ముందు డిగ్రీ.. తర్వాత ఇంటర్..
ఇప్పుడు గ్రూప్-2
* రోజూ 10 నుంచి 12 గంటలు చదివేవాణ్ని. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో ప్రణాళిక వేసుకున్నాను.
* సమాచారం కోసం ఇంటర్నెట్ శోధన, కరెంట్ అఫైర్స్ ఫాలోకావడం బాగా కలిసొచ్చింది.
* ఈనాడు పత్రికను క్షుణ్ణంగా చదివాను. ఇది ఎంతో ఉపకరించింది. స్నేహితుల సలహాలు పనికొచ్చాయి. స్థిర లక్ష్యం, సాధించాలనే తపన నన్ను నడిపించాయి.
బతుకు చెప్పే పాఠాలు నేర్చుకొంటే... భవిత ఉజ్వలంగా ఉంటుంది. వెంకటసుబ్బారావు అందుకు నిదర్శనం. బత్తి చిన్నపాలంకయ్య, అంకమ్మల కుమారుడు వెంకటసుబ్బారావు. వీరిది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పొద్దకొలుకుల గ్రామం. మధ్యతరగతి కుటుంబం. సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే 2000 సంవత్సరంలో పదోతరగతి పూర్తిచేశాడు సుబ్బారావు. ఎలాగైనా తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే ఆశయం నాన్నది. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేర్పించారు. మారుమూల గ్రామం నుంచి వెళ్లడంతో అక్కడి వాతావరణానికి భయపడి నెలరోజులకే ఇంటికి పారిపోయి వచ్చేశాడు. తల్లిదండ్రులు ఎంత బతిమాలినా, కళాశాలకు వెళ్లలేదు. చదువు మానేస్తానని, ఊళ్లోనే కూలీ పనులు చేసుకుంటానని ఉండిపోయాడు. అలా తొమ్మిదేళ్లు కూలీగానే ఉండిపోయాడు. పదేళ్లు బడిలో చదివిన పాఠాల కంటే... తొమ్మిదేళ్లలో జీవితం నేర్పిన గుణపాఠాలు ఎక్కువ మార్పును తీసుకొచ్చాయి.
బాధ్యతలే బాటలేశాయి
సొంత పొలం అయిదెకరాలు ఉండేది. పత్తి, మిరప, కంది వేసేవారు. కరవు కావడంతో వ్యవసాయంలో నష్టాలే. పొలాన్ని బీడుగా విడిచి కూలీ పనులకు వెళ్లారు. 2004లో అక్క సుబ్బలక్ష్మి భర్త మరణించారు. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. ఇద్దరూ పసివాళ్లే. అక్క, పిల్లలకు తోడుగా ఉండాల్సి వచ్చింది. మాచర్ల మండలం రచ్చమల్లపాడులో ఉంటూ వారి పొలం సాగుచేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకున్నాడు సుబ్బారావు. 2008లో పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన తర్వాత అక్క ఇంట్లో ఉండడం సబబు కాదని, ఏడాది తర్వాత సొంతూరు పెద్దకొలుకుల వచ్చేశాడు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించలేమని అర్థమవడానికి కరవు గురువైంది. ఆర్థికంగా కష్టాలు వెంటాడాయి. మార్పు మొదలైంది. చదువే ఈ కష్టాల నుంచి తనని బయటపడేస్తుందని భావించాడు. ఈ ఊరి నుంచి పాతికమంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. వారి నుంచి అందిన స్ఫూర్తి, భవిష్యత్తుపై భయం ఉండడంతో తనూ ఉపాధ్యాయుడు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగిన కార్యాచరణ, ప్రణాళికలు సిద్ధంచేసుకున్నారు. బీఈడీ చదవాలంటే డిగ్రీ అర్హత కావడంతో అదే ఏడాది దూరవిద్యలో డిగ్రీలో చేరారు. కూలీ పనులకు వెళ్తూ చదువుకొని పరీక్షలు రాశారు. డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా ఒక పాప(సంజన) పుట్టింది. కుటుంబ బాధ్యతలు చూస్తూనే 2012లో 60శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేశారు. వెంటనే బీఈడీ ప్రవేశపరీక్ష రాస్తే 105వ ర్యాంకు వచ్చింది. అప్పుడే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ టీటీసీ చదివిన వారికి కేటాయిస్తూ నిర్ణయం వచ్చింది. దీంతో బీఈడీ చదవాలనే ప్రయత్నం విరమించుకుని గ్రూప్స్ సాధించాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఇంటర్మీడియట్ తప్పనిసరిగా ఉండాలని 2013లో వన్ సిట్టింగ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.
ఒకేసారి రెండు కొలువులు
ఇంటర్మీడియట్ అవ్వగానే ప్రభుత్వం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు భర్తీచేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో కుటుంబాన్ని వదిలి హైదరాబాద్ వెళ్లి మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్నారు. ఓ వైపు వీఆర్‌వో, మరోవైను పంచాయతీ కార్యదర్శి రెండు పరీక్షలు రాశారు. రెండింటిలోనూ విజేతగా నిలిచారు. ఒకేసారి రెండు కొలువులు వరించాయి. సన్నిహితుల సూచనతో వీఆర్వో ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగం వచ్చిన కొన్నిరోజులకు బాబు(భానుమనీష్) పుట్టాడు. 2016లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇక లక్ష్యం ఇదే. ఉద్యోగానికి సెలవుపెట్టి, కుటుంబాన్ని కొన్నాళ్లు దూరంగా పెట్టి తను హైదరాబాద్ వెళ్లిపోయారు. స్నేహితులతో కలిసి ఏడాదిపాటు సొంతంగా సాధన చేశారు. పత్రికలు, సమకాలీన అంశాలు, అంతర్జాలంలో అంశాలను మేళవించుకుని మిత్రులతో చర్చించడం ద్వారా పరీక్షలో విజయం సాధించారు. 332 మార్కులతో ఉపతహసీల్దారుగా ఎంపికయ్యారు.
కుటుంబమే అండ
హైదరాబాద్‌లో ఏడాది శిక్షణలో ఉంటే మరి కుటుంబానికి దిక్కెవరు? ఇంటిని పోషించడానికి, తన చదువుకి డబ్బు అవసరం తప్పనిసరి. అప్పుడే అమ్మానాన్నలు, స్నేహితులు అండగా నిలిచారు. పొలం పనులు, కూలీపనులు చేస్తూ డబ్బులు పంపించేవారు. పిల్లల బాధ్యతంతా నా భార్య వీరనారాయణమ్మ చూసుకునేది. నా విజయంలో కీలక పాత్ర నా జీవిత భాగస్వామిదే. కరెంటు అఫైర్స్ కోసం పూర్తిగా ‘ఈనాడు’పైనే ఆధారపడ్డాను. ‘ఈనాడు’లో వచ్చిన కరెంటు అఫైర్స్‌లో 80శాతం ప్రశ్నలు పరీక్షల్లో వచ్చాయి. రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే నాలక్ష్యం.