి స్థితికి మానవుడు, ఈ అభిమానము అనేటటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ అభిమానము అనే తెర తొలగించబడాలి. ఈ తెర తొలగించగలిగే శక్తి అమ్మకు ఉన్నది. అమ్మ యొక్క అనుగ్రహం చేత, మానవులందరు ఈ తెర తొలగించబడి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు.
ఈశ్వరుడే సర్వజీవులకు తండ్రి. ప్రకృతి తల్లి. కాబట్టి ప్రకృతి యొక్క సహాయంతో, నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయుక్తిక, వ్యక్తిగత సంఘటనలు అన్నింటిని, ప్రకృతి యొక్క వరదానంగా, ఈశ్వరుడి యొక్క వరదానంగా, ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఈశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవడానికి మార్గంగా, ఇచ్చినది కాదనక, రానిది కోరక, తన కర్తవ్యాన్ని సేవకుని వలె, ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె, తన కర్తవ్యాన్ని నాలుగు ఆశ్రమ ధర్మాలలో స్పష్టంగా ఎవరైతే నిర్వచించుకుని ధర్మంతో నిర్వహిస్తారో, మోక్ష కాంక్షతో నిర్వహిస్తారో, సామాన్యముగా నిర్వహిస్తారో, విశేషమైనటువంటి లక్షణాలు లేకుండా నిర్వహిస్తారో, మానసికమైనటువంటి పరిణతి, బుద్ధి యొక్క పరిణతి చేత, నిష్కామ కర్మను సిద్ధింప చేసుకుని, ఆ నైష్కర్మ్యసిద్ధి యొక్క బలం చేత, నేను అనేటటువంటి అహంభావనను తొలగించుకుని, ఆ నేను స్థానంలో, ఈశ్వరుడే కర్త, ఈ పిల్లవాడిని ఎవరు చదివించారమ్మా ఇంత బాగా? నేనే చదివించానండి! ఈ పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడు? నా వల్లే అయ్యాడండి! ఈ రకమైనటువంటి కర్తృత్వభావాన్ని త్యజించాలన్నమాట. ఈ భర్తగారు ఇంత బాగా అవ్వడానికి కారణం ఏమిటమ్మా? అంటే నేనే అయ్యానండీ అని ఏ భార్యా చెప్పదు. నావల్లే ఈయన ఇంతవాడయ్యాడండి, ఆయన చెప్పుకుంటాడు. నా భార్య యొక్క సహకారం చేత, నేను ఇంతవాడిని అయ్యాను. నేను ఈ పనులన్నీ సాధించాను. అట్లాగే భార్యగారు కూడా చెప్పుకుంటారు, నా భర్తగారి యొక్క సహకారం వల్ల నేను ఈ పనులన్నీ చేయగలిగాను. ఇలా నీ గురించి మరొకరు చెప్పుకున్నప్పుడు కూడా నీలో అభిమానము ప్రవేశిస్తుంది.
ప్రశంస ద్వారా కూడా అభిమానము కలుగుతుంది. అయితే సామాన్య రీతిగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొంగక, కుంగక ఉంటారు. ప్రశంస చేత పొంగరు, తెగడ్త చేత కుంగరు. ఓహో! అలాగా? ఈశ్వరానుగ్రహం. అని ఎవరైనా ఒక వేళ ప్రశంసించినప్పటికీ కూడా, ఆ ప్రశంసలన్నీ ఈశ్వరునికి ధారపోస్తారు. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం.... అనేటటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళేమీ స్వీకరించడం లేదు. స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి, ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్నేమీ బాధించలేదుగా. మనమేమీ దానిని స్వీకరించలేదు. అట్లా మానసికంగా భౌతికంగా శరీరభావన నుంచి, దేహభావన నుంచి, కర్తృత్వ భావన నుంచి, భోక్తృత్వ భావన నుంచి, తనను తాను వేరుచేసుకోవడానికి, ఈ సాంఖ్యవిచారణ క్రమాన్ని, ఈ పంచీకరణ యొక్క విధానాన్ని, పంచకోశ విరమణకు, పంచకోశ నిరసనకు ప్రతీ ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి. ఇది ఆంతరిక సాధన. ఇది ప్రతి నిత్యం చేయవలసినటువంటి సాధన. అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. - విద్యా సాగర్ గారు