కాబట్టి ధ్యానం అంటే నిద్ర పోయేదో, విశ్రాంతి తీసుకునేదో, ఉపరమించేదో .. అలాంటి శరీర స్థానం నుంచి మనసనేటటువంటి స్థానం మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఇది నీ లోపల ఙాత అనే సాక్షి, బ్రహ్మాండ సాక్షియైన కూటస్థ స్థితిని పొందే విధానం ఏదైతే ఉందో దానికే ధ్యానం అని, తారకం అనీ పేరు. దానికే తరణమని పేరు. కాబట్టి మధనం చేయాలి. ఎవరైతే ఈ మధనాన్ని చేస్తారో, ఆ మధనం ఆ మానసిక ఆశ్రయం ద్వారా సద్గురు కృపను పొందుతారో వారు మాత్రమే ఈ జ్ఞాత, కూటస్థుడు అభేదము, పరమాత్మ, ప్రత్యగాత్మలు అభిన్నులు అనేటటువంటి సాక్షాత్కార ఙానాన్ని పొందుతారు
ప్రాణ రూప హిరణ్యగర్భుడున్ను, అగ్ని రూప విరాట్టున్ను పరబ్రహ్మమేయని చెప్పగా, నచికేతుడు, ఓ యమధర్మరాజా! హిరణ్యగర్భ రూపము చేతను, విరాడ్రూపము చేతను ఆ పరబ్రహ్మమును ఏల ఉపదేశించెదవు? సాక్షాత్ పరబ్రహ్మమునే నాకు ఉపదేశింపుమనెను.
అందుకని నచికేతుడు ఏమని అడుగుచున్నాడు, యమధర్మరాజుని?- క్రింది స్థితి, పై స్థితి రెండెందుకు చెప్తున్నావు నాకు? నాకా విరాడ్రూప స్థితి అవసరం లేదు. అంటే అర్ధం ఏమిటి?- నచికేతుడు బ్రహ్మనిష్ఠుడై ఉన్నప్పటికి, సరాసరి పరమాత్మ సాక్షాత్కార ఙానాన్ని అడుగుతున్నాడు. సరాసరి పరమాత్మ స్థితిని తెలిసికోగోరుచున్నాడు, సరాసరి పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుచున్నాడు.
ఎందుకనిట? తనకు సాధ్యం అయిపోయిన దాన్ని మరల చెప్పటం ఎందుకు. బ్రహ్మగారు ఏం చేసారట? విరాడ్రూపాన్ని ప్రతిపాదిస్తూ, ఆ విరాడ్రూపానికి లక్ష్యంగా పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని చెప్పారు. కాబట్టి నాకా విరాడ్రూప స్థితి అవసరం లేదు.ఎందుకని నేను అయ్యే వచ్చాను. ఎందుకని నేను తురీయనిష్ఠలో ఊండబట్టే యమధర్మరాజును దర్శించ గలిగేటటువంటి సమర్థనీయుడనై వచ్చాను. కాబట్టి మనకున్నటువంటి మహా కారణ స్థితిని , మహర్షిత్వ స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మఙాన స్థితి. ఆ బ్రహ్మజ్ఞాన స్థితి గురించి తనకు కరతలామలకంగా తెలుసు కాబట్టి, పొందవలసినటువంటి లక్ష్యార్ధం గురించే ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ.
వాచ్యార్ధంగా నాకు ఇదంతా తెలుసు. ఏమిటి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలు; విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు. అందులో ఈ విరాడ్రూప విశేషమంతా కూడ నాకు తెలిసిందే. కాబట్టి నేను తెలుసుకో గోరుతున్నది ఏమిటంటే పరబ్రహ్మ సాక్షాత్కారమైనట్టి , పరమాత్మ స్థితిని గురించి నాకు ఉపదేశించండి అని వినయంతో యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు.
అంతట యమధర్మరాజు, ఓ నచికేతా! ఆ పరబ్రహ్మము మనోవాక్కులకు అతీతముగా ఉన్నది. రూపము, గుణము గల వానినే శబ్దము బోధించగలుగుచున్నది. రూపరహితమైనటువంటి, గుణ రహితమైనటువంటి పరబ్రహ్మను బోధించుటకు శబ్దము సమర్ధము కాదు. అందుచే విశేషములతో కూడిన హిరణ్యగర్భ, విరాడ్రాది రూపముల ద్వారా, నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును నీవు తెలుసుకొనుమనెను.
ఇట్లా బాబు నచికేతా! నీవు తెలుసుకోవాలి అనుకోంటే మనోవాగతీతమైనటువంటి పరమాత్మను, పరబ్రహ్మమును మనసు ద్వారా వాక్కు ద్వారా తెలుసుకోవటం సాధ్యమయ్యే పనికాదు. కారణం ఏమిటంటే ఈ మనస్సు, వాక్కు శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తాయి. శబ్దాతీతమైనటువంటి దాన్ని గ్రహించగలిగే శక్తి వీటికి లేదు. కాబట్టి శబ్దాతీతమైనటువంటి పరబ్రహ్మము, పరమాత్మ “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే“ అనే పద్ధతిగా ఉన్నాయి. ఎవరైతే “వాంగ్మే మనః ప్రతిష్టతః” - వాక్కును తీసికెళ్ళి, మనఃసంయమనమందు, వాక్కు మనసు సంయమింప చేసినవాడై, అలాగే మనసును తీసికెళ్ళి బుద్ధి యందు, బుద్ధిని మహత్తత్త్వము నందు, మహత్తత్త్వమును అవ్యక్తము నందు, అవ్యక్తమును ప్రత్యగాత్మ యందు సంయమింపచేసేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో, ఆ రకమైనటువంటి సాధనా క్రమం సాధించేటటువంటి వారెవరైతే ఉన్నారో, ఆ సంయమన విద్య చేత, ఆ అధియజ్ఞం చేత, ఆ ఆంతరిక యజ్ఞం చేత, జ్ఞానయజ్ఞం చేత ఆ రకమైన నిర్ణయానుభూతిని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మౌనమనేటటువంటి ఆశ్రయం ద్వారా, శబ్దాతీతమైనటువంటి పద్ధతి ద్వారా ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది.
బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.
కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.
కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.
నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.
జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.
అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.
కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.
దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై, ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.
అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు.- విద్యా సాగర్ స్వామి