హిజ్బుల్ ముజాహిదీన్ పోస్టర్‌బాయ్‌గా పేరున్న సమీర్ టైగర్ రాజకీయ నాయకులపై దాడులు చేయడంతో సిద్ధహస్తుడు. దాదాపు 80 మంది యువకులను ఉగ్రవాదం వైపు నడిపించాడు. ఈ క్రమంలో హజ్బుల్‌కు కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఇతని ఫొటోకూడా 2017 నవంబర్ వరకు భద్రతా దళాలకు చిక్కలేదు. కొన్నేళ్లుగా సమీర్ భద్రతాదళాలకు దొరక్కుండా తిరుగుతున్నాడు. ఇటీవల సైన్యం పుల్వామాలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయడంతో ఇన్ఫార్మర్లను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు ఓ పోలీస్ ఇన్ఫార్మర్‌ను కిడ్నాప్ చేశాడు. సైన్యం ఆచూకీ చెప్పాలని అతడిని చిత్ర హింసలకు గురిచేశాడు. ‘ శుక్లాకు చెప్పు సింహం వేట ఆపగానే కుక్కలు అడవి తమవే అనుకుంటాయి. నిజంగా అతడు తల్లిపాలు తాగితే నా ముందుకు రమ్మను’ అంటూ శౌర్య చక్ర గ్రహీత మేజర్ రోహిత్ శుక్లాకు సవాలు విసిరాడు. ఈ తతంగం మొత్తాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది కశ్మీర్ లోయలో ఇది వైరల్‌గా మారి శుక్లా వద్దకు చేరింది. సమీర్ టైగర్ సవాల్‌ను మేజర్ శుక్లా స్వీకరించాడు. వెంటనే వేటను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పుల్వామాలోని ద్రబ్గామ్ గ్రామంలో నక్కిఉన్నట్లు సైన్యానికి సమాచారం అందింది. వెంటనే శుక్లానే స్వయంగా ఆయుధం చేతబట్టి ఆపరేషన్‌కు నేతృత్వం వహించాడు. ఉగ్రవాదులు నక్కిన ఇంటిని సైన్యం చుట్టుముట్టింది. తొలుత సమీర్‌ను లొంగిపోవాలని రోహిత్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. స్థానికులతో కూడా చెప్పించాడు. కానీ ఇంటిలోపల నుంచి సమీర్ సైన్యంపై కాల్పులు ప్రారంభించాడు. ఇంకేముంది ఇరువర్గాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. ఇదే సమయంలో ఉగ్రవాదులకు మద్దతుగా అల్లరి మూకలు రాళ్లు రువ్వడం మొదలుపెట్టాయి. కానీ సైన్యం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తొలుత సమీర్ సహచర ఉగ్రవాది ముస్తాక్‌ను మట్టుబెట్టాయి. తర్వాత కలుగులోని ఎలుకవలే బయటకు వచ్చిన సమీర్ సైన్యానికి ఎదురుపడ్డాడు. దీంతో వీరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో సైన్యందే పైచేయి అయింది. ఎట్టకేలకు హిజ్బుల్ కమాండర్‌ను మట్టుబెట్టి భారీ విజయం సాధించింది. సమీర్‌ను మట్టుబెట్టే క్రమంలో మేజర్ రోహిత్ శుక్లా ఛాతికి తీవ్రమైన గాయాలయ్యాయి. కానీ అతడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముష్కర నాయకుడిని మట్టుబెట్టాడు. ఈ ఆపరేషన్‌ను ఆయనే స్వయంగా ముందుడి నడిపించడం విశేషం. శుక్లాను సవాల్ చేసిన 24గంటల్లోపే ఉగ్రవాదులను మట్టుకరిపించి శౌర్యచక్ర తనను ఎందుకు వరించిందో చాటిచెప్పాడు.
బుర్హాన్ వనీ తర్వాత పోస్టర్ బాయ్ ఇమేజ్ సమీర్‌దే..
కశ్మీర్ లోయలో బుర్హాన్ వనీ తర్వాత అత్యధిక మంది యువతను ఉగ్రవాదం వైపు నడిపించింది సమీర్ టైగరే. తొలిసారి ఇతని ఫొటో 2017 నవంబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో ఇతను పట్టుకున్న అత్యాధునిక ఎం4 తుపాకీ ఆమెరికాలో తయారైందిగా గుర్తించారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాక్‌కు అమెరికా ఇచ్చే ఆయుధాలు కశ్మీర్‌లో ఉగ్రవాదులకు చేరుతున్నాయని తొలిసారి అధికారికంగా గుర్తించారు. సమీర్‌పై రూ.10లక్షల బహుమతి కూడా ఉంది.
ధైర్యసాహసాలకు మారుపేరు రోహిత్ శుక్లా..
రాజ్‌పుత్ రైఫిల్స్ రెజిమెంట్‌కు చెందిన రోహిత్ శుక్లాకు సాహసిగా పేరుంది. ఆయన ప్రస్తుతం కశ్మీర్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్నారు. గత ఏడాది పుల్వామాలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో సమీర్ టైగర్ సహచరులను రోహిత్ నేతృత్వంలోని బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఏడాది మార్చి 27న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు శౌర్యచక్ర అవార్డును ప్రదానం చేశారు. గత ఏడాది ఎన్‌కౌంటర్ కారణంగానే తాజాగా సమీర్ టైగర్ రోహిత్ శుక్లాను సవాలు చేసి మృత్యువును కొనితెచ్చుకున్నాడు. ఈ ఘటనతో భారత సైన్యాన్ని సవాలు చేస్తే ఎటువంటి గతి పడుతుందో ఉగ్రవాదులకు తెలిసొచ్చినట్లైంది.